జుట్టు పట్టు
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు దినపత్రిక - సంపాదకీయ పుటగల్పిక )
'సీబీఐ చిలక నాలుక మడతపడిందనా నీ మధన, దానికి జుట్టు పీక్కుంటే లాభ మేమిట్రా?
కరెంటు బిల్లుగాని వచ్చి చచ్చిందా ఏమిటి? షాక్కొట్టి మతి భ్రమిస్తేనే ఇట్లాంటి పిచ్చి వేషాలు మొదలయ్యేది!
చెల్లాయి కూరగాయల మార్కెట్టుకుగానీ పంపిందా, నువ్వు
జుట్టు పీక్కుంటే మాత్రం ధరలు దిగొస్తాయట్రా?
ఇప్పటికైనా ఆ జుట్టు పీక్కోవడం ఆపు ! చెప్పేది నీకే, చెవికెక్కటం లేదా?
నీ సినిమా పిచ్చి దొంగలెత్తుకుపోనూ? అభిమాన కథా నాయకుడి సినిమా పైరసీ పాలైతే జుట్టు పీక్కోవాల్సింది నిర్మాత గదరా? నీకెందుకీ తంటా?
నీ బోడిగుండు చూస్తే చెల్లాయి తట్టుకోలేదేమోరా... ముందు సంసారం సంగతి చూసుకోరా సన్నాసీ! ప్రతి దానికీ ఇంత ఆవేశం అవసరమా? పాజిటివ్ ఆలోచనలు చెయ్యరా కొంచెం!
పెట్రోలు ధర ఇప్పట్లో పెరగదంటున్నారు. మెట్రో రైలు కూతవేటు దూరంలో ఉందాయ . కడుపు మంటతో ఎవరూ చచ్చిపోకుండా ఇంచక్కా 'ఆహార భద్రత' వచ్చేసింది. ఉచితంగా సెల్ఫోన్లు, పిల్లలకు కంప్యూటర్లు దొరికే బంగారు కాలం తొందర్లోనే రానుంది. అందుకు ఎగిరి గంతేయాలి. కానీ, ఈ పిచ్చి గంతులు ఏమిటి?
ప్రధాని ఆఫీసులో చోరీనా? అయితేనేం, మీ ఇంట్లో పడలేదుగా ఆ దొంగలెవ్వరూ! బొగ్గు దస్త్రాలనే కాపాడలేనివాడు ఈ దేశాన్ని ఏ రకంగా రక్షిస్తాడనా? చెప్పుకోవడానికి, చప్పట్లు కొట్టించుకోవడానికి గొప్పగా ఉంటాయి గాని, నిజానికి పెద్దాయనకు ఇంకేమీ పనులు లేవా ఏమిట్రా ... బొగ్గు దస్త్రాలమీద శేషశయనుడి మాదిరిగా అస్తమానం పడుక్కుని కునకడానికి?
నీకు సంబంధంలేని సంగతుల గురించి అదేపనిగా ఆలోచించకు. మనసు పాడుచేసుకొని క్రాపు చెడగొట్టుకోకు. ఇందుకేనా మా చెల్లాయిని నీకిచ్చి చేసిందీ? నీ భార్య కోసమన్నా నాలుగు వెంట్రుకలు అట్టే పెట్టుకో... ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో!
ఏమిటీ, రూపాయికి దమ్మిడీ విలువ లేకుండా పోయిందా!
వానలు ఎక్కువై దోమల పీడా పెరిగిందా! దానికా ఈ జుట్టు పీక్కోడాలూ!
ఏటీఎంలలో దొంగ నోట్లొస్తు న్నాయా? చలామణీ ముఖ్యంగానీ ఏ నోట్లయితే ఏమిట్రా? అసలు నోటుకు ఏమన్నా కొసరు బంగారం దొరుకుతుందా ఎక్కడైనా? ఎందుకట్లా పీక్కోడం జుట్టు ! ఆపిక!
సచివాలయంలో తెలుగువా డటం లేదని, ప్రతి సాయంకాలం ఖైరతాబాదు జంక్షన్ కిక్కిరిసిపోతోందని, అర్హత లేనివాళ్లకే అకాడమీలు అవార్డులు ప్రదానం చేస్తున్నాయనీ... ఇవంట్రా నీ దిగుళ్లు? చెప్పి చెప్పి నాకలుపోస్తోంది . ఇక ఆపరా బాబూ ఆ స్వచ్ఛంద క్షవర కళ్యాణం!
పొంతనలేని సంగతులన్నీ ఇలా ఒకేచోట పోగేసి సమస్యకో గుప్పెడు చొప్పున జుట్టు పీక్కుంటూపోతే బోడిగుండు ఒక్కటే చివరకు మిగిలేది!
బాబ్బాబూ 1 ముందా స్వయం ముండన పథకం పక్కన పెట్టు. రోజులూ ఆట్టే బాగాలేవు. నీ అవతారం చూసి ఏ తీవ్రవాదో అనుకుని కేసైనా లేకుండా మూసేసే పోలీసు పటాలం ఉంది. ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో!
ఆధార్ కార్డు సమస్యా? అరె, నువ్వేమన్నా మహారా వ్యలో ఉన్నావా పెళ్ళి ధ్రువపత్రం దొరకదనుకోవడానికి! బీహారులో ఉన్నావా మీ నాయన పింఛను బిగుసుకుపోడానికి! నికి! మధ్యప్రదేశు లో కూడా లేవు గ్యాసుబండ కష్టమనుకో వడానికి!
ఇది ఆంధ్రప్రదేశ్! మహా అయితే పిల్లలకు ఉప కార వేతనాలు కూస్తంత ఆలస్యమవుతాయి. ఏడవడానికి ఇంకేం సమస్యలే తోచలేదుట్రా బాబూ నీకు? జుట్టుమీద పడితే సమస్యలు తీరుతాయా?
ఎవరికి లేవబ్బీ ఇబ్బందులు? ప్రజా ప్రతినిధులే భవిత్తుండదేమోనని బెంగడిపోతున్నారు. తెల్లకార్డుగాడివి నువ్వెంత?
లక్షల కోట్లు దిగమింగినవారే దొరబాబుల్లా లక్షణంగా ఊరే గుతుంటే, నువ్వేమిట్రా దిగాలుగా ముఖం వేలాడేసుకుని ఈ మూల జుట్టు పీక్కుంటున్నావ్!
నీది ఆదాయానికి మించిన అప్పుల బాధ అయితే, ఇష్టంలేకున్నా రిటైరై పోయిన పోలీసు పెద్దాయనది ఆదా యానికి మించిన ఆస్తుల గోల. అందరూ నీలాగే జుట్టు మీద పడితే... చివరికి ఏమవుతుందో తెలుసా? నీళ్లలో, నేలపై ఎక్కడ చూసినా వెంట్రుకల కుప్పలే దర్శనమిస్తాయి.
ప్లాస్టిక్ సంచులగోల చాలదన్నట్లు అదనంగా వెంట్రుకల కాలుష్యం తిప్పలెందుకు బాబూ ? అసలే ప్రభుత్వం డబ్బుల్లేక అల్లాడుతోంది. ప్రజాకర్షక పథకాల నిధులను ఇటు మళ్ళించాల్సొస్తుంది . ప్రజాప్ర తినిధులు ఆనక వాటిని దారి మళ్ళించాలి. గాలి, గడ్డి, తుక్కు, బొగ్గు స్కాములకు తోడుగా కొత్తగా వెంట్రుకల స్కామొకటి పుట్టుకొస్తుంది. అప్పుడు పీక్కోవటానికి ఒక్క వెంట్రుకైనా మిగలదు నీ గుండు బోడిదైనాక . ఉన్న ఆ రెండు వెంట్రుకలనైనా అట్లాగే ఉండనీయరా బాబూ .. నీకు పుణ్యముంటుంది . అసలింతకూ నీ సమస్య ఏమిటో నోరు విప్పి చెప్పరా!
'హమ్మయ్యా, ఇప్పటికైనా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలన్నా! ధరలు పెరగడం, సీబీఐ ధోరణి, కరెంటు షాకులు, సినిమా పైరసీ, పెట్రోలు ధరలు, మెట్రో గోల, ఆకలి చావులు, ప్రధాని తీరు, రూపాయి పతనం, అణు ఒప్పందం, దొంగనోట్లు, తెలుగు వాడకం, బిరుదుల బాగోతం, ట్రాఫిక్ కష్టాలు, ఆస్తులు అప్పులు... వీటి గురించి నా విలువైన జుట్టును వదులుకుంటానా? అరేయ్, నేను సగటు భారతీయుణ్ని రా, నా బాధ నిన్నటి పేపర్లో వచ్చిన వార్త చూసి...
'ఏమిటా వార్త?
సుప్రీం ధర్మాసనం నేరగాళ్లను రాజకీయాల్లోకి రానీయకుండా చక్కటి తీర్పు ఇచ్చింది కదా కొన్నాళ్ల కిందట! దాన్ని నీరుగారుస్తూ హస్తం నాయ కత్వంలో అత్యవసరాదేశం వచ్చింది మొన్న. అంత వరకూ అర్ధం చేసుకోవచ్చు. నిన్నేమిట్రా అదే పార్టీ ఉపాధ్యక్షుడు ఒక్కసారిగా బాపూజీ వారసుడిలా మారిపోయి వట్టి 'నాన్సెన్స్' అంటూ ఆ కాగితాల కట్టనలా పరా పరా చించేస్తానంటాడు? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మంత్రిమండలి తీర్మానం మేరకు చేసిన ఆర్డినెన్సు. దాన్ని అదే పాలక పక్షానికి చెందిన నాయకుడు ఇట్లా కొట్టి పారేస్తే... చెల్లకుండా పోతుందంటావా ? ఈ రాజకీయం అర్థ కాకే ఈ జట్టు పీక్కోవడం!'
'దానికి నువ్వెందుకురా జట్టు పీక్కోవడం! నేర రాజకీ యాలు చేసే చోరశిఖామణులు కదా పీక్కోవాల్సింది! ఒక్కమాట చెప్పనా... ఏ సమస్య అయినా ఇట్లా జుట్టు పీక్కుంటూ కూర్చుంటే పరిష్కారం కాదు.
ఎన్నికలొస్తు న్నాయి గదా! సమయం చూసి నేరగాళ్ల జుట్టు పీకితే అన్ని సమస్య లూ చిటికెలో పరిష్కారమయిపోతాయి.
నేతాశ్రీల జట్టు ఓటరు చేతిలోకి వచ్చేది మన ప్రజాస్వామ్యంలో అయిదేళ్లకోసారి! అప్పుడు పట్టు... వాడి జుట్టు! ఓ పౌరుడిగా... అందుకు ముందుగా నడుం కట్టు!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు దినపత్రిక - సంపాదకీయ పుటగల్పిక )