గల్పిక:
శివపురాణం
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు దినపత్రిక - 18/04/04- నాటి సపాదక పుట గల్పిక)
శివరాత్రి కదా! జాగారం చేద్దామని మా కాలనీలోని మొగాళ్లు నలుగురం డాబా మీద కబుర్ల కచేరీ పెట్టాం .
కింద ఆడవాళ్లు టీవీలో సినిమాలేవో చూస్తున్నారు. దూరం నుంచి గుళ్లో భజనలు వినపడుతున్నాయి.
ఉన్నట్టుండి ఊడిపడ్డ కమారావు- మన పురాణాల నిండా బోలెడన్ని పాలిటిక్స్ . . భాయ్ అన్నాడు .
ఎన్నికల సీజన్..ఆ వేడిమీద ఉన్నాడులే అనుకున్నాం.
ఎవ్వరం పటించుకోకపోవటం చూసి వాడికి ఒళ్లు మండినట్టుంది. ' కావలిస్తే మీచేతే ఒప్పిస్తాను చూడండి' అంటూ మొదలుపెట్టాడు.
'ఉదాహ రణకు... మన శివపురాణాన్నే తీసుకోండి! శివలింగమే నేటి పాలిటిక్సుకు పెద్ద సింబాలిజం' అనేశాడు.
' అదెలాగా? ' అనడిగాడు నా పక్కనున్న భాస్కర్రావు అమాయకంగా. అంతే .. ఇంక కన కారావును ఆపటం ఎవరి తరమూ కాలేదు.
' శివలింగానికి ఆదీ అంతూ లేవుకదా. మన పాలిటిక్సూ డిటో డిటో . త్రిమూర్తుల్లోని ద్విమూర్తులు .. విష్ణవు , బ్రహ్మ శివలింగం బిగినింగ్ అండ్ ఎండింగ్ . ఐ మీన్ ఆదీ తుదీ అంతు చూద్దామని పంచెలెగకట్టి మరీ పందెం కాసుకున్నారు. ఏమైంది?..
పరువుకోసం బ్రహ్మగారు ఆవు చేతా , పూవూ చేతా అబద్ధపు సాక్ష్యాలు చెప్పించారు . అంటే ఏంటిట ? గెలుపుకోసం గాడ్ అయినా తప్పుడు చెయ్యడం తప్పుకాదనేగా దారి చూపించింది. ఓటరుకు మల్లే సాధు జంతువని మనం పుస్తకాల్లో చఅకే ఆవు కూడా గడుసుదే సుమండీ! బ్రహ్మతరపున వకాల్తా పుచ్చుకునే సందర్భంలో అవు తల్లి చల్లంగుండా .. తలతో నిలువుగా తోకలో అడ్డంగా ఊపి మన పొలిటీషియన్లకు ప్రెస్ మీట్లలో ఎట్లా మసులుకోవాలో మార్గం చూపించింది. అవునా? తవ్వినకొద్దీ ఇట్లాగే బోలెడు బొచ్చెడు ట్రిక్కులు బైటపడతాయి. ' అని ఓ అరక్షణం ఊపిరి కోసం ఆగాడు కనకారావు .
మళ్ళీ అందుకుంటూ ' గణాధిపత్యం కోసం కుమారస్వామి వినాయకుల మధ్య పోటీ ఏర్పట్టం గుర్తుందా ?
ముల్లోకాల్లోని తీర్ధాలలో మునకలేసి ముందొచ్చినవాడినే సమర్థుడిగా భావించాలని కదా మెయిన్ రూల్స్ బుక్కులా ముఖ్యమైన క్లాజు. ఆ ఒప్పందం మనం వినాయనుడి విషయంలో గంగలో కలిసింది. పాపం, మురుగు స్వామిని అటు చల్లంగా నెమలిమీద పోనిచ్చి.. వినాయక మహారాజా చేసిందేమిటి? శ్రమలేకుండా అధిష్ఠానం చుట్టూతా ప్రదక్షిణాలు చేసి మరీ అధికారు సాధించాడు. అంటే ఏమిటిట? నియోజకవర్గాల్లో ఊరికే ఈ పండుగా , ఈ పండుగా అంటూ తిరణాల డాగులా తిరగడం దండగరా అబ్బాయిలా! భాగ్యనగరం చుట్టూతా తిరిగో .. భాగమతీ నగరంలో తిష్ఠ వేసో .. అధినాయకుల కరుణా కటాక్షాలు రాబట్టిన జిడ్డుకే ఆఖరికి అధికారం దక్కేది. అదీ పురాణాలు మనకు నేర్పే పాఠాలు మిత్రులారా!
మా కనకారావుది పండితవంశం లెండి. వాడింట్లా తండ్రి పురాణ పఠనం .. మా శుంఠ పక్క విగకుండ ఆ పాండిత్య శ్రవణం!
మార్కండేయుడి కథ చెప్పుకొచ్చేడేసారి. ఆ మునికుమారుడిది అర్థాయుష్షు గదా! డిటో ఏ క్షణంలో పదవూడుతుందో తెలీని మంత్రిగారి పరిస్థితి. యమదూతలొచ్చి పాశం వేసి లాక్కుపోతుంటే శివలింగాన్ని కావిటేసుకున్నాడు అచ్చంగా కుర్చీని వదల్లేని మొండి మంత్రుల్లా. ఆ ఉడుంపట్టుకు తన పునాదులే కదిలిపోతుంటే బెదిరిపోయిన అదిదేవుడు మార్కండేయుణ్ణెలాగో పేరోల్ మీద వదిలించుకున్నాడు. అట్లాంటి పట్టుంటే తప్ప పదవాట్టే రోజులు నిలవదనేదే మార్కెండేయుడి మార్క్ సిద్ధాంతం .
ఇంక అంకిలుడి కథ ఇంకా అన్యాయం . ఉపిరున్నంత కాలం ఉచ్ఛనీచాలు మరిచిన నీచ్.. కమీనే! కానీ, మనకు పరమ పవిత్రమైన శివరాత్రి నాడే వాడి చరిత్ర మననం చేసుకోక తప్పడంలేదు. తెలిసో.. తెలీకో . . ఆ తెలివిమాలిన కుంక మాదిరి జాగారం చేస్తేచాలు .. శివయ్య గారి గుడ్ లుక్సులో పడ్డట్లే గురూ! అంకెలుడికి కైలాసం, మన అంకఛండాలులకు అమాత్య విలాసం! మన పాలిటిక్సు ఇంతర్ధ్వాన్నంగా ఉన్నాయని ఎంతేడిస్తే ఏం లాభం.. కళ్లు వాయడం తప్ప.
పదవున్నంత కాలం నువ్వెన్నైనా పాడుపన్లు చేసుకా! ఎన్నికలప్పుడు మాత్రు అప్రమత్తంగా ఉంటే చాలు కేబినెట్లో సీటు ఖాయం. శివనామస్మరణకంటే మినిమమ్ మన లోకంలో అయినా కాస్తో, కూస్తో పుణ్యం.. పురుషార్థం. పాడుపాలిటిక్సు వల్లనే సైతానులకు సైతం సింహాసనాలు లభ్యం .
శివరాత్రి నాడేంటీ. . ఈ యాంటీ గాడ్ ప్రసంగాలు! కనకారావేమన్నా కమ్యూనిస్టు ఫిలాసఫిష్టా? అంటూ డౌట్ రావచ్చు. అతగాని ఆరోపణలన్నీ మతంలోని లోసుగులపై కాదు. దేవుళ్ల పేరు నడిపించే పాడు పాలిటిక్సు మీద.
నిజానికి ఇప్పటి సంకటాలకే నాటి పురాణాలు పరిష్కారం చూపించాయి! క్రాంతదర్శకులని పట్టుకుని వంకర భాష్యాలు చెప్పటం కాదిది. పిల్లనిచ్చిన అల్లుణ్ణి పట్టించుకోనందుకే ప్రజాపతి పదవి పుసుక్కున పోయింది. పవరిచ్చిన ఓటర్ని పట్టించుకోని పక్షంలో ప్రజాపతినిధి పదవికైనా అదే మూడుతుంది. చులకనగా చూసినందుకే ప్రజాపతికా పదవూడింది . పాలి టిక్స్ ' కుమార ' సంభావాల రచ్చ ఎంత చేసినా కంఠశోషే. కుమారుడినే స్వామిగా ఎంచి సాగిలపడ్డ గడుసుకే లాభం జాస్తి. విజయవిలాసం చంద్రుడికి మల్లే పైవాడి అనుగ్రహముంటే నెత్తినెక్కి కూర్చోడం.. వీరభద్రుడి అవతార మల్లే ఆగ్రగం చూపించినప్పుడు కాళ్లు పట్టుకోడం .. పాలిటిక్సులో సైతం ప్రమోషనొచ్చే తంత్రం. పిల్లనిచ్చిన మామ ప్రజాపతి తలనడ్డంగా నరికి బ్రహ్మ కోరిక తీర్చడానికి శివుడు మేక తలకు అతికించినట్లు శివపురాణం కథనం . కథనే కంచికైనా పంపించెయ్యచ్చు కానీ మేక తలలు చూపించి అధికారం యాచించే పెద్దపులుల పట్లే ప్రజలప్రమత్తులవాలని అష్టాదశ పురాణాల అంతిమ ప్రబోధం' అన్న కనకారావు ముక్తాయింపుతో అందరం ఏకీభవించాం.
' అర్థమయింది సోదరా! నేటి నాయకుడు శివుడంతటి బోళాకాదు. పాలటిక్సు ఫీల్డు శివపురాణానికి మించి లోతు. . ' అంటూండగానే శివాలయం నుంచి మహాదేవుడు మెచ్చికట్లు గంటలు గణ గణా వినిపించాయి.
జాగారం చేయించిన ఫలం ఇలాగైనా దక్కించినందుకు అందరం మా కనాకారావుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ డాబా కిందికి దిగివచ్చేసాం.
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు దినపత్రిక - 18/04/04- నాటి సపాదక పుట గల్పిక)
No comments:
Post a Comment