Sunday, August 28, 2016

గురువులకు పాఠాలు- ఓ సరదా గల్పిక


బండెడు పుస్తకాలకు బస్సెడు గురుబ్రహ్మలు తోడయ్యే నూతన విధ్యావిధానం రాబోతుందా?ఒక ఉపాధ్యాయుడికి నలభైమంది శిష్యపరమాణువులన్న  సిద్ధాంతం ఇహ పాత పడనుందా? ఒహ విద్యార్థికి నలభైమంది గురువులనే నవీన పథకం అమలు కానుందా?

విద్యుత్ బుగ్గ, ఆకాశవాణి, చరవాణివంటి ఆవిష్కరణలకంటే పనిగట్టుకొని పనులు మానేసుకొని బుర్రలు బద్దలు కొట్టేసుకొన్నారు పెద్దలు! కేవలం అవకాశాల్రాని రాజకీయవేత్తలు, అధికారం దక్కని అధికార వర్గాలు, ఉద్యోగసంఘాల బుద్ధికుశలతవల్ల మన పిల్లకాయలకిప్పుడు కొత్త విద్యావిధానం దొరికిందోచ్!

చదువు సాములు మెరుగు పడాలని, బడిపిల్లోడి అవసరాలకు తగ్గత్లు అభ్యాస పద్ధతులు  మార్పు చెందాలన్న అభ్యుదయ భావాలతో తెలంగాణా సర్కారిప్పుడు 'హేతుబద్దీకరణ'కు కాలుదువ్వుతోంది. ప్రభుత్వపెద్దల బుద్ధికుశలతకు మించి కొత్త పద్దతులున్ బాలల విద్యారంగంలోకి చొచ్చుకొచ్చేస్త్తున్నాయ్! పాఠ్యప్రణాళికలు శుద్ధంగా అమలు కావాలంటే బండెడేం ఖర్మ.. జంబో జెట్టుకు మించిన గురుసైన్యం తయారు కావాల్సుంది.

తెలుగులో అచ్చులు నేర్పించేందుకొక ఉపాధ్యాయుడు, హల్లుల  వల్లెవేతకు ఇంకో గురుబ్రహ్మగారు,, గణితంలో ఒంట్లు వటువు వంటబట్టించేందుకు పట్టుదల తగ్గని పంతులొకరు, ఎక్కాలు పిల్లడి బుర్ర కెక్కించి తొక్కేందుకు వస్తాదుల్లాంటి ఉస్తాదులు మరో ఇద్దరు- ఒహరు పైనుంచి కిందికి తొక్కిస్తే.. మరొహరు కిందనుంచి పైకెక్కించేందుకు.. ! ఆంగ్లంలో మూడు బళ్లు ఏడ్చినప్పుడు ఒక్కో బడికి ఒక్కో గట్టిపిండం అవసరమే కదా! సాంఘిక శాస్త్రంలో పర్యావరణమనే కొత్త అంశం పుట్టుకొచ్చిందిప్పుడు.. పిల్లకాయలను తోటలెంట దొడ్లెంట  తిప్పుతూ.. ప్రకృతి తిరకాసునంతా విప్పి చూపించే విశ్లేషకుల అవసరం కొత్తగా ఏర్పడింది. మోరల్ క్లాసులు పీకేందుకైతే మోటా పరిజ్ఞానం కల మాస్టార్ల అవసరం ఎలాగూ తప్పని సరి తద్దినమై కూర్చుంది. సామాన్య శాస్త్రం మాత్రం సామాన్యులకు అలివయేట్లుందా? భౌతిక.. రసాయన శాస్త్ర సూత్రాల వివరణ .. ప్రయోగశాలల్లో వాటి సత్యనిరూపణలకు ఏక మొత్తంగా మొత్తం కనీసం  నలుగురు గురువులన్నా సదా సిద్ధంగా ఉండి తీరాల్సుండె!

చిత్రకళ, సంగీతం వంటి కళా విశేషాలను గడుగ్గాయిలచేత  కాయించి వడబోయించేందుకు  ఎంతమంది ప్రావీణ్యుల సహకారమవసరమో ఇంక చెప్పేందుకు లేదు. ఇహ గెంతడం..  పరుగెత్తడం.. ఒకే బంతిని పట్టుకొని తెగగుంజుకోడం.. గుద్దులాడుకోడం వంటి వంటికి సంబంధించిన విద్యల్ని దెబ్బలక్కాచుకొంటూ వడుపుగా నేర్పించే  ఓపికమంతులు  పంతుళ్లుగా రావడమూ తప్పని సరే! ఇన్ని చతుష్షష్టి కళలు  ముష్టి సర్కారు బళ్ల పిల్లకాయకు అంతవసరమా అన్న ధర్మసందేహం ధర్మం కాదు! జీవించడానికి అవసరమైన కీచులాటల్లో లాఘవం రావాలంటే పసితనంనుంచే కండబలం చూపించే విద్యల్లో రాటు తేలాల్సిందే! బిడ్డ అవసరాలకు తగ్గ విద్య ఉగ్గుపాలదశనుంచే  గరపాలన్నది కదా హేతు బద్ధీకరణంలోని ప్రధాన నీతి సూత్రం!

గురువులకేమీ కరువు లేదు.   తరగతి గదిలో చుక్కల్లో చందమామాలా మెరిసే ఒక్క బుడతడికి ఒకేసారి నలుగురు గురువులు ఉన్న నాలుగ్గంటల్లో విద్య గరపడమెలా?.. అన్నదే ప్రస్తుత సమస్య. సంక్షోభం వచ్చినప్పుడే సమస్యకు పరిష్కారం బైటపడేది. గతంలో నల్లబల్ల దగ్గర యమధర్మరాజు దగ్గరిచుట్టమల్లే బెత్తమాడిస్తూ నిలబడ్డ  ఉపాధ్యాయుడు ఇప్పుడు ఒకింత  అసుంటా కిందికి దిగి బెంచీలమీద తోటిగురువులతోపాటు బుద్ధిగా కూర్చుంటాడు. నిష్పత్తిలో ఒక్క శాతంగా ఉన్న విద్యార్థి ఒక్క మెట్టు  పైకెక్కి బల్లమీద బాసింపట్లేసుకుని కూర్చుంటాడు. మారిన కొత్త విద్యాభ్యాస విధానంలో ముందుగా విద్యార్థి వేసే హాజరు పిలుపులకు ఉపాధ్యాయులంతా 'జీ.. హుజూర్' అని పలకాలి. ఆ తరువాతే తరగతులు ఆరంభమయేవి.
విద్యార్థి కళ్లు మూసుకొని వేలు ఎవరి వైపు చూపిస్తే ఆ ఉపాధ్యాయుడికి ఆ పూట పాఠం చెప్పుకొనే సువర్ణావకాశం దక్కుతుంది.
శిక్షణా సమయంలో పక్క గురువులు కక్షతోనో.. కడుపుమంటతోనో అల్లరికి తెగబడితే పిల్లవాడిచ్చే శిక్షలు దారుణంగా ఉంటాయి. ఆ పూట పాఠం చెప్పే అవకాశం కోల్పోవడంతో పాటు.. గోడకుర్చీ వేయడమో.. బెంచీ ఎక్కి నిలబడ్డమో తప్పని సరి. అల్లరి మరీ మితిమీరితే బైట ఎండలో నిలబడ్డమూ తప్పదు గురువులకి.
పాఠం వినే సమయంలో సాధారణంగా ఏ విధ్యార్థి పెదవి విప్పడు. తెలివితక్కువ వెధవ ఎప్పుడైనా ఖర్మకాలి ఏదైన తిక్క సందేహం అడిగితే ఠక్కుమని సమాధానం చెప్పేట్లుండాలి పంతుళ్ళ ఇంటిదగ్గర తయారీ. ఇంటిదగ్గర పాఠం సరిగ్గా తర్ఫీదు కాని పంతుళ్ల పని గోవిందో గోవిందే! వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఎంత పంతులుకైనా గుంజీలు తప్పవు.  శిష్యుడి చేతిలో బెత్తం ఆడుతున్నంత సేపూ గురువుల గుండెళ్ళో మెట్రో రైళ్ళు పరుతెత్తుతుంటాయ్!
'ఐ నెవర్ టెల్ ఎనీ లెసన్' అని పలక మెళ్లో వేళ్ళాడదీసినా పంతుళ్లెవరూ  ఎదురు పలక్కూడదీ  కొత్త నూతన విద్యా విధానంలో. 'వ్యాపారంలో వినియోగదారుడే రాజు' అయినట్లే కొత్త విద్యాభ్యాస ప్రణాళికలో విద్యార్థే రారాజు.
సర్కారువారి సరికొత్త హేతుబద్ధ ప్రణాళికను అవహేళన చేయకుండా జంధ్యాలవారి 'జంబలకిడి పంబ' సూత్రం అమలు చేస్తే మాత్రం తప్పేముంది? కాకపోతే తయారీ రంగంలో కాస్తంత మార్పులు అవసరం. ఉపాధ్యాయులకి ముందస్తు శిక్షణ ఉన్నట్లే.. విద్యార్థికీ  ప్రాథమిక పరిజ్ఞానంలో రవ్వంత  తర్ఫీదు అవసరమవుతుంది. ఒక్క గురువు వేధింపులకే తాళలేక పసిమొగ్గలు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఇంతమంది యమ గురువులను ఒకేసారి ఒకే చోట ఎదుర్కొనేందుకు తగిన శక్తి సామర్థ్యాల్లో పసివాళ్ళకు శిక్షణ అవసరమవుతుంది.
పిల్ల కథానాయకులు పెద్ద పెద్ద దర్శకులనే అదుపులో పెడుతున్నారు చలనచిత్ర రంగంలో. బొడ్డూడని పసిగుడ్డులుకూడా కన్నవాళ్లని కనుసన్నల్లో ఆడిస్తున్నారు. సర్కారు కార్యాలయాల వ్యవహారాలన్నీ బిళ్లబంట్రోతుల కంట్రోల్లోనే కదులుతున్నాయి. కార్యకర్తల ఆదేశాలమీదే  బడానేతలూ పార్టీ గోడలు దూకుతున్నారు. పూజారుల లెక్కల ప్రకారమే సాక్షాత్ ఆ ఏదుకొండలవాడు నామాల పొడుగు సరిదిద్దుకొంటున్న నేపథ్యంలో పిల్లకాయల బెత్తాలముందు పాఠాలు చెప్పుకు బతికే బడిపంతుళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డంలొ తప్పేముంటుంది?!
మీడియా హోరు.. చిత్రాల బోరు.. సీరియళ్ల జోరుల ముందు బేజారు కాకుండా గట్టిగా  నిలబడుండాలంటే  చిన్నబళ్లనుంచే పెద్ద పెద్ద గురువులను అదుపు చేయడంలో తర్ఫీదు పొందుండాలు పసిగుడ్డులు. ఎన్నికల సమయంలో వందలాది నేతలు వేలాది హామీలను వడగళ్ళ వానలా గుప్పిస్తుంటారు. ఓటర్లుగా మారినప్పుడు ఆ వడగళ్ల నొప్పిని సంహించేందుకైనా విద్యార్థి దశనుంచే బిడ్డను సమాయత్తం చేయాల్సుంటుంది కదా!  హేతు బద్ధీకరణ అసలు సదుద్దేశం కూడా  అదే అవుతున్నప్పుడు మనం తప్పు పట్టడం అన్నింటికన్న పెద్ద తప్పు,
***
-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయ పుటలో ప్రచురితం. ఈనాడు యాజమాన్యానికి.. సంపాదక వర్గానికి.. కార్టూనిస్టు శ్రీ శ్రీధర్ గారికి కృతజ్ఞతలతో)

Thursday, August 25, 2016

మంత్రిగారి కుక్కగారు- వ్యంగ్యం

కుక్కనుంచి పుట్టకపోవడం మనిషి దురదృష్టం. మనిషిలాగా పుట్టకపోవడం కుక్క అదృష్టం. 'చీఁ!,, కుక్కా!' అని ఊరికే చీదరించుకొంటాంగానీ.. విధిరాత బాగోలేకే వీధి కుక్క బతుకు.. మంత్రులింమెట్టిన శునకానిది శుక్ర మహర్దశ! ఆమ్ ఆద్మీ జనాలకంటే  పూటకో అరప్లేటు భోజనానిక్కూడా నానా అగచాట్లు. మంత్రిగారింటి చాటు కుక్కపిల్లకైతే  గంటకో స్వ్వీటు.. చాటు! అయ్యగారి సందర్శానికని వచ్చే వందిమాగదులందరి ముద్దు మురిపాలు  ముందుగా మంత్రివర్యులగారి ముద్దుల శునకం పాలు! కనకపు సింహాసనంమీది  శునకాన్ని సుమతీ శతక్కారుడు ఏ మంత్రిగారింట్లోనో చూసుంటాడు. మన తుక్కు తెలుగులో కుక్కంటే కుక్కే.  అదే ఆంగ్లంలో  'డాగ్'  తిరగబడ్డ 'గాడ్' ! మంత్రిగారింటి డాగ్ అయితే తిరగబడ్డా.. మరగబడ్డా.. . 'గాడే’ సర్వే సర్వత్రా.! ఇంటిక్కాపలా  ఖర్మం మామూలు కుక్కలకి. మంత్రిగారింటి కుక్కలకి మంత్రిగారింటిల్లిపాదీనే కాపలా! గోమాత ఎక్కడున్నా పూజ్యమే కానీ.. శునకానికి  మంత్రిగారింట ఉన్నంత కాలమే రాజ్యం.  ఆనుపానులు తెలీని అమాయక ప్రాణం..  రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య శాఖామాత్యులవారి శ్రీమాన్ శునకం .. హఠాత్తుగా కనిపించకుండా  పోయి దేశమంతటా కలకలానికి కారణమైపోయింది మలేసియా విమానం మాయమయినప్పుడు కూడా  ఇంతలా కలవరం కలిగించలేదెక్కడా!
కటకటాల వెనకున్న దొంగవెధవ కనపించడం లేదంటే అర్థముంది. పిటపిటా నడిచే పడుచు పిల్ల గాయబ్ అయిందటే ఎక్కడో గబ్బయిందని అర్థమవుతుంది. అవినీతికో.. అరాచకానికో అడ్రసుదారుడు  పట్టుబడే సమయంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం..అదీ.. మామూలే! చట్టసభల సమయంలో రాహుల్ బాబొకప్పుడు  చటుక్కున సెలవు చీటీ పారేసి ఎక్కడికో చెక్కేసినట్లు.. రాజస్థాన్ మంత్రిగారి కుక్కా.. ఇప్పుడు  హఠాత్తుగా  మాయమైపోయింది! శునకరాజానికంతగా వచ్చి పడ్డ కష్టాలేంటో? ఎమ్ సెట్ పరీక్షల్లాంటి  కేసులూ   ఏవీ లేవు మరి! భూ దంధాల్లాంటి ధూం ధాంల్లో దూరే   అవసరాలా?.. అసలే ఉండుండని జాతి ఆ శునకానిది. . చలన చిత్రాల్లాంటి కళలమీదగ్గాని గాలి  పోలేదు కదా.. చెప్పా పెట్టాకుండా ముంబయి చెక్కేసెయ్యడానికి? డాగ్ ఫాదర్ మంత్రిగారు! చెవిలో చిన్నగా ఊదినా చాలు.. కొండమీది కోతినైనా తెచ్చి కొంపలో పడేస్తారు!
కుక్కగారు కనిపించకుండా పోవడం పోలీసు యంత్రాంగం మొత్తానికిప్పుడు ప్రాణాల మీదకి వచ్చిపడింది ముఖ్యమైన దస్త్రాలు మాయమైనా  బొత్తిగా పట్టించుకోరు శ్రీవారు. కుక్కగారిని  వెతికి తెచ్చేందుకు  మాత్రం ఇచ్చిన గడువు కేవలం ఒక్క వారం !
మంత్రిగారి ముఖమంటే అప్పుడప్పుడు   మీడియాలో డప్పుకొట్టేటప్పుడైనా చూసే అవకాశం కద్దు. మంత్రిగారి ముద్దు కుక్క ముఖారవింధం  కనీసం ఫేస్ బుక్కులోనయినా  సందర్శిచు  అవకాశమే లేదు! ఇహ  పసిగట్టి పట్టుకొనుట ఎట్లు? దొంగవెధవల పని పట్టేటందుకంటే  కుక్కలకి గట్టి శిక్షణుంటుంది. సాటి కుక్కల్ని పసిగట్టేపాటి నైపుణ్యం కుక్కలకే లేనప్పుడు  మంత్రిగారి కుక్కజాడ కనిపించడం ఏట్లు?    కుక్క ముఖారవిందాలన్నీక్క తీరులోనే ఉండటం.. కుక్క మొరుగుళ్లన్నీ ఒకే కోడులో సాగడం పోలీసులకో ఓ అగ్ని పరీక్ష!
నల్లదనం మాదిరి కుక్కనూ ఎక్కడో దాచేసి  మీడియా ప్రచారానికి మంత్రి పడే ఆరాట’మిదంతా  అంటూ ప్రతిపక్షాలప్పుడే నిప్పులు చెరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో   ఏకుక్క సాయంతో  గెలవాలన్న నక్కజిత్తులి’వన్నీ అంటూ ’ ప్రజాసంఘాలూ దాడులు ప్రారంభించేసాయి. రోజులు గడిచే కొద్దీ వేడి పెరగడమే కానీ..ఏ  పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. కనక  కనిపించని శునకంగారిని ఉద్దేశించి చివరికి నియోజక వర్గ  ప్రజానీకమే  బహిరంగంగా మొర పెట్టుకొన్నారు. అందులోని అత్యంత ముఖ్యాంశాలు కొన్నిః
 మంత్రిగారి గౌరవనీయులైన శునకంగారికి.. హక్కులు లేకపోయినా సామాన్యులం ఎలాగో తట్టుకోగలం.. మంత్రులు పెంచుకొనే కుక్కలు కనిపించకుండా పోతే పాలన స్థభించి పోవడం ఖాయం.. తమరు కనిపించకుండా పోయిన రోజునుండి మా మంత్రిగారు మాకు కనిపించకుండా పోయారు.. తమరి మీదున్న చింతతో శ్రీవారు  మా చింతలు ఆలకించేందుకు సిద్ధంగా లేరు..   రియో ఒలంపిక్సు క్రీడలు తిలకించుటానికి  వెళ్ళంటే .. వెంటనే ఓ బహిరంగ   ప్రకటన విడుదల చేయ ప్రార్థితులు.. కృష్ణాపుష్కరోత్సవాలకు హాజరయి ఉంటే తక్షణమే తిరిగి రావలయునని విన్నపములు.. చింత వీడి వెంటనే తమరు అజ్ఞాతమునుండి బైటకు  రా  ప్రార్థితులు. మంత్రిగారి భవంతి నిత్య పంచభక్ష్య పరమాన్నాల విందులకు  మొహం మొత్తి  తమరు పాత పాదరక్షల వేటకు వెళ్లారని వదంతులు ఊపందుకొంటున్నాయి.. దయచేసి పాత చెప్పులు మా దీన జనులకు వదిలేయమని మనవి. రాబోయే ఎన్నికల్లో మొన్నటి ఎన్నికల హామీలేవీ నెరవేర్చని మాయగాళ్లందరికీ దేహశుద్ధి చేసేందుకు మా దగ్గర మిగిలున్న చివరి ఆయుధందొక్కటే!. ఈ సారి ఎన్నికల్లో తమరే నిలబడితే గంపగుత్తగా ఓట్లేసి గెలిపించుకునేందుకు మేమంతా సిద్ధం.. నేటి నాయకులకన్నా మీ విశ్వాసం ఎజెండా వల్లే  బీదా బిక్కీకి కొద్దో గొప్పో మేలు జరుతుందని మా విశ్వాసం..’.
మంత్రిగారి బంగళాలో ఉన్నంతకాలం బైటెక్కడా వినిపించని  శునకరాజంగారి ఊసులు..    కనిపించకుండా పోయిన మరుక్షణంనుంచి మీడియా నలుమూలలా మారుమోగేస్తున్నాయి!


ప్రతీ కుక్కకీ ఒక రోజు వస్తుందంటారు. మంత్రిగారికి కుక్కకిప్పుడొచ్చేసినట్లుందా  మంచి రోజు. ప్రజాస్వామ్యమంటే  అంతే మరి. రోజుకో విచిత్రం జరుతుంటేనే  పిచ్చి జనాలకి   దానిమీద గురి 
***
-కర్లపాలెం హనుమంతరావు

Friday, August 19, 2016

ఆసుపత్రులకు దూరంగా ఉండాలంటే- ఈనాడు సంపాదకీయం

జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం- ఇన్ని దశలు దాటి రాకముందు జంతువే మనిషి మూలరూపం. విశ్వ సంస్కృతులు జంతు తతులను విభిన్న కాలాల్లో వేర్వేరు దృక్పథాలతో చూసినా, భారతీయతది మాత్రం సృష్టి ప్రారంభంనుంచి ఒకే విధానం... దైవభావం. ఆదిదేవుడు పశుపతి. స్థితిమూర్తి శేషశయనుడు. సృష్టికర్త హంసవాహనుడు. సోమకాసురుని వాడి రెక్కలచే చీల్చి చెండాడి వేదరాశిని కాచింది మత్స్యరూపమైతే, క్షీరసాగర మథనంలో మందరగిరి కిందకు జారిపోయిన వేళ మూపు
నడ్డుపెట్టి సురాసుర కార్యానికి సాయంపట్టింది కూర్మమూర్తి. ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో వర్ణించినట్లు 'అజాండ కర్పరము బీటలు వారగ మేను పెంచి మహీ మహిళా లలామను గొమ్ము కొన దగిల్చి' నీటినుంచి యెత్తినది వరాహ మూర్తి. హరి వైరంతో అరాచకం చేసే హిరణ్యకశిపుని వధాయజ్ఞం నిర్విఘ్న నిర్వహణకు హరి ఎత్తింది అర నరావతారం. 'కుటిల నఖాగ్ర కుంచికల'తో ధర్మకార్యం పూర్తిచేసింది మిగతా సగం మృగావతారం! భగవంతుడెత్తిన ఆ నృసింహావతారమే
నరుడికీ మృగానికీ మధ్యగల బలమైన బంధానికి తిరుగులేని ఉదాహరణ. సీతాన్వేషణలో ఉన్న రాముడికి ప్రథమంగా సమాచారం అందించింది జటాయువు. స్నేహహస్తం చాచిన సుగ్రీవుడు
, బంటుభావంతో సేవించిన ఆంజనేయుడు, సేతునిర్మాణం చేయించిన నీలుడు- చివరికి అల్పజీవి అయినా అనల్ప భక్తితో సాయానికొచ్చిన ఉడుత... అంతా జంతుసంతతే. విజ్ఞత, గ్రహణ శీలత, సున్నితత్వం, దయ, ఓర్పు, ధైర్యం, దూరదృష్టి, సహానుభూతి వంటి సద్గుణ సంపదలే దైవీయ భావనలనుకుంటే- పశుపక్షి కీటక సముదాయాలను మించిన దేవతామూర్తులు నేలా నింగీ నీటా మనిషికి మరేవీ తారసపడవు.


జంతుజాలాల్లోని ఈ విశిష్టతలవల్లే భారతీయులు చెట్టుమీది పిట్టనీ, పుట్టలోని పామునీ దేవతా స్వరూపాలుగా సంభావించి కొలిచేది. ఆవును సాక్షాత్ గోమాత స్వరూపంగా కరుణశ్రీ వంటి కవులు భావించి కీర్తించింది ఈ దైవీయ భావనతోనే. జాంబ పురాణం ప్రకారం అనంత కాలాల కిందటే జన్మించిన మూలపురుషుడు జాంబవంతుడు. కన్నబిడ్డ డొక్కలను కొలిమిగా, చర్మాన్ని తిత్తిగా, హస్తాలను పట్టుతెరలుగా, బొటనవేళ్లను ఉలులుగా మలచి విశ్వకర్మకే పరికరాలను సమకూర్చిన నిపుణుడు ఆయన. భూదేవికి వరాహపురాణం వినిపించిన మేధావి ఆదివరాహమూర్తి. సామవేదాన్ని గానంగా వినిపించిన మహాముని శుకుడు. భోజరాజీయంలోని గోవు అభిజ్ఞాన శాకుంతలంలోని కణ్వమహర్షితో సమానమైన ప్రతిభా విశేషాలతో తన చిన్నిదూడకు సుద్దులు చెబుతుంది. రఘునాథ నాయకుడి 'నలచరిత్ర' హంస కథానాయకుడి చేతజిక్కినప్పుడు చెప్పే 'సంసార ధర్మాలు' పండితుల పలుకులకు తీసిపోనివి. నలదమయంతుల మధ్య రాయబారం నడిపి వారి ప్రేమను పండించిన పెళ్ళిపెద్ద అది. శృంగారం మదన శివాలు తొక్కి నాయిక పరకీయగ మారే ప్రమాదాన్ని గ్రహించి రాత్రికో మడతపేచీ కథ చొప్పున చెప్పుకొస్తూ మగడు ఇల్లు చేరినదాకా ఇంటి పరువును, ఇంతి పరువును గుట్టుగా
కాపాడిన చతుర, కదిరీపతి 'శుకసప్తతి' చిలుక. రాబర్ట్ బ్రూస్ వంటి మహారాజుకే పాఠాలు చెప్పిన సాలెపురుగులోని యంత్రరహిత నూలు నిర్మాణ కౌశలం అద్భుతం. 'ఈశ్వరశక్తి నీ కడుపులోనే లీలమై యుండునో' అంటూ జాషువా వంటి మహాకవుల మన్ననలందుకున్న జంతుజాలాల విశేషాలు ఎంత చెప్పుకొన్నా సశేషాలే!

మనిషి తన తోటి మనిషిని చిన్నబుచ్చడానికి జంతువులతో పోల్చడం ఎంతవరకు సమంజసం? 'బూడిద బుంగవై యొడలు పొడిమి దప్పి మొగంబు వెల్లనై/ వాడల వాడలం దిరిగి వచ్చెడు వారలు చొచ్చొచోయనన్/ గోడల గొందులందొదిగి కూయుచు నుండెడు' వారిని శ్రీనాథుడంతటి మహా పండితుడు గాడిదలని తూలనాడటం తగునా? పిల్లిమీద, ఎలుకమీద పెట్టి తిట్టే అన్యాపదేశాలు సాహిత్యంలో అలంకారాలు- అన్నంత వరకైతే సరిపుచ్చుకోవచ్చు. కానీ, చిన్నజీవులపట్ల పెద్దమనసు కలిగి ఉండటం బుద్ధిమంతుల లక్షణం. తీయని పదాల రామా రామా యటంచు/ తీయ తీయగా రాగాలు తీయుచున్న/ కమ్మకైతల క్రొమ్మావి కొమ్మమీది' ఆదికవి వాల్మీకిని మనం 'కోకిలస్వామి'గా కొలుచుకుంటున్నాం. కర్ణాటక రాజ్యాధిపతులు ఒకప్పుడు 'ధరణీ వరాహ'మనే బిరుదును గొప్ప గౌరవంగా ధరించేవారు. నృత్య విశేషాలను మయూర భంగిమలతోను, చురుకు వేగాన్ని అశ్వతేజంతోను, సునిశితమైన వినికిడిని పాము చెవులతోను, సూక్ష్మదృష్టిని విహంగవీక్షణంతోను సరిపోల్చుకొని సంబరపడే మనిషి సాటి జీవాన్ని అల్పదృష్టితో చూడటం సృష్టిదోషం. విష్ణుశర్మ పంచతంత్రంలో జంతుపాత్రలు అందించే నీతిచంద్రికలు మనిషి మనసులో ముసిరి ఉన్న చీకట్లను పారదోలేవి. విశ్వాసానికి
శ్వపతి(కుక్క), శుచి-శుభ్రతలకు మార్జాలం, బృందస్ఫూర్తికి పిపీలక సందోహం, ఐక్యతకు కాకిమూక, సమానత్వ భావనకు వానరజాతి... మనసు తెరచుకుని ఉండాలేగానీ క్రిమికీటకాలనుంచి పశుపక్ష్యాదులదాకా సర్వజీవావళి మనిషి పాలిట పరమ గురువులే. సాధు హృదయంతో చేరదీయడమొక్కటే మనం చేయవలసిన సత్కార్యం. మైమీ విశ్వవిద్యాలయం, సెయింట్ లూయీ విశ్వవిద్యాలయం జంతువులను పెంచి పోషించేవారిమీద చేసిన ప్రయోగాల ఫలితం ప్రకారం- అది మానవ జాతికే ప్రయోజనకరం. పెంపుడు జంతువుల యజమానుల్లో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యవంతమైన శరీరం, కలుపుగోలుతనం, సామాజిక స్పృహ, నిర్భయత్వం- జంతుజాలాలకు దూరంగా ఉండేవారిలోకన్నా ఇరవైశాతం అధికంగా ఉంటాయని పరిశోధన బృంద నాయకుడు అలెన్ ఆర్ మెక్కానిల్ చెబుతున్నారు. ఆసుపత్రులకు దూరంగా ఉండాలంటే సాటి జీవాలకు చేరువ కావడమే దగ్గరి దారి!

(ఈనాడు యాజమాన్యంవారి సౌజన్యంతో.. సంపాదక బృందానికి ధన్యవాదాలతో.. 24, ఆగష్టు. 2011 నాటి ఈనాడు సంపాదకీయం)

Thursday, August 18, 2016

'ఛీర్' కొడదామా? 'ఛీ!' కొడదామా?


గెలీలియో నిజంగా మహానుభావుడు. మందుబాబులకన్నా ముందే భూమి గుండ్రంగా తిరుగుతున్నదని కనుక్కొన్నాడు.

కథలు చెప్పేవాళ్లందరూ తాగుబాతులని చెప్పలేంకానీ.. తాగుబోతులుమాత్రం మంచి కథకులై ఉంటారు. కొంపకు ఆలస్యంగా వచ్చినప్పుడల్లా ఇంటిఇల్లాలుకి కొత్తకథ అల్లి చెప్పాలంటే అల్లాటప్పా వ్యవహారం కాదు! తప్పతాగితే తప్ప అంత సృజనాత్మకత సాధ్యం కాదు.

మందేమీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టిందికూడా కాదు. రామాయణకాలంలో- సీతమ్మవారిని వెతకడానికని వెళ్ళిన ఆంజనేయుడుకి లంకలో ముందుగా కనిపించింది ద్రాక్షారసాలు సేవించే రాక్షసులే! భారతంలోని కీచకుడుకి మగువలమీదకన్నా మధ్యపానంమీద మక్కువ జాస్తి. ఉజ్జయినీ కాళీమాతకు మద్యమే నైవేద్యం. శిప్రానదీ తీరాన కొలువైన భైరవుడు నాటుసారా తప్ప మరొకటి ముట్టడు. దేవదానవులు దెబ్బలాట దేనికోసం? ఆ సురేకదా నేటి సారాయి!

మదిరలో ఎంత మహత్తు లేకపోతే గాలిబ్ అంత గమ్మత్తైన గజల్సు చెప్పగలడు! అజంతా హరప్పా శిథిలాలు తవ్వితీసినప్పుడూ ముందుగా బైటపడ్డవి అప్పటి తాగుబోతులు తాగిపారేసిన చట్లూ పిడతలేనంటారు. నిప్పు కనిపెట్టకముందు ఆదిమానవుడు ఎండావానలకు, చలిగాడ్పులకు ఎలా తట్టుకొని నిలబడ్డాడంటారూ? అంతా యిప్పసారా మహత్తు. యుద్దసమయాల్లో ఏనుగులకీ  బాగా మద్యం పట్టించి శత్రుసైన్యంమీదకు తోలేవారని 'ఇండికా'లో మెగస్తనీస్ అంతటి మహానుభావుడే రాసినప్పుడు 'రా' పనికిరాదంటే కుదురే పనేనా!

కామానికీ సూత్రాలు రాసిపెట్టిన మునులు మధుపానానికి శాస్త్రాలు రాయలేదంటే నమ్మలేం! తంజావూరు తాళపత్ర గ్రంథాలయంలో మరికాస్త మందుకొట్టి వెదికితే ఒకటో రెండో పెగ్గుకావ్యాలు బైటపడక మానవు. మౌర్యులకాలంలోనే మనవాళ్ళు 'అంగుళం' కనిపెట్టారంట! ఎందుకు? లోటాలో మందుకొలతలు చూసుకొనేందుకుగాక మరి దేనికీ? ‘చంద్రయాన్’ మిషన్ ఇంజనులో ఇంధనానికి బదులు ఏ కల్లో సారానో  కొట్టించి వదిలుంటే.. సముద్రంలో పడేబదులు ఇంచక్కా చందమామ చూట్టూ చక్కర్లు కొట్టొచ్చుండేది.

దేవుడుకూడా ఆదాము అవ్వల్ని ఆపిల్ ముట్టుకోవద్దాన్నాడుగాని.. మందు జోలికి వెళ్లద్దని హద్దులు పెట్టలేదు కదా! మరెందుకు అందరూ ఈ మందును ఇలా ఆడిపోసుకొంటారో అర్థం కావడంలేదు!

ఒత్తిడినుంచి ఉపశమనం పొందే ఉపాయంకదా ఇది! శతాబ్దాలకిందట మనవాళ్లు శోధించి సాధించింది. అష్టాంగమార్గాల్లో ఆఖరిదైన 'సమాధి' అంటే ఫుల్లుగా ‘రా’ కొట్టి చల్లంగా పడుంటమే! మందుగుండు కనుక్కొన్నది చైనానే కావచ్చుకానీ.. 'మందు' కనుక్కొన్నది మాత్రం నిశ్చయంగా మన దేశమే!
‘సారే జహాఁసే అచ్చా!.. సారా భారత్ మహాన్!’
-కర్లపాలెం హనుమంతరావు

***
(ఈనాడు- సంపాదకపుటలో ప్రచురితం)



Thursday, August 11, 2016

చందమామ విజయ రహస్యం

కాదేదీ నా కబుర్లకనర్హం
మా చిన్నతనంలో బాలల బొమ్మల భాగవతం.. భారతం.. రామాయణం.. లాంటి పుస్తకాలు  చదవడం ఎంతగా ఇష్టపడేవాడినో .. అరవై ఏళ్ళు దాటిన ఈ వయస్సులో కూడా అలాంటి సాహిత్యం కంటబడితే అంతగానే ఇష్టపడతాను. నాలాగే చాలామంది అలాగే ఇష్టపడుతారనే అనుకుంటాను!
పిల్లలకోసం రాసిన పుస్తకాలను పెద్దలం మనమూ అంతే ఇష్టంగా చదవడం కాస్త విడ్డూరంగానే ఉంటుంది. కానీ.. మనస్తత్వవేత్తలు మాత్రం 'ఇందులో అంత ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు కదా.. అది మంచి ఆరోగ్యానికి సంకేతం కూడా' అంటున్నారు.
పిల్లల పుస్తకాలలో సాధారణంగా కనిపించే పాత్రలు.. కథానాయకులైనా.. కథానాయికలైనా.. రాక్షసులైనా.. భూతాలైనా.. ఎలాంటి పై ముసుగులు లేకుండా అటు మంచివైపో.. ఇటు చెడువైపో ఉండటం స్పష్టంగా కనిపిస్తుంటుంది. కథ నడుపున్నంత సేపూ ఎలాంటి  మాయా మర్మాలు చూపకుండా  కథానాయకుడు సాహస వీరుడుగానో.. తెలివితేటలు కలవాడి ఉవకుడిగానో.. అమాయకుడిగానో.. పరోపకారిగానో.. సమాజంలో పదిమంది మెచ్చే ఇంకా ఏ ఇతర సుగుణాలు కలవాడిగానో మాత్రమే కనిపిస్తుంటాడు. కథానాయికలైతే అతి సుకుమారులు. అత్యంత సౌందర్యరాశులు. అమాయకత్వం మూర్తీభవించిన ముగ్ధబాలలు. రాక్షసులు.. భూత ప్రేత పిశాచాలు..  సవతి తల్లులు.. మంత్రగత్తెలు..  భయంకరమైన జంతువులు.. వంటి దుష్టశక్తుల చేతుల్లో పడి రక్షించేవారికోసం అలమటించే నిస్సహాయులుగా కనిపిస్తూ మన సానుభూతిని చూరగొంటారు. ప్రతికూలశక్తులేవైనా గానీయండి..  నిష్కారణంగా .. నీచంగా.. అసహాయులను అవస్థల పాల్చేస్తూ.. ఆనందించే కౌటిల్యం ప్రదర్శిస్తుంటాయి. వాటి చెడుకు.. కథానాయకుల రూపంలో కనిపించే మంచికి మధ్య నిరంతరం కథ జరుగుతున్నంత సేపూ సంఘర్షణ జరుగుతుంటుంది. ఆ ఘర్షణలో అంతిమంగా ,, కచ్చితంగా మంచికి విజయం కలగడం.. అమాయకమైన అందమైన కథానాయికలు విముక్తి చెందడం.. చదివే చిన్నారులకు ఎంతో సంతోషం కలిగించే అంశాలు.
వయసు పైనబడి శరీరం వడలిపోయినా .. అంతర్గతంగా .. పసిపిల్లలకు మల్లే ఎప్పుడూ మంచికే జయం కలగాలని; దుర్మార్గం.. దౌర్జన్యం.. రాక్షసత్వం.. శాశ్వతంగా ఓడితీరాలన్న తీవ్రకాంక్ష   ఇంకా  మనసులో ఇంకిపోకుండా మిగిలున్నపెద్దలకి .. పిల్లల మాదిరిగానే.. అలాంటి బాలసాహిత్యం ఎంతో ఆనందం.. ఉత్తేజం.. కలిగిస్తుంది.

పెద్దలకోసం రాసిన పుస్తకాలలో మంచి మంచిలాగా స్పష్టంగా కనిపించక పోవచ్చు. చెడు మంచి ముసుగు వేసుకొని వంచనకు తెగబడుతుండవచ్చు. అందం అన్నివేళలా ఆనందం కలిగించే విశేషం కాకపోవచ్చు. అమాయకత్వమూ  సానుభూతి చూరగొనే తీరులో ఉండక పోగా.. ఒక్కోసారి తీవ్రమైన కోపం తెప్పించే పద్ధతిలో విసుగు పుట్టించవచ్చు. మంచికి .. చెడుకు మధ్య జరిగే సంఘర్షణ బాల సాహిత్యంలో మాదిరి స్పష్టంగా ఉండక..  మేదో సంబంధమైన నారికేళపాకంలో కూడా సాగే రచనలుగా ఉండవచ్చు. తలుచుకొనేందుకే ఇష్టంగా ఉండని మానవ సంబంధాలు.. అవినీతి.. అకృత్యాలు.. క్రౌర్యాలు.. కామకలాపాలు.. నమ్మక ద్రోహాలు..నరికి చంపుకోడాలు..  ఇలా ఏవైనా.. ఏ రూపంలో అయినా .. కనిపించి చదివేవారి మనసుమీద ప్రతికూలమైన వత్తిడి పెంచి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే  రీతిలో సాగవచ్చు. అలాంటి రచనలు వాస్తవానికి.. వాస్తవ ప్రపంచానికి ప్రతిబింబాలుగా ఉన్నంత మాత్రాన.. పెద్దలందరికీ ఒకే విధంగా ఆదరణీయం కాకపోవచ్చు. సంస్కృతీ సంబంధమైన వైవిధ్యాలు.. భాషాసంబంధమైనా వైరురుధ్యాలు.. అన్ని రచనలను అందరు పెద్దలు ఒకే తీరులో అభిమానించేందుకు అవరోధంగా మార్చుతుంటాయి.  పెద్దల సాహిత్యంలో అంతిమ విజయం కచ్చితంగా  మంచికే దక్కాలన్న నియయ.. నిబంధనలు కూడా ఉండవు.  ప్రౌఢసాహిత్యం విషయంలో అందుకే అందరు పెద్దలకు ఒకే విధమైన అభిమానం ఉండాలని ఆశించడం అహేతుకం.
బాలల సాహిత్యంలో ఈ బెడదలేవీ ఉండవు.  ఏ రూపంలో ఉన్నా కథ.. కథనాలు.. సరళంగా.. సదా సమాజహితంగా సాగుతూ.. మంచి చెడుల మధ్య విభజన రేఖ నల్లబల్లమీద తెల్లసుద్దతో వేసిన బొమ్మంత స్పష్టంగా… అందంగా ఉంటుంది. అందుకే అది భాషా.. సంస్కృతి.. కాలం.. దేశం.. వంటి పరిమితులకు అతీతంగా ప్రపంచంలోని  పసిపిల్లలందరి  మానసికానందానికి.. మనో వికాసానికి ఒకే తీరులో ప్రేరణ అవుతుంటుంది. పిల్లల మనస్తత్వంగల పెద్దలనూ అదే తీరులో అలరిస్తుంటుంది.

తెలుగులో కొన్ని దశాబ్దాల పాటు అవిఛ్చినంగా సాగి ఆబాల గోపాలాన్ని ఒకే తీరుగా అలరించిన.. అలరిస్తున్న..   విజయావారి 'చందమామ' మాస పత్రిక విజయంలోనే ఈ రహస్యం దాగి ఉంది.

బాలసాహిత్యాన్ని నిజంగా ఇష్టపడుతున్నట్లయితే- అలా ఇష్టపడుతున్నట్లు బాహాటంగా  చెప్పుకోడాన్ని  పెద్దలెవరూ చిన్నతనంగా భావించవలసిన అవసరం లేదు. బాలల సాహిత్యాన్ని అభిమానిస్తున్నారంటే ఆ  పెద్దల మనసులూ బాలల మనసులంత స్వచ్చంగా.. సహజంగా.. ఆరోగ్యంగా.. ఆనందంగా.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉన్నట్లే లెక్క
-కర్లపాలెం హనుమంతరావు
*** 

Thursday, August 4, 2016

సరళీకర వ్యాపార విధానాలు


'ఈ మధ్య పత్రికల్లో మరీ ఎక్కువయిందేంది బాబాయ్ గోల! ఈ 'ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్' అంటే ఏందీ?'
'పక్కనే చక్కని తెలుగు ముక్కల్లో రాసుంది.. చదువుకోవచ్చు గదరా! 'సరళతర వ్యాపార నిర్వహణ' అనీ! పనిమాలా  వచ్చి మీ బాబాయి పనిని చెడగొట్టందే నీకేం తోచదా  బాబిగా?
'బాబాయీ!.. పనీనా! బాబోయ్.. ఇదేంటి పిన్నీ కొత్తగా!'
'అట్లకు పిండి రుబ్బి పెట్టాలి. బట్టలకు సబ్బెట్టి ఉతికి ఆరబెట్టాలి.. అన్నింటికన్నా ముందు ఇప్పుడు ఈ బియ్యంలో రాళ్లు ఏరి పెట్టాలి' అదీ మీ పిన్ని నాకు జారీ చేసిన  హుకూంరా  హనుమంతూ! ఏ 'సరళతర విధానం' అవలంబించి ఈ పనులన్నీ చక చకా  తెముల్చుకుందామా! అని ఇందాకట్నుంచీ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇదిగో.. ఇంతలోనే నువ్వొచ్చేసావు! ఇంద.. నువ్వూ ఈ చేట చేత్తో పుచ్చేసుకో!'
'ఈ బియ్యంలో రాళ్లు ఏరే కన్నా.. రాళ్ళలో బియ్యం ఏరడం సులభం లాగుంది   బాబాయ్! అదే ప్రస్తుతానికి నీవు అవలంబించవలసిన 'సరళతర' విధానం కూడానూ!
'మా బాగా చెప్పావురా బుజ్జిగా! ఈ దుకాణాలవాళ్ళు బియ్యంతో వ్యాపారం చేస్తున్నారో.. రాళ్ళతో వ్యాపారం  చేస్తున్నారో బోధ పడకుండా ఉందిరా!'
'అర్థమయిందిలే బాబాయ్ ఇప్పుడు ఈ 'ఈ వే డూ బి' అంతరార్థం.  ఐ మీన్  'సరళతర వ్యాపార నిర్వహణ' మూలసూత్రం!'
'ఛ!.. చ! ప్రపంచ బ్యాంకు ఇలాంటి  చేటలో బియ్యం చెరిగే  విధానాలను గురించి  ఎందుకు నివేదికలు తయారు చేస్తుందిరా తిక్క సన్నాసీ? పెద్ద పెద్ద  వ్యాపారాలు చేసుకునేందుకు ఉన్న వెసులుబాట్లను బట్టి వివిధ దేశాలకు అది ర్యాంకులిస్తుంటుందిగానీ ప్రతి ఏటా. ఆ ర్యాంకుల్ని ఆధారం చేసుకొనే   వ్యాపారస్తులు ఏ ఏ దేశాల్లో పెట్టుబళ్ళు పెడితే గట్టి లాభాలు గుంజుకోవచ్చో  ఓ అంచనాకొస్తుంటారు'
'అట్లాగయితే .. మన దేశానికే మొదటి ర్యాంకు వస్తుండాలే!'
'వెనకనుంచి మొదటి ర్యాంకు రానందుకు సంతోషించు!   పోయినేడాది మనది  నూట ముఫ్ఫై నాలుగో ర్యాంకు ..నూట ఎనభై దేశాల పట్టికలో! ఈ సారేదో నాలుగు స్థానాలు ముందుకు జరిగాయనుకో! సింగపూర్ దే మొదటినుంచీ మొదటి స్థానం'
'అన్యాయం బాబాయ్! అంతా సింగపూరు సింగపూరు అంటూ చిందులేసే వాళ్లే కానీ.. మన దగ్గరున్నన్ని  సులువుసూత్రాలు  ప్రపంచంలో ఇంకెక్కడున్నాయి.. చెప్పు! ఈస్టిండియా కంపెనీ ఈ వెసులుబాట్లన్నీ లెక్కేసుసుకొనే కదా మన దేశాన్ని వెదుక్కుంటూ  వచ్చి మన నెత్తికెక్కిందీ!'
'ఆ పాత స్టోరీలన్నీ ప్రపంచ బ్యాంకు ముందు పరమ వేస్టురా అబ్బిగా?'
'పోనీ.. ఇప్పటి లెక్కలు చూసుకున్నా మనకే ఫస్టు ర్యాంకు రావాలి బాబాయ్ న్యాయంగా! సర్కారు భూముల్ని ఇంచక్కా ఆక్రమించి ఆకాశాన్నంటే భవంతులు లేపినా .. అడిగే నాధుడుండడు మన దగ్గర. తిక్క పుట్టి ఎవరైనా కోర్టు గడప తొక్కినా .. ఏ అపరాధ రుసుమో కట్టేస్తామని.. అఫిడవిట్టో అదేందో ఒకటి గీకి పారేస్తే సరి.. అంతా సెట్టైపోయినట్టే. ఆక్రమించిన భూములు అమ్ముకొనేటప్పుడు సెటిల్మెంటుకు ఏ ప్రజానేతో వచ్చి మోకాలడ్డినా ఓ శాతం మనది కాదనుకుంటే సరి..  అంతా ఓం శాంతిః.. శాంతిః.. శాంతిః!'
'ఆ మాటా నిజమేననుకో! వడ్డించే చేతులు మనవాళ్లవయేట్లు కాస్త అప్రమత్తంగా ఉంటే చాలు.. తట్టెడు సిమెంటన్నా తయారవకముందే పది రూపాయల షేరు పదింతలు పెంచి రాత్రికి రాత్రి రాక్ ఫెల్లర్ తాతై పోవచ్చు'
'మరే! తుక్కు తవ్వుకునేందుకని అనుమతులు తీసేసుకొని ఉక్కు తయారయే సరుకు తవ్వుకున్నా చాలుగదా.. ఏడుకొండలవాడి నెత్తికి  కిరీటాలనేంటి.. పడుకొనే గదుల్లో పక్క ఎక్కేందుకు  వాడే ఎత్తుపీటలు కూడా ఇంచక్కా మేలిమి బంగారంతో మలాములు చేయించుకోవచ్చు'
'లెక్కలడిగే నోళ్ళు నొక్కి పారేసేందుకు విందులు.. వినోదాలు..   నాలుగు నోట్ల కట్టల సందు చూసుకొని  విసిరేయడాల్లాంటి  చమత్కారాలు చచ్చేటన్ని ఎటూ మన దగ్గర ఉంటాయిగదా!'
'వేలు దూరే సందిస్తే చాలు.. కాలు బార్లా చాపుకునే వెసులుబాట్లు వేలకు వేలున్నా మన దగ్గర మరి ఎందుకు  మరీ  ఇంత దిక్కుమాలిన దిగువ ర్యాంకులో మనల్ని తొక్కేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు?'  మంచి ర్యాంకు కొట్టేయాలంటే మరేదన్నా  మతలబు ఉందంటావా బాబాయ్?'
'ఏమోరా! దమ్ముండాలే కానీ దుమ్మూ ధూళితోనైనా సరే దుమ్ములేపే వ్యాపారాలు బ్రహాండంగా చేసిపారేసే వెసులుబాట్లు మన దేశంలో వీశలకొద్దీ వాడుకలో ఉన్న మాటా వాస్తవమే! ఒప్పుకుంటాగానీ.. ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ పెరామీటర్లకీ  పక్కదారి చిట్కాలు బొత్తిగా సెట్టవవేమోరా! టర్కీలో ఎప్పుడో రద్దయిన తుక్కునోట్లనుకూడా   ఇంచక్కా  కోట్లకిందకు మార్చేసే   చురుకు బుర్రలకైతే  లెక్కలేదిక్కడ!   గాలికీ వానకీ   ఎక్కడో శేషాచలం అడవుల్లో పడి  ఎదిగేవి ఇక్కడి  చందనం మొక్కలు!  పులులూ.. చలులూ అని కూడా వెరవకుండా ప్రాణాలకు తెగబడి మరీ   రెండు  దుంగల్ని  నరికి  ఏ చైనాకో జపానుకో తరలించి  నాలుగు డబ్బులు దండుకునే  రూట్లు ఎన్ని కనిపెట్టారు మన లోకల్ కొలంబస్సులు! కొత్త మార్గాలు కనిపెట్టారన్న కనీసమైన కృతజ్ఞతైనా లేకుండా  ఎన్ని ఎన్ కౌంటర్లు జరిపారో  వాళ్లమీద  ఈ గడ్డమీద!'
'రాత్రనక పగలనక వళ్లూ కీళ్లూ ఇరగ దీసి మరీ  సాధన చేసి గెలిచినా క్రికెట్ అటగాళ్లకు  చివరికి గిట్టేది ఓ కప్పు.. అదీ పదకొండు ఆటగాళ్లకీ కలిపి ఒహటి. కనీసం కాఫీ.. టీలు  పోసుకొని తాగేందుకైనా వీలు లేకుండా పొడుగు మూతిది.  వేలంపాట విధానం కనిపెట్టి ఆటగాళ్లూ వేలంపాట సరుక్కన్నా ఏమీ తీసిపోరన్న లాభసూత్రాన్ని కనిపెట్టిన లలిత్ మోదీనైనా బిజినెస్ మోడల్ గా చూసుకోవద్దూ!  ఆ అబ్బిని  దేశం  సరిహద్దులు దాటిందాకా తరిమి  తరిమి కొడితిమి గదా మనందరం కలసి! ఏటేటా అందమైన సుందరాంగుల శృంగార భంగిమలతో గోడకేలండర్లు పంచి పెట్టే అమూల్యమైన ఆలోచన   మాల్యా జీది.   బ్యాంకులకు అతగాడేవో  ముష్ఠి మూడువేల కోట్లు బకాయి పడ్డాడని దేశం దాటి పారిపోయిందాకా నిద్రైనా పోకుండా పహరా కాస్తిమి! ఆడంగులు.. పీనాసులు  పోపు డబ్బాల్లో.. పక్కగుడ్డల కింద సందుల్లో దాచుకున్న  చిల్లర సొమ్మునంతా బైటికి తీయించడమేమన్నా  సామాన్యమైన  చమత్కారమా? స్తబ్ధుగా పడున్న  గ్రామీణ ఆర్థిక వ్యవస్థను  ఒక్కసారిగా తట్టిలేపాడన్న   విశ్వాసమైనా    లేదు అగ్రిగోల్డు పెద్దాయనమీద దేశంలోని పెద్దలెవరికీ!'
'నిజమేరా!  నాలుగు డబ్బులు దేశానికి రాబట్టే  ఉపాయాలు కనిపెట్టే వ్యాపారస్తులమీదా న్యాయస్థానాలు సైతం అట్లా  అగ్గినిప్పులు కురిపిస్తుంటే.. ఏ గుండె నిబ్బరంతో విదేశాలనుంచి బిజినెస్ మాగ్నెట్లు  సముద్రాలు దాటి వచ్చి మరీ ఇక్కడ పెట్టుబళ్ళు పెడతారు!.. మదుపుదార్లకు  డబ్బులు చెల్లించే విషయంలో విఫలమై తీహార్ జైలు ఊచలు లెక్కించే  సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ రాసిన పుస్తకం ‘లైఫ్ మంత్రాస్’ వరల్డ్ బెస్ట్ సెల్లింగ్ బుక్ గా రికార్డుకెక్కింది. అయినా  ప్రపంచ బ్యాంకు అతగాడి వ్యాపార  సులువు సూత్రాలని లెక్కలోకే తీసుకోలా! ప్రపంచ బ్యాంకు పెరామీటర్లకూ  కొన్ని పరిమితులు ఉండిపోయాయనుకుంటా!'
'అలాగని.. అన్ని రకాల వ్యాపారాలకు తరగని గని వంటి మనదేశానికి ఇంత దిక్కుమాలిన ర్యాంకు ఇచ్చి కిందకు తొక్కేస్తే.. అరటి తొక్కల వ్యాపారం కూడా ఇక్కడ ఇంక ఎక్కిరావడం కష్టం కదా!బాబాయ్! అందరూ మన ఆంధ్రపత్రిక నాగేశ్వర్రావు పంతులుగారంత చురుగ్గా ఉండరు.. తలనొప్పి మందు అమృతాంజనాన్ని కూడా ఫ్రాన్సులాంటి దేశాల ఆడపిల్లలకి సౌందర్య సాధనం కింద అమ్మి సొమ్ము చేసుకోవడానికి!'ఈ కాలం 'ఈ-కాలం' అయిపోయింది. ఈ ర్యాంకుల గొడవొకటి కొత్తగా నెత్తిమీదకొచ్చి పడింది.   ఎలాంటి వ్యాపార  వెసులుబాటులో విస్పష్టంగా  చెప్పకుండా   వట్టిగా  'సరళతర వ్యాపార నిర్వహణ' అని ఒక పేరు పెట్టి  ర్యాంకుల పట్టికలు తయారు చేసేస్తుంటే.. ఎంత   మేథస్సు పొంగిపొర్లే పుణ్యభూమి అయినా   పైసా పెట్టుబడి పెట్టేందుకు  విదేశీయులే కాదు.. స్వదేశీయులూ ఛస్తే  ముందుకు  రారు'
' అందుకే కదరా ఇందాక మీ పిన్ని రాళ్ళేరమని ఇచ్చిన బియ్యాన్ని 'ఈజీవే ఆఫ్ డూయింగ్ బిజినెన్' పద్ధతిలో  రాళ్ళకు బదులు బియ్యం గింజలేరి ఇచ్చేసింది! ఇదిగో .. దాంతో చేసిన కిచిడీ! అందుకో!  రుచి చూడు! ఫలితం పాజిటివ్ గా ఉంటే   .. 'సరళతర  వ్యాపార నిర్వహణ' ప్రాజెక్టు రిపోర్టొకటి తయారు చేసి'   ప్రపంచ బ్యాంకుకి సమర్పించేటట్లు మన ప్రభుత్వాలమీద వత్తిడి పెంచేద్దాం!'
'బాబోయ్! పన్ను విరిగింది బాబాయ్! నీ బియ్యం కిచిడీ బంగారం కానూ!'
విరగదుట్రా మరి! బియ్యం  కిచిడీలో అన్నీ రాళ్లేనాయ మరి!'
 మీ బాబాయిగారి 'సరళతర వ్యాపార నిర్వహణవిధానం అలాగా ఏడ్చింది మరి! ఆడమనిషినని తీసి పారేయకుంటే తోచిన సలహా ఒక్కటిస్తాను. వింటే వినండి! ఈ దేశంలో  అపరిమిత లాభాలు గడించి పెట్టే సరళతర వ్యాపార నిర్వహణ' విధానాలు  సక్రమంగా పనిచేసే రంగం ఒక్కటే ఒక్కటి.. రాజకీయ రంగం. అందులో మీరెలాగూ రాణించే రకం కాదు గానీ.. లోపలికి పదండి.. మీకోసం రోలు.. పొత్రం ఎదురు చూస్తున్నాయి.. అట్లకి పిండి రుబ్బి పెడుదురుగానీ ఇద్దరూ కలసి!
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఈనాడు సంపాదకీయం పుటలో ప్రచురితం- ఈనాడుకి.. కార్టూనిస్ట్ శ్రీధర్ గారికి ధన్యవాదాలతో)

Monday, August 1, 2016

పెళ్ళిచూపులుకాని పెళ్ళిచూపులు- మరీ చిన్న కథ

రామసుబ్బు చేసేది విప్రోలో పెద్ద ఉద్యోగమే అయినా బామ్మగీసే గీటు దాటేరకం బొత్తిగా కాదు. ఒక్క పెళ్ళి అనేమిటి! పెళ్ళిచూపులుకూడా శుద్ధసాంప్రదాయఫక్కీలో సాగితీరాలన్న బామ్మగారి ఆంక్ష. అందుకు ఒప్పుకున్న తరువాతే సుబ్బురామమ్మను చూసేందుకు రామసుబ్బు స్నేహితుడితోసహా తరలి వచ్చింది.
పాతకాలం మోడల్లో ఫలహారాలు సుష్టుగా లాగించిన తరువాత పిల్లను తెచ్చి చాపమీద కూర్చోపెట్టారు. మగపెళ్ళివారి తరుఫునుంచి ప్రశ్నలవర్షం ప్రారంభమయింది.
'సంగీతం వచ్చా?
'రామలాలీ మేఘ శ్యామలాలీ..'
'గొంతులు బాగున్నాయి సరే ఆమెతో పాటు ఆ పక్క జంటస్వరం ఎందుకు?'
'మొదట్నుంచీ మాకిద్దరికీ కలిసి పాడటమే అలవాటండీ!'
'సంగీతానిదేముందిలేండి! సంసారం చేసుకోవడానికి కావాల్సింది వంటా వార్పూవంటచేయడం వచ్చా.. రాదా.. మీ స్నేహితురాలికి?'
'వంకాయకూర బ్రహ్మాండంగా చేస్తుందండీ!'
'వంకాయకూర ఒక్కటేనా వచ్చు?!'
'కాలేజీకెళ్లి చదువులు సాగించడంచేత ఇంట్లో వంటచేసే తీరిక లేదండీ! కావాలంటే రెండునెల్లలో అన్నీ నేనే దగ్గరుండి నేర్పిస్తానండీ! నాకు అన్ని రకాల వంటలూ చేయడం వచ్చు'
'బాగుంది! రేపు మీ స్నేహితురాలికి ఒంట్లో ఓపికలేదు పొమ్మన్నా  మీరే ఆపద్ధర్మంగా ఆమెకు సాయం పట్టేటట్టున్నారే!  మరి మీరు ఏమీ చదువుకోవడం లేదా ఏమిటీ?'
'ఇద్దరం కలిసే చదువుకొన్నామండీ ఇంటరుదాకా! మెడిసన్లో నాకు సీటు వచ్చినప్పట్నుంచే విడివిడిగా వెళ్ళి చదువుకోవాల్సి వస్తోంది'
'సరే! కాస్త మీ స్నేహితురాలిని  అసుంటా నడిచి చూపించమనండి! లేకుంటే కాలో చెయ్యో వంకరుంటే ఎలా తెలిసేదీ!'
సుభద్ర పక్కనుండి సుబ్బరామమ్మచేత నడిపించింది.
కట్నకానుకలదాకా రాకుండానే  ఆ సంబంధం రద్దయిపోయిందని వేరే చెప్పాలా!
సడేలే! మరి ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ దేనికంటారా!
అక్కడే ఉందండీ అసలు ట్విస్టంతా. సంబంధం రద్ధయిందన్నానేగాని.. బాజాభంత్రీలు మోగలేదని అన్నానా!
ఈ పెళ్లిచూపులు అయిన రెండునెల్లకు భాజాభంత్రీలు మోగాయి.. రామసుబ్బు స్నేహితుడు సుబ్రహ్మణ్యం పెళ్లికొడుకైతే.. సుబ్బరామమ్మ స్నేహితురాలు సుభద్ర పెళ్ళికూతురు!
వాళ్ళిద్దరూ ఒకళ్లకొకళ్ళు తెగనచ్చేసుకొన్నారు రామసుబ్బు పెళ్ళిచూపుల్లో.
బామ్మగారి పనుపుమీద పెళ్లికూతుర్ని అడ్డమైన ప్రశ్నలు వేసినందుకు ఆనక సుబ్బరామమ్మకు సుబ్రహ్మణ్యం ప్రయివేటుగా సారీచెప్పడం సుభద్రకు తెగనచ్చేసిందిస్నేహితురాలికోసం పెళ్ళిచూపుల్లో సుభద్ర అన్నిరకాల మాటలు చిరునవ్వుతో ఎదుర్కోవడం సుబ్రహ్మణ్యానికీ బాగా నచ్చేసింది.
పెళ్ళిచూపులు కాని పెళ్ళిచూపుల్లో నిజమైన పెళ్లిచూపులు జరగడమే ఈ కథలో విశేషం
-కర్లపాలెం హనుమంతరావు
-***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...