Wednesday, November 10, 2021

ఒక రొచ్చి అడగాలా? - ఈనాడు వ్యంగ్యం



 వ్యంగం - ఈనాడు 

ఒకరొచ్చి అడగాలా? 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు దిన పత్రిక సంపాదకీయ పుట సరదా గల్పిక) 


' మనది కర్మభూమి.  దేశం ఈ మాత్ర మైనా సుభిక్షంగా ఉన్నదంటే, అందుకు పాలకుల దక్షత కారణం కాదు. న్యాయస్థా నాల దీక్ష అంతకన్నా కాదు. అంతా ఆ భగవంతుడి సంకల్పం ' అన్నాడయ్యా ఈమధ్య ఓ న్యాయాధీశుడు'


'ముత్యంలాంటి మాటన్నా! కానీ, ఈ సంకల్పం నెరవే

ర్చడంలో దేవుళ్లూ ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటున్నారో? ' 


' దేవుళ్లకు అవేమైనా  కొత్తా?  సత్యభామ అలక వహించినప్పుడు ఆమె కోపతాపాల మధ్య శ్రీకృష్ణుడెంత సంఘర్షణ చెంది ఉంటాడో? '


' నిజమే, నువ్వు అంటుంటే గుర్తుకొస్తోంది. సుగ్రీవుడికి ఇచ్చిన మాటకోసం చెట్టు చాటునుంచి వాలిని  సంహరించేటప్పుడు శ్రీరాముడికీ అలాంటి సంకటమే ఎదురై ఉంటుంది. కదా ?' 


' పురాణాల కేంగానీ .. ఇప్పుడు ఎన్నికల్లో సామాన్యుడి పరిస్థితీ అలాగే ఉంది. వడగళ్ల వానలా వచ్చి పడుతున్న ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవడానికి సామాన్యుడు ఎంతగా నలిగిపోతున్నాడో! వీడి గోడు ఎవరూ పట్టించుకోవడంలేదు'


'నిజమే, మన నేతలు ఈ మధ్య మరీ తెలివి మీరిపోయారు. చలాయించినంత కాలం రాజ్యం చలాయించి, చెల్లుబాటు కావడంలేదని తెలిసిన తరువాత ఇప్పుడు గోడ దూకడానికి సిద్ధపడిపోతున్నారు. ముందే లెక్కలేసుకుని, బేరాలు మాట్లాడుకుని, బయటకు అంతా కార్యకర్తల నిర్ణయం మేరకే నడచుకుంటున్నామని బుకాయిస్తు న్నారు. ప్రజల గోడు మాత్రం ఎవరూ పట్టించుకో వడమే లేదు.' 


' నిజమే కానీ, ముందు నా...?


'నీ మాటే వినాలంటావు. నా మాట వినే అవసరం నీ కెంత మాత్రం లేదంటావు? అలా అనుకున్న పెద్ద పెద్దవాళ్లకు ఇప్పుడే ఖర్మ పట్టిందో చూడు!'


'సరే, ముందు నువ్వే చెప్పరా బాబూ!' 


' ఇప్పడందరూ నన్ను ఏవేవో అడుగుతున్నారు. కానీ, అసలు నన్నడిగే వీళ్లు ఇన్నిన్ని లక్షల కోట్ల కుంభకోణాలు  చేశారా? నన్ను సంప్రతించే నేరగాళ్లను జైలుగోడల వెనకనుంచి మళ్ళీ జనంలోకి మళ్ళించారా? నన్నడిగే ఆ ఊరేగింపులూ  గట్రా చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారా? 


'అసలు జనఘోషకు, చట్టసభ సభ్యుల చిద్విలాసాలకు పొంతనే లేదన్నా!'


' అవును మరి... ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ జీతభత్యాలను అనేక రెట్లు పెంచుకున్నారు. వంటగ్యాస్ బండ ధరను ప్రజల మెడకు గుదిబండగా మార్చేశారు. బజారులో ధరలు అగ్గిపెట్టకుండానే మండిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతుంటే పట్టించుకోకుండా కార్ల ధరలు మాత్రం తగ్గించి చంకలెగరేస్తారా? ' 


' అయిపోయిందా?' 


' ఎక్కడైపోయింది పేదోడి ఘోష! రాజ్యాంగంలో రాసుండబట్టి అయిదేళ్లకోసారి ఎన్నికల సమయంలో వచ్చి కనపడుతున్నారు కానీ, లేకపోతే నేనంటూ ఒకణ్ని ఇక్కడ భూమ్మీద కష్టాలతో అల్లాడిపోతున్న సంగతి పెద్దోళ్ల బుర్రకు పట్టిఉండేదా?' 


' నువ్వుచెప్పేది నిజమేనన్నా! కరెంటు బిల్లులు పెంచబోమన్నారు. గద్దెనెక్కిన తరువాత ఛార్జీలు ఎడా పెడా పెంచి షాకులు మీద షాకులిచ్చారు. ఆధార్ కార్డులకోసం మండుటెండలో క్యూలో నిల బెట్టించి పోలీసులతో కొట్టించారు. నడిరోడ్డుపై ఆడ కూతుళ్లు నడవలేని పరిస్థితులు దాపురించాయి. అత్యాచా రాలు ప్రబలిపోయాయి!'


'అంతేకాదు... రైతుల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది. వానలు కురుస్తున్నా పంటలు వేసుకోలేని దుస్థితి దాపురించింది. అన్నదాతలు అడిగే మద్దతు ధరలకు బ్యాంకు రుణాలకు దిక్కూదివాణం లేదుగానీ, రైతేదో గడ్డం పుచ్చుకొని తెగ బతిమాలినట్లు నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కరెంటు కోతలు మాత్రం దండిగా ప్రసాదిస్తున్నారు మహా ప్రభువులు. వీరు పెట్టిన కష్టాలు ఇన్నీ అన్నీ కావు!' 


' ఒప్పుకొంటారా బాబూ ! నువ్వు అడగకపోయినా పెట్రోలు ధర పెంచేశారు. ఉప్పులూ పప్పుల్లో రాళ్లు కలిపేశారు. ఆటోమీటర్ల మీద అదనంగా వసూలు చేస్తున్నారు. బెల్టుషాపులు పెట్టి మరీ మద్యం దంచేస్తున్నారు. కాకి ఈక పడితే కూలే ఇళ్ళు కట్టించి అంట గడుతున్నారు. జీవితం ఇప్పుడు అలా తగలడింది'


'అయితే, ఇప్పుడు మనం ఏం చేద్దామన్నా!'


 'ఎవరడినా అడగకున్నా ఓపిక చేసుకొని పోలింగు బూత్ దాకా వెళ్లాలి. ఉన్నవాళ్లలో మంచివాడు అనుకున్నవాడికి ఓటేసెయ్యాలి. శ్రీకృష్ణ సత్యభామలది సంసార సమస్య.  రాముడు, వాలి మధ్య వైరం సుగ్రీ వుడితో పొత్తుల సమస్య. ఇప్పుడొస్తున్న ఎన్నికలు మాత్రం మన సొంత సమస్య... మన ఊరి సమస్య. ' 


'అవునన్నా! చెడ్డ నాయకులకు గేట్లు మూసే ఆయుధం ఓటే! ఒక రొచ్చి బొట్టు పెట్టి పది రూపాయలిచ్చి మద్యం పంచి స్వర్గం అరచేతిలో పెడతామని మాటివ్వాలా? ఉచిత బహుమానాల మార్పిడికి ఓటేమీ మన చేతికొచ్చిన ఉచిత ఓచర్ కాదు కదా? .. ఈ సారి ఎన్నికలు రానీ! పేదోడి పవరేంటో  బూత్ దాకా వెళ్లి రుచి చూపిస్తా! ' 

***

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు దిన పత్రిక సంపాదకీయ పుట సరదా గల్పిక) 










No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...