కవిత: అసత్
సుందరాచారి
సేకరణ : కర్లపాలెం హనుమంతరావు
నల్ల రాతికి కలతల యిల్లు గట్టి, జారు కన్నీటి ధారల జలకమార్చి, వేడి నిట్టూర్పు సెకలలో వేల్చి మనసు, ముందు పెట్టితి వై వేద్యమునకు సయ్యు.
అధరపుటములు కదలించి, మధుర మనుచు
ఆరగించెను నా స్వామి; ఆరగించి,
కడుపు నిండకపోయిన కారణమున
కండలూడ్చెను నాలోన కత్తిదూసి, ఎముక లొకకొన్ని మిగులగా నేర్చి పేర్చి, నరములన్నియు నారగా సరులు గూర్చి, పచ్చి నెత్తురు పళ్లెంబు పట్టి పాడి ‘అమరుడైయుండు మోస్వామి!' యంటి నంత.
నిలువు మాసిన దేశాని కలతయేమొ వెలియనేలేదు, గాలిలో కలవరించె, కడుపుచల్లనివానిని కదలనీక కాళ్లు చుట్టును పెనగుచు కలవరించె.
పేద గుండియ పేలగా పీల్చినట్టి రుధిరమదిరమ్ము కడుపులో రొదలు నేయ, మండుగొంతుక తడుపగా మంచినీళ్ళ కరవులోబడి నాస్వామి కలవరించె.
కనకపీఠము ముంగల కప్పురంపు ప్రభలు వెలుగొంద, అగరుధూపాల నెత్తి, మంచిపన్నీటిపాదాలు ముంచి కడుగ పిలుచుచుండియు కలవారు, వెలికిరాడు.
ఏడులోకాల కనుసన్న నేలువాడు ఇరుకు చీకటి గుడిలోన మరగినాడు. నాకు లేనట్టి దేవుడు లోకములకు లేదు, లే డింక పిలిచినా రాడు, రాడు.
- సుందరాచారి
( సేకరణ : కర్లపాలెం హనుమంతరావు )
01-01-2021
No comments:
Post a Comment