ఈనాడు ' హాసం వ్యంగ్యం గల్పిక
బొంకుల దిబ్బ
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 16-07-2016 ,
అబద్ధాలు ఆడాలంటే ఎంతో నిబద్ధత కావాలని, గోడ కట్టినట్లుగా ఉండాలని బుద్ధిమంతుల బోధ. ఆపద్ధర్మంగా ఇటునుంచి అటు దూకినట్లే... అవసరార్థం మళ్ళీ రేపు అటు నుంచి ఇటు దూకేందుకు వాటంగా ఉండాలి నిజం చెప్పాలంటే. నిజం మీద నిలబడటానికి అట్టే నిజాయతీ అవసరం లేదు. ఆడిన అబద్ధానికి కట్టుబడి ఉండాలంటేనే ఆటుపోట్లు తట్టుకునే గుండె నిబ్బరం ఉండాలి. అది లేకే సత్యం రాజు, అమెరికా బిల్ క్లింటన్ అన్ని కడగండ్ల పాలైంది. అందరూ హరిశ్చంద్రులకు చుట్టాలైతే ఈ చట్టాలెందుకు?
పనామా పత్రాలు విడుదలైనా, అందులోని పంగనామాల పెద్దలెవరూ పెదవి విప్పడమే లేదు! ఎన్నికల యుద్ధంలో నిలబడినప్పుడు అభ్యర్థ యోధులంతా ఎన్నెన్ని అబద్ధాలకు అందమైన హామీ చమ్కీ దండలు తొడిగి మరీ ప్రచార పర్వాలు రక్తి కట్టిస్తారో! ఆడిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ అడేసి ఎన్నుకునే జనాలకు అన్నీ పచ్చి నిజాలేనన్న భ్రమ కలిగించడం అన్నిచోట్లా రాజ కీయాలలో పండే సాధారణ చమత్కారమే!
నిజానికి, నిజం మీద నిలబడేందుకు ప్రతిభతో పని లేదు. ఒక్క అమా యకత్వం ఉంటే చాలు.. ఆడిన మాట అబద్ధమని ఒప్పేసుకుని కన్నీళ్ళు పెట్టుకోవడానికి! పశ్చాత్తాపంతో కన్నీళ్ళు పెట్టుకోవడానికేగా అబద్ధాల సృష్టి జరిగింది?
అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు 'అమ్మతోడు' ఒట్లు సహా కాణిపాకం గుళ్ళో దీపాలార్చేయడం వంటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి. గురజాడ కన్యా శుల్కంలో గాయత్రి పట్టుకుని ప్రమాణం చేసిన వాడొకడైతే, దీపాలార్వేసి, ప్రమాణం చేసిన ఘనుడు ఇంకొకడు. అందుబాటులో ఉన్న సవాలక్ష ఉపాయాలను ఉపేక్షించి ఆడిన అబద్ధాలకు పశ్చాత్తాపాలు ప్రకటించు కుంటూపోతుంటే, చేజేతులా భవిష్యత్తు పటానికి పూలదండలు వేసుకొన్నట్లే!
గోడ దూకేటప్పుడు లీడరన్నవాడు గోడ కట్టినట్లు అబద్ధాలాడతాడని అడి పోసుకుంటాం. తెరచాటున జరిగే బేరాలన్నీ యథాతథంగా చెప్పుకొంటూ పోతే ప్రజాసేవకుడి కథ ముగిసినట్లే కదా! నమ్ముకున్న కార్యకర్తల ఉసురు పోసుకోకూడదన్న సదుద్దేశమే నాయకుడి నోటితో అబద్ధాలాడించేది... అర్థం చేసుకోవద్దూ!
'నిజం చెప్పమంటారా. అబద్ధం చెప్పమంటారా? ' అని రాజునే అడుగుతాడు పాతాళభైరవి సినిమాలో ఎన్టీఆర్. అపరిమితమైన లాభాలు ఏవో ఆశించేగదా వేన్ పిక్ మోపిదేవి, సుబ్రతోరాయ్ నుంచి శారదా ఫండ్ దాదాల దాకా, ఆగ్రిగోల్డ్ నుంచి కింగ్ ఫిషర్ వరకు నల్ల వ్యాపారాలని కూడా చూడకుండా నిలువెత్తు బురదలోకి దిగబడిపోయింది, నష్టాలు నెత్తికి చుట్టుకుంటాయని తెలిసీ నిజాలను నమ్ముకుంటారా తెలివున్న పెద్దమనుషులెవరైనా! గురజాడవారి గిరీశం అడుగుజాడల్లో నడిచే మహాశయులు అన్ని రంగా లోనూ ఇప్పుడు అందలాలెక్కి ఊరేగుతున్నారు. కాదంటే, అదే ఓ పెద్ద శుద్ధ అబద్ధం. అవును కన్యాశుల్కం ఆసాంతం శుద్ధ అబద్ధాల పుట్ట. ప్రపంచంలోని ఏ అబద్దపు వ్యవహారమైనా 'కన్యాశుల్కం'లో తప్పకుండా ప్రత్యక్షమై తీరవలసిందే. మన రాజకీయాల మాదిరిగా అయినా, ఆ నాటకంలో జరిగిందంతా నిజమేనని, అయస్కాంతాలు పెట్టి గాలించినా అబద్ధమనేది అణువంతైనా కనిపించదని అందరం అమాయకంగా నమ్ముతుంటాం. ఆ చమత్కారమే యథాతథంగా రాణించే రంగం- రాజకీయం. అందుకే రాజకీయాలు ఇవాళ ఇంతలా అబద్ధాల దుకాణాల మాదిరి కళకళలాడిపోతున్నది . 'నిజం బొమ్మ అయితే, అబద్దం బొరుసు" అన్నవాడికి రాజకీయ గోతుల లోతులు బొత్తిగా తెలియవని అనుకోవాలి. రెండువైపులా ఉన్నవి బొరుసులే అయినా బొమ్మలే అన్నట్లు కథ నడిపించగల సమర్థులే రాజకీయ రంగంలో రాణించేది. అబద్ధాన్ని నిజంగా.. నిజాన్ని అబద్ధంగా చేసేస్తాం' అని డబ్బాలు కొట్టుకుంటాడు కన్యాశుల్కంలో బైరాగి. అ మార్కు గడుసుపిండాలకే ఎంత నిజాయతీ పార్టీలో ఉన్నా మంచి మార్కులు పడేది.
నిజాయతీపరులెవరూ రాజకీయాల జోలికి రావద్దు. వచ్చినా రాహుల్ బాబులా నాలుగు కాలాలు మాగినా పండటం కుదిరే పనికాదు . 'కన్యాశుల్కం' మార్కు 'బొంకుల దిబ్బ' సెట్టు లాంటివే రాజకీయాల రంగుల లోకం. నిజాన్ని నమ్ముకుని మాత్రమే రాజకీయం నడపాలనుకొన్న లోక్ సత్తా జేపీ రథం పరుగుపందెంలో వెనక ఎందుకు పడిందో అర్ధం చేసుకుంటే చాలు- నేటి రాజకీయాలు నిజమైన అబద్ధపు స్వరూపం కళ్లకు కట్టినట్లు అవగతమవుతుంది. సత్యం మీదే బొత్తిగా ఆధారపడటం రాజకీయాలతో పెద్ద అడ్డంకి.
ఈ రాజకీయ సూత్రం అర్థంకాని అమాయకులెవరైనా ఇంకా మిగిలి ఉంటే మారిపోవాలి. ' ట్రూ రిపెంటెన్సుకి ట్వంటీ ఫోర్ అవర్చు చాలు' అన్నాడు గిరీశం మహాశయుడు. ఒక్కొక్క రాష్ట్రానికి ఎన్నికలు ముంచుకొచ్చే వస్తున్నాయి. నార్కో ఎనాలసిస్ టెస్టులకయినా నాలిక మడతలు అందకూడదు. లై డిటెక్టర్ల ముందు మతులు పోగొట్టుకోకూడదు. టికెట్ల కోసం ఎన్ని కోట్లయినా పొయ్యి , పోలీసు రికార్డుల్లో ఎంత రికార్డుస్థాయి నేర చరిత్రయినా ఉండనీయి .. స్వల్ప ఆస్తులు, స్వచ్ఛమైన చరిత్ర ప్రక టించే గుండెదిటవు అవసరం.
కడుపు నుండిన జనం చెప్పులు విసిరినా దడుపు దాచుకొనే ఒడుపు ఒక్కటి ఒడిసి పట్టుకుంటే చాలు- ఏ పార్టీ టికెట్ మీదైనా ఇట్టే టిక్కు పెట్టించుకోవచ్చు. అబద్ధాలు రంగరించి బిడ్డలందర్నీ గద్దెలెక్కించాడు లాలూజీ. రాజకీయాల్లో నాలుకలు ఎన్ని చీలికలైనా నో ప్రాబ్లమ్ . అవి మొద్దు బారకుండా పదునుగా ఉంచుకుంటే చాలు. సత్యహరిశ్చంద్రుడి కథ మర్చిపోయేటంత కీర్తి ప్రతిష్ఠలతోపాటు, వారసులందరికీ చెక్కు చెదరని స్విస్ బ్యాంకు ఖాతాలు సాధించుకోవచ్చు. ఏ ప్రజా సేవకుడి అంతిమ లక్ష్యమైనా అంతకుమించి మరేముంటుంది?
- రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 16-07-2016 ,
No comments:
Post a Comment