ఈనాడు - హాస్యం - వ్యంగ్యం
పదకొండో అవతారం
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 23-03-2009 )
' దేవుడు భక్తులకు వరాలివ్వటం రివాజు. దేవుడిమీదే వరాల జల్లు కురిపిస్తున్నారు మీ భక్తులు ఈ రోజు' అంది పతిదేవుడి పాదాలు నొక్కుతూ లక్ష్మీదేవి.
దేవుడు ముడుపులకు పడిపోతాడా?' అనడిగాడు శ్రీమన్నారాయణుడు చిద్విలాసంగా అరమోడ్పు కన్నులతో నిద్రను అభినయిస్తూ.
'ద్వాపరంలో తమరు మణిమాణిక్యాలను కూడా కాదని వట్టి తులసిదళానికే దాసులైపోలేదా స్వామీ! అందుకే ఈ కలికాలంలో కూడా ఏ టీవీ పెట్టో, వందనోట్లు పెట్టో దాసోహం చేసుకోవాలని చూస్తున్నారు తమ భక్తులు' అంది లక్ష్మి దెప్పుతున్నట్లు.
దేవుడి నాడి పట్టుకోవడం అంత సులభమా దేవీ! పక్క పార్టీవాళ్ళ రెక్కపుచ్చుకుని లాక్కొచ్చుకున్నంత తేలికని భ్రమ!
పోయినసారి పదవీ స్వీకారమప్పుడు తమమీదే ప్రమాణం చేశారు గదా దేవా మన భక్తులు.... ఏమైంది? రామవారధి శ్రీరాములవారే కట్టలేదంటున్నారు ఇప్పుడు। అయోధ్యలో ఆలయం కడతామన్న మాటలు టమాటాలంత విలువైనా చేయటం లేదు.
నిజమే దేవీ ! బెజవాడ దుర్గ విగ్రహానికే నకిలీ బెడద తప్పలేదు. మాటామంతీ నేర్పిన మన విధాతా సతీమణి వాణినే మాతృభాష అని చులకన మంత్రులూ... నాయకులూ' చేస్తున్నారు.
ఆడదానిమీద మీ మగాడికెప్పుడూ శీతకన్నేగా స్వామీ! తమరు కూడా మినహాయింపు కాదు. ఎన్ని యుగాలబట్టి మీ పాదాల దగ్గర ఇలా పడున్నాను... గజేంద్ర మోక్షం నాడు గభాలున అలా చెప్పా పెట్టకుండా లేచెళ్ళిపోయారు। వరాలిచ్చే వేళైనా ఒక్కసారైనా నా సలహా తమరు తీసుకున్నారా? యథా 'దేవా తదా భక్తా! ' . మనిషి మాత్రం మరోలాగా ఎందుకుంటాడు ! అందుకే ' ఆకాశంలో సగానికి పైగా మేము ఉన్నా చట్టసభల్లో మాత్రం అవకాశాలు సున్నా' అంది లక్ష్మి శ్రీవారి పాదాలను మరింత కసిగా మర్ధిస్తూ,
చట్టసభల్లో మాదిరి ఈ కొట్టుకోవటాలేమిటి తల్లీ! అక్కడ మీ గుళ్ళనూ, గుడిలో లింగాలనూ మింగే రాక్ష సులు మళ్ళా పదవుల్లోకి రావాలని యజ్ఞాలు చేస్తు న్నారు. యాగాలు మీకు.. భోగాలు వాళ్ళకు. మీ ఆల యాలు అవినీతికి నిలయాలుగా మారాయి నారాయణా! మీ భూమినీ సొమ్మునూ పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రసాదాల్లా పంచుకుంటున్నారు. విడిది గృహాలను విచ్చలవి డిగా వాడుకుంటున్నారు. మీరిలాగే కళ్ళు మూసుకుని తన్మయత్వం నటిస్తుంటే గర్భగుళ్ళలోనూ తమ పిత్నదేవుళ్ల విగ్రహాలు ప్రతిష్టించుకునేట్లున్నారు' అన్నాడు. . అప్పుడే వచ్చిన నారదుడు హడావుడి పడిపోతూ.
నారదుడు చెప్పింది నిజం స్వామీ! తిరుమలలో మనం పవళించే వేళనీ చూడకుండా పైవాళ్ళకు ప్రత్యేక దర్శనాలి వ్వమని వేధించే నాయకులు ఎక్కువైపోతున్నారు. ఏవేవో కల్యాణాల పేర్లు చెప్పి రెండు పట్టుచీరెలు, పంచలూ మన మొహాన కొట్టి ఇన్ని ముత్యాల తలంబ్రాలు తలమీద పోసి పోతే తమ తప్పులకు తలాడిస్తామనుకుంటున్నారు. పండగల వంకలో పేపర్ల నిండా మాది దేవుడి పాలన అని రెండేసి పేజీల ప్రకటనలిచ్చి బ్రహ్మాండంగా ప్రచా రాలు చేసుకుంటున్నారు' అంది లక్ష్మి ఆవేదనగా,
అంతేనా! వేళకు వానలు పడితే వరుణదేవుడు వాళ్ళ పార్టీలోకి మారాడనీ, రెహమానుకి ఆస్కారవార్డు వస్తే అదంతా వాళ్ళ మహిమేననీ, అణు ఒప్పందానికి మీ ఆమోదముద్ర ఎప్పుడో పడి పోయిందనీ, గాంధీగారి కళ్ళజోళ్ళూ.. కాలిజోళ్ళు వాళ్ళు చెబితేనే మీరు వాళ్ళ దేశానికి ఇప్పించారనీ, క్రికెట్లో ఓవరుకు ముఫ్ఫైయారు పరుగులు వాళ్ళ మాటమీదే మీరు యువరాజ్ చేత చేయించారని తెగ డప్పులు కొట్టేసుకుంటున్నారు మహాత్మా! సర్వసాక్షివి నీ పేరునే వాళ్ళు పత్రికలకీ, టీవీలకి వాడుకొంటూ సర్వం నాశనం చేస్తున్నారు. 'అభయహస్తం' అంటేనే జనం భయపడుతున్నారు. దొరకని బియ్యం కిలో రెండు .. దొరికితే ఉల్లి కిలో ఇరవై ! నీళ్ళు లేకుండానే డాములు కడతామంటున్నారు. నకిలీ పైపులు పగిలి జలయజ్ఞానికన్నా ముందు జలప్రళయం ముంచుకొస్తుందేమోనని జనం వణికి చస్తున్నారు. గుండెనొప్పి వస్తే ఆసుపత్రివైద్యం... ఆకలినొప్పికి మాత్రం కల్తీ మద్యమే వైద్యమట... చోద్యం! ఆణా వడ్డీ నారాయణమంత్రంలాగా అదేపనిగా పదేపదే జపిస్తున్నారు. క్షమాభిక్షలతో రాక్షసులు బైటికొచ్చారు. అక్రమార్కుల మీద సర్కారు జీఓల మంత్రజలం చల్లి విక్రమార్కులుగా మార్చి దేశంమీదకు వదిలేశారు. ధరలు దిగిరాకపోయినా, ఉద్యో గాలు ఊడిపోతున్నా, ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతున్నా ఆడవాళ్ళమీద అఘాయిత్యాలను ఆపలేకపోతున్నా, ఆపద్బాంధవుడిలాంటి తమ నామధేయాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. మహాత్మా! రెండువేల పన్నెండులో ప్రపంచానికి ప్రళయం వస్తుందంటున్నారు. ఈ వరస చూస్తే ఈ దేశానికి మూడేళ్ళు ముందుగానే ముంచుకొచ్చేటట్లుంది గోవిందా?
అన్నీ వింటున్న శేషశయనుడు కనులు తెరిచి అడిగాడు ఆఖరికి
'వేదాల కోసం మత్స్యావతారం, భూదేవికోసం వరాహావతారం, అమృతం కోసం కూర్మావతారం, ధర్మాల కోసం నరసింహావతారం, దానాలకోసం వామనావతారం, మర్యాదకోసం రామావతారం, విజయాలకోసం పరశురామావతారం, మంచి రాజకీయా లకోసం కృష్ణావతారం, బుద్ధికోసం బుద్ధావతారం... ఆఖరికి ఆకలికోసం కలికి అవతారం కూడా ఎత్తేశాను గదా నారదా! పది అవతారాలూ వృథాయేనా? అన్ని అవలక్ష ణాలతో మళ్ళీ జన్మ ఎత్తిన ఈ దుష్టరాజకీయాన్ని శిక్షిం చటానికిప్పుడు మళ్ళీ ఏమి చేయాలి?
పదకొండో అవతారం ఎత్తాలి పరంధామా! ఓటరు జన్మ ఎత్తి 'బ్యాలెట్' ఆయుధాన్ని అందుకోవాలి నారా యణా! అప్పుడే సర్వజనావళికి సంక్షేమం- అన్నాడు నారదుడు రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తూ.
'నిజమే నాథా! ముందు లేవండి!' అంది లక్ష్మి నారదుడి మాటలకు మద్దతుగా పాదసేవ అప్పటికి ఆపి.
కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 23-03-2009 )
No comments:
Post a Comment