ఈనాడు - సంపాదకీయం
ఆనందోబ్రహ్మ!
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం 05 -06-2011 )
మనుచరిత్ర వరూధిని మొదలు సముఖం కృష్ణప్ప అహల్యా సంక్రందనం కథానాయిక చెలికత్తె వరకు ఎందరికో- ఆనందమంటే అదేదో ఒంటినుంచి పుట్టే పరబ్రహ్మ స్వరూపం! 'ఎందే డెందము కందళించు రహిచే - అందే ఆనందోబ్రహ్మం' వరూధినికి. అహల్య సహేలికీ 'ఎందును సంచరింపక అఖిలేంద్రియముల్ సుఖమొందు'- అలాంటి, బుద్ధికి అగోచరమైన ఆనందమే పరమానందం. తార అతిచొరవతో మనసు చెదిరిన శశాంకుడూ ప్రారంభంలో పరకాంత అని కొంతా, అధర్మమని కొంతా చింతపడ్డా చివరికి దేహరుచికే దాసోహమన్నాడు. అడిదం సూరపరాజు 'కవి జనరంజనం' కథానాయకి చంద్రమతి శోభనం గదిలో అడుగుపెట్టే వేళ చెలికత్తెలకు బహుపరాకులు చెప్ప వలసిన పరిస్థితి. మొగుడు మునిపంట నొక్కగానే మొగమటు తిప్పుకొనే అంతటి లజ్జావతీ ఆరుమాసాలు ముగియకుండానే అతగాడు అడిగీ అడగక ముందే తియ్యనిమోవినందించే గడసరితనానికి అలవాటుపడింది! ఇదంతా పడుచుతనపు పరవళ్ల ఉరవళ్లని సరిపుచ్చుకొంటే సరిపోతుందా? మరి రఘునాథ నాయకుడి 'శృంగార సావిత్రి' విశ్వా మిత్రుడి వ్యథో? మద్ర దేశాధిపతి ఉగ్రదీక్షను భగ్నం చేయాలని బదరికావనానికి బయలుదేరిన మేనక వెనుక 'అకట! నీవు నన్ను విడనాడి చనం బదమెట్టులాడు? ' నంటూ అంతటి జితేంద్రియుడూ గోడుగోడుమంటూ వెంటబడ్డాడే! ఆనందం ఒక అర్ణవమైతే అందులో ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా మునక. రసరమ్య కావ్యం రాయమని రాయలవారు అడిగినప్పుడు పెద్దనామాత్యుడి వంటి పెద్దమనిషే 'నిరుపహతి స్థలం, రమణీయ ప్రియదూతిక చేతి కప్పుర విడెం, ఆత్మ కింపయిన భోజనం, ఊయల మంచం' వంటి భోగాలు లేనిదే ఊర కృతులు రాయడం ఆశక్యమనేశాడు. మరి మామూలు మనిషికి ఆనందమంటే భౌతిక సుఖాల భోగమని మాత్రమే అనిపించదా?
నిజానికి ఆనందానికీ భౌతిక సుఖాలకీ అసలు సంబంధమనేది ఉందా? సిలువ మేకులకు వేలాడే క్రీస్తు పెదవులమీది చలువ నవ్వులు ఏ ఆనందానికి ప్రతీకలు? ఆనందమంటే కేవలం భౌతిక భోగానుభవం అనే భావన బలంగా ఉన్నంత కాలం ఎవరికైనా, భిక్షాపాత్ర ధరించిన బుద్ధ భగవానుడి వదనంలోని ఆ ప్రశాంతత అర్ధం కాదు. చిదానంద స్వరూపంగా సదా మనం సంభావించే ఏ భగవదవతారమూ భూమిపై సుఖపడిన దాఖలాలు లేవు అంటారు స్వామి సుఖబోధానంద. లోకాదర్శంకోసం చివరికి జానకి నైనా సంతోషంగా పరిత్యజిస్తానని ఆచరించి చూపినవాడు మర్యాదా పురుషోత్తముడు. రాజసూయ యాగం వేళ అతిథి అభ్యాగతుల ఎంగిలి విస్తరాకులను గోవర్ధనోద్ధరణమంత సంబరంగా ఎత్తి పారేసినవాడు గోవిందుడు. అన్నమయ్యను ఎవరి బలవంతాన బాలాజీ పల్లకిలో మోసుకెళ్లాడు? తామరాకుమీది నీటిబొట్టు తత్వం నాకు అత్యంత ప్రీతిపాత్రం- అని గీతలో భగవానుడు చెప్పాడు. ఆనందం, భౌతిక సుఖాలు- పాలూ నీరు వంటివి. నీటిలో నేరుగా కలిస్తే పలచనయ్యే పాలు పెరుగై మథనానికి గురయి వెన్న ముద్దగా మారితే ఏ నీరూ ఏమీ చేయలేదు. పెరుగుగా మారటానికి పాలకు పెట్టే తోడే ఆనందం అంటారు మాతా అమృతానందమయి. 'ఒక కొత్త ముఖాన్ని చూడకుండా ఒక కొత్త సుఖాన్ని చవిచూడకుండా / నా రోజు మరణిస్తే/ నేను బతికి ఉన్నట్లా?' అని ఓ ఆధునిక కవి అంతర్మథనం. మనసుతోపాటు మన పరిసరాలకు సరిసమానంగా సంతోషాన్ని పంచేదే అసలైన ఆనందం. అది ఉండేది పైనో, పక్కనో, పక్కలోనో కాదు. కస్తూరి మృగం దేహ పరిమళం లాగా అది పుట్టుకొచ్చేది మనలోని మంచి భావనల్లోనుంచే! మనిషి ఆ పరి మళ మృగంలాగా ఆనందమనే ఆ చందనం కోసం మూలమూలలా వెదుకులాడటమే ఇప్పటి అన్ని అశాంతులకూ మూలకారణం.
కౌమారంలో మిరాయి నోరూరిస్తే యౌవనాన మిఠారి చూపులు కవ్విస్తాయి. వయసు పడమరకు వాలుతున్నకొద్దీ గతం ఆకాశాన వెలుగులు విరజిమ్మిన తారల చమత్కారాలు పగటి చుక్కలకు మల్లే వెలాతెలాబోతాయి. చివరకు మిగిలేది విలువైన క్షణాలు వృధాగా చెయి జారిపోయాయన్న బాధాజ్ఞానమే. 'ఎంతమాత్రం ఎవరు దలచిన అంతమాత్రమే' అందే ఆ బ్రహ్మపదార్థం ఆదీ అంతూ ఇదీ అని ఇదమిత్థంగా తేల్చిచెప్పినవారు ఇటు వైదాంతికుల్లోనూ లేరు, అటు శాస్త్రవేతల్లోనూ కానరారు. 'నీ వలన కొరత లేదు. మరి నీవు నీరు కొలది తామెరవు' అంటూ వాగ్గేయకారుడు అన్నమయ్య పాడినదే ఇప్పటివ రకూ అందరం ఒప్పుకోవలసిన ఆ ఆనందస్వరూపం తాలూకు స్వభావం. ఆవల భాగీరథి ఉంటే దరిబావుల ఆ జలమే ఊరుతుంది. మరి మన అంతరంగబావుల్లో సంతోషపు జల పడవలనంటే - మన జీవన ప్రవాహాన్ని ఆనందసాగరానికి పాయలుగా మలచాలి. ఆరు దశాబ్దాలక్రితం ఓ కారు బయలుదేరతీయాలంటే ఇద్దరు ముగ్గురు వెనకనుంచి తోయవలసి వచ్చేది. కాలంమారి అదే పనిని ఒకరు ముందు ఓ చువ్వసాయంతో పూర్తిచేసేవారు. ఇప్పుడు ఎవరిసాయమూ లేకుం డానే బ్యాటరీతో కారు బయలుదేరుతోంది. కారుమీద గల శ్రద్ధ మనిషికి తన మనసుమీద ఉండాలా, వద్దా?! చక్కని ఇల్లు, చల్లని సంసారం, సంఘంలో పరువూ, జేబునిండా పరుసు బరువు... అన్ని ఆనందాలకూ భౌతిక సుఖాలే మూలమన్న ఇక్ష్వాక కాలంనాటి ఆలోచనలే ఈనాటికీ చలామణీలో ఉన్నాయంటున్నారు బ్రిటన్ పింఛన్ల శాఖ తరపున సర్వే చేసిన మానవ శాస్త్రవేత్తలు. యుక్తవయస్కుల్లో మధ్య వయస్కులలో భౌతికానంద అయస్కాంతం మరీ బలంగా పనిచేస్తుంటే ఏడుపదుల వయసు దాటినవారిలో మాత్రం నూటికి డెబ్బై రెండుమంది తాతయ్యలు, తాతమ్మలు శీత వేళాను , శిశిరాన్ని ఖాతరు చేయటం లేదంటున్నారు! 'తీరని దాహము దేనికై / వేసారిన మోహము దేనిపై / క్షీర జలనిధి నీలోనే ఉండగ, ఆరని దీపం లోపల ఉండగ? ' అని మన భావకవి కృష్ణశాస్త్రిలా కులాసాగా పాడు కునే ఆ తాతల తరాన్నుంచి ఆనందానికి అసలైన అర్థం ఆధునికులూ తెలుసుకుంటే... అదే బ్రహ్మాండంలో అసలు సిసలు ఆనందో బ్రహ్మ !
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం 05 -06-2011 )
No comments:
Post a Comment