ఈనాడు - సంపాదకీయం
తన కోపమే తన శత్రువు
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 16-09-2011 )
బ్రహ్మ ఆరంభంలో సృష్టించే విధానం తెలియక కుపితుడైన సమయంలో కనుబొమలనుంచి ఉద్భవించిన రూపమే రుద్రుడని పురాణ కథనం. నవరసాల్లో రౌద్రానిది శాంతరసంకన్నా ముందుస్థానం. దుష్టశిక్షణార్థం దివినుంచి దిగివచ్చిన అవతారమూర్తి సమయోచితంగా సత్యాగ్రహాన్ని ప్రదర్శించి ఉండకపోతే శిష్టరక్షణ సాధ్యమై ఉండేదా అన్నది ప్రశ్న. నారదమహర్షికి సనకమహాముని ఇచ్చిన వివరణ ప్రకారం కలియుగం మరో పేరు తామసయుగం. త్రేతా యుగంలోనే శ్రీరామచంద్రుడంతటి శాంతమూర్తికి వారధి నిర్మాణం వేళ సముద్రుడిమీద ఆగ్రహం పుట్టుకొచ్చింది. ద్వాపరంలో కురుక్షేత్ర సంగ్రామం మూలాలు దుర్యోధనుడి వంటి దుష్టుల మదమా త్సర్యాలలో దాగున్నాయి. రజోగుణజనితాలైన కామక్రోధాలే సర్వపాపా లకు మూలకారణమని గీతాచార్యుడు ప్రబోధించాడు. ఆయనే రాయబారంవేళ ' అలుగుటయే యెఱుంగని మహామహితాత్ముడజాతశత్రుడే యలిగిననాడు సాగరములన్నియునేకము గాకపోవు' అంటూ యుద్ధ తంత్రంలోని దండోపాయాన్ని ప్రయోగించబోయాడు. అలకలకొలికి సత్యభామ పడకటింటి కోపతాపాలేగదా నందితిమ్మన పారిజాతాప హరణం' పరిమళ సౌరభాలు. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడి కరుణాకటాక్షాలవల్ల పునరుజ్జీవితుడైన పరీక్షిత్ మహారాజు శమీకమహర్షి తనను నిర్లక్ష్యం చేశాడన్న ఉక్రోషంతో క్షణికావేశంలో మృతస ర్పాన్ని మునిమెడలో వేసి చావును కొనితెచ్చుకున్న సందర్భం సదా స్మరణీయం . తండ్రికి జరిగిన అవమానానికి కుంగి శాపానికి పూనుకొన్న శృంగితో ఆ సందర్భంలో తండ్రి శమీకుడు అన్నమాటలు నిజానికి సర్వకాలాలకూ సర్వలోకాలకూ సహితం కలిగించే చద్దిమూటలు. త్రాచువంటి మూగజీవులకు కేవలం ఆత్మరక్షణాయుధమైన క్రోధంతో మేధావి మనిషి కార్యాలన్నింటినీ సాధించుకోవాలనుకుంటే ముందుగా నష్టపోయేది తాను, తనచుట్టూ ఉన్న సమాజం.
దమయంతి కల్యాణం నలుడితో జరిగిందని విన్న ద్వాపరుడు, శని కోపంతో చిందులువేసే సందర్భంలో వారి సేనానాయకులైన అరిషడ్వర్గాలు ఒక్కొక్కరే తమ ప్రతాపాలను ఉగ్గడించుకొనే సన్ని వేశం మహాభారతంలో ఉంది. కాముడి కారుకూతల తరవాత క్రోధుడి 'నా దుర్గం ఈ కామునికైనా దుర్భేద్యం . కాముని ఆశుగాలు ఈ క్రోధుని ముందు బలాదూరు' అనే కోతలు చాలు- ఈ దుర్వాస మానసపుత్రుడు మానవజీవితంలో చేసే అలజడులు, ఆగడాలు, విధ్వంసాలు వివరించడానికి. 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్ర/ నీవు కులుకుచు దిరిగెదవెవరబ్బ సొమ్మని రామచంద్ర' అంటూ దాసునిచేతనే స్వామిని తిట్టిపోయించే గడుసుదనం దానిది. 'ఎగ్గుసిగ్గులు లేక ఏకచక్రపురాన/ భిక్షాటనము చేసి వెలగలేదే' అని పాండవ పక్షపాతే అధిక్షేపించగా 'నల్లపిల్లివోలె ఇల్లిల్లు గాలించి/పాల్వెన్న దొంగిలి ప్రబలలేదే' అంటూ ఆ పాండవ మధ్యముడు ఎదు రుదెబ్బ తీస్తాడు. ఆ రచ్చంతా ఎంత అంతరంగికుల మధ్యనైనా చిచ్చు పెట్టించగల ముచ్చు క్రోధానిదే. ఉత్తమకావ్య రసాస్వాదన చేయలేని అశక్తుల మీద యధాశక్తి కసి తీర్చుకునే నిమిత్తం నన్నెచో డుడు ఎన్నుకున్న మార్గం ప్రబంధ లక్షణమన్న వంకతో కుకవి నింద. మదమాత్సర్యాలకు, కోపతాపాలకు కొరతేలేని సృజనరంగంలో తిట్టుకవిత్వం పేరుతో పొల్లుకొట్టుకుపోగా పొట్టుగా మిగిలిన సాహిత్య సరకే గుట్టలు గుట్టలు. 'నీపేరేమిట'ని అడిగిన నేరానికే 'వట్టిమానైన చిగురు బుట్టింప గిట్టింప బిరుదుగల వేములవాడ భీమ కవినే గుర్తించలేవా' అంటూ చాళుక్య చొక్కరాజంతటివాడిమీద తాడి చెట్టంత ఎత్తున ఎగిరిపడే కవితావతంసులకు కొదవ లేదు. వాక్పా రుష్యం దహనంకంటే దారుణమన్న నన్నయ్య శాంతిప్రవచనాలు చెవిన పెట్టకపోతే చెడేది ముందు మన ఆరోగ్యాలే!
మనిషి దేనిని పరిత్యజించి శోకరహితుడవుతాడని యక్షుడు సంధించిన ప్రశ్నకు యుధిష్ఠిరుడిచ్చిన సమాధానం- క్రోధం. మనిషి జీవితం శోకమయం కావడానికి కోరికలే కారణమని బుద్ధభగవానుడి ప్రబోధం. 'తీరిన కోరికలు మరిన్ని కోరికలకు ప్రేరణలవుతాయి... తీరని కోరికలు క్రోధానికి కారణాలవుతాయి' అంటుంది భగవద్గీత. కోపమునకు ఘనత కొంచెమైపోవును/కోపమునకు మిగుల గోడుచెం దు/కోపమడచెనేని కోరికలీడేరు' అన్నది వేమన మాట. భూమినుంచి సహనం, వాయువునుంచి పరోపకారతత్వం, ఆకాశం నుంచి కాలాతీత మైన గుణస్థిరత్వం, నీటినుంచి నిత్య స్వచ్ఛత, అగ్నినుంచి పునీతమయ్యే గుణం అలవరచుకోవడానికే పంచభూతాలనే ప్రసాదాన్ని ప్రకృతి మనిషికి బహూకరించింది. ముక్కుమీదికోపం ముఖానికి అందమని ముప్పూటలా ముటముటలాడతామంటే మొదటిగా మోస మొచ్చేది మన ఆరోగ్యానికే అంటున్నారు వైద్యశాస్త్రజ్ఞులు. కాన్కార్డియా విశ్వవిద్యాలయ పరిశోధకులు మానవజీవన ప్రమాణాలమీద ఒకటిన్నర దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ప్రయోగాలలో కోపగుణం- రక్తపోటు, నిద్ర, మానసిక ఒత్తిడి, హార్మోన్లు, శరీరావయవాలు, జీర్ణకోశం తదిత రాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని శాస్త్రీయంగా రుజువైంది. అనివార్యమైనప్పుడు కోపాన్ని ఆవేశపూరితంగాకాక అర్థవం తంగా సున్నితంగా ఎదుటివారు అర్థం చేసుకొనేటంత తగుమోతాదులో వ్యక్తం చేయడం ఆరోగ్యవంతమైన మార్గం అంటున్నారు ఆ పరిశోధక బృంద నాయకుడు. పేలుళ్లు, పెను విస్పోటాలవంటి దుస్సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే- విశ్వవ్యాప్తంగా ప్రతివ్యక్తీ తన మనసును స్వర్గధామంగా మలచుకొనే ప్రయత్నం ఆరంభించాలి. 'కోపాన్ని అణచుకోవడం గొప్ప యజ్ఞం చేసినంత ఫలం' అన్న తాళ్ళపాక తిరుమలాచార్యులవారి తత్వాన్ని ఒంటబట్టించు కొంటే- ఒంటికీ, ఇంటికీ, దేశానికీ, విశ్వానికీ మేలు.L
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 16-09-2011 )
No comments:
Post a Comment