Thursday, December 23, 2021

ఈనాడు - సంపాదకీయం ప్రణయ పరిమళం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ప్రేమకు వందనం - పేరుతో ప్రచురితం - 12 -12-2012 )

 


ఈనాడు - సంపాదకీయం 


ప్రణయ పరిమళం 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ప్రేమకు వందనం - పేరుతో ప్రచురితం - 12 -12-2012 ) 


కంటిరెప్పల మైదానాలమీద కలల విత్తులు చల్లి అనుభూతుల పంట పండించేది ప్రేమ. హరిహర సుర జ్యేష్ణాదులు, కౌశిక శుక వ్యాసాదులు సైతం వలపు వలకు చిక్కి చిక్కిసగమైనవారే! ' కాయజుడు చేయు మాయల/ కా యజుడు, హరుండు, నంబుజాక్షుడు లోనై! తోయజ నయనల బాయరు/ హేయ జనుల్ నరులనంగ నెంత ధరిత్రిన్!' అన్న వైజయంతీ విలాసకర్త సారంగు తమ్మయ వాదన- కాదని కొట్టిపారేయలేనంత గట్టిది. చెట్టు నీడుండి, రుచియైన రొట్టె ఉండి/ దివ్యమైనట్టి శృంగార కావ్యముండి/ పరవశము చేయ గల మధుపాత్ర ఉండి/ పాడుచు హాయిగా ప్రియమైనవారు'  పక్క నుంటే ఉమర్ ఖయ్యామంతటి వాడికే- 'వట్టి బయలున స్వర్గం ఉట్టి పడుతుందట! వలచిన చిన్నది చాలాకాలం సుదూరంలో ఉన్నందువల్లే కాళిదాసు మేఘదూతం కథానాయకుడు చిక్కి శల్యమై చేతి కంకణాన్ని జారవిడుచుకొన్నది. 'మరలు కొనుచు హరిని వీడి/ మరలిన నర/ జన్మమేమి? ' అన్నంత భక్త్యావేశం ఉన్న విప్రనారాయణుడూ 'ఆడ ఉసురు తగలనీకు స్వామీ/ ముసురుకున్న మమతలతో కొసరిన అపరాధమేమి? ' అని ఒక ఆడుది ఇలా వేడుకొన్నదో లేదో రంగనిమాలా కైంకర్యమంతా ఆ అంగన సాంగత్యం పాల్జేసాడు! కావ్యాలంకార సంగ్రహ కర్త భట్టుమూర్తి- స్వాధీనపతిక, వాసవ సజ్జిక, విరహోత్కంఠిత , విప్రలబ్ధ , ఖండిత, కలహాంతరిత, ప్రోషిత భర్తృక, అభిసారిక అంటూ అష్టవిధ నాయికలుగా విభజించి చూపించాడు . కానీ - నిజానికి 'ఈ స్థాయీ భావాలన్నీ స్త్రీ పురుష భేదం లేకుండ పడుచు గుండె లన్నింటిలో సందర్భానుసారం గుబాళించే ప్రణయ పుష్ప పరిమళాలే! కొసచూపు దూసినప్పుడు, కులుకు నడక కంటబడ్డప్పుడు, సంయోగ శర్వరీలో, వియోగ విభావరిలో హృదయ సంబంధమైన సమస్తావస్థలలో  సరసులందరి మనసు లో పొరల్లో ముందుగా తళుక్కున మెరిసేది శృంగార భావమే! 'నాలో నన్ను ఇలా కలవరపరచేదేదో తెలీడం లేదు' అంటూ చలం 'గీతాంజలి'లో పడే ఆ అవ్యక్త మధుర బాధే ప్రేమికులందరిదీ. 'యెనక జల్మంలోన యెవరమో? ' అని బావ నాయుడంటే సిగ్గొచ్చి నవ్విన యెంకి, 'ముందు మనకే జల్మ ముందోలే' అనగానే తెల్లబోయిందట. ఎన్నాళ్లు మనకోలె ఈ సుకము లంటూ ఆ బావ దిగాలుపడితే కంట నీరెట్టేసుకుంటుంది ఆ నండూరివారి వెర్రి యెంకి. | నెత్తురు చెమ్మైన క్రమ్మకుండు/ పచ్చి గాయము లవి యమబాధ- పడవ/ కదిపితిని పొమ్ము, లక్షల కత్తులచట/ దిగ బడునయన్న భీతితో దిగులు నాకు' అని 'నాయని' ప్రేమను కత్తిపడ వ'తో పోల్చి మొత్తుకుంటారు. పువ్వులో తావిలా- తావిలో తలపులా/ కోకిలా గొంతులా- గొంతులో కోర్కెలా/ వెన్నెలా వెన్నలా వెన్నలో వెలుగులా నింగిలో నీడలా- నీడలో నిదురలా ప్రణయం ఒక్కొక్క రికి ఒక్కోవేళ ఒక్కో రూపంలో కనిపించి మురిపిస్తుంది. . కనిపించక కవ్విస్తుంది. . కనిపించీ కనిపించవండా ఏడిపిస్తుంది. గోడచాటున చేరి గుటకలేయడంతో మొదలయ్యే ప్రేమయాత్ర చూపులే ఆపేసి , రూపు పూసే మరిసి/వొకరెరుగ కింకొకరు వొంగి నిదరోదాము' అన్నంతదాకా సాగి సుఖాంతం కావాలంటే ధైర్యంగా దాటవలసిన  అవాంతరాలు ఎన్ని ఉంటాయో! మధ్యలో పడవలసిన  అవస్థలూ అంతే.  నిదురపోని కనుపాపలకు జోలపాట పాడలేక, ఈలవేసి చంపుతున్న ఈడుపోరు ఆపలేక పడుచుగుండెలు పడే దుర్భరానంద బాధ మేఘదూతం కాళిదాసు ఊహలకు సైతం అందనంత వింతైనది. మనసిచ్చినట్లు మాటొచ్చిన దాకా ఒక అంకం. మాటిచ్చినట్లు చివరిదాకా మనసును నడిపించుకో వడం మరో అంశం.  ప్రేమంటే రెండు గుండెలు చేసే సాము. గెలుపు కోసం ఓటమి, ఆ ఓటమికోసం అలుపెరుగని పోటీ.  వలపు- ప్రేమ పిచ్చివాళ్ల కూటమికి మాత్రమే అంతుబట్టే ఓ వింతక్రీడ.


భూమ్యాకర్షణ శక్తి సూత్రాన్ని సాధించినంత సులభం కాదు ప్రేమ ఆకర్షణశక్తి మూలాన్ని శోధించడం. ప్రణయ గణితంలో సంతోషం గుణకారం, సంతాపం భాగహారం, స్నేహం కూడిక, ద్వేషం తీసివేత అంటారు యండమూరి సమాధానంతో నిమిత్తం లేకుండా. ప్రశ్నలా పుట్టి మనసును సలిపేదే ప్రేమ.  ప్రేమను గురించి వివరిం చమని ఆల్మిత్రా అడిగినప్పుడు అలుస్తఫా సుదీర్ఘమైన వివరణ ఇస్తారు.  ఖలీల్ జిబ్రాన్ ప్రవక్త సందేశంలో ప్రేమమార్గం పరమ కఠినం. భీతి చెందకుండా విశ్వాసంతో వశమైపోయేవాళ్లను పరవశుల్ని చేసేది ప్రేమ పరుసవేది. నిజం. ప్రేమభావన సముద్రతీర లాంతరుగా మారి దారి చూపకపోతే జీవన సాగరంలో మనిషి ఏనాడో జాడ తెలియని ఓడగా కనుమరుగైపోయి ఉండేవాడు. మనిషి ఉనికికి ప్రేరణ ప్రేమే. నది ఇంకిపోయిన పిదప ప్రవాహపు గుర్తులు ఇసుక మేటలో కనిపించినట్లు- మనిషి కనుమరుగైన తరువాత అతను విత్తిన ప్రేమ వృక్షాలు పుష్పించి పరిమళాలు వెదజల్లుతూనే ఉంటాయి. జీవితం వెలుగు చీకట్ల పడుగు పేకయితే, వెలుగు ప్రేమభావన. చీకటి దాని ఛాయ. 'లోకము నవ్వునంచుదనలో జనియించిన ప్రేమ నాపగా /నే కమలాక్షికైన దరమే!' అంటారు కొప్పరపు సుబ్బారావు 'తారాశశాంకం'లో. ఒయాసిస్సుల తడిసోకని ఎడారిలా బతుకు గడచిపోవాలని ఎవరు కోరుకుంటారు? కలల్ని రుమాలులో మూట కట్టుకోవాలన్నా, పిడికిలితో సముద్రాలని ఒడిసి పట్టుకోవాలన్నా- ప్రేమలో పడటమొక్కటే సులభమార్గం. మనసు నుంచి ప్రేమను దూరం చేయడం అంటే నదినుంచి నీటిని తోడేయటమే' అని ఒక ఆధునిక కవి భావన. కంటినుంచి దృష్టిని గెంటేయడం సాధ్యమా? ప్రేమా అంతే 'ఈసు కన్నుల దోయి/ చూచు చెడుపులు వేయి/ గుడ్డిప్రేమే హాయి' అంటారు కూనలమ్మ పదాల్లో ఆరుద్ర. ' ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును/ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును/ ప్రేమ కలుగక బ్రతుకు చీకటి'  అని ఎలుగెత్తారు యుగకవి గురజాడ. హింస, ద్వేషం, ఆవేశం, ఆక్రోశాలకు తావులేని ప్రేమ తావిని పంచుకోవాలన్నదే రాబోయే ప్రేమికుల దినం' యువలోకానికి అందిస్తున్న పరిమళ సందేశం.


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ప్రేమకు వందనం - పేరుతో ప్రచురితం - 12 -12-2012 ) 



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...