Wednesday, December 29, 2021

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్


 



చార్లెస్ ఫిలిప్ బ్రౌన్


( జననం : నవంబరు 10, 1788)


నూరార్లు లెక్క చేయక

పేర్లెక్కిన విబుధ వరుల బిలిపించుచు వే

మార్లర్థ మిచ్చు వితరణి 

చార్లెసు ఫీలిప్సు బ్రౌను సాహెబు కరుణన్.


ఎవరయ్యా ఈ చార్లెసు ఫిలిప్సు బ్రౌన్ సాహెబు? 


పేర్లెక్కిన విబుధవరులను ఎందుకు పిలిపించేవాడు? అర్థ వితరణం ఎందుకు చేసేవాడట? 


మన దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిస్తూ ఉండిన కాలంలో ఆ కుంఫినీ కొలువులో ఉండి కడప, మచిలీపట్నం మొదలైన చోట్ల చాలా సంవత్సరాల పాటు జడ్జీగా  పనిచేసిన ఇంగ్లీషు దొర-  బ్రౌన్. 


ఎందరు దొరలు మన దేశానికి రాలేదు? ఎందరు ఇక్కడ కొలువు చేయలేదు? తమ దేశం కొలువు చేస్తూ మనదేశాన్ని కొల్లగొట్టలేదు? ఐతే ఈ బ్రౌన్ దొర విశేషం ఏమిటి?


ఈ బ్రౌన్ దొర తన దేశాన్ని కొలుస్తూ ఆ కొలువుకు ఏమాత్రమూ భంగం కలగకుండా అంతకంటే ఎక్కువగా తెలుగు దేశపు కొలువు చేశాడు. మనలను కొల్ల గొట్టలేదు సరికదా తన డబ్బే విస్తారంగా మనకోసం వెచ్చించాడు. నిస్వార్థంగా తెలుగు భాష సేవలో, తెలుగు సాహిత్యం ఉద్ధరణకోసం ఎన్నో ఉత్తమ గ్రంథాలను చెదపురుగుల నోట పడకుండా కాపాడాడు. అనేక కావ్యాల వ్రాత ప్రతులను సంపాదించి తప్పుల కుప్పలుగా ఉన్న వాటిని శ్రద్ధగా పరిశీలించి సంస్కరించి ముద్రింపించాడు. తెలుగు ఇంగ్లీషు నిఘంటువును, ఇంగ్లీషు తెలుగు నిఘంటువును కూర్చాడు.  ఈ మహా భాషా సాహిత్య వ్య యానికి ఆయనే మదుపు పెట్టాడు. మదుపు పెట్టిన దానికి ఆయన ఆపేక్షించిన ప్రతిఫలం ఆంధ్రుల విజ్ఞానమూ, వికాసమూను. 


మరి ఆ భాషా సేవలో తనకు సహాయ పడడానికోసమే బ్రౌన్ దొర పేరెక్కిన విబుధ వరులను పిలిపించి తాను పోషించాడు. వేతనాలు ఇచ్చి ఆయన వేమార్లరమిచ్చు వితరణి కూడా. 


కష్టంలో ఉన్న ఒకాయన కొంత పాండిత్యం ఉన్నవాడై ఉండాలికూడా తనకు సహాయం చేయవలసినదిగా బ్రౌన్ దొరగారిని అర్థిస్తూ దొరగారు పండితుడు కనుక ఆయనను కొంచెం మెప్పించినట్లవుతుందని భాగవతం గజేంద్ర మోక్ష ఘట్టంలోని పద్యం వ్రాసి పంపించాడట!


లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపన్ దగున్ రావే యీశ్వర కావవే వరద సంరక్షించు దీనునిన్ భద్రాత్మకా


బ్రౌన్ దొర కొంత సొమ్ము ముట్టజెప్పాడట. ఆ వచ్చిన పద్యపు అర్జీమీద పద్యంలోనే ఒక ఎండార్స్ మెంట్  కూడా వ్రాశా డట. ఆ పద్యంకూడ భాగవతంలోనిదే:


ఏను మృతుండ నౌదునని యింత భయంబు మనంబులోపలన్ 

మానుము సంభవంబుగల మానవకోటికి చావు

నిక్కమౌ గాన హరిం దలంపు ఒక గందు జన్మము నీకు ధాత్రిపై

మానవ నాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్ .


బ్రౌన్ దొర పండితుడు. పండితాభిమాని, న్యాయమూర్తి. రావణ దమ్మీయ ద్వ్యర్థికావ్యాన్ని రచించిన పిండిప్రోలు లక్ష్మణ కవి మేనల్లునికి ఒక వ్యాజ్యెంలో అన్యాయం జరిగింది. న్యాయాధి కారి లంచం తీసుకొని అన్యాయమైన తీర్పు చెప్పాడు. అప్పుడు రాజమహేంద్రవరంలో జిల్లా జడ్జీగా ఉన్న బ్రౌన్ దొర దగ్గరికి అప్పీలు వచ్చింది. లక్ష్మణ కవి దొరగారిని దర్శించి ఒక పద్యం చెప్పాడు.


మధువైరికిన్ వనమాలికి గౌస్తుభ

హారునకును సంశ్రితావసునకు రాధికా ప్రియునకు రామసోదరునకు 

జగదీశునకు దయాసాగరునకు 

శ్రీ నాథునకును రక్షిత దేవ సమితికి 

బ్రౌఢ భావునకు నారాయణునకు 

నురగేంద్ర తల్పున కరి శంఖ ధరునకు 

దొగల రాయని గేరు మొగము దొరకు 

రణ నిహత దుష్ట రాక్షస రమణునకును 

గాన మోహిత వల్లవీ కాంతునకును

రిపు విదారికి హరికి శ్రీ కృష్ణునకును 

కిల్పిషారికి నే నమస్కృతి యొనర్తు.


శ్రీ కృష్ణునికి నమస్కారం అని చెప్పిన ఈ పద్యం ప్రతి పాదంలోని మొదటి అక్షరాలను వరసగా చదివితే 'మహారాజశ్రీ బ్రౌన్ దొరగారికి' అని అవుతుంది. 


జరిగిన అక్రమాన్ని ఆలకించి న్యాయమూర్తి బ్రౌన్ దొర న్యాయం చేకూర్చాడట.


విదేశీయులు తెలుగు నేర్చుకోవడానికి సహాయపడే తెలుగు వ్యాకరణాన్ని రచించాడు బ్రౌన్. తెలుగు వారికి ఎంతగానో ఉపకరించే తెలుగు ఇంగ్లీషు నిఘంటువును, ఇంగ్లీషు తెలుగు నిఘంటువును తయారు చేశాడు.


బ్రౌన్ దొర అభ్యుదయ వాది. ఛాందస పండితులు పట్టు కొని వ్రేలాడే అర్ధానుస్వార శకట రేఫాలు వాడుక నుండి ఏనాడో నిష్క్రమించిన అర్థరహితమైన సంజ్ఞలు అని ధైర్యంగా చెప్పగలి గాడు. 


ఆయన తరువాత దాదాపు ఒక శతాబ్దానికి కాని గిడుగు రామమూ ర్తి పంతులు గారి కృషి ఫలితంగా వ్యావహారిక భాషకు మన్నన కలుగలేదు. బ్రౌన్ దొర ఏనాడో వ్యావహారిక భాషకు గౌరవం కలగజేశాడు.


బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పాఠశాలా పరీక్షలలో తరుచు అడుగుతూ ఉండే ప్రశ్న ఒకటి ఉండేది. 

 "బ్రిటిష్ పాలన వలన మనకు కలిగిన లాభములేవి"? అని. 


రైళ్ళు, తపాలా ఆఫీసులు వగైరా ఏవేవో విద్యార్థులు జవాబుగా వ్రాస్తూ ఉండేవారు. 


వాటి మాట ఎలా ఉన్నా బ్రిటిష్ పరిపాలన వలన తెలుగు దేశానికి కలిగిన ఒక పెద్ద ప్రయోజనం..  చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని నిస్సం దేహంగా చెప్పవచ్చు


- ఎన్. శివనారాయణ

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...