Showing posts with label Eenadu. Show all posts
Showing posts with label Eenadu. Show all posts

Wednesday, December 29, 2021

ఈనాడు - సంపాదకీయం క్రీడా స్ఫూర్తి ... రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ఇది ఆరంభమే - పేరుతో ' ప్రచురితం - 12 -08-2012 )

 


ఈనాడు - సంపాదకీయం 

క్రీడా స్ఫూర్తి 


...

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఇది ఆరంభమే - పేరుతో ' ప్రచురితం - 12 -08-2012 ) 


'క్రిందు మీదెఱిగి కృతకార్యుడగువాడు/ చేయు కార్యమెల్ల సిద్ధి బొందునన్న' ది  మడికి సింగన పద్మపురాణ ప్రవచనం. తండ్రి తొడలపై కూర్చుండనీయలేదని చిన్నారి ధ్రువుడు దృఢదీక్షకు దిగి శ్రీమన్నారాయణుడిని ప్రసన్నం చేసుకున్న కథ పోతన భాగవతంలో కనపడుతుంది. బాల ధ్రువుడికి కార్యదీక్ష లక్షణాలను వివరిస్తూ నారదులవారు చేసిన బోధ- సర్వకాలాలకు వర్తించే కార్యదక్షత పాఠం 'యుద్ధ సమయంలో బంధుమిత్ర పరివారాన్ని సంహరించడం ధర్మకార్యమేనా? ' అంటూ పార్థుడిలాగా సందేహ డోలికల్లో ఊగిసలాడేవాడికి విజయం- చెట్టుమీద ఉన్నా కొట్టలేని పిట్టలాంటిదే. ' చిత్తము చిక్కబట్టుము; త్యజింపు బేలతనమ్ము; మోము పై/ కెత్తుము, ధైర్యము జెదరనీకుము కొంపలు మున్గునయ్య నీ/ తత్త రపాటు నీ ముఖ విధంబు పరుల్ పసిగట్టిరేని' అంటూ హితవా క్యాలు పలికే నారాయణుడు నిజానికి మన గుండెల్లోనే కొలువై ఉంటాడు. శ్రీనాథుడి హరవిలాసంలోని హంసతూలిక పాన్పుపై ' నలరు మొగ్గ/ యెత్తునను మేను గలిగిన నీలోత్పలాక్షి' పార్వతి పశుపతిని తనపతిగా చేసుకునేందుకు శైల పాషాణ పట్టికా స్టండి లమున' పవ్వళించింది. ముత్తాతల పుణ్యగతుల కోసం దివిజ గంగను భువికి దింపిన భగీరథుడు- శివుడినుంచి జహ్నుమహర్షి వరకు  పెట్టిన పరీక్షలను తట్టుకుని నిలబడిన తీరు చాలు, ధీరోదా త్తుడికి ఉండవలసిన ముఖ్యగుణమేదో తెలుసుకునేందుకు .


ఏనుగు లక్ష్మణకవి సుభాషితంలో చెప్పినట్లు- కార్యసాధకుడు దుఃఖాన్ని సుఖాన్ని మదిలో లెక్కకు రానీయడు. పుట్టినప్పటినుం ఏ తన కన్నతండ్రికి పట్టం కట్టించేదాకా కన్నయ్యకు ఎదురైన కష్టాలు కడలిలో కెరటాలకు మించినవి. కందుకూరి వీరేశలింగం నీతికథామంజరిలో బోధించిన విధంగా '  కష్టపడునట్టివారు లోకంబు తోడ/ మొర్రపెట్టరు తమ కష్టములను గూర్చి వట్టివారలె యరతురు మిట్టిపడుచు'. అరుపులు గొడ్డు గేదెలకే గాని మనుషులకు గొప్పకాదని వీరేశలింగం అభిప్రాయం. వాస్తవానికి పశుపక్ష్యా దులూ నిశ్శబ్దంగానే తమ పనులు చక్కబెట్టుకుంటాయి. నల దమయంతుల మధ్య నడిచిన ప్రేమ వ్యవహారం ఫలవంతం కావడానికి రాయంచ కడదాకా చూపించిన కార్యకుశలతే ప్రధాన కారణం. దారిపొడవునా దృశ్యాలు తరచూ గతిమారిపోయే తరుణంలోనూ సైబీరియన్ పక్షులు గడబిడ పడకుండా సుదూర ప్రాంతాలకు దారితప్పకుండా చేరడాన్ని కార్యశూరతకు ఉత్తమ ఉదాహరణగా చెప్పుకోవాలి. అసూయపడితే చాలదు... ప్రకృతినుంచి మనిషి చాలా పాఠాలు నేర్చుకోవాలి. 'పనులను ప్రయత్నము చేతన, కావవి బహు మనోరథములున్నంతన్' అని విక్రమదేవవర్మ సూక్తి. ఇసుక బొరియల్లో నుంచి బయటపడే వేళ సముద్ర  తీరప్రాంతాలు తాబేళ్లకు పూర్తిగా అపరిచితం. చిటికెన వేలంత లేని ఆ జీవాలు అట్లాంటిక్ సముద్ర జలాలను దశాబ్దంపాటు అన్ని అడ్డంకులు దాటి ఈదుకుంటూ తిరిగి క్షేమంగా స్వస్థలాలకు చేరుకుం టాయి. ఎవరు శిక్షణ ఇచ్చారు వాటికి?  లక్ష్యంమీద గురితప్ప కుంటే ఏనాటికైనా విజయం సాధ్యమే! బలమైన బంధనాల నిర్బంధం మద్యే ఎదిగిన ఏనుగు మామూలు మోకునూ ఛేదించే ప్రయత్నం చేయదు. ఆత్మవిశ్వాస లోపమే మనిషి పాలిట పెనుమోకు. విజయసాధనకు సులభమార్గం తెలుపమని ఓ జిజ్ఞాసి సోక్రటీసును సందర్శించాడు. జిజ్ఞాసి తలను చెరువు నీటిలో బలవంతంగా ముంచి ఉంచి లేపి బతికి తీరాలన్న కోరిక ఇప్పుడు ఉన్నంత బలంగా ఎప్పుడూ ఉంటే విజయం తనంతట తానే వచ్చి వరించి తీరుతుందన్న సోక్రటీస్ గురుబోధను మరవరాదు.


మూడువందల కోట్ల డాలర్ల వ్యాపారం చేసిన జేమ్స్ బాండ్ చిత్రానికి రచయితగా ఇయాన్ ఫ్లెమింగ్ కి దక్కింది ఆరువందల డాలర్లే. నిస్పృహతో కలం పారేసి ఉంటే బాండ్ సృష్టికర్తగా ఆయన చరిత్రలో మిగిలి ఉండేవాడా! ప్రమాదంలో కాలు కోల్పో యినా కృత్రిమ పాదంతో మయూరిగా తిరిగి వచ్చిన సుధా రామ చంద్రన్ ది  విజయకాముకులందరూ ప్రేరణపొందే స్ఫూర్తిగాథ. మొదటి విద్యుత్ బుగ్గ పనిమనిషి పాలబడి పగిలిపోయిన క్షణంలో నిరాశకు గురై ఉంటే ఎడిసన్ గొప్ప ఆవిష్కర్తగా నమోదై ఉండేవాడే కాదు. విజేత జీవిత పదకోశంలో ఓటమి అంటే అర్థం గెలుపు సోపానం. సైకిల్ రిక్షా వ్యాపార నష్టాలకు చెక్కుచెదరనందుకే ఉక్కు ట్రక్కులకు టాటా కొలబద్ద కాగలిగాడు. పదాలు సరిగ్గా పలకలేని ఐన్ స్టీన్ ప్రముఖ వక్తగా మారగలిగాడంటే- పట్టు దలే ప్రధాన కారణం. తుపానులొస్తాయని ఓడలను ఒడ్డున కట్టేసి ఉంచగలమా? విపత్కర పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించే ధీరులే కావాలి మనకిప్పుడు. బీజింగ్ ఒలింపిక్స్ లో  చేజా రిన పతకం లండన్ మైదానంలో దొరకబుచ్చుకున్న సైనా నెహ్వా ల్ లు  నేడు దేశావసరం. భారతావనికి తనవంతుగా మొదటి పతకం అందించిన గగన్ నారంగ్ రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధించి తీరతానని సగర్వంగా ప్రకటించుకున్నాడు. ఇద్దరు బిడ్డల తల్లయి ఉండీ మేరీకోమ్ బాక్సింగ్ లో  సాధించిన విజయం ముందుతరాలకు ఆదర్శం. ప్రతికూల వాతావరణంలోనూ విజయ్ కుమార్ సాధించిన రజతపతకం విలువ దేశవాసులందరికీ బంగారాన్ని మించినంత విలువైనది. సైనా గురువు గోపీచంద్ ఈమధ్య భాగ్యనగరంలో జరిగిన భారీ సన్మానసభలో దేశం తర పున ఆడే క్రీడాకారులందరి పక్షాన చేసిన వాగ్దానం- 'ఇది ఆరంభం' మాత్రమేనన్నది. క్రీడా ప్రేమికులందరూ సంబరపడవలసిన  గొప్ప సంకేతమది. క్రీడాకారులందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన గొప్ప సందేశమూ అందులో ఇమిడి ఉంది!


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఇది ఆరంభమే - పేరుతో ' ప్రచురితం - 12 -08-2012 ) 


Tuesday, December 28, 2021

ఈనాడు ' హాసం వ్యంగ్యం గల్పిక బొంకుల దిబ్బ రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 16-07-2016 ,


 


ఈనాడు ' హాసం వ్యంగ్యం గల్పిక


బొంకుల దిబ్బ

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 16-07-2016 , 


అబద్ధాలు ఆడాలంటే ఎంతో నిబద్ధత కావాలని, గోడ కట్టినట్లుగా ఉండాలని బుద్ధిమంతుల బోధ. ఆపద్ధర్మంగా ఇటునుంచి అటు దూకినట్లే... అవసరార్థం మళ్ళీ రేపు అటు నుంచి ఇటు దూకేందుకు వాటంగా ఉండాలి  నిజం చెప్పాలంటే. నిజం మీద నిలబడటానికి అట్టే నిజాయతీ అవసరం లేదు. ఆడిన అబద్ధానికి కట్టుబడి ఉండాలంటేనే ఆటుపోట్లు తట్టుకునే గుండె నిబ్బరం ఉండాలి. అది లేకే సత్యం రాజు, అమెరికా బిల్ క్లింటన్ అన్ని కడగండ్ల పాలైంది. అందరూ హరిశ్చంద్రులకు చుట్టాలైతే ఈ చట్టాలెందుకు?


పనామా పత్రాలు విడుదలైనా, అందులోని పంగనామాల పెద్దలెవరూ పెదవి విప్పడమే లేదు! ఎన్నికల యుద్ధంలో నిలబడినప్పుడు అభ్యర్థ యోధులంతా ఎన్నెన్ని అబద్ధాలకు అందమైన హామీ చమ్కీ దండలు తొడిగి మరీ ప్రచార పర్వాలు రక్తి కట్టిస్తారో!  ఆడిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ అడేసి  ఎన్నుకునే జనాలకు అన్నీ పచ్చి నిజాలేనన్న భ్రమ కలిగించడం అన్నిచోట్లా రాజ కీయాలలో  పండే సాధారణ చమత్కారమే!


నిజానికి, నిజం మీద నిలబడేందుకు ప్రతిభతో పని లేదు. ఒక్క అమా యకత్వం ఉంటే చాలు.. ఆడిన మాట అబద్ధమని ఒప్పేసుకుని కన్నీళ్ళు పెట్టుకోవడానికి! పశ్చాత్తాపంతో కన్నీళ్ళు పెట్టుకోవడానికేగా  అబద్ధాల సృష్టి జరిగింది?


అబద్ధాన్ని  నిజమని నమ్మించేందుకు 'అమ్మతోడు' ఒట్లు సహా కాణిపాకం గుళ్ళో దీపాలార్చేయడం వంటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి. గురజాడ కన్యా శుల్కంలో గాయత్రి పట్టుకుని ప్రమాణం చేసిన వాడొకడైతే, దీపాలార్వేసి, ప్రమాణం చేసిన ఘనుడు ఇంకొకడు.  అందుబాటులో ఉన్న సవాలక్ష ఉపాయాలను ఉపేక్షించి ఆడిన అబద్ధాలకు పశ్చాత్తాపాలు ప్రకటించు కుంటూపోతుంటే, చేజేతులా భవిష్యత్తు పటానికి పూలదండలు వేసుకొన్నట్లే!


గోడ దూకేటప్పుడు లీడరన్నవాడు గోడ కట్టినట్లు అబద్ధాలాడతాడని అడి పోసుకుంటాం. తెరచాటున జరిగే బేరాలన్నీ యథాతథంగా చెప్పుకొంటూ పోతే ప్రజాసేవకుడి కథ ముగిసినట్లే కదా! నమ్ముకున్న కార్యకర్తల ఉసురు పోసుకోకూడదన్న సదుద్దేశమే నాయకుడి నోటితో అబద్ధాలాడించేది... అర్థం చేసుకోవద్దూ!


'నిజం చెప్పమంటారా. అబద్ధం చెప్పమంటారా? ' అని రాజునే అడుగుతాడు పాతాళభైరవి సినిమాలో ఎన్టీఆర్.  అపరిమితమైన లాభాలు ఏవో ఆశించేగదా వేన్ పిక్  మోపిదేవి, సుబ్రతోరాయ్ నుంచి శారదా ఫండ్ దాదాల దాకా, ఆగ్రిగోల్డ్ నుంచి కింగ్ ఫిషర్ వరకు నల్ల వ్యాపారాలని కూడా చూడకుండా నిలువెత్తు బురదలోకి దిగబడిపోయింది, నష్టాలు నెత్తికి చుట్టుకుంటాయని తెలిసీ నిజాలను నమ్ముకుంటారా తెలివున్న పెద్దమనుషులెవరైనా! గురజాడవారి గిరీశం అడుగుజాడల్లో నడిచే మహాశయులు అన్ని రంగా లోనూ ఇప్పుడు అందలాలెక్కి ఊరేగుతున్నారు. కాదంటే, అదే ఓ పెద్ద శుద్ధ అబద్ధం.  అవును కన్యాశుల్కం ఆసాంతం శుద్ధ అబద్ధాల పుట్ట. ప్రపంచంలోని ఏ అబద్దపు వ్యవహారమైనా 'కన్యాశుల్కం'లో తప్పకుండా ప్రత్యక్షమై తీరవలసిందే. మన రాజకీయాల మాదిరిగా అయినా, ఆ నాటకంలో జరిగిందంతా నిజమేనని, అయస్కాంతాలు పెట్టి గాలించినా అబద్ధమనేది అణువంతైనా కనిపించదని  అందరం అమాయకంగా నమ్ముతుంటాం. ఆ చమత్కారమే యథాతథంగా రాణించే రంగం- రాజకీయం.  అందుకే రాజకీయాలు ఇవాళ ఇంతలా అబద్ధాల దుకాణాల మాదిరి కళకళలాడిపోతున్నది . 'నిజం బొమ్మ అయితే, అబద్దం బొరుసు" అన్నవాడికి రాజకీయ గోతుల లోతులు బొత్తిగా తెలియవని అనుకోవాలి. రెండువైపులా ఉన్నవి బొరుసులే అయినా బొమ్మలే అన్నట్లు కథ నడిపించగల సమర్థులే  రాజకీయ రంగంలో రాణించేది. అబద్ధాన్ని నిజంగా..  నిజాన్ని అబద్ధంగా  చేసేస్తాం' అని డబ్బాలు కొట్టుకుంటాడు కన్యాశుల్కంలో బైరాగి. అ  మార్కు గడుసుపిండాలకే ఎంత నిజాయతీ పార్టీలో ఉన్నా మంచి మార్కులు పడేది.


నిజాయతీపరులెవరూ రాజకీయాల జోలికి రావద్దు. వచ్చినా రాహుల్ బాబులా నాలుగు కాలాలు మాగినా పండటం కుదిరే పనికాదు .  'కన్యాశుల్కం' మార్కు 'బొంకుల దిబ్బ' సెట్టు లాంటివే రాజకీయాల రంగుల లోకం.  నిజాన్ని నమ్ముకుని మాత్రమే రాజకీయం నడపాలనుకొన్న  లోక్ సత్తా  జేపీ రథం పరుగుపందెంలో వెనక ఎందుకు పడిందో అర్ధం చేసుకుంటే చాలు- నేటి రాజకీయాలు నిజమైన అబద్ధపు స్వరూపం కళ్లకు కట్టినట్లు అవగతమవుతుంది. సత్యం మీదే బొత్తిగా ఆధారపడటం రాజకీయాలతో పెద్ద అడ్డంకి. 


ఈ రాజకీయ సూత్రం అర్థంకాని అమాయకులెవరైనా ఇంకా మిగిలి ఉంటే మారిపోవాలి. '  ట్రూ రిపెంటెన్సుకి ట్వంటీ ఫోర్ అవర్చు చాలు' అన్నాడు గిరీశం మహాశయుడు. ఒక్కొక్క రాష్ట్రానికి ఎన్నికలు ముంచుకొచ్చే వస్తున్నాయి. నార్కో ఎనాలసిస్ టెస్టులకయినా  నాలిక మడతలు అందకూడదు. లై డిటెక్టర్ల ముందు మతులు పోగొట్టుకోకూడదు. టికెట్ల కోసం ఎన్ని కోట్లయినా పొయ్యి , పోలీసు రికార్డుల్లో ఎంత రికార్డుస్థాయి నేర చరిత్రయినా  ఉండనీయి ..   స్వల్ప ఆస్తులు, స్వచ్ఛమైన చరిత్ర ప్రక టించే గుండెదిటవు అవసరం.


కడుపు నుండిన జనం చెప్పులు విసిరినా దడుపు  దాచుకొనే ఒడుపు ఒక్కటి ఒడిసి పట్టుకుంటే చాలు- ఏ పార్టీ టికెట్ మీదైనా ఇట్టే టిక్కు పెట్టించుకోవచ్చు. అబద్ధాలు రంగరించి బిడ్డలందర్నీ గద్దెలెక్కించాడు లాలూజీ.  రాజకీయాల్లో నాలుకలు ఎన్ని చీలికలైనా నో ప్రాబ్లమ్ . అవి మొద్దు బారకుండా పదునుగా ఉంచుకుంటే  చాలు.  సత్యహరిశ్చంద్రుడి కథ మర్చిపోయేటంత కీర్తి ప్రతిష్ఠలతోపాటు, వారసులందరికీ చెక్కు చెదరని స్విస్ బ్యాంకు ఖాతాలు సాధించుకోవచ్చు.  ఏ ప్రజా సేవకుడి అంతిమ లక్ష్యమైనా అంతకుమించి మరేముంటుంది?


- రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 16-07-2016 , 


ఈనాడు- సంపాదకీయం జాతీయ పానీయం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈ నాడు - ప్రచురితం - 19 -08 -2012 )

 



ఈనాడు- సంపాదకీయం 


జాతీయ పానీయం

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడు - ప్రచురితం - 19 -08 -2012 ) 


ఉల్లాసంగా ఉండాలనుకున్నప్పుడు, ఒంటరితనం వేధిస్తున్నప్పుడు.... ఎప్పుడైనా సరే, కావాలనిపించేది కుదిరితే ఓ కప్పు తేనీరు. థేంక్ గాడ్! టీ కనిపెట్టిన తరువాతే నేను పుట్టాను' అనుకున్నాడట ప్రముఖ రచయిత సిడ్నీ స్మిత్. మదిరానికి అలవాటుపడి అనవసరంగా ప్రాణా లమీదకు తెచ్చుకున్నాడు గానీ... తేనీరు రుచి తెలుసుకుని ఉంటే ఉమర్ ఖయ్యాం మరిన్ని రుబాయీలు మనకు మిగిల్చి ఉండేవాడు. సుమతీకర్త కాలం నాటికి చాయికి  ఇంత ప్రాచుర్యం లేదు. ఉంటే అప్పిచ్చువాడు, వైద్యుడు వంటి అత్యవసరాల జాబితాలో తాజా తేనీరూ చేరి ఉండేదే. 'అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష' అన్న మన పెద్దలు తేనీరు ప్రస్తావన ఎందుకు తేలేదో! తాగేవాడి హోదానుబట్టి పానీయం పేరు మారే విధానాన్ని నన్నెచోడుడు కుమారసంభవంలో చెప్పనే చెప్పాడు! 'అమరులు త్రావుచో అమృతమందురు దీని, వహిప్రజంబ జప్ర ముని గోనియానుచో నిది రసాయనమందురు' . ఆ క్రమంలోనే ఈ కలియుగంలో మర్త్యులు  పడిచస్తున్న పానీయం పేరు ' తేనీరు' ఎందుకు కాకూడదు? ' పెరుగును శరచ్చంద్ర చంద్రికా ధవళం'తో పోల్చిన కాళిదాసు తేనీరు రుచి కనుక తెలుసుకుని ఉంటే- ఏ తేనె పట్టు బొట్టుతోనో సరిపోల్చి ఉండేవాడు. శ్రీనాథుడి జమానాలో ఈ చాయ్ గొడవలు లేకగాని... ఉండి ఉంటే హరవిలాసంలో ' చిరుతొం డనంబిని చేగానుగాడి చెరుకుం/ దీగె రసంబును' జంగముడు తెమ్మ న్నట్లు'  ఏ అల్లం కొట్టిన సుగంధ తేనీరో కావాలని దబాయించకుండా ఉండేవాడా! నాటి కవులకన్నా మనం అదృష్టవంతులం. నేటి జనాభాలో నూటికి ఎనభైమంది తేనీటి ప్రియులేనని అఖిలభారత తేనీరు సంఘం తాజా గణాంకాలు తేల్చి చెబుతున్నాయి మరి. 


పని ఒత్తిడినుంచి పలాయనం చిత్తగించడానికి ఏనాడో ఓ చీనా వైద్యుడు కనిపెట్టిన చిట్కా తేనీరు. నాగరికులు చాయ్ రుచి మరిగేందుకు మరో పది శతాబ్దాలు పట్టింది. వినిమయ విధాన వాణిజ్యంలో భాగంగా తేనీటి కోసం విలువైన దుస్తులను , వెండినీ ఆంగ్లేయులు వదులుకున్నారంటే దాని రుచికి వేరే వివరణ ఎందుకు?  చైనాతో తెల్లవాడికి చెడటం భారతీయులకు కలిసివచ్చింది. అస్సాం సాగుమీదకు ఇంగ్లిషువాడి దృష్టి మళ్ళటం మన అదృష్టం. ప్రపంచ తేనీటి అవసరాలను తీర్చే ప్రముఖ దేశాల జాబితాలో భారతదేశానిదే ఇవాళ ప్రథమస్థానం. ఉత్పాదన లోనే కాదు.. వినిమయంలోనూ భారతీయులదే అగ్ర తాంబూలం. పడక దిగినప్పటినుంచి రాత్రి శయన మందిరం చేరే దాకా  భారతీయులు సగటున పదకొండు కప్పుల టీ సేవిస్తున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రుచికి ఆరోగ్యానికి సాధారణంగా చుక్కెదురు. 'మది రాపానము చేయువానికిని సన్మానంబులే సిగ్గు లే/ వదనాలంకరంబు  లే సుగతి లే వాక్పుష్టి లే వాంఛ లే ' అంటూ ఓ ఆధునిక కవి ఏకరువు పెట్టనే పెట్టాడు. కవివరుడు, భిషగ్వరుడు వేంకట నరసిం హాచార్యులవారు 'విశంగాదిరసం', 'రేపు మాపును మనుజుండు బదరీ పల ప్రమాణము సేవిస్తే వాత గుల్మాలు, జ్వరాలు, సంధి ప్రకోపాలు, ధాతు నష్టాలు వంటి ఎన్నో రుగ్మతలు దూరంగా పారిపోతాయని చికిత్సగా చెప్పుకొచ్చారు . ఖరీదైనది ఆ ఔషధం. అంతకన్నా అధిక ప్రయోజనాలను కలిగించే కారుచవుక ఔషధం తేనీరు. కేన్సరుకు తేనీరు విరుగుడు అంటారు. టీలోని బి కాంప్లెక్స్ విటమిన్లు, నికోటిన్, కెఫైన్  ఉత్తేజకరమైన శక్తి ఉత్ప్రేరకాలు రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరచే శక్తిమంతమైన ఔషధాలలో  టీ కి  మరొకటి సాటి లేదు. రక్త పోటు, చక్కెరవ్యాధి, దంత క్షయాలకు గొప్ప నిరోధకంగా పనిచేసే ఔషధం తేనీరు. దేవతలకు అమృతం ఉందో లేదో తెలియదు . మానవులం అదృష్టవంతులం. మనకు సర్వరోగ నివారిణి తేనీరు దొరికింది!


కొప్పరపు సోదరులు ఒక అష్టావధాన పద్యంలో చెప్పినట్లు ' ప్రభు భటులు, నైష్ఠికులు  గార్య పరత నేగ .. గొక్కరో కోయనుచు' కోడి కూయాలి. ఆ కోడికన్నా ముందే లేచి ఇంటి ఇల్లాళ్లు చాయ్ నీళ్లను  మరగబెడుతున్న రోజులివి. పొట్టలో టీ చుక్క పడనిదే పడక దిగనని మొరాయించే జనాభా పెరుగుతోంది. చైనా, జపాన్లలో తేనీటి సేవనం ఒక ప్రత్యేక ఉత్సవం. నిమ్మరసం టీ వారి ప్రత్యేకత. టిబెట్టులకు ఉప్పు టీని కొయ్యకప్పులో తాగడం సరదా. ఆఫ్రికన్లు టీ కషాయాన్ని చిలికి ఆ నురగ తాగుతారు. పశ్చిమాసియాలో యాలకుల తేనీరంటే ప్రాణం పెడతారు. భారతీయులు అన్నిరకాల తేనీటినీ ఆదరించే పానప్రియులు. గుజరాతీలకు మసాలా టీ మీద మనసైతే, కాశ్మీరీదేశవాసులు వట్టి కషాయంలో బాదం, యాలకులు కొట్టి వేసి ' కాహ్వా' అనే టీని 'వాహ్వా  వాహ్వా' అంటూ సేవిస్తారు. తేనీటి సేవనానికి వయసుతో నిమిత్తం లేదు. విద్యార్థి లోకానికి టీ నిద్రకాచే చిట్కా.  వయసు పైబడినవారికి శక్తినిచ్చే ఔషధం. ఉపవాసాలకూ నేడు తేనీరు నిషిద్ధం కాదు. అతిథి మర్యాదల్లో తేనీరు ప్రధాన అంశం. జీవనానికి నీరు ఎంత అవసరమో, చాయి  అంతకన్నా ముఖ్యావసరమైన రోజులు వచ్చాయి. మారుమూల పల్లెనుంచి మహా పట్టణం దాకా చాయ్ దుకాగాలు  కనిపించని చోటు భూమండలమంతా గాలించినా దొరకదు. టీ కప్పుల చప్పుళ్లు లేని సభలు, సమావేశాలు చప్పగా సాగినట్లే లెక్క.  సమరావేశాన్ని చప్పున చల్లార్చగల మహత్తు గుప్పుమని పొగలు గక్కే వేడి తేనీటికే కద్దు . ఎన్ని విభిన్న దృక్పథాలైనా ఉండనీయండి.... వందకోట్లకు మించిన మన జనాభా ముక్తకంఠంతో ' జిందాబాద్'  అనే  ఒకే ఒక్క పానీయం- తేనీరు. అసోమ్ లో  తొలుత తేయాకు సాగు చేసిన సిపాయిల తిరుగుబాటు వీరుడు మణిరాయ్ దేవన్ 212వ జయంతిని పురస్కరించుకొని తేనీటికి  జాతీయ పానీయం హోదా కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. వాణిజ్యంపై నియమించిన పార్లమెంటరీ స్థాయీసంఘమూ తేనీటికి  జాతీయ హోదా కల్పించవలసిందని  సిఫార్సు చేయడం తేనీటి ప్రియులందరికీ తీయని కబురు.


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడు - ప్రచురితం - 19 -08 -2012 ) 


Monday, December 27, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక చెరసాలలు కావాలి రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 26- 07 - 2011 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక 


చెరసాలలు కావాలి 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 26- 07 - 2011 ) 



ట్రిపుల్ ఐటీలు ఐఐటీలకు  బదులుగా జైలు లాంటిది ఒకటి మనం అడిగి తెచ్చుకుని ఉంటే బాగుండేది.


అంతమంది ఎంపీలున్నా ముష్టి రెండు పెద్దరైళ్లు తెచ్చుకోవడానికి అన్ని అవస్థలు పడుతున్నాం. ఇంకా జైళ్ల లాంటి పెద్ద పథకాలు మనకు వస్తాయనేనా? అయినా ఇప్పుడీ  ఊచల  ఊసు అంత హఠాత్తుగా నీకు ఎందుకొచ్చినట్లబ్బా? !


వాన కురుస్తున్నప్పుడే కుంట నింపుకోవాలన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేశంలో పాపాలు, నేరాల శాతం పెట్రోలు ఉత్పత్తుల రేట్ల మాదిరి ఎట్లా ఊపందుకున్నాయో చూశావుగా ! దేశంలో ఏ మూల నేరం జరిగినా మూలాలు మన  రాష్ట్రంలోనే కదా బయట పడుతున్నాయి! కార్పొరేట్ రకం కొత్త నేరాలకూ మన యువనేతలే పాఠాలు చెబుతున్నప్పుడు- శిక్షాలయాలూ మన సమీపంలోనే ఉండటం న్యాయమా కాదా? కృష్ణాజలాల్లో వాటాలకోసం వృథాగా  అలా ఆరాటపడే బదులు శ్రీకృష్ణ జన్మస్థలాల స్థాపన కోసం లాబీయింగ్ చేస్తేనే లాభం ఏమంటావ్ ? 


'నిజమేరా... బాబా శివైక్యమైన తరువాత పుట్టపర్తి చూడు ఎట్లా బోసిపోయిందో!  ఆ కేరళవాళ్లకంటే ఏదో గుడి నేలమాళిగల్లో బంగారు కణికలు దొరుకుతుంటాయి. మన దగ్గరున్న నల్లబంగారాన్ని ఎవడికో తవ్వుకో మని తేరగా ధారపోసేస్తిమి. నువ్వన్నది నిజమే. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ తీహార్ జైలునో ఇక్కడ దాకా  తరలించుకు రావడమొక్కటే మనముందున్న ఏకైక మార్గం. 


కానీ మన దగ్గరిప్పుడు జైళ్లు కట్టుకునే పాటి ప్లాట్లెక్క డున్నాయిరా బాబురా?  అవీ సెజ్జులూ పోర్టులూ అంటూ  అప్పనంగా ఎప్పుడో ఎవరెవరికో అబ్బాయిగారి కోసమూ ధారాదత్తం చేసి పారేస్తిమి  గదరా గాడిదా! 


ఏ స్థలాలూ లేకపోతే మెట్రోరైళ్లు లాంటివెలా పుట్టుకొ స్తున్నాయ్ బాబాయ్ ? అన్నేసి ఎకరాలు పోసి ఆ భారీ బస్టాండులు కట్టిస్తే వచ్చేదేముంది- కిలో మీటరుకు ముష్టి రూపాయి నలభై పైసలు. అదే ఏ తీహార్ మోడలు చెరసాలో అత్యంత అధునాతనంగా కట్టించి పారేశామనుకో... బోలెడంత వ్యాపారం. పార్కింగ్ ఫీజుల దగ్గ ర్నుంచీ ఫుడ్ కోర్టులు, హోటళ్లూ, మాళ్లూ జైలుకొస్తున్న నేరగాళ్లు అల్లాటప్పా గోంగూరగాళ్లా? వాళ్లకూ  ఎంత మందీమార్బలం, బంధుబలగం! తమ నేతల  నిత్య సందర్శన కోసం వచ్చిపోతూంటారు. నేరాలకీ ఘోరాలకి కరవులేనంత కాలం చెరసాలల చుట్టూ చెలరేగిపోయే వ్యాపారాలను వ్యవహారాలను ఎంతలావు ఆర్థిక మాంద్యమూ ఏమీ చేయలేదు. తెలుసా!


ఒప్పుకొన్నానురా అబ్బాయ్! బయటకు కనిపించే వ్యాపారాలే కాదు, లోపాయికారీగా జరిగే రూపాయల వ్యవహారాలూ లెక్కలోకి తీసుకుంటే- కటకటాలు కట్టించడంకన్నా గొప్ప లాభసాటి పథకం మరొకటి లేదు. రింగు రోడ్లూ ఫ్లైఓవర్లూ అంటూ ఎప్పుడూ ఏవేవో వివాదాస్పద మైన పనులే ప్రభుత్వాలు ఎందుకు చేపడుతున్నట్లు?  చక్కగా ఏ సినిమా హాళ్లనో  జైళ్లుగా మారిస్తే సరిపోతుంది. గాలి ఆడని ఆ గోడౌన్ థియేటర్లను కారాగారాలుగా మారిస్తే ఎంత లావు మొండి నేరగాడైనా ఒక్క పూటలో నేరాంగీ కారం చేసి తీరాల్సిందే!


ఇందిరమ్మ ఇళ్లంటూ ఇన్ని లక్షల కోట్లు పెట్టి అరకొ రగా జైళ్లలోని సెల్లలంటి ఇల్లు కట్టడమే  గానీ, ఆ సొమ్ములో సగం తిని సగం సద్వినియోగం చేసినా జిల్లాకో తీహార్ జైలును తలదన్నే 'అత్తారిళ్లు' తయారై ఉండేవి ఈపాటికి....


సరే. ప్రస్తుతం జరగాల్సింది చెప్పరా బాబూ! బడిబాట లాగా ' మళ్ళీ జైలుకు'  అనే ఉద్యమం ప్రస్తుతం నడుస్తున్నట్లుంది... కల్మాడీతో మొదలైన వరస రాజా, కనిమొళిలో  అగేలా  లేదు. మారన్లు వెయిటింగ్, మరెందరు

బారులు తీరబోతున్నారో తెలీదు. చూస్తు న్నాంగా, ఎప్పుడూ దేశం నిండా ఏవో ఆందోళనలూ! 'ఓటుకు నోటు కేసు'  ఓటి నడు స్తోంది. జోరుగా గనుల తవ్వకాల్లో ఎంతమంది చెరసాల బాట పడతారో ఇప్పుడే చెప్పడమూ కష్టమే . ఏ కేసు అప్పజెప్పినా సీబీఐవాళ్లు శని ఆదివారాలు కూడా చూసుకో కుండా నిజాలను నిగ్గుతేల్చే పనిలో పడి ఉన్నారు. పేపరు లీకులు, నకిలీ ఔషధ ప్రయోగాలు, దేవుడి ఆర్జిత సేవ ల్లోనూ కుంభకోణాలు తవ్వి తీస్తున్నారు . అబ్బో..  ఇట్లా చెప్పుకొంటూపోతే రొప్పు రావాల్సిందేగానీ...


నిధులూ పథకాలూ పంచాల్సిన ప్రతినిధులు ఉన్నంత కాలం ఈ నేరాల చిట్టాకు చివరంటూ ఉండదని ఒక్కము క్కలో చెప్పేసెయ్  బాబాయ్- ఇన్ని తంటాలెండుగ్గానీ! 


అది సరేరా!  ఎవరైనా మాకు ప్రాజెక్టులు కావాలి.... విమానాశ్రయాలు కావాలి, పోర్టుల సంఖ్య పెంచాలి.. కళాశాలలు కావాలి... అని అడు గుతారు. ఇలా 420 మోసకారులను పెట్టే జైళ్లు కావాలని మరీ అంత బహిరంగంగా అడుగుతారంటావా? నామర్దా కదా?


ఏంటి బాబాయ్ ! చెరసాలలని మరీ అంత తేలిగ్గా తీసిపారేశావు. అవి శ్రీకృష్ణుని  జన్మస్థలాలు . రాముడికి గుడి కట్టించిన రామదాసుకు కూడా నీడనిచ్చిన గోల్కొండ బందీఖానాలు . జర్మనీలో గాలిపటాలు ఎగరేస్తేనే లోపలే వేసేస్తారు తెలుసా! కట్టుకున్న భార్య జుట్టు పీకాడని ఒక పెద్దమనిషిని రాత్రంతా బంధించిన చీకటి కొట్టు బాబాయ్ చెరసాలంటే ! నెహ్రూజీ తీరిగ్గా పుస్తకం రాసుకున్న విశ్రాంతి మందిరం. బ్యాంకు దొంగను ఓ. హెన్రీగా మార్చిన పుస్తకాలయం. జైళ్లు- ఒంటి కొవ్వు తగ్గించే వ్యాయమశాలలు... గ్రంథసాంగులు గ్రంథాలు రాసుకునే విశ్రాంతి మందిరాలు, వోల్టేర్ లాగా వేదాంతిగా మార్చే యోగాశ్ర మాలు కూడా బాబాయ్!


అర్ధమైందిరా బాబూ! బయట కొవ్వొత్తులు చూపిస్తూ ఓదార్పు యాత్రలు చేసే యువరాజులకు, ఆ కొవ్వొత్తులు తయారుచేసే విధానం కూడా నేర్పే శిక్షణాలయాలు అని కూడా కదూ నువ్వు చెప్పాలనుకుంటున్నావ్? మన నేరగా ళ్లను మనం కట్టుకున్న జైళ్లలోనే పెట్టుకుంటే మన పరువు దేశవ్యాప్తం కాకుండా  ఉంటుందని నువ్వెందుకంటు న్నావో తెలిసింది. 


ఎవరి గురించి అంటున్నావో... అది మాతం చెప్పకు బాబాయ్! ఆ చిప్పకూడు పెట్టే ' రెస్టా ' రెండుకు నువ్వే పోతావ్!  


-రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 26- 07 - 2011 ) 


Sunday, December 26, 2021

ఈనాడు - గల్లిక- వ్యంగ్యం - హాస్యం అలుగుటయే ఎరుంగని ... రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 23 -12-2010 )


 



ఈనాడు - గల్లిక- వ్యంగ్యం - హాస్యం 


అలుగుటయే ఎరుంగని ... 

రచన - కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23 -12-2010 ) 


సర్కారు గజగజ వణుకుతోంది.

రాష్ట్రానికి రక్తపోటు పెరిగిపోతోంది. చలిగాలికన్నా మిన్నగా ప్రతిపక్షాల దీక్షలకు బలవన్మరణాల పాలవుతున్నారు. రైతు శ్రేయస్సు  గురించి నేతలమధ్య మాటల యుద్ధంముందు- కోడిపందాలు బలాదూర్. ఇప్పుడు ఎవరి దృష్టి రాహుల్ మీదనో , రాడియామీదనో  లేదు. వికీలీక్సు, నూటపాతికేళ్ళ కాంగ్రెసు ప్లీనరీ, టూజీ రాజా స్పెక్ట్రమ్ లీలలు, సచిన్ శతకాలు, చైనా జియాబావో- రష్యా మెద్వెదేవ్ పర్యటనలు, పెరిగిన పెట్రోలు రేట్లు, ఉల్లిగడ్డ ధరలు, కరిష్మా కపూర్ కొత్తస్నేహాలు- ఏవీ జనాలకు ఇప్పుడు పట్టడం లేదు. ఏ నోటవిన్నా... ఏ ఛానెల్లో కన్నా రైతుప్యాకేజీ గురించే చర్చంతా!


దేవుడు నిజంగా మూడొంతులు దయామయుడు. భూమండలంమీద నేల ఒక వంతు ఉంటేనే సాగుచేసే రైతు బతుకు ఇంత దుర్భ రంగా ఉంది. మిగిలిన నాలుగొంతులూ భూమి ఉండి ఉంటే?  బాబోయ్... తలచు కుంటేనే గుండెలు దడదడలాడిపోతున్నాయి! 


పాండవులు అయిదు ఊళ్లతోనే ఎందుకు సర్దుకుందామనుకున్నారో ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది . విష్ణుమూర్తి పాలమీదా, విశ్వేశ్వ రుడు వెండికొండమీదా, విధాత తామరతూళ్ళలో ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చిందో బోధపడుతోంది. దేవుడంటే సాగు బాధ తప్పించుకున్నాడుగానీ- మనిషికి ఆరుగాలం స్వేదయాగం తప్పదు కదా! 


అన్నం పర బ్రహ్మ స్వరూపమైనప్పుడు ఆ బ్రహ్మరూపాన్ని సృష్టించే అన్నదాత, ప్రాణదాత మాదిరి పూజనీయుడే కదా! ఆ ప్రాణదాతే ప్రాణాలు తీసుకునేదాకా పరిస్థితులు దిగ జారటానికి ఎవరు కారణం? 


ప్రకృతి అంటే సరే. రాజకీయాలూ రైతన్నతో పేకాటాడు కుంటామంటే ఎలా? రైతుకన్నా  మద్యం కంపెనీలే సర్కా రుకు ఎక్కువా? దొరల సారా బట్టీలకు దొరికినంత సులువుగా ఎరువులకు పురుగు మందులకు అనుమతులు దొరకటంలేదు. పిట్ట రెట్టేస్తే టప్మని కూలే వంతెనలు కడుతున్న గుత్తేదారులకు దక్కుతున్న నిధుల్లో పదోవంతు దుక్కి దున్నే బక్క రైతుకు దక్కడం లేదు. వేలంపాటలో ఆటగాళ్లను పాడుకోవడానికి కుహనా కంపెనీలకు అత్యంత ఉదారంగా కోట్లు గుమ్మరించే బ్యాంకులు- బక్కరైతుకు ఒక్క పదివేలు అప్పుగా ఇవ్వమంటే సవాలక్ష ఆంక్షలు పెడతాయి! చెడిపో యిన స్టేడియాల మరమ్మతులకు ధారపోసే నిధుల్లో పైసా వంతు బీడుపడిన పంట పొలాలకు ఇవ్వమంటే- రాష్ట్రం కేంద్రంవైపు, కేంద్రం రాష్ట్రంవైపూ వేలు చూపిస్తుంటాయి. 


కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము/ బిల బిలా పక్షులు  తినిపోయె అలలు పెసలు/ బొడ్డుపల్లెను గొడ్డేరి మోసిపోతినెట్లు చెల్లింతు టంకము లేదు మార్గం'  అంటూ ఆనాడు శ్రీనాథుడు ఏ అమరపురికరిగాడో... అదే దారి పడుతున్నాడు అనాథ అవుతున్న ఇప్పటి అన్నదాత కూడా! 


అప్పిచ్చువాడు, ఎప్పుడూ ఎడతెగక పారు ఏరు లేని ఊరులో ఉండవద్దని బద్దెనామాత్యుడు ఎప్పుడో పద మూడో శతాబ్దంలోనే హితమ . ఆ లెక్కన మన రైతన్నలు అచ్చంగా ఏ అమెరికా పంచనో తలదాచుకో వాలి. కాకపోతే క్యూబా పోయి సాగు చేసుకోవాలి. కనీసం పొరుగు రాష్ట్రాలకైనా తరలిపోవాలి. లక్షలు కొట్టుకుపోతుంటే- వంద చేతిలో పెట్టి అదే పదివేలు పరిహారం అనుకోమనే పాలకుల పరిహాసాన్ని ఏ రైతన్నయినా ఎంతకాలమని సహించగలడు ?


గుర్తింపు కార్డులు, సమయానికి సరిపడా బ్యాంకు అప్పులు, కల్తీలేని విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, పురుగు మందులు, పనిచేసే మోటార్లు, చౌక విద్యుత్తు, వానలు లేకపోతే సమయానికి కరవు మండలాల ప్రకటనలు, వరదలు ముంచకముందే ముందు జాగ్రత్తలు, పంటలు మునిగితే వెంటనే సహేతుకమైన నష్టపరిహారాలు, సబబైన మద్దతు ధర, సరసమైన పంటల బీమా, మంచి ధరకు సరకు అమ్ముకునే ఏర్పాట్లు, గోదాములు, సర్వేలు, నివేదికలు, పర్యవేక్షణలు, సమగ్రమైన శాస్త్రీయ సాగు విధానాలు... అన్నీ పేరుకు పేపర్లలో పేర్చుకుంటూపోతే చేలో ధాన్యం చేతికొస్తుందా? ఎంత ఘనమైన అంకెనైనా సున్నాతో గుణిస్తే వచ్చే ఫలితం శూన్యమే. చిత్తశుద్ధిలేని పాలకుల పథకాలన్నీ కలిపినా సున్నాను మించి విలువ చేయటంలేదు. అదే- నేటి విషాదం.


రైతును ఊరికే రాజనో, దేశానికి వెన్నెముకనో ఊదరగొడితే చాలదు. వెన్నులో ఇంత సున్నమన్నా మిగిలి ఉంటేగదా తాను నిలబడి నలుగురికి ఇంత అన్నం నోటికి అందించేది. వంద తప్పులవరకు నిబ్బరంగా ఉండ టానికి భూపాలుడు ఏమన్నా గోపాలుడా! పోతనామాత్యుడే ఈ కాలంలో ఉండి ఉంటే, మనకు భాగవతం దక్కి ఉండేదే కాదు. ఎంత రామభద్రుడు వచ్చి పలికించుదామను కున్నా- పొలంపనే చూసుకోవాలా, కలుపు మొక్కలే ఏరుకోవాలా, ఎరువులకని, విత్తనాల దుకాణాల ముందు పడిగా పులు పడిఉండాలా, అప్పుకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుండాలా! ఇన్ని తిప్పలుపడి గుప్పెడు గింజలు పండించినా ఏ వానకు తడిసో, వరదలో కొట్టు కుపోతేనో ముందు ఇల్లు గడవడమెలాగో తెలియక తల్ల డిల్లుతూ కూర్చుంటాడు. చదువుల తల్లి కన్నీరు. ఇంకేమి తుడుస్తాడు?


అందుకే చెప్పేది... అలుగుటయే ఎరుంగని... మహామహితాత్ముడు అలిగిననాడు ఏమవుతుందోనని పర మాత్ముడు చెప్పిన దానికన్నా సాగు చేసుకునేవాడు అలిగితే అంతకన్నా ఎక్కువే అనర్థాలు జరిగిపోతాయి! 'సర్వే జనా సుఖినోభవంతు' అనే ఆశీర్వాదం నిజమవాలంటే ముందు 'అన్నదాత సుఖీభవ' అనే దీవెన ఫలించాలి. 231124 


రచన - కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23 -12-2010 ) 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక రచన - కర్లపాలెం హనుమంతరావు సిగ్మా.. సిక్స్ ! ( ఈనాడు ప్రచురితం - 05 - 09.2002 )

 




సిగ్మా..  సిక్స్ ! 

( ఈనాడు ప్రచురితం - 05 - 09.2002 ) 



సిక్స్ పేరు విన్నావా? 


ఏంటో తెలీదుగురూ!? 


అనుకున్నాలే.. సిగ్మా అనగానే కనీసం నీకు సిగ్మండ్ ఫ్రాయిడయినా గుర్తుకొచ్చివుంటే బాగుండేది. 


విషయం చెప్పు ఇంతకీ నువ్వు చెప్పాలనుకుంటున్నది సిగ్మా గురించా ..  సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించా?


రెండూ కాదు... చిన్నప్పటి మావూళ్ళో తిప్పడి గురించి...


తిప్పడి గురించి చెప్పుకోటానికేముంటుందబ్బా!  సరే చెప్పు ! లింకులేకుండా నువ్వే డొంకా  కదిలించవులే..! 


ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో మల్టీనేషనల్ కంపెనీలన్నీ 'ఎర్రర్ ఫ్రీ ' ఆపరేషన్ల కోసం కొన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాయి. అయినా నూటికో  కోటికో ఓటన్నా  తప్పు జరగనే జరుగుతుందికదా?


కోటికో తప్పంటే అంత చెప్పుకోనక్కర్లేడనుకో 


కోటికో తప్పైనా తప్పు తప్పే ..! ఒకపాయింట్ మిలియన్ ఫ్రాక్షన్ మిస్టేకొచ్చినందుకేగదా మొన్నామధ్య సూపర్సానిక్ స్క్రామ్ జెట్టాపరేషన్ అలా ఫెయిలయిందీ!  కొన్ని మిలియన్ డాలర్ల మనీ వూరికే అలా గాల్లో ఆవిరయిపోయింది..! పవర్ గిర్ట్స్ 

తరచూ ఫెయిలై రాష్ట్రాలకు రాష్ట్రాలు రోజుల తరబడి చీకట్లో కూరుకుపోయినా, మనవాళ్ళకు చీమకుట్టినట్లయినా వుండదు. కానీ  పర్ఫెక్షన్ కోసం పడి చచ్చేవాళ్ళకి పాయింట్ జీరో జీరో జీరో జీరో జీరో డిఫరెన్సొచ్చినా  సహించ లేరు తెలుసా! ఫరెగ్జాంపుల్... మన ముఖ్యమంత్రిగారి ఫ్యూచర్ జె.డి.పి ఫిగర్ చూడు! 


విదేశాన్నుండి వచ్చిన  మినిస్టరొకాయన మా దేశంలో ఇలాంటి ఫిగర్లు చూపిస్తే పిచ్చాసుపత్రిలోనో..  జైల్లోనే జాయిన్ చేస్తారన్నట్లు   గుర్తు! 


విదేశస్తులకిలాంటి విజన్లు అర్ధంకావు.  కానీ నిజానికా విజన్ ప్లాను ప్రకారం చేస్తే సూపర్ విజన్ అవుతుందని మన  ముఖ్యమంత్రిగారి ప్రగాఢ నమ్మకం . దానికే ఆయన పాపం, రాత్రి నిద్రలు కూడా జాతికి త్యాగం చేసి ఇరవైనాలుగ్గంటలూ  జనంకోసమే పనిచేస్తున్నది అయినా  లెక్కల్లో ఎక్కడో మాటిమా

టికీ తేడాలొచ్చి చివరాఖర్లో  అంతా  అభాసుపాలవడం, అమాత్యుల అద్భుత భావం అల్లరిపాలవడం ..! 


మొన్న జరిగిన చదువులపండుగ చివర్లో అధికారులు తయారుచేసిన లెక్కలే అందుకు రుజువు కదా! 


నిజమే. జనాభాలెక్కలనుండి గణాంక వివరాల దాకా, ప్లానింగ్ కమిషన్ ఫిగర్లమొదలు బడ్జెటరీ ఎలాట్ మెంట్ల వరకూ... ఎప్పుడూ ఏవో తికమకలు.. తిర కాసులూ... సర్కసులూ చేస్తుంటారీ సర్కారీ దాసులు ! 


ఈ కంప్యూటర్లొచ్చింది మొదలు మేటర్లో  మరీ కనప్యూజన్‌ పాలువ మరీ  ఎక్కువపోయింది . ఎమ్సెట్  పేపర్చూ..  ఎలక్ట్రిసిటీ  మంత్లీ బిల్సూ , విద్యార్థుల మార్కుల షీట్లూ, స్టాక్ మార్కెట్ల గత్తర కోట్లు, గెజిట్లు చూపే డేటా షీట్లు గట్రా గట్రా లన్నింటిలో  ఎప్పుడూ ఏవో పొరపాట్లు! 


ఇదేమని అడిగితే ఏదో పైపై సంజాయిషీలిచ్చే అలవాట్లూ ..  


 సో..  పట్టించుకొనే నాధుడెవడూ లేడు కాబట్టి . . సూపర్ స్టార్స్  సినిమా రిలీజ్ డేట్స్ , క్రికెట్ ప్లేయర్స్  ట్రాక్ రికార్డ్సూ , ప్రజా ప్రతినిధుల ప్రెస్సు మీట్లు  లాంటి వాటిల్లో ఆ తేడాలొస్తే మాత్రం చాలా గొడవలు అయిపోతాయ్! 


గెజిట్లో డేటాఫ్ బర్తంటే గుర్తుకొచ్చింది. మొన్నామధ్య ఒక పెద్దాయన  పుట్టిన కంగారులో మైమరుపొచ్చేసి మూడేళ్లు ముందు పుట్టినట్లు అరవై ఏళ్లకు గుర్తొచ్చిందట!  చటుక్కున చాటుగా సరిచేయించేసుకున్నా అతగాడి సిన్సియారిటీకి బొత్తిగా  పిటీ లేకపాయ!   చేసిన తప్పు చెబితే చెల్లన్నా వినకుండా పై అధికారులు పాపం ' వల్లకాదు, బ్రెటకు వెళ్లాలన్నా ' రు !   పాపం, కొంతమందికి  కన్నీళ్ళు కూడా ఆగలేదంటున్నారు. 


పిటీ. . పిటీ అంటూ ననువు మాటిమాటికీ నా మాటల ట్రాకును  మళ్లించేస్తున్నావ్! 


సారీ గురూ! సావాసదోషం.. సరే .. నీ తిప్పడి కథనే కంటిన్యూ చేసెయ్ ! 


అక్కడికే వస్తున్నా! సూటిగా చెబితే నీ బోటాడికి మేటర్ బొత్తిగా బుర్రకెక్కదు. కాబట్టి ఈ తప్పొప్పుల పట్క్ టి చదవక తప్పింది కాదు.  


ఓకే! కానియ్! 


పేపర్లో చూశా... మన ముంబయ్ లో  డబ్బావాలాల  ఎర్ర ఏగానీ ఖర్చు లేకుండా  ' సిగ్మా సిక్స్' స్టాండర్డ్ సాధించారు. 


సిగ్మా సిక్స్ అంటే? 


 పది లక్షల పనులుచేస్తే  అందులో కేవలం మూడు తప్పులు మాత్రమే ఉండటం! ... వీళ్ళు చేసే కోటిన్నర పనుల్లో ఒక్క తప్పు మాత్రమే.. అదీ ఏ ఏడాదికో ఒకసారి  పొరపాటున దొర్లుతుందని  ఇంటర్నేషనల్ మేగ్జైనోటి  సర్వేచేసి మరీ సర్టిఫికేటిచ్చేసింది . చదువూ సంధ్యా లేనోళ్ళు.  ఒక గుంపుగా తయారై..  కంప్యూటర్లకు మించి  కరెక్టుగా  లక్షలాది భోజనాల కారియర్లను వందల కొద్దీ  కిలోమీటర్ల వరకు .. సిటీ  శివార్లు టు  సెంట్రల్ పాయింట్ వరకు  . . రిటన్లో సాయంత్రానికి ఎవరి ఇళ్లకు వారి బాక్సులు  పర్ ఫెక్టుగా చేరేస్తుంటారు!


చదువూ సంధ్యా లేని మనుషులూ....


లెక్కా డొక్కా రాని  వాళ్ళు కూడా లెక్కా పత్రం కరెక్టుగా ఎట్లా చేస్తారన్నదే కదా.. నీ ముక్కులూ .. మూలుగుళ్లు ! 


ఒకే. . ఒకే! పోనీ మనమూ ఆ పొరుగు స్టేటు నుండి కొద్ది మంది బుద్ధిమంతులను అరువుతెచ్చుకుంటే నో! 


మన రాష్ట్రంలో కూడా అంతకుమించిన టేలెంటున్నవాళ్ళు పూరికి పదిమందికి తక్కువుండరు. . తెలుసా? ఉదాహరణకి మావూరి తిప్పడినే తీసుకొందాం . పూరు మొత్తానికి వాళ్ళ

దుస్తులు ఉతికే ఫేమిలీ.  వాళ్లాకీ ఒకటంటే ఒకటే డాంకీ .   రెండొందల గడప. గడపొకటికి కనీసం అయిదు బట్టలేసినా  అటూ ఇటూగా  వెయ్యవుతాయి.  ఈ నెయ్యిలో  మళ్ళీ కొన్నొందల వెరైటీలు, చీరెలు, జాకెట్లు, ధోవతులు, పంచెలూ పై పంచెలూ

చొక్కాలూ, పొంట్లూ . . తోళ్లూ తొక్కలూ .. చిరిగినవీ,రంగులు వెలిసి పోయేవీ, చలువ చేసేవీ, చెయ్యనివి, చెయ్యకూడనివీ .. అన్నీ ఒకే మూటలా  కట్టుకుని రేవు ఉతుకులు అయి ఆరిందాకా ఆగి .. తిరిగి చీకట్లోగా వాకిట్లోకి చేర్చే డ్యూటీ! ఎవరి బట్టలు వాళ్ల  ఇళ్లకు వేళ లోపల తడబడకుండా, తప్పులు  ల్లేకుండా , ఏళ్ళ తరబడి చేరవేస్తున్నాడంటే. ' నిజానికి మా తిప్పడి వాషింగ్ ఫేమిలీ ఆపరేషన్ ముందు ఈ సిగ్మా " నగ్మా .. 

సిగ్గా...  ఐనా సరే  సిగ్గుతో  తలొంచుకొవాల్సిందే! 


చదువు సంధ్యలేకుండా, లెక్కా, డొక్కా, రాకుండా...ఇంత చక్కగా ఎలా పనిచేస్తున్నాడో...? పోనీ రాడి ఆపరేషన్ సక్సెస్  సీక్రెటేమిటొ  ఆరాతీసి మన సియంగారి చెవిలో ఊదాల్సింది! సర్కారీ ఉద్యోగుల  కాకి లెక్కలతో పబ్లిగ్గా పరువన్నా పోయే ప్రమాదం తప్పుతుంది ! 


ఆ అయిడితోనే మొన్న మా మారెళ్లినప్పుడు వాడిని కలిసా! 

' నీ ట్రేడ్ సీక్రైటేంటో చెప్పరా ! ' అని గట్టిగా వత్తిడి చేస్తే ఏమన్నాడో తెలుసా? 


ఏమన్నాడ్రా? 


ఇందులో నాగొప్పేంలేదయ్యా! గొప్పంతా మా గాడిదదే! గుడ్డల మూట వాసన బట్టి గడపగడపకి తిరుగుతుందది, దానితోకపట్టుబతిరగటమే మేము చేసేపని' అనేశాడు.


'ఈ లెక్కన గాడిదే చాలా గ్రేట్! 


అవును ' అందుకే స్పెషల్ రిక్రూట్ మెంటు  పెట్టి కనీసం వాటిలోని కొన్నింటినయినా మన గవర్నమెంటు పన్లోకి తీసుకుంటే మన సియం తన సెంచరీ విజన్ లో కనీసం సెంటిమీటర్ సక్సెస్ కన్నా నాందీ పలకవచ్చు! 


- కర్లపాలెం హనుమంతరావు'


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ప్రచురితం - 05 - 09.2002 )

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక దొంగ నాటకం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు- ప్రచురితం - 07-02 2014


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక


దొంగ నాటకం 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు- ప్రచురితం - 07-02 2014 


దొరలే దొంగలు, దొంగలే దొరబాబులు. కాలజ్ఞాని బ్రహ్మంగారైనా ఊహించి ఉండరేమో ఈ విడ్డూరం!


వేమనదంతా వెర్రి వాదం. బంగారం కావాలంటే ఆకువసర్లు నూరాలా? ఏ బంగారు దుకాణం వెనక ద్వారాన్నో, గుట్టుచప్పుడు కాకుండా తెరవగలిగితే బోలెడంత బంగారం!


బిల్ గేట్స్, లక్ష్మీ మిట్టలు లాంటి లక్ష్మీపుత్రులదంతా వట్టి చాదస్తం. కోట్లు, లక్షలు కూడబెట్టడానికి ప్లాన్లు, ప్రాజెక్టులంటూ పెద్ద పెద్ద బిల్డప్పులు అవసరమా? రెండు రోజులు చాలు. మూడు రౌండ్లు రెక్కీ నిర్వహిం చేస్తే- బస్తాలనిండా బంగారమే బంగారం!


'నిజాయతీ' అని తెగ గింజుకుంటున్నాడు ఈ మధ్య ఓ పెద్దమనిషి. ధర్మంగా సంపాదిస్తే ఎన్ని తిప్పలో ఈ తిక్కదేశంలో తెలీదా? అనంతపద్మనాడికైనా ఆదాయం పన్ను శాఖలతో ఎంత సతాయింపు?  దేశాభివృద్ధికోసం ముందస్తు పన్నులు కాస్తంత ఎక్కువ కట్టినా లెక్కలడిగి బొక్కలో తోసేస్తున్నారే!


లక్షలు పోసి కొనుక్కున్న ఉద్యోగం కాబట్టి, ఆ నష్టం కాస్తంత పూడ్చుకోవాలనుకోవడం నేరమా? గుండె చిక్కబట్టుకుని బల్లకింద నుంచి ఇంతేదో గిల్లుకుందామన్నా లోక్ పాల్  బిల్లనీ, అవినీతి నిరోధక చట్టమని, చట్టుబండలని  ఎన్నెన్ని గుదిబండలు మెడల చుట్టూ! 


గాలినైనా వేలంపాటలకు పెట్టుకుని నాలుగు రాళ్ళు నిబ్బరంగా దాచుకునే సదుపాయం సర్కారు పెద్దలకే కరువైపాయే! ఇనుము. ఇసుక, బొగ్గు, ఎర్రచందనం పేరిట ఎన్నెన్నో యాతనలు పడి. కోట్లు కూడబెట్టినా ఏం లాభం? ఏ ఖజానా పెద్దకో హఠాత్తుగా దేశసేవ చేయాలన్న దుర్బుద్ధి పుడితే చాలు, ఆ పొట్టే పెద్ద నోట్లన్నీ రద్దు! బోఫోర్సు క్యాష్ లాగా విదేశీ బ్యాంకుల బోషాణాల్లో మూసిపెట్టుకోవడానికి అందరికీ ఇటాలియన్ సంబంధాలు కుదరద్దూ?


ఎన్నికలు అత్యంత ఖరీదైనవి. వందకోట్లు రేషను కార్డుల సంఖ్యకన్నా రెట్టింపు ఓటరు కార్డులు ఉన్న నియోజకవర్గాల్లో నిలబడి ఎదుటి పక్షంలో తలబడాలంటే తలకు వెయ్యేసుకున్నా ఎన్ని కోట్ల రూపాయలు తగలే యాలి! రోజురోజుకూ చిక్కిపోయే రూపాయిని నమ్ముకునే కన్నా, బంగారం కణికెల్ని వీలైనన్ని దారుల్లో  సేకరించి దాచుకోవడం తెలివితక్కువ పనేం కాదుగా ! అయినా, దొంగతనం, దొంగతనం అంటూ దుర్మార్గంగా అభాండాలువేయడం ఎంతవరకు సమంజసం ? 


చతుష్షష్టి కళల్లో చోరకళ ఒకటి. తంజావూరు తాళ పత్ర గ్రంథాలయంలో కెళ్లి వెదికితే, ఎన్ని బొత్తుల పొత్తాలు బయటపడతాయో! ఇరుగు పొరుగు ఇళ్ళలో దూరి, పాలు పెరుగులు మింగిన బాలకృష్ణుణ్ని ఇలాగే వేధించి ఉంటే రాజకీయాల్లో మనకు మార్గదర్శకత్వమంటూ మిగిలుండేదా ? దొంగ లెవ్వరినీ రాజకీయాల్లోకి రావద్దంటే ఎలా?


ఆమ్ ఆద్మీ ప్రభ అన్ని రంగాలా వెలగాలనేగా అందరి మూలుగులు దోచుకుని, దాచుకుని... దొరబాబుల్లాగా ఊరేగే సౌకర్యం!  రెండు మూడు వర్గాలకే పరిమితం చేయడం ఎంత దుర్మార్గం! పనివాళ్ల పేరున గనులు రాసిచ్చే ఉదార హృదయులు అందరికీ దొరుకుతారా? ఉప్పు, పప్పు ధరలు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. పట్టపగలు ఏటీఎంలలో చొరబడి దౌర్జన్యంగా ఎంత దోచుకుంటే మాత్రం చెడ్డపేరే గాని, చారెడు నూకలన్నా దొరుకుతున్నాయా?


బంగారుతల్లులు, ఇందిరమ్మ సంచులు అంటూ హంగామాలు చేస్తే మిగిలేది భంగపాటే! బంగారు తండ్రులు, ఏ రాహుల్ గోతాలో పథకాలుగా ప్రవేశ పెట్టి బీదా బిక్కి చేతికి ఓ సుత్తి, దొంగతాళాల గుత్తీ ఇచ్చేస్తే- దారిద్య్ర రేఖ నుంచి మధ్య తరగతికేం ఖర్మ. ఏకంగా ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో కెక్కే  భారతావనినే ఆవిష్కరించవచ్చు గదా!


తన పని తాను చేసుకుపోవడానికి చట్టాలు ఎలాగూ మనకు దిట్టంగానే ఉన్నాయి. ఒకవేళ జైలుకు పంపినా, కొన్నాళ్లు సకల మర్యాదలు చేసి, చిలకమార్కు నేర పరిశోధనతో బయట పడేయవచ్చు. రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష పెడితే ఏమొస్తుంది? ఆమ్ ఆద్మీకి ఇలా ఏదో ఉపాధి హామీ పథకాలు ప్రవేశపెడితే ఓటు బ్యాంకు బలపడటానికి పనికొస్తుంది. 'ఆహార భద్రతకన్నా ఇలాంటి స్వేచ్ఛావిహార

భద్రతే ఎన్నికల్లో కలిసొచ్చే ఆకర్షణీయ పథకం. పోలీసు ఉద్యోగాలకు పరుగు పందాలు పెట్టి అభాసుపాలయ్యే కన్నా, 'జేబులు కొట్టే దొంగవెధవల' పోస్టులు సృష్టించి ఉద్యోగ హోదా కల్పిస్తే విరాళాల సేకరణలో పెద్ద తలకాయలకు దాసోహ మనే బాధా తప్పుతుంది కదా! పరుగు పందాల్లో గెలిచి పోస్టులు కొట్టేసిన పోలీసులు మాత్రం ఏం పొడుస్తున్నారట? సూరి హంతకుడి వ్యవహారం చూడలా? ఏటీఎంలో చారల చొక్కా ఆగంతకుడి ఆచూకీ తీయగలిగారా? బంగారం దుకాణం దొంగలిద్దరూ జాలిపడి దొరబాబుల్లాగా వచ్చి లొంగిన తరవాతగదా పత్రికా సమావేశాలు పెట్టింది.. బీరాలు పలికింది!


దొంగ జాలిపడితేనే పోలీసులకు కేసులు క్లోజయ్యేది. కీచకులు పాలుమాలితేనే మహిళల భద్రత కాస్త పెరిగేది. ప్రైవేటు బస్సులు పోనీలే... పాపమని నెమ్మదిస్తేనే ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం సంభవమయేది . సర్కారు ఉద్యోగులు చెయ్యి నొప్ఫెట్టి రెక్కలు ముడుచుకుంటేనే ముడుపులు ముప్పు జనాలకు తప్పేది. పంతుళ్లు, వైద్యులు వస్తాయించకుంటేనే సర్కారు చదువులు, వైద్యాలు సక్రమంగా సాగేది.  కబ్జా దారులు దర్జా ఒలకబోయని నేలమీదే చెట్టయినా గుట్ట యినా చివరిదాకా మిగిలేది. ప్రజాస్వామ్యమని పెద్ద ఘరానాగా మనం ప్రకటించుకుంటున్నాం గానీ, దొంగ ఓటర్ల దయాదాక్షిణ్యాలమీదనే సుమా ఈ మహా సౌధం నిలబడి ఉన్నది...


'దొంగ వెధవ' తిట్టు కానేకాదు. వెయ్యి కిలోల బంగారం అనే ధనంతో రాజకీయాల్లోకి వచ్చి వర్ధిల్లు' అనే దీవెన. 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు- ప్రచురితం - 07-02 2014 )

ఈనాడు- సంపాదకీయం స్వేదయాగం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు ప్రచురితం - 01 - 12 -2011 )

 ఈనాడు- సంపాదకీయం 


స్వేదయాగం

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ప్రచురితం - 01 - 12 -2011 ) 


"పొలాలనన్నీ/హలాల దున్నీ! ఇలాతలంలో హేమం పిండే' విరామ మెరుగని శ్రామికుడు కర్షకవీరుడు. 'ఎవరు నాటిరో, ఎవరు పెంచిరో/ వివిధ సుందర తరువుల/ మివుల చల్లని దయాధార ల/తవిలి కురిపించి? ' అని కృష్ణశాస్త్రి సందేహం. సందేహమెందుకు, ఆ దయామూర్తి నిశ్చయంగా కర్షక చక్రవర్తే! సర్వజీవుల హృదయ పూర్వక వందనాలందుకోగల అర్హత అన్నదాతకుగాక మరెవరి కుంది? తెలతెలవారకముందే పల్లెకన్నా ముందు లేచిన రైతుకు నులివెచ్చని చలి మంటలు హారతులు పడుతుంటే, చెట్టూచేమా వింజామరలై గాలులు వీస్తాయి. నాగులేటి వాగు నీళ్లు కాళ్లు కడు గుతుంటే, జామ కొమ్మ చిలకమ్మ క్షేమసమాచారాలు విచారిస్తుంది. పువ్వునూ కాయనూ పేరు పేరునా పలకరించుకొంటూ పొలం పనుల్లోకి దిగే హలధరుణ్ని సాక్షాత్ బలరాముడి వారసుడిగా పొగుడుతాడొక ఆధునిక భావుకుడు. పాల కంకులను పసి పాపలకు మల్లే సాకే ఆ సాగుదొరను 'ఆకుపచ్చని చందమామ'గా పిలుచుకుంటూ మురిసిపోతాడు ఇంకో గేయకవి సుద్దాల. 'మట్టి దాహం తోటి నోరు తెరవంగా/ మబ్బు కమ్మీ నింగి జల్లు కుర వంగా' వీలు తెలిసి వాలుగా విత్తులు జల్లితేనే గదా పాతరలోని పాత గింజకైనా పోయిన ప్రాణం లేచి వచ్చేది! పుడమితల్లి పురిటి సలుపులు రైతన్న మంత్రసానితనం వల్లనేగదా చల్లంగా తీరేది! కలుపు పెరగకుండ ఒడుపుగా తీయడం, బలుపు తగ్గకుండా తగు ఎరువులేయడం, తెగులు తగలకుండ మందు చల్లడం, పురుగు ముట్టకుండ ఆకులు గిల్లడం, పశువు మేయకుండా కంచెలా కాపు కాయడం, పిట్ట వాలకుండా వడిసెతో కొట్టడం- పంట చేతికి దక్క డమంటే చంటిబిడ్డను మీసకట్టు దాకా పెంచడం కన్నా కష్టం. కృషీవలుడు అందుకే రుషితుల్యుడు.


అరచేతి గీతలు అరిగిపోయేదాకా అరక తిప్పడం తప్ప మరో లోకం పట్టని ఆ నిష్కాముకత్వం అమాయకత్వం కాదు. నమ్ము కున్న వాళ్లందరికీ ఇంత బువ్వ పెట్టాలన్న అమ్మతనం అది! ఆరు గాలాలూ శ్రమించి పుడమితల్లిని సేవించినా ఫలం అందనప్పుడు తల్లడిల్లేది తానొక్కడికోసమే కాదు. బిడ్డ ఆకలి తీర్చలేని తల్లిపడే ఆవేదన అది! మట్టితో సాగుబడి బంధం పేగుముడికన్నా బలమైనది. 'ప్రాణములొడ్డి ఘోర గహ/ నాటవులన్ బడగొట్టి, మంచి మా/గాణములన్ సృజించి, ఎము/కల్ నుసి జేసి పొలాలు దున్ని/భాషాణముల్' జాతికి నింపి పెడుతున్నా సొంతానికి చారెడు నూకలైనా చేటలో మిగలని రైతు దుస్థితికి కలవరపడిన కవులెందరో! 'వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు' అని కవి జాషువాలాగా ఆర్తి చెందిన భావుకులు తెలుగు నేలమీద ఏటుకూరి వేంకట నర్సయ్యనుంచి దర్భశయనం శ్రీనివాసాచార్యదాకా కోకొల్లలు. సింగమనేని నారాయణ భావించినట్లు నిజానికి 'ఎర్రటి నేలలో నాగలి మొనదించి యుగాలుగా విత్తనాన్ని మొలకెత్తిస్తున్న ప్రతి అన్నదాతా కవులకు స్ఫూర్తి ప్రదాతే. ఆ కర్షకుడి హృదిలోకి జొరబడి, కనుకొనుకుల్లో నిలబడి, కన్నీటికీ పన్నీటికీ కినిసి , మురిసిన దువ్వూరివారైతే ఏకంగా 'కృషీ వలుడు' అనే కర్షక కావ్యాన్నే సృష్టించారు. శాస్త్ర విజ్ఞానం ఎంత శరవేగంగా దూసుకుపోయినా  సాగుదారుడు లేకపోతే బతుకు బండి  ముందుకు సాగదు. ఏడు నక్షత్రాల హోటలు పాయసాల పాల నుంచీ ఏడడుగులు నడిచే వధూవరులమీద జల్లే తలంబ్రాల దాకా... అన్నీ అన్నదాత స్వేదయాగ ఫలాలే! ఆకలి తీర్చాల్సిన నేలతల్లి రైతు బతుకులను  మింగే రాక్షసబల్లిగా మారుతుండటమే సాగు భారతంలో నేడు నడుస్తున్న విషాదపర్వం.


జీవనదులెన్ని ఉన్నా మాయదారి కరువు పీడిస్తోంది. ఉత్తరానివి ఉత్తుత్తి ఉరుములు, దక్షిణానివి దాక్షిణ్యమెరుగని మెరుపులు. పడిన చినుకులకు ఎడతెరిపి తోచదు. పాలుతాగే చంటిపిల్ల నీట మునిగితే తల్లికెంత కడుపు కోతో, పంట మునిగిన రైతుకంత గుండెకోత.  చేతులారా పెంచుకున్న పంటకు చేజేతులా నిప్పంటిం చుకున్నా ప్రభుత్వాలకు పట్టదు. గోడలేని పొలాలకు గొళ్లేలు బిగిం చుకున్నా గోడు వినేందుకు ఏ నాథుడూ  రాడు. కళ్ళాల దగ్గరే కాదు... అంగళ్లలో సైతం ఆసరా దొరకదు. నిల్వలకు నీడలేక నడి బజారులో నిండు జీవితాన్ని పొర్లబోసుకుంటున్నాడు నేడు రైతు. ఓటమని తెలిసీ చివరి వరకూ పోరాడవలసిన కర్ణుడైనాడు కర్ష కుడు. పొలం గుండె తొలుచుకుంటూ పొగగొట్టాలు లేస్తున్నాయి... పంట చేల కంఠాలకు ఆర్థిక మండళ్ల ఉరితాళ్లు పడు తున్నాయి... ఉరి రద్దుకు పరితపించే పెద్దలకైనా పట్టదా ప్రాణ దాత ఉసురుకు ముంచుకొచ్చే ఆపద? రైతు చావుదెబ్బ జాతికి శాపం కాదా! వట్టొట్టి సానుభూతి వచనాలు కురవని నైరుతీ రుతు పవనాలు. వేదికల వాదనలు రైతు వేదన తీర్చవు. అన్నదాత కన్నీ టికి కావాల్సిందిప్పుడు చిత్తశుద్ధితో వేసే ఆనకట్ట. ఆ పని వెంటనే ప్రారంభం కాకపోతే ఆ ప్రవాహంలో జాతి మొత్తం కొట్టుకొని పోయే ప్రమాదం అట్టే దూరంలో లేదు. కాడి ఇంతదాకా పడేయక పోవడం సేద్యగాడి చేతకానితనం కాదు. 'కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై/ చెక్కిళ్లమీద జాలిగా జారుతున్నా ఒక్క వాన చుక్క యినా చాలు/ వచ్చే కారు'కి 'చాలు'లో విత్తే చారెడు గింజలైనా దక్కుతాయి' అన్నది అన్నదాత ఆశావాదం. 'ఇఫ్కో' సాహితీ పుర స్కార ప్రదానోత్సవ సభలో కేంద్ర మంత్రి శరద్ పవార్ వల్లెవే సిన మన వ్యవసాయ సంస్కృతిలోని విలక్షణత అదే. 'మూల వర్షం ముంచినా జ్యేష్ఠ వర్షం తెలుస్తుంది' అన్న ఆశే అన్నదాతను ఇంకా బతికిస్తోంది. మనందరికీ బతుకులు మిగులుస్తోంది.


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ప్రచురితం - 01 - 12 -2011 )

Saturday, December 25, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం గంజినీళ్లే గతి - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 17-06-2010)


 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

గంజినీళ్లే గతి 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 17-06-2010) 


గిన్నీసు రికార్డు కాదు.. . ఇంట్లో గిన్నెలూ, చెంబులూ బద్దలైపోతు నాయే నీ దెబ్బకు 


నా దెబ్బ కాదయ్యా మగడా! .. ఇది ధరలదెబ్బ!  బోడి బీరకాయ కిలో యాభయ్యా?  బీన్స్ ఎనభై... బీటురూటు ముప్ఫై.. బెండ ముప్పైరెండు... దొండ....


అబ్బ..ఆపు నీ ధరల దండకం...! 


లేకపోతే ఎందయ్యా? నువ్వేమో ఏడనో కోడిని కొట్టుకొచ్చి పలావు చేయమని కూర్చున్నావు పీకల మీద.  పుంజునంటే నువ్వు కొట్టుకొచ్చావు గానీ... పులావు లోకి కావాల్సినవి నేనే కొట్టునుంచి కొట్టుకురావాలి? 


కొట్టుకురావడమేంటే... కొత్తగా మాట్లాడుతున్నావ్? నెల మొదట్లోనే జీతం మొత్తం కుడుముల్లాగా నీ చేతిల్లోనే  పోశాను గదే! ఆ మొత్తం మార్నింగుషోలకే మటాషా?


ఆ తమాషా ఒక్కటే తక్కువ నా బతుక్కి! నా బతుకే టీవీ సీరియల్ అయిపోయింది. పులావు కావాలంటే ఏమేం కావాలో తెలుసా?


ఆ మాత్రం తెలీక పోవటానికి నేనేమన్నా సివిల్ ఎగ్జామినేషన్ రాసే విద్యార్థినా? నూనె... పసుపు.... కారం... ఉప్పు... కొబ్బరి... మసాలా దినుసులు. టమాటాలో బీన్సో ఆలు గడ్డలో పడితే ఆ మజాయే వేరు!


వంటనూనె బొట్టు ఎట్టా మండిపోతా ఉందో తెలుసా? మామా... పండక్కి గడపలకి పసుపు రాయటమట్లా ఉంచు... మెళ్ళో పుస్తెల తాడుకింత పులుముకుందామన్నా చిటికెడంతైనా కొనలేక చేతులు ముడుచుకూర్చున్నా. నువ్విప్పుడొచ్చి కోడిపులావు చేయమని మారాం చేస్తా ఉన్నావు! 


పసుపు లేకపోతే మానె... పోనీ- ఉప్పు కార మన్నా పోసి వండి పెట్టవే! 


సడిపాయె! ఉప్పు సంగతే చెప్పు... కల్లు, సారా అంటే ఏరులై పారతా  ఉందిగానీ... కల్లుప్పు తాగే బోరునీళ్ళలో తప్ప కలికానిక్కూడా దొరకటం లేదయ్యామగడా! రాతి ఉప్పు అయినా కిలో పాతిక పెడితే తప్ప రావటంలేదు. పులావుకు సరిపడా కొనాలంటే ఏ మధుకోడాకో కొడుకో, కూతురో అయిపుట్టాల


మరీ నీకు ఎటకారాలెక్కువైపోయాయ్! పోనీ

వట్టి కారమన్నా వేసి చేసి పెట్టవే... నాలిక జిహ్వ చచ్చిపోయుంది


కారం కారం అని పదిమార్లు అట్లా ఊరికే పలవరించమాకయ్యా! నా కళ్ళంట నీళ్ళొస్తున్నాయి. కొట్లో కారం పొట్లాల రేట్లెట్లా ఉన్నాయో తెలిస్తే నువ్విట్లా పులావు జపం చేయవు. కూరగాయ లెట్లాగూ కొనే స్తోమతు లేదు... కొరివికారమన్నా వేసుకుతిందామంటే... అది కొనటానికి మళ్ళా మనమేదో బ్యాంకు లోనుకు పోవాల


అపూ! వింటావున్నాను గదా అని... ఊరికే దంచేస్తున్నావు ఊకదంపుడు ఉపన్యాసం! పులావు ఎట్లా చెయ్యలో.... అందులో ఏమేం వెయ్యలో.... ఆ సోదంతా నాకెందుకు! కట్టుకున్న దానివి... అడిగింది ఠక్కుమని చేసి పెట్టడం పతివ్రతాధర్మం. ముందు పొయ్యి వెలిగించు!


ఏం పెట్టి వెలిగించాలయ్యా పొయ్యి ? గ్యాసు అయిపొయ్యి పదిరోజులపైనే అయిపోయింది. ఫోనులో పలకడు. పోయినా ఉలకడు ఆ గ్యాసుబండ బండమనిషి.  రేపో ఎల్లుండో... రేట్లు పెంచుతారంటగా.... అప్పటిదాకా నోస్టాక్ అంట!


ఆహాఁ... గ్యాసు లేకపోతే పొయ్యే వెలగదా! కట్టెపేళ్ళతో కుస్తీపట్టిన రోజులు అప్పుడే మర్చిపోతే ఎట్లా సుకుమారీ! గ్యాసు మాటలు కట్టి పెట్టేసి  ముందా  పులావు పనిచూస్తావా... లేదా? 


సరీ... పొయిలోకి నా కాళ్ళో చేతులో పెట్టి వండి పెడతాగానీ... ముందు నువు పులావు దినుసుల సంగతి చూడు మామా! నిజం చెబితే నీకేదో..  నువ్వంటే పడని పత్రికల్లో రాసిన కతల్లాగుంటాది గానీ... ఇదిగో సంచీ! నువ్వే బజారు దాకా పోయి  నాలుగు రకాల కూరగా యలు కొనుక్కురా! ఒక్క కోడిపులావేం ఖర్మ... గరమాగరమ్ కోడిపులుసు... కోడివేపుడు, గారెలు కూడా చేసి పెట్టడానికి నేను రడీ!


ఎట్లాగైనా నువ్వు మాటల్లో మన సర్కారు వాళ్ళని మించిపోయావే! నీ కబుర్లతోనే కడుపు నింపేస్తావు... తెల్లారిపోయినట్లుంది.... అదిగో అప్పుడే కోడికూత! 


అది కోడికూతేగానీ... కోడి కూసింది కాదు. మామా! మనచిన్నాడిని గోడవతల కూకుని అట్లా కూస్తుండమని నేనే అన్నా. నువ్వు కోడిపులావో అని కలవరిస్తా వుండావాయ పాపం! ఇదిగో ఆ కోడికూతలు వింటూ ఈ జావ తాగతా వుండు. కోడిపులావేం ఖర్మ... పెద్ద వొటేల్లో చికెన్ బిర్యాని తిన్నదానికన్నా మజాగా ఉంటాది... ' పాపం, నిజం కోడిని వదిలేయ్ మామా! మన సర్కారు పున్నెమా అని దాన్నైనా నాలుగు దినాలు హాయిగా బతకనీరాదా!'


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 17-06-2010) 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక కుర్చీల ముచ్చట్లు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 06 - 05 - 2019 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక

కుర్చీల ముచ్చట్లు 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 06 - 05 - 2019 ) 


ఎన్నికల ప్రచార సభాప్రాంగణం. 


ఖాళీ కుర్చీలు . 


ఖాళీగా కూర్చోలేక కబుర్లలో పడ్డాయి. 


ఈ హస్తం పార్టీ మీటింగులంటే ఇందుకే నాకు హాయి. వేది కమీద హడావుడేగానీ కింద గ్రంథాలయాని కన్నా  నిశ్శబ్దంగా ఉంటుంది.


నిజమేనన్నా. నిన్న ఆ పసుపుపచ్చ రంగు పార్టీ వాళ్ళ మీటింగులకు వెళ్లొచ్చిన కుర్చీల గోడు వినాలి. ఎక్కడెక్కడి జనాలో పుట్టపగిలిన్నట్లు వచ్చి పడ్డారుట . ఒక్కోసారి ఇద్దరేసి శాల్తీలను కూడా మోయాల్సిన చ్చిందని . . ఒళ్ళు హూనమైపోయిందని ఒహటే మూలుగు . పగవాడిక్కూడా వద్దన్నా ఈ పాడు కుర్చీల బతుకు ' అందులోనూ ఈ దేశంలో ఎన్నికల సమయంలో అసలు వద్దు. 


నాలుగు రోజులు పనికే నువ్వింత బేజారవడం ఏం బావోలేదప్పా!  ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఇప్పుడీ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలప్పుడు కుర్చీలుగా పుట్టాం!


ఇంకో కుర్చీ అందుకుంది 'ఆ మాటా నిజ మేనన్నా! ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే కుర్చీలాటేగా! మనకోసం నెహ్రూ-గాంధీ కుటుంబంవారు ఎంతగా వెంపర్లాడుతుం టారు. ఆ తెల్లగడ్డం గుజరాతీ పెద్దాయన ఎన్ని నెలలబట్టి ఎండనక వాననకా ఊళ్ళెంబడి పడి తిరుగుతున్నాడూ! గిన్నీసు బుక్కు లోక్కూడా ఎక్కేట్లున్నాడు. అంతా కిస్సా  కుర్చీ కా' అను బావుంటుంది. 


ఎట్లాగైనా మనల్ని దక్కించుకునితీరాలని బుద్ధిమంతులుగా పేరుగడించుకున్న పెద్ద పెద్దోళ్లూ బుద్ధిహీనంగా నోళ్లు పదును పెడు తున్నారు.


మన మీద మోజు అలాంటిది. అందుకే నలిపి నామం పెట్టని పరమ పిసినారి నేతలూ ' అవి ఇవి ఇస్తాం. . ఊరికే ఇస్తాం. . ఊరి మొత్తానికి చేయిస్తాం ' అంటూ జనాల కళ్ల ముందు నోట్లాడిస్తూ ఊరిస్తున్నారు. అందుకే మనమూ ఓ రకంగా ప్రజాసేవలో భాగస్వాములవుతున్నట్లు లెక్క.  ఆనందపడి పొండి! 


 మరో కుర్చీఅంతుకుంది . 


'ఇదేం ప్రజాసేవ' పెద్ద కుర్చీ  ఎక్కడానికి చేసే టక్కుటమారాలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడే ఇలాంటి ఉదారత ప్రదర్శించి ఉంటే అలాంటి ప్రజాసేవ చేయించిన ఫలం మనకూ దక్కేది. అదీ అసలైన గొప్పతనం! 


ఇప్పుడు మాత్రం మన గొప్పతనానికి తరుగేమిట్రా?  ఏళ్లు మీదపడ్డా పెళ్ళి మీద మనసుపోని బుల్లోడికి మనమీదే  మోజు.  ఏళ్ల కిందట పెళ్ళాడి తాళికట్టిన ఆమె పేరును ఈమధ్యే వెల్లడించిన పెద్దాయనకూ మనమీదే వలపు. 

కుర్చీ  మీద కూర్చుని తృప్తి పడి  పశువులకు వేసే గడ్డి తిన్న పాపానికి  జైలుకు పోతూ కూడా మనల్ని ముద్దుగా ముద్దుల భార్యకు అప్పగించి పోలేదూ లాలూ ప్రసాదు!


జైలంటే గుర్తుకొచ్చింది. నాయన పోయాడన్న దుఃఖమన్నా లేకుండా మనల్నే ఎంతగా తలచుకున్నాడు జగను! ఇప్పటికే మనల్ని మరచిపోలేక ఎన్ని ఆపపోసాలు పడుతున్నాడో చూశావా! 


అదే నేననేది. కాటికి కాలు చాపుకొన్న ముసిలోడి నుంచి, కళ్లు ఇంకా పూర్తిగా తెరవని బుడ్డోడి  దాకా ఆడామగా అన్న తేడా లేకుండా అందరికీ మనమీదే కన్ను.  రాజకీయాలనుంచి సన్యాసం తీసుకున్నా ,  సన్యాసంలోనే ఉండీ  రాజకీయాలు చేస్తున్నా , సిని మాల్లో చేరి గొప్ప పేరుగడిస్తున్నా  , రాజకీయాల్లో దూరి సినిమాలు చూపిస్తున్నా. అందరూ చెప్పులు, చీపుళ్ళు, మిర్చీలు, ఫ్యాన్లు పట్టుకుని రొప్పుతూ తిరిగేస్తున్నారంటే అదంతా మన కుర్చీలమీదుండే అంతు లేని ప్రేమతోనే.  జనాలకు ఈ మాత్రమైనా మనం మేలు చేస్తున్నామంటే అదంతా ఆ భగవంతుడు ఈ ఆషాఢభూతులకు అధికారంపై దాహం మోహం ప్రసాదించబట్టే . 


బాగుంది నీ మెట్ట వేదాంతం! అందలం ఎక్కిన తరువాత అంది వచ్చినదంతా అబగా కబళించుకుపోవాలన్న దుర్బుద్ధితో కదూ వీరంతా వేషాలు వేస్తోందిప్పుడు. మళ్ళా కుర్చీ ఎక్కిస్తే ఈ జగన్నాటకాన్ని మరో అయిదేళ్లపాటు నిరాటంకంగా ఆడుకోవచ్చని కదూ తేరగా సొమ్ము వెదజల్లుతోంది! జనం నుంచి దోచిన లక్షకోట్లలో నుంచి ముష్టి రూపాయి విదిల్చి అదేదో పెద్ద ప్రజాసేవ చేస్తున్నట్లు పోజొకటి! 


రాజకీయ నాయకుల సభలు చూసీచూసీ మీరూ గడుసుతనం మహబాగా ఒంట పట్టించు కున్నారన్నా! 


నాయకుల మాటల్లోని మర్మం మనకేమైనా కొత్తా! టికెట్ దక్కలేదన్న అక్కసుతో పార్టీ కార్యాలయం నుంచి మనల్ని బయటకు లాగి కెమెరాల సాక్షిగా కుళ్ళబొడిచిన సంగతి ఎలా మరవ గలం? అందుకే, అధికారానికే కాదు... అసమ్మతికి నేనే ప్రతీకనని గర్వపడతా. నిన్నూ గర్వపడమంటున్నా! 


ఛీ..  పో అని ఈసడించినా, చెప్పులు విసిరి కొట్టినా దులపరించుకుని చిరునవ్వులు చిందించడానికి నేనేమన్నా నిన్న మొన్నటిదాకా కుర్చీకి  అతుక్కుని కూర్చున్న రాజకీయనేతనా? వట్టి కుర్చీని ! మన విలువ ఏమిటో తెలిస్తే నువ్విలా మాట్లాడతావా?


తెలుసులేరా బాబూ మన ప్రభ! దశరథుడంతటి మహాప్రభువు రామచంద్రుణ్ని మనమీద కూర్చోబెట్టాలని తహతహలాడిపోయాడు. కన్నబిడ్డకే ఆ భాగ్యం దక్కాలని కైకేయమ్మ అంతులేకుండా పరితపించింది. చివరికే మైంది? అన్నదమ్ములిద్దరికీ దక్కలేదు.  మన సాంగత్యం అన్న కాళ్లకింద నుంచి తమ్ముడి తలమీదకు ఎగబాకి మనమీద పద్నాలుగేళ్లు కొలువు తీరలేదా పాదుకలు? దీన్నిబట్టి నీకు పాదుకలు, పెద్దమనుషులు కాదు ముఖ్యం. సింహాసనం ఎక్కినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రధానం. మనల్ని ఎలాగైనా సాధించుకోవాలని సప్త సముద్రాలను క్షీరసాగరాలుగా మారుస్త మని వాగ్దానాలు గుప్పిస్తారు పెద్దమనుషులు. జనం నమ్మి అందలం ఎక్కిస్తారు. సుపరి పాలన హామీ గాలికొదిలేస్తారు. గాలిని, భూమిని, నీటిని కూడా దోచేస్తారు. ఫలితం.. 


ఇదిగో... ఇలా మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు సభల్లో ఓటర్లకు కాకుండా... వట్టి ఖాళీ కుర్చీలకు రాసుకొచ్చిన ప్రసంగం వినిపించాల్సి రావడం 


ఆపక్కన  ఎన్నికల కోడ్ ఒకటి నడుస్తోంది. ఎక్కువ తక్కువలైతే అదో కేసవుతుంది. ఈ నెలరోజులు ఎన్నెన్ని రాజకీయ సభలు చూళ్లేదు. ఖాళీ కుర్చీలం... మనకు అర్ధమైనంతైనా మన ఓటర్లు అర్ధ మనకుండా ఉంటుందా?


నిజమేరా, ఈపాటికే ఒక మంచి నిర్ణయం తీసేసుకుని ఉంటారు. మళ్ళీ ఎన్నికల దాకా పశ్చాత్తాప పడకుండా మంచి సమర్ధుణ్ణ్ని, చిత్తశుద్ధిగల నేతను మాత్రమే ఎన్నుకుంటారని ఆశిద్దాం'


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 06 - 05 - 2019 ) 

ఈనాడు - సంపాదకీయం తన కోపమే తన శత్రువు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 16-09-2011 )

 



ఈనాడు - సంపాదకీయం 

తన కోపమే తన శత్రువు


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 16-09-2011 ) 


బ్రహ్మ ఆరంభంలో సృష్టించే విధానం తెలియక కుపితుడైన సమయంలో కనుబొమలనుంచి ఉద్భవించిన రూపమే రుద్రుడని పురాణ కథనం. నవరసాల్లో రౌద్రానిది శాంతరసంకన్నా ముందుస్థానం. దుష్టశిక్షణార్థం దివినుంచి దిగివచ్చిన అవతారమూర్తి సమయోచితంగా సత్యాగ్రహాన్ని ప్రదర్శించి ఉండకపోతే శిష్టరక్షణ సాధ్యమై ఉండేదా అన్నది ప్రశ్న. నారదమహర్షికి సనకమహాముని ఇచ్చిన వివరణ ప్రకారం కలియుగం మరో పేరు తామసయుగం. త్రేతా యుగంలోనే శ్రీరామచంద్రుడంతటి శాంతమూర్తికి వారధి నిర్మాణం వేళ సముద్రుడిమీద ఆగ్రహం పుట్టుకొచ్చింది. ద్వాపరంలో కురుక్షేత్ర సంగ్రామం మూలాలు దుర్యోధనుడి వంటి దుష్టుల మదమా త్సర్యాలలో దాగున్నాయి. రజోగుణజనితాలైన కామక్రోధాలే సర్వపాపా లకు మూలకారణమని గీతాచార్యుడు ప్రబోధించాడు. ఆయనే రాయబారంవేళ ' అలుగుటయే యెఱుంగని మహామహితాత్ముడజాతశత్రుడే యలిగిననాడు సాగరములన్నియునేకము గాకపోవు' అంటూ యుద్ధ తంత్రంలోని దండోపాయాన్ని ప్రయోగించబోయాడు. అలకలకొలికి సత్యభామ పడకటింటి కోపతాపాలేగదా నందితిమ్మన పారిజాతాప హరణం' పరిమళ సౌరభాలు.  సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడి కరుణాకటాక్షాలవల్ల పునరుజ్జీవితుడైన పరీక్షిత్ మహారాజు శమీకమహర్షి తనను నిర్లక్ష్యం చేశాడన్న ఉక్రోషంతో క్షణికావేశంలో మృతస ర్పాన్ని మునిమెడలో వేసి చావును కొనితెచ్చుకున్న సందర్భం సదా స్మరణీయం . తండ్రికి జరిగిన అవమానానికి కుంగి శాపానికి పూనుకొన్న శృంగితో ఆ సందర్భంలో తండ్రి శమీకుడు అన్నమాటలు నిజానికి సర్వకాలాలకూ సర్వలోకాలకూ సహితం కలిగించే చద్దిమూటలు. త్రాచువంటి మూగజీవులకు కేవలం ఆత్మరక్షణాయుధమైన క్రోధంతో మేధావి మనిషి కార్యాలన్నింటినీ సాధించుకోవాలనుకుంటే ముందుగా నష్టపోయేది తాను, తనచుట్టూ ఉన్న సమాజం.


దమయంతి కల్యాణం నలుడితో జరిగిందని విన్న ద్వాపరుడు, శని కోపంతో చిందులువేసే సందర్భంలో వారి సేనానాయకులైన అరిషడ్వర్గాలు ఒక్కొక్కరే తమ ప్రతాపాలను ఉగ్గడించుకొనే సన్ని వేశం మహాభారతంలో ఉంది. కాముడి కారుకూతల తరవాత క్రోధుడి 'నా దుర్గం ఈ కామునికైనా దుర్భేద్యం . కాముని ఆశుగాలు ఈ క్రోధుని ముందు బలాదూరు' అనే కోతలు చాలు- ఈ దుర్వాస మానసపుత్రుడు మానవజీవితంలో చేసే అలజడులు, ఆగడాలు, విధ్వంసాలు వివరించడానికి. 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్ర/ నీవు కులుకుచు దిరిగెదవెవరబ్బ సొమ్మని రామచంద్ర'  అంటూ దాసునిచేతనే స్వామిని తిట్టిపోయించే గడుసుదనం దానిది. 'ఎగ్గుసిగ్గులు లేక ఏకచక్రపురాన/ భిక్షాటనము చేసి వెలగలేదే' అని పాండవ పక్షపాతే అధిక్షేపించగా 'నల్లపిల్లివోలె ఇల్లిల్లు గాలించి/పాల్వెన్న  దొంగిలి ప్రబలలేదే' అంటూ ఆ పాండవ మధ్యముడు ఎదు రుదెబ్బ తీస్తాడు. ఆ రచ్చంతా ఎంత అంతరంగికుల మధ్యనైనా చిచ్చు పెట్టించగల ముచ్చు క్రోధానిదే. ఉత్తమకావ్య రసాస్వాదన చేయలేని అశక్తుల మీద యధాశక్తి కసి తీర్చుకునే నిమిత్తం  నన్నెచో డుడు ఎన్నుకున్న మార్గం ప్రబంధ లక్షణమన్న వంకతో కుకవి నింద.  మదమాత్సర్యాలకు, కోపతాపాలకు కొరతేలేని సృజనరంగంలో తిట్టుకవిత్వం పేరుతో పొల్లుకొట్టుకుపోగా పొట్టుగా మిగిలిన సాహిత్య సరకే గుట్టలు గుట్టలు. 'నీపేరేమిట'ని అడిగిన నేరానికే 'వట్టిమానైన చిగురు బుట్టింప గిట్టింప బిరుదుగల వేములవాడ భీమ కవినే గుర్తించలేవా' అంటూ చాళుక్య చొక్కరాజంతటివాడిమీద తాడి చెట్టంత ఎత్తున ఎగిరిపడే కవితావతంసులకు కొదవ లేదు. వాక్పా రుష్యం దహనంకంటే దారుణమన్న నన్నయ్య శాంతిప్రవచనాలు చెవిన పెట్టకపోతే చెడేది ముందు మన ఆరోగ్యాలే!


మనిషి దేనిని  పరిత్యజించి శోకరహితుడవుతాడని యక్షుడు సంధించిన ప్రశ్నకు యుధిష్ఠిరుడిచ్చిన సమాధానం- క్రోధం. మనిషి జీవితం శోకమయం కావడానికి కోరికలే కారణమని బుద్ధభగవానుడి ప్రబోధం. 'తీరిన కోరికలు మరిన్ని కోరికలకు ప్రేరణలవుతాయి... తీరని కోరికలు క్రోధానికి కారణాలవుతాయి' అంటుంది భగవద్గీత. కోపమునకు ఘనత కొంచెమైపోవును/కోపమునకు మిగుల గోడుచెం దు/కోపమడచెనేని కోరికలీడేరు' అన్నది వేమన మాట. భూమినుంచి సహనం, వాయువునుంచి పరోపకారతత్వం, ఆకాశం నుంచి కాలాతీత మైన గుణస్థిరత్వం, నీటినుంచి నిత్య స్వచ్ఛత, అగ్నినుంచి పునీతమయ్యే గుణం అలవరచుకోవడానికే పంచభూతాలనే ప్రసాదాన్ని ప్రకృతి మనిషికి బహూకరించింది. ముక్కుమీదికోపం ముఖానికి అందమని ముప్పూటలా ముటముటలాడతామంటే మొదటిగా మోస మొచ్చేది మన ఆరోగ్యానికే అంటున్నారు వైద్యశాస్త్రజ్ఞులు. కాన్కార్డియా విశ్వవిద్యాలయ పరిశోధకులు మానవజీవన ప్రమాణాలమీద ఒకటిన్నర దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ప్రయోగాలలో  కోపగుణం- రక్తపోటు, నిద్ర, మానసిక ఒత్తిడి, హార్మోన్లు, శరీరావయవాలు, జీర్ణకోశం తదిత రాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని శాస్త్రీయంగా రుజువైంది. అనివార్యమైనప్పుడు కోపాన్ని ఆవేశపూరితంగాకాక అర్థవం తంగా సున్నితంగా ఎదుటివారు అర్థం చేసుకొనేటంత తగుమోతాదులో వ్యక్తం చేయడం ఆరోగ్యవంతమైన మార్గం అంటున్నారు ఆ పరిశోధక బృంద నాయకుడు. పేలుళ్లు, పెను విస్పోటాలవంటి దుస్సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే- విశ్వవ్యాప్తంగా ప్రతివ్యక్తీ తన మనసును స్వర్గధామంగా మలచుకొనే ప్రయత్నం ఆరంభించాలి. 'కోపాన్ని అణచుకోవడం గొప్ప యజ్ఞం చేసినంత ఫలం' అన్న తాళ్ళపాక తిరుమలాచార్యులవారి తత్వాన్ని ఒంటబట్టించు కొంటే- ఒంటికీ, ఇంటికీ, దేశానికీ, విశ్వానికీ మేలు.L


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 16-09-2011 ) 

Friday, December 24, 2021

ఈనాడు హాస్యం - వ్యంగ్యం - గల్పిక బండ పడుద్ది కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 09-12- 2013 )


 



ఈనాడు హాస్యం - వ్యంగ్యం - గల్పిక


బండ పడుద్ది


కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 09-12- 2013 ) 


' ఓరి .. నీ బండపడ '  అని మన పెద్దాళ్లు ఊరికే అన్నారా? తథాస్తు దేవతలున్నార్రా! జనాల నెత్తిన మళ్ళీ బండ ఎలా పడిందో చూడు' 


గ్యాస్ బుండ గురించే అన్నా  నీ ఆవేదన? బండమీద ఇంకో అరవై ఆరున్నర. స్వాతంత్య్రం వచ్చి అరవై ఆరేళ్లు దాటాయి. దానికి గుర్తుగా ధరను జాతికి అంకితం చేస్తే చమురు కంపెనీల దేశభక్తినిలా శంకించడం బావోలేదన్నా!


ఏడుపొక్కటే తక్కువరా!  పొయ్యిమీదనే  మండుతోందను కుంటే... పొయ్యి కిందా  ఇలా మంట పెట్టిస్తుంటే కడుపు మండిపోతుందిరా!  ఇక్కడు వట్టి గ్యాసు గ్యాసని  మనం నేతల కూతలనేదో ఛీ కొడతాంగాని- ఆ గ్యాసు సిలిండర్లకు పట్టి బజార్లో పెడితే ఎంత డిమాండూ!


వానచుక్క సామెతని సరిపెట్టుకోరాదా అన్నా! మురిక్కాలవలో పడితే మురుగు, ముత్యం చిప్పులో పడితే ముత్యం.  ముత్యానికి మరి డిమాండు ఉండకుండా ఉంటుందా?  నీకు తెలవడా అన్నా!


మా బాగుందిరా అబ్బీ నీ కపిత్వం! కిలో బంగారం, కిలో వంటగ్యాసు తూచి ఏదో ఒకటే కోరుకొమ్మంటే, నీ ఓటెటోగాని నేను మాత్రం గ్యాస్ తీసేసుకుంటారా   బాబూ!  అలా ఉంది ఇంట్లో పరిస్థితి. ఎందుకురా ఆ నవ్వూ!


ముక్కోటి దేవతలొకవైపు అమ్మ ఒకవైపు రెండిం టిలో ఏది కావాలంటే.. అమ్మవైపే తూగేను నేను- అని వెనకటికి ఒక గొప్ప కవి మా గొప్పగా చెప్పారులే. ' అమ్మ కూడా వద్దు బదులుగా ఓ గ్యాసు బండ ఇవ్వు'  అని అడిగేట్లున్నావ్ నువ్వు!  అందుకొచ్చింది నవ్వు.  మరేమనుకోమాకన్నా!


నవ్వులాటగానే ఉంటుందిరా అబ్బీ నీకు నా బతుకు.  పెళ్ళీ పెటాకులూ అయితే బయటపడుతుంది తమరి సరుకు .  అన్నట్లు నువ్వేదో పెళ్ళిచూపులకు వెళ్తున్నావటగా?  పిల్లకు ఏ పీజీ డిగ్రీనో ఉందని సంబరపడిపోకు. ఎల్పీజీ గ్యాస్ కనక్షను లాంటిదేదో ఉందో లేదో ముందు చూసుకో! కాపురం కూడా గ్యాసు లేనిదే ముందుకు కదలదు. గుర్తుంచుకో!  కాఫీలోకి పంచదార తక్కువైతే ఏ పక్కింటి పంచ ముందో నిలబడి ఓ కప్పు అప్పు అడుక్కోవచ్చు. అదే గ్యాసుగాని అయిపోయిందనుకో .. అయిపోయిందే నీ పని. ' ఎక్క డైనా బావగాని- గ్యాసుబండ దగ్గర కాదు' అన్న సామెత పుట్టుకొచ్చింది విను!  ఒకే బాణం, ఒకే భార్య లాగా ఒకే కనెక్షను .. ఒకే  బుకింగు' అన్న కొత్త సూత్రం తెచ్చింది ఈ గ్యాడు తిప్పలు. 


ఆవుమీద వ్యాసంలోలా  ఈ గ్యాసుమీదనేనీ నీ ధ్యాసంతా?.   వ్యాసమేదన్నా రాస్తున్నావా అన్నా?! 


మ' సంసారి బాధలు నీకేం తెలుస్తాయిరా సన్నాసీ?  బైటికె ళ్చిన ఆడపిల్ల క్షేమంగా ఇంటికొచ్చిందాకా ఎంత ఆందోళ నో... దానికి పదింతలు.. బుక్ చేసిన సిలిండరు సవ్యంగా మన ఇల్లు చేరిందాకా!  ఆడపిల్లవాళ్ళు సమర్పించుకునే కట్నాలనుంచి  కొంత గిల్లి మళ్ళీ పిల్లకు నగానట్రా చేయిం చినట్లు మనం ముందుగా చదివించుకోవాలను తిరుగు కట్నంలా సబ్సిడీ మొత్తాన్నిప్పుడో బ్యాంకు ఖాతాలో జమ వేస్తారట!  బికార్లం... బాటా, బిర్లాల మాదిరి బ్యాంకుల

చుట్టూ షికార్లు కొట్టడం.. . ఆదో విచిత్రం! నిరాధారుడికి గ్యాసుబండ బహుదూరం.  జీవనాధారం కోసమే అల్లాడాలా . . ఆధార్ కార్డులకోసమే పోరాడాలా? పోలీసోడి దెబ్బలకన్నా మహా కముకుగా ఉంటున్నాయబ్బీ  'గ్యాసు ' దెబ్బలు! 


పో అన్నా... నువ్వు మరీ చెబుతావు.  అంతర్జాతీయ మార్కెట్టంటూ ఒహటుంటుందని, దానికి అనుసంధానమైన పాపానికి ధరలెప్పుడూ కిందికి దిగిరానేరామని అంట్లు తోముకునే అప్పులమ్మక్కూడా అవగాహనస్థాయి పెంచింది. వంట గ్యాసు లాంటిదాన్ని నువ్వు ఇలా తక్కువ చేయటమా?! 


వేళకు ఇంటాయన కొంప చేరకపోయినా ఏమంత అందోళన పడటంలేదు ఈ కాలం ఇల్లాళ్లు.  అదే బుక్ చేసిన గ్యాసుబండ సవ్యంగా ఇంటికి చేరకపోతే, మంచమెకేస్తు న్నారురా వాళ్ళు!  మా పిన్నమ్మగారమ్మాయిని కొత్త కాపురానికి పంపిస్తూ సారెలో ముందుగా పెట్టిందేంటో తెలుసా  గ్యాసు సిలిండరు ! కట్నకానుకలకన్నా కరాఖండీగా  కండేషను పెట్టారట మగపెళ్ళివాళ్ళు.  పిల్లను చూచానికని వచ్చినప్పుడు ముందుగా అమ్మాయికేమున్నా లేకున్నా  ప్రత్యే కంగా కనెక్షనుంటేనే సంబంధం ఖాయం చేసుకుంటున్నారు.  అలాంటి గ్యాసుని తక్కువచేసి మాట్లాట్టం కుదురుతుందా?


పిచ్చిపిచ్చి ఊహలొచ్చేస్తున్నాయి. మరీ ఈమధ్య ఈ గ్యాసుబండ ధర పెరిగినప్పట్నుంచీ ! తులాభారం సీనులో ఒక సిబ్బెలో ఎన్టీఆర్లా శ్రీకృష్ణుడంట..  మరో సిబ్బెలో తూకానికి సత్యభామాదేవి వంటింటి గ్యాస్ సిలిండరంట! ఇంకో సీనులో కుచేలుడిచ్చిన అటుకులు బొక్కి పరంధాముడిచ్చిన అష్టఐశ్వర్యాల్లో గ్యాసు సిలిండరు కూడా కనిపించింది. పచ్చి పండ్లు, పిచ్చి కాయలే దొరికాయా శ్రీరాముడంతటివాడికి నైవేద్యంగా పెట్టడానికి అని లక్ష్మణస్వామి నోరుచేసుకుంటే పండరీబాయి  ఫేమ్ భక్త శబరి ఏమని మొత్తుకుందో తెలుసా? ' క్షమించు లక్ష్మణా! సమయానికి గ్యాసు నిండుకొంది, బుక్ చేసిన బండ ఇంకా డెలివరీ కాలేదు' అని. 


అయ్యబాబోయ్.. ఇంక ఆపుతావా అన్నా.. గ్యాసు మాటలు ఇంతకూ ఎప్పుడూ లేంది ఇవాళ నువ్వింత పెందలాడే వచ్చి ప్రేమగా పలకరిస్తోందెందుకో తెలుసుకోవచ్చా?


ఇంట్లో గ్యాసు నిండుకుందిరా!  వంట సగంలో అగిపోయింది. నీ సిలిండరొక పూటకి దొర్లించుకుపోదామనీ! నీ సాయం వృధా పోదులేరా సోదరా ! డబుల్ సిలిండరుతో సహా రంభలాంటి భార్య ప్రాప్తిరస్తు' అని దీవిస్తాగా'


ఒక్కటి మాత్రం ఇప్పటిదాకా నువ్వు చెప్పిన గ్యాసు పాఠా న్నిబట్టి గట్టిగా ఒంటపట్టించుకున్నానన్నా! వంటగ్యాసు బండను  మాత్రం సాక్షాత్తు ఆ వాయుదేవుడే వచ్చి అడిగినా ఇవ్వకూడదని.  ఈ వంకతో వచ్చినప్పట్నుంచీ మా పార్టీని తెగ తిట్టిపోస్తున్నావుగా నువ్వు ఇంక నీకెలా ఇచ్చేది? !


అంతేనంటావా? అయితే దీవెన కాదు. విను ! ఉప్పుకల్లు ఒకప్పుడు తెల్లాడిని తరిమితరిమికొ ట్టింది. గ్యాసు బాధితులందరి తరఫున ఇదే నా శాపం .  ' ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే నీ సర్కారుకూ ' గ్యాస్ ట్రబుల్'తప్పదు 


రచన: కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 09-12- 2013 ) 

ఈ నాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక కలకాలం కరవే కరువు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - కరవు ఘోష పేరుతో - ప్రచురితం - 15 -08-2009)


 



ఈ నాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక


కలకాలం కరవే కరువు!  

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - కరవు ఘోష పేరుతో - ప్రచురితం - 15 -08-2009) 



'తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి'  అనిగదా పెద్దలు అనేది' ఈ కరవు రోజుల్లో గారెలెలాగూ తినేది లేదుగానీ.. ఆ భారతమన్నా చెప్పు బాబాయ్.. ఈ జెండా పండుగ రోజున వినాలనుంది!'


' ఏం భారతంరా ... కరవు భారతమా? ఇప్పుడు మనకొ చ్చిన కరవు అప్పుడు ద్వాపరయుగంలో గనక వచ్చిఉంటే?  ఆ వందమంది కౌరవులను ముప్పూటలా మేపలేక పాపం గాంధారమ్మ మొగుడిచేత హస్తినాపురాన్ని ఏ మార్వాడీ వాడికో కుదువ పెట్టించి ఉండేది. అయిదూళ్ళయినా ఇవ్వమని పాండవులు ప్రాధేయపడ్డారంటే నిజంగానే కరవుందేమోనని అనుమానంగా ఉందిరా అబ్బాయ్ ! లేకపోతే పుట్టిన పిల్లల్ని పుట్టినట్లు ఆ గంగమ్మ నీళ్ళలో ఎందుకు వదిలేసుకుంటుందిరా కుంతి  ? ' 


' పో బాబాయ్; నువ్వెప్పుడూ ఇలాగే విచిత్రంగా మాట్లాడతావ్! ఆ కాలంలో కరవు ఉండి ఉంటే నిండుసభలో ద్రౌపదమ్మకు బేళ్ళ కొద్దీ చీరెలు శ్రీకృష్ణపరమాత్ముడెలా సరఫరా చేశాడంటావ్?'


' అందుకేరా ఆయన్ని దేవుడన్నది. అలాంటి మాయలు తెలియవు కనకనే భీముడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు బండెడన్నం పప్పు, కూరలు రోజూ పంపిం చమన్నాడని బకాసురుణ్ని బండకేసి ఉతికాడు . కరవు రోజులొచ్చి మీదపడితే ఎంత లావు దానవీరశూర కర్ణుడైనా కవచ కుండలాల్లాంటివేవో అడిగితే ఠపీమని  పీకిచ్చే స్తాడుగానీ... కందిపప్పు ఓ పావు కిలో కావాలంటే దిక్కులు చూడాల్సిందే' 


' నువ్వు మరీ బాబాయ్! ఒక భారతమేంటి.. భాగవతంలో కూడా కరవు కాటకాలు తాండవించాయనేట్లున్నావ్ బాబోయ్!' 


  ' బాగా గుర్తు చేశావ్ రా అబ్బాయ్! ద్వాపరంలో మాత్రం ఈ కరవు కాట కాలకు కాపురాలు సరిగ్గా ఏడ్చి చచ్చాయా? చిటికెన వేలితో కొండనెత్తిన కృష్ణుడు తులాభారం నాటికి తులసాకంత బరువు కూడా తూగలేదంటే అర్ధమేమిటి? కరవు కాటకాలకు చిక్కి శల్యమైపోయాడనేగా ! అన్నీ ఉంటే ఆ కన్నయ్య అలా మన్ను ఎందుకు తింటాడురా! పాలు పెరుగులకోసం పొరుగు ఇళ్ళల్లో ఎందుకలా దూరతాడురా అబ్బాయ్? ' 


'బాబోయ్ నీ వరస చూస్తుంటే రామాయణానికి ఈ కరవు ఎసరు పెట్టేట్టున్నావే! ' 


'రామరాజ్యమనగానే కరవు కాటకాలనేవి అసలు రానేరావని నీ ఉద్దేశమా? నిజం నిష్ఠురంగా  ఉంటుందిగానీ, రాములవారు ఏకపత్నీ వ్రతమాచరించటానికి ముఖ్యకారణం ఈ దుర్భిక్షమే.  సీతాపహరణమనేది ఒక వంక గానీ, లంకమీద యుద్ధానికెళ్ళటానికి అక్కడ చక్కగా దొరికే ఉప్పూ, పప్పూ, బంగారమూ, బట్టలే అసలు కారణమంటే భక్తులు నొచ్చుకోవచ్చు. ఆ కాలంలో అడవులూ కరవు కోరల్లో చిక్కుకోబట్టే అప్పుడే పుట్టిన ఆంజనేయుడు కూడా ఆకలికి తట్టుకో లేక పోనీ సూర్యుణ్నయినా పండులాగా తిందామని పైకెగురుకుంటూ వెళ్ళాడు.' 


'ఇంక ఆపుతావా బాబాయ్ నీకు పుణ్యముంటుందీ!' 


'పాయింటొచ్చింది కనక చెబుతున్నాన్రా! ఆ హరిశ్చంద్రుడు నక్షత్రకుడి నస వదిలించుకోవడానికి ఆఖరికి అలిని కూడా అమ్మకానికి పెట్టాడుగానీ... అదే ఇప్పటి కరవు కాలంలో అయితే ఎవరు కొనేవారు చెప్పు?  సృష్టి ఆరంభంలో కనక అమృతంకోసం దేవదానవులు అలా కొట్టుకు చచ్చారు. ఈ కరవు కాలంలో అయితే అందరూ హాలాహలానికి ఎగబడి ఉండేవాళ్ళు పాడు జీవితాలతో విసిగి విసిగి ' 


'ఆ దానవుల్నంటే సరే, దేవతల్నీ వదలిపెట్టవా?' 


'ఈసారి నుంచి 'కరవు వీర', కరవు ధీర,'కరవుకాటక' బిరుదులిస్తున్నారు!' 


'విను' అందరి రాత రాసే విధాతకే కరవువాత పడక తప్పలేదురా బాబూ! నాలుగు నోళ్ళకు రెండు పూటలా ఆహారమంటే  మామూలు వ్యవహారమా! పొద్దస్తమానం పాలసముద్రంలో పడుంటే చింతామణికైనా చవిచెడి నాలిక్కింత చింతతొక్కు రాసుకుందామనిపించినా  కలికానికైనా ఆ లోకంలో దొరకని కరవుకాలం.  కనకనే అన్నేసి అవతారాల వంకతో భూమ్మీదికొచ్చి పోయాడేమో.. ? కలిమికి మొగుడైతే మాత్రం ఏం లాభం... కరవుకు ఆ దేవుడైనా దాసుడవాల్సిందేరా నాయనా! దేవుడి బతుక్కున్నా జీవుడి బతుకే నయం!"


'అదేంటి బాబాయ్... మరో వింత విషయం చెబుతున్నావ్ ! ' 


'మనకిలా ఏ కరవో కాటకమో వచ్చినప్పుడు వానలు పడాలనో, పంటలు పండాలనో దేవుళ్ళకు మొక్కుకుంటాం. దేవుళ్లకూ ఆ  కాటకాలొచ్చిపడితే పాపం ఎవరికి చెప్పుకొంటారు చెప్పు?' 


' పాయింటే బాబాయ్ ! ' 


' అంతే కాదు. మానవ  జన్మెత్తితే మరిన్ని లాభాలున్నాయిరా నాయనా! నిజాలే చెప్పాలన్న నియమం లేదు. పంట చేను పగులిచ్చి వానబొట్టుకు నోరెళ్ళబెట్టుకు చూస్తున్నా, వీధి బావి ఎండిపోయి, పాడిగేదె వట్టిపోయి, ముసలి తల్లి మందులేక మూలుగుతున్నా, పిల్ల గాడు ఫీజుకట్టక బడినుంచి చదువు మాని తిరిగి వచ్చినా , తాకట్టు కొట్టులో  ఉన్న పెళ్ళాం తాళి కలలో కనపడి ఎగతాళి చేస్తున్నట్లున్నా.. తట్టుకోలేక తెల్లారకుండానే ఓ అన్న దాత పురుగుమందు తాగి బతుకు తెల్లార్చుకున్నా - మందెక్కువై చచ్చాడేగానీ, కరవుతో  కాదని, అసలు కరవనేదే లేదు పొమ్మని బుకాయించవచ్చు.  ధరలు ఆకాశంలో వీరవిహారం చేస్తున్నాయి. ' దించండి మహాప్రభో ! ' అని వేడుకుంటే 'మంత్రాలకి చింతకాయలు రాల్తాయా! మా దగ్గరలాంటి మంత్రదండమే నిజంగా ఉండుంటే ప్రతిపక్షాలన్నింటినీ ఈ పాటికి హాంఫట్ మని మాయం చేసిఉండమా! ' అంటూ సాక్షాత్  ముఖ్యమంత్రి మాదిరి మాట విసిరి వినోదం చేయచ్చు.  జనం బియ్యం కొనలేక గంజి కాసుకుని తాగుతుంటే 'గంజి కాదది హోటల్  స్పెషల్ ‌ సూప్ ' అని సూపర్బుగా  కామెడీ చేసేయచ్చు . ఆ 'వ్యాట్' పన్నయినా పీకి పారెయ్యండి మహాప్రభో! ' అని మొత్తుకుంటే 'వ్హాట్ ' అంటూ గుడ్లురిమి చూసి ఆనక పకపకా నవ్వేయచ్చు.  పొరుగు రాష్ట్రాలకు బియ్యం తరలిపోకుండా ఆపగలిగితే ఈ ఆపద కొంతవరకైనా తగ్గుతుందేమో ఆలోచించండి సార్ ! ' అంటే ' అక్కడా ఇక్కడికన్నా ఘోరకలి ఉండబట్టే గదా... మన సరుకుల కోసం ఎగబడుతున్నది! మనది దేవుడి పాలనయ్యా!  పాపం జగన్ బాబు  ఆనందపడతాడని ఈసారికి వానదేవుడిని  నేనే కాస్త విశ్రాంతి తీసుకోమన్నా! జనం దాహం తీర్చటానికి బావి తవ్వుదామని ఉవ్విళ్లూరుతున్నా.  'సెజ్ కానిది గజం భూమి కూడా దొరక్క ఇబ్బందిగా ఉంది' అని కన్నీళ్ళు పెట్టుకోవచ్చు'


'ఇంకొద్దు బాబాయ్! నిజంగానే నాకూ కన్నీళ్ళొచ్చేటట్లున్నాయ్... ఆఖరుగా అడుగుతున్నా... రకరకాల కరవులున్నాయంటగా? తీవ్రమైన కరవు, సాధారణ కరవు, మూగ కరవు, ఏదేదో ఏకరువు పెట్టకుండా మనది ఏ రకం కరవో ఒక్కముక్కలో మాత్రం చెప్పు బాబాయ్! ' 


'మూగకరవురా అబ్బీ!  ఆగస్టులో నలభై డిగ్రీలు ఎండ కాస్తున్నా కరవు మండలాలు ప్రకటించకుండా మూగగా చూస్తూ కూర్చుందే ప్రభుత్వం... అందుకూ! ఈ ఆగస్టు పదిహేనుకున్నా సంకెళ్ళు తెంపుకొని స్వేచ్ఛగా చెలరేగి పోయే ధరవరలను అదుపుచేసి మళ్ళా మనకింకో స్వాతంత్ర్యం తేవాల్సిన విధి విధాతది కాదు.. దేవుడిపాలన అయిన మన ప్రభుత్వానిదే! 


'బాగా చెప్పావ్ బాబాయ్! తెల్లోడిని తరిమినవాడికి, తలచుకుంటే ఈ కరవును తరుమటం ఒక లెక్కా... పత్రమా!'



రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - కరవు ఘోష - పేరుతో 15 -08-2009-న ప్రచురితం) 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...