Tuesday, December 28, 2021

ఈనాడు- సంపాదకీయం జాతీయ పానీయం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈ నాడు - ప్రచురితం - 19 -08 -2012 )

 



ఈనాడు- సంపాదకీయం 


జాతీయ పానీయం

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడు - ప్రచురితం - 19 -08 -2012 ) 


ఉల్లాసంగా ఉండాలనుకున్నప్పుడు, ఒంటరితనం వేధిస్తున్నప్పుడు.... ఎప్పుడైనా సరే, కావాలనిపించేది కుదిరితే ఓ కప్పు తేనీరు. థేంక్ గాడ్! టీ కనిపెట్టిన తరువాతే నేను పుట్టాను' అనుకున్నాడట ప్రముఖ రచయిత సిడ్నీ స్మిత్. మదిరానికి అలవాటుపడి అనవసరంగా ప్రాణా లమీదకు తెచ్చుకున్నాడు గానీ... తేనీరు రుచి తెలుసుకుని ఉంటే ఉమర్ ఖయ్యాం మరిన్ని రుబాయీలు మనకు మిగిల్చి ఉండేవాడు. సుమతీకర్త కాలం నాటికి చాయికి  ఇంత ప్రాచుర్యం లేదు. ఉంటే అప్పిచ్చువాడు, వైద్యుడు వంటి అత్యవసరాల జాబితాలో తాజా తేనీరూ చేరి ఉండేదే. 'అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష' అన్న మన పెద్దలు తేనీరు ప్రస్తావన ఎందుకు తేలేదో! తాగేవాడి హోదానుబట్టి పానీయం పేరు మారే విధానాన్ని నన్నెచోడుడు కుమారసంభవంలో చెప్పనే చెప్పాడు! 'అమరులు త్రావుచో అమృతమందురు దీని, వహిప్రజంబ జప్ర ముని గోనియానుచో నిది రసాయనమందురు' . ఆ క్రమంలోనే ఈ కలియుగంలో మర్త్యులు  పడిచస్తున్న పానీయం పేరు ' తేనీరు' ఎందుకు కాకూడదు? ' పెరుగును శరచ్చంద్ర చంద్రికా ధవళం'తో పోల్చిన కాళిదాసు తేనీరు రుచి కనుక తెలుసుకుని ఉంటే- ఏ తేనె పట్టు బొట్టుతోనో సరిపోల్చి ఉండేవాడు. శ్రీనాథుడి జమానాలో ఈ చాయ్ గొడవలు లేకగాని... ఉండి ఉంటే హరవిలాసంలో ' చిరుతొం డనంబిని చేగానుగాడి చెరుకుం/ దీగె రసంబును' జంగముడు తెమ్మ న్నట్లు'  ఏ అల్లం కొట్టిన సుగంధ తేనీరో కావాలని దబాయించకుండా ఉండేవాడా! నాటి కవులకన్నా మనం అదృష్టవంతులం. నేటి జనాభాలో నూటికి ఎనభైమంది తేనీటి ప్రియులేనని అఖిలభారత తేనీరు సంఘం తాజా గణాంకాలు తేల్చి చెబుతున్నాయి మరి. 


పని ఒత్తిడినుంచి పలాయనం చిత్తగించడానికి ఏనాడో ఓ చీనా వైద్యుడు కనిపెట్టిన చిట్కా తేనీరు. నాగరికులు చాయ్ రుచి మరిగేందుకు మరో పది శతాబ్దాలు పట్టింది. వినిమయ విధాన వాణిజ్యంలో భాగంగా తేనీటి కోసం విలువైన దుస్తులను , వెండినీ ఆంగ్లేయులు వదులుకున్నారంటే దాని రుచికి వేరే వివరణ ఎందుకు?  చైనాతో తెల్లవాడికి చెడటం భారతీయులకు కలిసివచ్చింది. అస్సాం సాగుమీదకు ఇంగ్లిషువాడి దృష్టి మళ్ళటం మన అదృష్టం. ప్రపంచ తేనీటి అవసరాలను తీర్చే ప్రముఖ దేశాల జాబితాలో భారతదేశానిదే ఇవాళ ప్రథమస్థానం. ఉత్పాదన లోనే కాదు.. వినిమయంలోనూ భారతీయులదే అగ్ర తాంబూలం. పడక దిగినప్పటినుంచి రాత్రి శయన మందిరం చేరే దాకా  భారతీయులు సగటున పదకొండు కప్పుల టీ సేవిస్తున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రుచికి ఆరోగ్యానికి సాధారణంగా చుక్కెదురు. 'మది రాపానము చేయువానికిని సన్మానంబులే సిగ్గు లే/ వదనాలంకరంబు  లే సుగతి లే వాక్పుష్టి లే వాంఛ లే ' అంటూ ఓ ఆధునిక కవి ఏకరువు పెట్టనే పెట్టాడు. కవివరుడు, భిషగ్వరుడు వేంకట నరసిం హాచార్యులవారు 'విశంగాదిరసం', 'రేపు మాపును మనుజుండు బదరీ పల ప్రమాణము సేవిస్తే వాత గుల్మాలు, జ్వరాలు, సంధి ప్రకోపాలు, ధాతు నష్టాలు వంటి ఎన్నో రుగ్మతలు దూరంగా పారిపోతాయని చికిత్సగా చెప్పుకొచ్చారు . ఖరీదైనది ఆ ఔషధం. అంతకన్నా అధిక ప్రయోజనాలను కలిగించే కారుచవుక ఔషధం తేనీరు. కేన్సరుకు తేనీరు విరుగుడు అంటారు. టీలోని బి కాంప్లెక్స్ విటమిన్లు, నికోటిన్, కెఫైన్  ఉత్తేజకరమైన శక్తి ఉత్ప్రేరకాలు రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరచే శక్తిమంతమైన ఔషధాలలో  టీ కి  మరొకటి సాటి లేదు. రక్త పోటు, చక్కెరవ్యాధి, దంత క్షయాలకు గొప్ప నిరోధకంగా పనిచేసే ఔషధం తేనీరు. దేవతలకు అమృతం ఉందో లేదో తెలియదు . మానవులం అదృష్టవంతులం. మనకు సర్వరోగ నివారిణి తేనీరు దొరికింది!


కొప్పరపు సోదరులు ఒక అష్టావధాన పద్యంలో చెప్పినట్లు ' ప్రభు భటులు, నైష్ఠికులు  గార్య పరత నేగ .. గొక్కరో కోయనుచు' కోడి కూయాలి. ఆ కోడికన్నా ముందే లేచి ఇంటి ఇల్లాళ్లు చాయ్ నీళ్లను  మరగబెడుతున్న రోజులివి. పొట్టలో టీ చుక్క పడనిదే పడక దిగనని మొరాయించే జనాభా పెరుగుతోంది. చైనా, జపాన్లలో తేనీటి సేవనం ఒక ప్రత్యేక ఉత్సవం. నిమ్మరసం టీ వారి ప్రత్యేకత. టిబెట్టులకు ఉప్పు టీని కొయ్యకప్పులో తాగడం సరదా. ఆఫ్రికన్లు టీ కషాయాన్ని చిలికి ఆ నురగ తాగుతారు. పశ్చిమాసియాలో యాలకుల తేనీరంటే ప్రాణం పెడతారు. భారతీయులు అన్నిరకాల తేనీటినీ ఆదరించే పానప్రియులు. గుజరాతీలకు మసాలా టీ మీద మనసైతే, కాశ్మీరీదేశవాసులు వట్టి కషాయంలో బాదం, యాలకులు కొట్టి వేసి ' కాహ్వా' అనే టీని 'వాహ్వా  వాహ్వా' అంటూ సేవిస్తారు. తేనీటి సేవనానికి వయసుతో నిమిత్తం లేదు. విద్యార్థి లోకానికి టీ నిద్రకాచే చిట్కా.  వయసు పైబడినవారికి శక్తినిచ్చే ఔషధం. ఉపవాసాలకూ నేడు తేనీరు నిషిద్ధం కాదు. అతిథి మర్యాదల్లో తేనీరు ప్రధాన అంశం. జీవనానికి నీరు ఎంత అవసరమో, చాయి  అంతకన్నా ముఖ్యావసరమైన రోజులు వచ్చాయి. మారుమూల పల్లెనుంచి మహా పట్టణం దాకా చాయ్ దుకాగాలు  కనిపించని చోటు భూమండలమంతా గాలించినా దొరకదు. టీ కప్పుల చప్పుళ్లు లేని సభలు, సమావేశాలు చప్పగా సాగినట్లే లెక్క.  సమరావేశాన్ని చప్పున చల్లార్చగల మహత్తు గుప్పుమని పొగలు గక్కే వేడి తేనీటికే కద్దు . ఎన్ని విభిన్న దృక్పథాలైనా ఉండనీయండి.... వందకోట్లకు మించిన మన జనాభా ముక్తకంఠంతో ' జిందాబాద్'  అనే  ఒకే ఒక్క పానీయం- తేనీరు. అసోమ్ లో  తొలుత తేయాకు సాగు చేసిన సిపాయిల తిరుగుబాటు వీరుడు మణిరాయ్ దేవన్ 212వ జయంతిని పురస్కరించుకొని తేనీటికి  జాతీయ పానీయం హోదా కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. వాణిజ్యంపై నియమించిన పార్లమెంటరీ స్థాయీసంఘమూ తేనీటికి  జాతీయ హోదా కల్పించవలసిందని  సిఫార్సు చేయడం తేనీటి ప్రియులందరికీ తీయని కబురు.


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడు - ప్రచురితం - 19 -08 -2012 ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...