Thursday, December 30, 2021

ఈనాడు- సంపాదకీయం పాటే మంత్రమూ... రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 05 - 08 -2012 )

   ఈనాడు- సంపాదకీయం 


పాటే మంత్రమూ... 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 08 -2012 ) 


దివ్యభావాలతో అమూర్తిని భగవంతుడిగా భావించి ఆరాధించడమే భక్తి. అది తొమ్మిది విధాలు. అందులో సంకీర్తనం ఒకటి. అది సంగీత సంబంధి. రామామాత్యుని స్వరమేళ కళానిధి- స్వర ప్రకరణం ప్రకారం, సంగీతం సామవేద సంగ్రహం. బ్రహ్మ సంగ్రహకర్త. సర్వజ్ఞుడైన శంకరుడు గానసంతుష్టుడు. అనంతుడు సంగీత స్వాధీనుడు. యక్షగంధర్వ దేవదానవ మానవాదులే కాదు... పశుపక్ష్యాదులూ నాదప్రియులు. గాంధర్వం, గానం అని సంగీతం రెండువిధాలు. గంధర్వులు గానంచేసే అనాది స్వరసంప్రదాయం గాంధర్వం. వాగ్గేయకారులు లక్షణయుక్తంగా రచించి దేశీరాగాలతో జనరంజకంగా పాడేది గానం. సంకీర్తనం గానప్రధానం. ఖట్వాంగుడు అనే రాజు ఇంద్రాది దేవతల వరప్రసాదం వల్ల తన ఆయష్షుకాలం ఒక్క ముహూర్తం మాత్రమే అని తెలుసుకుంటాడు. ' గిరులు బోలెడి కరులను/ హరులం దన ప్రాణ దయితలై మనియెడి సుం/ దరులను, హితవరులను, బంధ/ వరులను అందరిని వర్ణించి'  చివరకు గాఢ వైరాగ్యంతో మోక్షం పొందే ముందు నిరంతరాయంగా కొనసాగించింది గోవిందనామ సంకీర్తనమే ! 'ఈ మేను కలిగినందుకు సీతారామ నామమే పల్కవలెను' అని త్యాగరాజస్వామివారి కృతి. ' సకల సంగ్రహము సకల సంచ యము/ అకృత సుకృతమిది హరినామం' అని అన్నమాచార్యులు వారి సంకీర్తనం. 'రాతిరనే ఏనుగునెక్కి- రాకా చంద్రుడు గొడుగు గాను/ లేత తుమ్మెద మొదలైన బలముల చేత గెలిచెదనం టివా?' అంటూ మువ్వగోపాల పదకర్త క్షేత్రయ్య పదం. విరహం, వైరాగ్యం, శృంగారం, వేడుకోలు , అలక, సందేశం, సంతాపం, నుతి, ఎత్తిపొడుపు, బెంగ, పాగల్భ్యం  , బేలతనం- భావన ఏదైతేనేం... పొదిగే పనితనం ఉండాలేగానీ అన్నీ- సంకీర్తనాభరణంలో అందంగా అమిరే మణులూ మాణిక్యాలే!


జానపదం, యక్షగానం, జావళులవలె సంకీర్తనా ఒకానొక కాలంలో ముమ్మరంగా వెలిగిన దాఖలాలు కద్దు . సంకీర్తన ప్రక్రి యకు లక్షణాలు నిర్దేశించి, వేలకొద్ది గేయాలను సృజించిన పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. అన్నమయ్య వంశంలోని పన్నెండుమంది కవులు స్వయంగా సంకీర్తన కర్తలు, ప్రచార నిర్వాహకులు. పెద తిరుమలయ్య తండ్రి సంకీర్తన కర్తృత్వాన్ని సమర్థంగా కొనసాగిస్తే, ' సంప్రదాయాగత జ్ఞానసహితుడైన మనుజు సత్కవితయు వేదమంత సమము'  (తెలుగు సంకీర్తన లక్షణం-23) అంటూ సంకీర్తనాక్రియకు వేదప్రామాణికతను ప్రసాదించినవాడు చినతిరుమలాచార్యుడు. భక్తి అంటే రాతి విగ్రహం ముందు మోకరిల్లి మనసులోని కోరికలన్నీ ఏకరువు పెట్టడం ఒక్కటే కాదు. డాక్టర్ శ్రీపాద పినాకపాణివారన్నట్లు హృదయానుభవ భావమాధుర్యాన్ని బాహాటమైన పదాలతో ప్రకటించుకోవడమూ ఒక రకమైన భక్తిమార్గమే. భక్త మీరాబాయి కృష్ణప్రే మలో మునిగి భజనలు చేసినా, తుకారాం పాండురంగడిమీది అపరిమిత ప్రేమతో అభంగాలు గానం చేసినా, పురందరదాసు సుందరీమణుల ముందువెనకలనున్న శ్యామసుందరుడి అందచం దాలను పదాలుగా పలికినా- సంకీర్తనార్చనలోని అంతర్భాగాలే అవన్నీ. గీతాంజలి - ఈశ్వరుడికి టాగోర్ పట్టిన కీర్తనల హారతి. 'సానుతాప గానముతో సానురాగ గీతముతో/ మేనుమరచి నిన్నె వలచి/ వెదుకుచుంటి... వేచియుంటి' అంటూ బ్రహ్మసమాజం కోసం కృష్ణశాస్త్రి కలంనుంచి జాలువారిన సంకీర్తనలు ఎన్నెన్నో! తూము నరసింహదాసునుంచి ఎడ్ల రామదాసుదాకా తెలుగు సంకీ ర్తన సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానుభావులు ఎందరో! 'చింతలేదిక యేసు పుట్టెను/ వింతగను బెత్లహేమందున' అంటూ అతిలోకదైవం మితిలేని ప్రేమను ప్రతి పదంలో ప్రతిధ్వనిస్తూ యేసుభక్తులు చేసే కీర్తనలు, ఉర్దూ భాషామయ గీతికలను వచ్చిన లిపిలో రాసుకుని ఖురాను సమీపభావంతో అల్లా దయను కీర్తించే మొహరం గీతాలు- సంకీర్తనారాధనకు మతాలు ఎల్లలు లేవనేదానికి సంకేతాలు. 


వాంఛితార్థాలు తీరడం ఎలా ఉన్నా... పారవశ్యంతో సంకీ ర్తన గానం సాగించే నాదోపాసకులు మానసికంగా పొందే సాంత్వన అనిర్వచనీయం. 'పాట దైవసన్నిధికి బాట' అని పరమ భాగవతుల విశ్వాసం. ఇష్టమూర్తుల సద్గుణాలను పదపదంలో ప్రశంసిస్తూ ప్రతి పదానికి మానసికంగా అర్థాన్ని అనుభవించే సంకీర్తనా ప్రక్రియలో చైతన్యం వలయాలుగా ప్రసారమవుతూ మనసును ఆనందలోకాల విహారానికి మోసుకెళుతుంది. భక్తితత్వం అంటే కేవలం దైవసంబంధమనే భావన సగమే సత్యం. సామాజిక రుగ్మతలమీద విముఖతతో కూడుకున్న వైరాగ్య భావాలనుంచీ తత్వాల రూపంలో వెలువడ్డ సంకీర్తన సాహిత్యం తెలుగులో బోలెడంత. మేలుకొలుపులు, జోలపాటలు, పవ్వళింపులు, మంగళహార తులు, నీతిబోధనలు, బైరాగి గీతాలు, దేశభక్తి గీతాలు... సంకీర్తన ప్రక్రియకు బహుముఖ రూపాలు. కీర్తనల ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో తేలిందిప్పుడు. మతిమరుపు వ్యాధిపీడితులు వందమందిమీద కీర్తన క్రియాత్మక ధ్యాన పద్ధతులను ప్రయోగించగా అందరి జన్యువుల్లో సానుకూల స్పందనలు నమోదయ్యాయని పరిశోధక బృందం తేల్చి చెప్పింది. ఆత్మాశ్రయం, అనుభూతి, ఆవే దనలనుంచి సాంత్వనను కలిగించే కీర్తనల ప్రక్రియ- మతిమరుపు రుగ్మత నిదానానికి ఔషధంగా ఉపయోగపడుతుందని తేలటం సంతోషించదగ్గ పరిణామమేగా!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 08 -2012 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...