Friday, December 24, 2021

ఈ నాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక కలకాలం కరవే కరువు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - కరవు ఘోష పేరుతో - ప్రచురితం - 15 -08-2009)


 



ఈ నాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక


కలకాలం కరవే కరువు!  

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - కరవు ఘోష పేరుతో - ప్రచురితం - 15 -08-2009) 



'తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి'  అనిగదా పెద్దలు అనేది' ఈ కరవు రోజుల్లో గారెలెలాగూ తినేది లేదుగానీ.. ఆ భారతమన్నా చెప్పు బాబాయ్.. ఈ జెండా పండుగ రోజున వినాలనుంది!'


' ఏం భారతంరా ... కరవు భారతమా? ఇప్పుడు మనకొ చ్చిన కరవు అప్పుడు ద్వాపరయుగంలో గనక వచ్చిఉంటే?  ఆ వందమంది కౌరవులను ముప్పూటలా మేపలేక పాపం గాంధారమ్మ మొగుడిచేత హస్తినాపురాన్ని ఏ మార్వాడీ వాడికో కుదువ పెట్టించి ఉండేది. అయిదూళ్ళయినా ఇవ్వమని పాండవులు ప్రాధేయపడ్డారంటే నిజంగానే కరవుందేమోనని అనుమానంగా ఉందిరా అబ్బాయ్ ! లేకపోతే పుట్టిన పిల్లల్ని పుట్టినట్లు ఆ గంగమ్మ నీళ్ళలో ఎందుకు వదిలేసుకుంటుందిరా కుంతి  ? ' 


' పో బాబాయ్; నువ్వెప్పుడూ ఇలాగే విచిత్రంగా మాట్లాడతావ్! ఆ కాలంలో కరవు ఉండి ఉంటే నిండుసభలో ద్రౌపదమ్మకు బేళ్ళ కొద్దీ చీరెలు శ్రీకృష్ణపరమాత్ముడెలా సరఫరా చేశాడంటావ్?'


' అందుకేరా ఆయన్ని దేవుడన్నది. అలాంటి మాయలు తెలియవు కనకనే భీముడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు బండెడన్నం పప్పు, కూరలు రోజూ పంపిం చమన్నాడని బకాసురుణ్ని బండకేసి ఉతికాడు . కరవు రోజులొచ్చి మీదపడితే ఎంత లావు దానవీరశూర కర్ణుడైనా కవచ కుండలాల్లాంటివేవో అడిగితే ఠపీమని  పీకిచ్చే స్తాడుగానీ... కందిపప్పు ఓ పావు కిలో కావాలంటే దిక్కులు చూడాల్సిందే' 


' నువ్వు మరీ బాబాయ్! ఒక భారతమేంటి.. భాగవతంలో కూడా కరవు కాటకాలు తాండవించాయనేట్లున్నావ్ బాబోయ్!' 


  ' బాగా గుర్తు చేశావ్ రా అబ్బాయ్! ద్వాపరంలో మాత్రం ఈ కరవు కాట కాలకు కాపురాలు సరిగ్గా ఏడ్చి చచ్చాయా? చిటికెన వేలితో కొండనెత్తిన కృష్ణుడు తులాభారం నాటికి తులసాకంత బరువు కూడా తూగలేదంటే అర్ధమేమిటి? కరవు కాటకాలకు చిక్కి శల్యమైపోయాడనేగా ! అన్నీ ఉంటే ఆ కన్నయ్య అలా మన్ను ఎందుకు తింటాడురా! పాలు పెరుగులకోసం పొరుగు ఇళ్ళల్లో ఎందుకలా దూరతాడురా అబ్బాయ్? ' 


'బాబోయ్ నీ వరస చూస్తుంటే రామాయణానికి ఈ కరవు ఎసరు పెట్టేట్టున్నావే! ' 


'రామరాజ్యమనగానే కరవు కాటకాలనేవి అసలు రానేరావని నీ ఉద్దేశమా? నిజం నిష్ఠురంగా  ఉంటుందిగానీ, రాములవారు ఏకపత్నీ వ్రతమాచరించటానికి ముఖ్యకారణం ఈ దుర్భిక్షమే.  సీతాపహరణమనేది ఒక వంక గానీ, లంకమీద యుద్ధానికెళ్ళటానికి అక్కడ చక్కగా దొరికే ఉప్పూ, పప్పూ, బంగారమూ, బట్టలే అసలు కారణమంటే భక్తులు నొచ్చుకోవచ్చు. ఆ కాలంలో అడవులూ కరవు కోరల్లో చిక్కుకోబట్టే అప్పుడే పుట్టిన ఆంజనేయుడు కూడా ఆకలికి తట్టుకో లేక పోనీ సూర్యుణ్నయినా పండులాగా తిందామని పైకెగురుకుంటూ వెళ్ళాడు.' 


'ఇంక ఆపుతావా బాబాయ్ నీకు పుణ్యముంటుందీ!' 


'పాయింటొచ్చింది కనక చెబుతున్నాన్రా! ఆ హరిశ్చంద్రుడు నక్షత్రకుడి నస వదిలించుకోవడానికి ఆఖరికి అలిని కూడా అమ్మకానికి పెట్టాడుగానీ... అదే ఇప్పటి కరవు కాలంలో అయితే ఎవరు కొనేవారు చెప్పు?  సృష్టి ఆరంభంలో కనక అమృతంకోసం దేవదానవులు అలా కొట్టుకు చచ్చారు. ఈ కరవు కాలంలో అయితే అందరూ హాలాహలానికి ఎగబడి ఉండేవాళ్ళు పాడు జీవితాలతో విసిగి విసిగి ' 


'ఆ దానవుల్నంటే సరే, దేవతల్నీ వదలిపెట్టవా?' 


'ఈసారి నుంచి 'కరవు వీర', కరవు ధీర,'కరవుకాటక' బిరుదులిస్తున్నారు!' 


'విను' అందరి రాత రాసే విధాతకే కరవువాత పడక తప్పలేదురా బాబూ! నాలుగు నోళ్ళకు రెండు పూటలా ఆహారమంటే  మామూలు వ్యవహారమా! పొద్దస్తమానం పాలసముద్రంలో పడుంటే చింతామణికైనా చవిచెడి నాలిక్కింత చింతతొక్కు రాసుకుందామనిపించినా  కలికానికైనా ఆ లోకంలో దొరకని కరవుకాలం.  కనకనే అన్నేసి అవతారాల వంకతో భూమ్మీదికొచ్చి పోయాడేమో.. ? కలిమికి మొగుడైతే మాత్రం ఏం లాభం... కరవుకు ఆ దేవుడైనా దాసుడవాల్సిందేరా నాయనా! దేవుడి బతుక్కున్నా జీవుడి బతుకే నయం!"


'అదేంటి బాబాయ్... మరో వింత విషయం చెబుతున్నావ్ ! ' 


'మనకిలా ఏ కరవో కాటకమో వచ్చినప్పుడు వానలు పడాలనో, పంటలు పండాలనో దేవుళ్ళకు మొక్కుకుంటాం. దేవుళ్లకూ ఆ  కాటకాలొచ్చిపడితే పాపం ఎవరికి చెప్పుకొంటారు చెప్పు?' 


' పాయింటే బాబాయ్ ! ' 


' అంతే కాదు. మానవ  జన్మెత్తితే మరిన్ని లాభాలున్నాయిరా నాయనా! నిజాలే చెప్పాలన్న నియమం లేదు. పంట చేను పగులిచ్చి వానబొట్టుకు నోరెళ్ళబెట్టుకు చూస్తున్నా, వీధి బావి ఎండిపోయి, పాడిగేదె వట్టిపోయి, ముసలి తల్లి మందులేక మూలుగుతున్నా, పిల్ల గాడు ఫీజుకట్టక బడినుంచి చదువు మాని తిరిగి వచ్చినా , తాకట్టు కొట్టులో  ఉన్న పెళ్ళాం తాళి కలలో కనపడి ఎగతాళి చేస్తున్నట్లున్నా.. తట్టుకోలేక తెల్లారకుండానే ఓ అన్న దాత పురుగుమందు తాగి బతుకు తెల్లార్చుకున్నా - మందెక్కువై చచ్చాడేగానీ, కరవుతో  కాదని, అసలు కరవనేదే లేదు పొమ్మని బుకాయించవచ్చు.  ధరలు ఆకాశంలో వీరవిహారం చేస్తున్నాయి. ' దించండి మహాప్రభో ! ' అని వేడుకుంటే 'మంత్రాలకి చింతకాయలు రాల్తాయా! మా దగ్గరలాంటి మంత్రదండమే నిజంగా ఉండుంటే ప్రతిపక్షాలన్నింటినీ ఈ పాటికి హాంఫట్ మని మాయం చేసిఉండమా! ' అంటూ సాక్షాత్  ముఖ్యమంత్రి మాదిరి మాట విసిరి వినోదం చేయచ్చు.  జనం బియ్యం కొనలేక గంజి కాసుకుని తాగుతుంటే 'గంజి కాదది హోటల్  స్పెషల్ ‌ సూప్ ' అని సూపర్బుగా  కామెడీ చేసేయచ్చు . ఆ 'వ్యాట్' పన్నయినా పీకి పారెయ్యండి మహాప్రభో! ' అని మొత్తుకుంటే 'వ్హాట్ ' అంటూ గుడ్లురిమి చూసి ఆనక పకపకా నవ్వేయచ్చు.  పొరుగు రాష్ట్రాలకు బియ్యం తరలిపోకుండా ఆపగలిగితే ఈ ఆపద కొంతవరకైనా తగ్గుతుందేమో ఆలోచించండి సార్ ! ' అంటే ' అక్కడా ఇక్కడికన్నా ఘోరకలి ఉండబట్టే గదా... మన సరుకుల కోసం ఎగబడుతున్నది! మనది దేవుడి పాలనయ్యా!  పాపం జగన్ బాబు  ఆనందపడతాడని ఈసారికి వానదేవుడిని  నేనే కాస్త విశ్రాంతి తీసుకోమన్నా! జనం దాహం తీర్చటానికి బావి తవ్వుదామని ఉవ్విళ్లూరుతున్నా.  'సెజ్ కానిది గజం భూమి కూడా దొరక్క ఇబ్బందిగా ఉంది' అని కన్నీళ్ళు పెట్టుకోవచ్చు'


'ఇంకొద్దు బాబాయ్! నిజంగానే నాకూ కన్నీళ్ళొచ్చేటట్లున్నాయ్... ఆఖరుగా అడుగుతున్నా... రకరకాల కరవులున్నాయంటగా? తీవ్రమైన కరవు, సాధారణ కరవు, మూగ కరవు, ఏదేదో ఏకరువు పెట్టకుండా మనది ఏ రకం కరవో ఒక్కముక్కలో మాత్రం చెప్పు బాబాయ్! ' 


'మూగకరవురా అబ్బీ!  ఆగస్టులో నలభై డిగ్రీలు ఎండ కాస్తున్నా కరవు మండలాలు ప్రకటించకుండా మూగగా చూస్తూ కూర్చుందే ప్రభుత్వం... అందుకూ! ఈ ఆగస్టు పదిహేనుకున్నా సంకెళ్ళు తెంపుకొని స్వేచ్ఛగా చెలరేగి పోయే ధరవరలను అదుపుచేసి మళ్ళా మనకింకో స్వాతంత్ర్యం తేవాల్సిన విధి విధాతది కాదు.. దేవుడిపాలన అయిన మన ప్రభుత్వానిదే! 


'బాగా చెప్పావ్ బాబాయ్! తెల్లోడిని తరిమినవాడికి, తలచుకుంటే ఈ కరవును తరుమటం ఒక లెక్కా... పత్రమా!'



రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - కరవు ఘోష - పేరుతో 15 -08-2009-న ప్రచురితం) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...