ఈనాడు - సంపాదకీయం
చిరంజీవులు
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురణ- 25-06-2009 )
'షేక్స్పియర్ నాటకాలు- అన్నీ షేక్స్పియరే రాసి ఉండకపోవచ్చు' అని ఒకాయన తెగ వాదిస్తున్నాడు. విని విని శ్రోతకు విసుగొచ్చింది. 'ఇదిలా తేలదు, నేను చచ్చి స్వర్గానికి వెళ్ళాక ఆయననే అడిగి కనుక్కో వాలి' అని లేచి పోబోయాడు. మొదటాయన వదలలేదు- 'షేక్ స్పియర్ స్వర్గంలోనే ఉంటాడని నమ్మకం ఏముంది? నరకంలో ఉండొచ్చుగా' అని ఎదురు తిరిగాడు. శ్రోత తాపీగా లేచి 'అయితే పేచీ ఏముంది? మీరే స్వయంగా ఆయనతో తేల్చుకుందురుగాని' అనేసి చక్కాపోయాడు. స్వర్గం నరకం అనేవి ఉన్నాయని, అక్కడికి వెళ్ళాక తమ పూర్వీకులను కలుసుకోవచ్చునని చాలామంది నమ్ముతారు. వారిలో కొందరిది విశ్వాసం, మరికొందరిది భయం. విశ్వాసం గల వారికి పుణ్యకార్యాలు చేద్దామన్న ఆసక్తి ఉంటుంది. భయపడేవారిలో పాపకార్యాలు చేయరాదన్న జంకు ఉంటుంది. స్వర్గ నరకాలు ఎక్కడో కాదు మనలోనే ఉంటాయి' అని మరికొందరంటారు. జపాన్ జాన పద కథలో ఒక గొప్ప మల్లయోధుడు(సమురాయ్) రాజవుతాడు. స్వర్గ నరకాలకు తేడా తెలుసుకోవాలన్న ఆలోచన ఓరోజు అతని మనసును తొలిచేస్తుంది. ఉన్నపళంగా తన ఆధ్యాత్మిక గురువు దగ్గరకు పోయి, సంగతి తేల్చుకోవాలనుకుంటాడు. విషయం విన్న గురువు రాజును తేరిపారచూసి తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి రాజుకి ఓపిక తగ్గినా ఎలాగో తమాయించుకున్నాడు. అసలే సాహసి, దానికితోడు రాజ్యాధికారం. చివరికి గురువును బలవంతాన పట్టి కుది పాడు. ఆయన కళ్లు తెరిచి 'నువ్వు మూర్ఖుడివి... స్వర్గ నరకాల మధ్య తేడా గురించి నీకు చెప్పినా అర్థం కాదు' అన్నాడు. రాజుకు ఒళ్లు మండిపోయింది. కోపం ముంచుకొచ్చింది. 'నిన్ను చంపేస్తాను' అంటూ కత్తిదూసి రొప్పుతూ గురువుపైకి దూకాడు. గురువు చిన్నగా నవ్వి 'అదిగో అదే నరకమంటే!' అన్నాడు. ఒక్కసారిగా బిత్తర పోయాడు రాజు. గురువు చెప్పిందేమిటో అర్థం అయ్యేసరికి సిగ్గుతో చచ్చిపోయాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ గురువు కాళ్లపై పడి 'గురువర్యా' ఎందుకిలా చేశారు? ఒక్కక్షణం ఆలస్యం అయితే ఎంత ఘోరం జరిగిపోయేది!' అంటూ విలపించాడు. గురువు ఆప్యాయంగా లేవనెత్తి 'ఇప్పుడు నువ్వున్నది స్వర్గంలో' అన్నాడు.
' కారే రాజులు! రాజ్యముల్గలుగనే! గర్వోన్నతి పొందరే! వారేరీ? భూమిపై పేరైనన్లదే' అని ప్రశ్నించాడు బలిచక్రవర్తి. ' శిబి వంటివారిని ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. కారణం ఏమిటి?' అని శుక్రాచార్యుణ్ని నిలదీశాడు. ఇహపరాల్లో మనిషికి కీర్తి యశస్సు అనేవి రెండే తోడు. ధర్మబుద్ధివల్ల దానగుణంవల్ల కలిగే పేరు ప్రతిష్ఠలను కీర్తి అంటారు. శౌర్య పరాక్రమాలతో విజయాలు సాధించిన వారికి దక్కేది యశస్సు . ఆ రెండే ఇక్కడ మనిషికి ప్రాచుర్యాన్ని కలి గిస్తాయి. పరలోకానికి వెంట వస్తాయి. 'ఈ లోకమయగుకొందరకు, ఆలోకమ కొందరకున్.. ఇహమ్మున్ పరమున్ మేలగు కొందరకు' అన్నాడు భారతంలో ఎర్రాప్రెగ్గడ. అలా ఇక్కడా అక్కడా కూడా గొప్పగా గుర్తింపు సాధించాలనే పూనికతో జీవించేవారిని 'మహాశయులు' అంటుంది లోకం. వారికి స్వగతమే కాకుండా లోకహితమూ ప్రధానమై ఉంటుంది. కొందరికి స్వార్ధమే జీవితాశయం. పాప పుణ్యా లతో గాని, స్వర్గ నరకాలతో గాని ప్రమేయం ఉండదు. అసలాదృష్టి ఉండదు. ఈ భూమిపై ఉన్నన్నాళ్లూ ఉంటారు. తినగలిగినంతా తింటారు. ఎవరికీ తెలియకుండా పోతారు. బతికున్నప్పుడే ఈ లోకం వారిని పట్టించుకోదు. మరణించిన మరుక్షణం మరిచిపోతుంది. అలాంటివారిని 'జీవన్మృతులు'గా పరిగణిస్తుంది లోకం. 'నరుడు నరు డౌట ఎంతో దుష్కరమ్ము సుమ్ము!' అన్నాడు గాలిబ్. మనుషులంద రిలో మనిషి లక్షణాలే ఉంటాయని చెప్పలేం. దయ, సౌజన్యం, ఇత రులకు సాయం చేద్దామన్న బుద్ధి వంటివి మనిషి లక్షణాలు. వాటి వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. 'ఇతరులను పీడించడం పాపం, మేలు చేయడం పుణ్యం' అని చెప్పింది భారతం. దాన్ని పాటించిన వాడే మనిషి. మానవీయమైన గుణాలతో సంపూర్ణ మానవుడిగా జీవించిన మనిషిని ఈ లోకం దేవుడిగా ఆరాధిస్తుంది.
రాముడు, ధర్మజుడు, జీసస్ వంటివారు తమ ఉదాత్త జీవితాల కారణంగా మహాశయులుగా పేరొందారు. రావణ వధానంతరం వరం కోరుకొమ్మని ఇంద్రుడు అడిగితే- 'నా కొరకు చనిపోయిన వానర వీరులందరికీ జీవం ప్రసాదించాలి' అని కోరాడు రాముడు. నాకన్నా ముందు మరణించిన బంధువర్గం అంతా ఎక్కడ ఎలా ఉన్నారో తెలు సుకోకుండా- నేను స్వర్గంలో అడుగుపెట్టే ప్రశ్న లేనేలేదు' అన్నాడు ధర్మరాజు. తన వారికోసం ప్రాణత్యాగానికి సిద్ధపడటమే కాదు, తనకు హాని చేసినవారికి క్షమాభిక్ష సైతం కోరాడు జీసస్ క్రీస్తు. మహాశ యులు, మహనీయుల జీవన వైఖరి ఆ రకంగా ఉంటుంది. అలాంటివారు గతించి ఎన్నో వేల ఏళ్లయినా ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచిపోతారు. గట్టిగా కొలిస్తే గుప్పెడుండే గుండెలో కొండంత చోటిచ్చి మనిషి అలాంటివారి జ్ఞాపకాలను నిత్యం పచ్చగా కాపాడు కుంటాడు. గుండెలో కొంతమేర అలా పచ్చగా ఉండటమే మనిషితనా నికి గుర్తు. జీవించి ఉన్నంతకాలం స్మరించడమే కాదు, చనిపోయాకా వారిని కలుసుకోవాలన్న ఆశ మనిషి గుండెలో ఏమూలో స్థిరపడి ఉంటుంది. అలాంటి మూడువేల మందితో బ్రిటన్ లో ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. 'చనిపోయాక ఎవరిని కలుసుకోవాలని గాఢంగా కోరుకుంటారు? ' అనేది ప్రశ్న. ఎక్కువమంది జీసస్ క్రీస్తును కలవ డానికి మొగ్గు చూపారు. ప్రజల గుండెల్లో కొలువై ఉన్న ఆ పరమ పురుషుడు ఇప్పటికీ బ్రిటన్ ప్రజల 'సూపర్ స్టారే' అని నిర్వాహకులు కొనియాడారు. యువరాణి డయానా, విలియం షేక్స్పియర్, ఐన్స్టీన్, మార్లిన్ మన్రో, మోనాలిసా చిరునవ్వును ముగ్ధమోహనంగా చిత్రించిన లియోనార్డో డావిన్సీ వరసగా తరవాతి స్థానాలు పొందారు. తాము చనిపోయాక వీరిని కలుసుకోవాలనుకోవడానికి కారణాలు ఏమైనా వారంతా ఇప్పటికీ జనం గుండెల్లో కొలువున్నారన్నది వాస్తవం. ఎన్నేళ్లు గడిచినా పచ్చగా గుర్తుండేవాళ్లు మరణించారని ఎలాగంటాం?
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురణ- 25-06-2009 )
No comments:
Post a Comment