Monday, December 27, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక చెరసాలలు కావాలి రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 26- 07 - 2011 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక 


చెరసాలలు కావాలి 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 26- 07 - 2011 ) 



ట్రిపుల్ ఐటీలు ఐఐటీలకు  బదులుగా జైలు లాంటిది ఒకటి మనం అడిగి తెచ్చుకుని ఉంటే బాగుండేది.


అంతమంది ఎంపీలున్నా ముష్టి రెండు పెద్దరైళ్లు తెచ్చుకోవడానికి అన్ని అవస్థలు పడుతున్నాం. ఇంకా జైళ్ల లాంటి పెద్ద పథకాలు మనకు వస్తాయనేనా? అయినా ఇప్పుడీ  ఊచల  ఊసు అంత హఠాత్తుగా నీకు ఎందుకొచ్చినట్లబ్బా? !


వాన కురుస్తున్నప్పుడే కుంట నింపుకోవాలన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేశంలో పాపాలు, నేరాల శాతం పెట్రోలు ఉత్పత్తుల రేట్ల మాదిరి ఎట్లా ఊపందుకున్నాయో చూశావుగా ! దేశంలో ఏ మూల నేరం జరిగినా మూలాలు మన  రాష్ట్రంలోనే కదా బయట పడుతున్నాయి! కార్పొరేట్ రకం కొత్త నేరాలకూ మన యువనేతలే పాఠాలు చెబుతున్నప్పుడు- శిక్షాలయాలూ మన సమీపంలోనే ఉండటం న్యాయమా కాదా? కృష్ణాజలాల్లో వాటాలకోసం వృథాగా  అలా ఆరాటపడే బదులు శ్రీకృష్ణ జన్మస్థలాల స్థాపన కోసం లాబీయింగ్ చేస్తేనే లాభం ఏమంటావ్ ? 


'నిజమేరా... బాబా శివైక్యమైన తరువాత పుట్టపర్తి చూడు ఎట్లా బోసిపోయిందో!  ఆ కేరళవాళ్లకంటే ఏదో గుడి నేలమాళిగల్లో బంగారు కణికలు దొరుకుతుంటాయి. మన దగ్గరున్న నల్లబంగారాన్ని ఎవడికో తవ్వుకో మని తేరగా ధారపోసేస్తిమి. నువ్వన్నది నిజమే. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ తీహార్ జైలునో ఇక్కడ దాకా  తరలించుకు రావడమొక్కటే మనముందున్న ఏకైక మార్గం. 


కానీ మన దగ్గరిప్పుడు జైళ్లు కట్టుకునే పాటి ప్లాట్లెక్క డున్నాయిరా బాబురా?  అవీ సెజ్జులూ పోర్టులూ అంటూ  అప్పనంగా ఎప్పుడో ఎవరెవరికో అబ్బాయిగారి కోసమూ ధారాదత్తం చేసి పారేస్తిమి  గదరా గాడిదా! 


ఏ స్థలాలూ లేకపోతే మెట్రోరైళ్లు లాంటివెలా పుట్టుకొ స్తున్నాయ్ బాబాయ్ ? అన్నేసి ఎకరాలు పోసి ఆ భారీ బస్టాండులు కట్టిస్తే వచ్చేదేముంది- కిలో మీటరుకు ముష్టి రూపాయి నలభై పైసలు. అదే ఏ తీహార్ మోడలు చెరసాలో అత్యంత అధునాతనంగా కట్టించి పారేశామనుకో... బోలెడంత వ్యాపారం. పార్కింగ్ ఫీజుల దగ్గ ర్నుంచీ ఫుడ్ కోర్టులు, హోటళ్లూ, మాళ్లూ జైలుకొస్తున్న నేరగాళ్లు అల్లాటప్పా గోంగూరగాళ్లా? వాళ్లకూ  ఎంత మందీమార్బలం, బంధుబలగం! తమ నేతల  నిత్య సందర్శన కోసం వచ్చిపోతూంటారు. నేరాలకీ ఘోరాలకి కరవులేనంత కాలం చెరసాలల చుట్టూ చెలరేగిపోయే వ్యాపారాలను వ్యవహారాలను ఎంతలావు ఆర్థిక మాంద్యమూ ఏమీ చేయలేదు. తెలుసా!


ఒప్పుకొన్నానురా అబ్బాయ్! బయటకు కనిపించే వ్యాపారాలే కాదు, లోపాయికారీగా జరిగే రూపాయల వ్యవహారాలూ లెక్కలోకి తీసుకుంటే- కటకటాలు కట్టించడంకన్నా గొప్ప లాభసాటి పథకం మరొకటి లేదు. రింగు రోడ్లూ ఫ్లైఓవర్లూ అంటూ ఎప్పుడూ ఏవేవో వివాదాస్పద మైన పనులే ప్రభుత్వాలు ఎందుకు చేపడుతున్నట్లు?  చక్కగా ఏ సినిమా హాళ్లనో  జైళ్లుగా మారిస్తే సరిపోతుంది. గాలి ఆడని ఆ గోడౌన్ థియేటర్లను కారాగారాలుగా మారిస్తే ఎంత లావు మొండి నేరగాడైనా ఒక్క పూటలో నేరాంగీ కారం చేసి తీరాల్సిందే!


ఇందిరమ్మ ఇళ్లంటూ ఇన్ని లక్షల కోట్లు పెట్టి అరకొ రగా జైళ్లలోని సెల్లలంటి ఇల్లు కట్టడమే  గానీ, ఆ సొమ్ములో సగం తిని సగం సద్వినియోగం చేసినా జిల్లాకో తీహార్ జైలును తలదన్నే 'అత్తారిళ్లు' తయారై ఉండేవి ఈపాటికి....


సరే. ప్రస్తుతం జరగాల్సింది చెప్పరా బాబూ! బడిబాట లాగా ' మళ్ళీ జైలుకు'  అనే ఉద్యమం ప్రస్తుతం నడుస్తున్నట్లుంది... కల్మాడీతో మొదలైన వరస రాజా, కనిమొళిలో  అగేలా  లేదు. మారన్లు వెయిటింగ్, మరెందరు

బారులు తీరబోతున్నారో తెలీదు. చూస్తు న్నాంగా, ఎప్పుడూ దేశం నిండా ఏవో ఆందోళనలూ! 'ఓటుకు నోటు కేసు'  ఓటి నడు స్తోంది. జోరుగా గనుల తవ్వకాల్లో ఎంతమంది చెరసాల బాట పడతారో ఇప్పుడే చెప్పడమూ కష్టమే . ఏ కేసు అప్పజెప్పినా సీబీఐవాళ్లు శని ఆదివారాలు కూడా చూసుకో కుండా నిజాలను నిగ్గుతేల్చే పనిలో పడి ఉన్నారు. పేపరు లీకులు, నకిలీ ఔషధ ప్రయోగాలు, దేవుడి ఆర్జిత సేవ ల్లోనూ కుంభకోణాలు తవ్వి తీస్తున్నారు . అబ్బో..  ఇట్లా చెప్పుకొంటూపోతే రొప్పు రావాల్సిందేగానీ...


నిధులూ పథకాలూ పంచాల్సిన ప్రతినిధులు ఉన్నంత కాలం ఈ నేరాల చిట్టాకు చివరంటూ ఉండదని ఒక్కము క్కలో చెప్పేసెయ్  బాబాయ్- ఇన్ని తంటాలెండుగ్గానీ! 


అది సరేరా!  ఎవరైనా మాకు ప్రాజెక్టులు కావాలి.... విమానాశ్రయాలు కావాలి, పోర్టుల సంఖ్య పెంచాలి.. కళాశాలలు కావాలి... అని అడు గుతారు. ఇలా 420 మోసకారులను పెట్టే జైళ్లు కావాలని మరీ అంత బహిరంగంగా అడుగుతారంటావా? నామర్దా కదా?


ఏంటి బాబాయ్ ! చెరసాలలని మరీ అంత తేలిగ్గా తీసిపారేశావు. అవి శ్రీకృష్ణుని  జన్మస్థలాలు . రాముడికి గుడి కట్టించిన రామదాసుకు కూడా నీడనిచ్చిన గోల్కొండ బందీఖానాలు . జర్మనీలో గాలిపటాలు ఎగరేస్తేనే లోపలే వేసేస్తారు తెలుసా! కట్టుకున్న భార్య జుట్టు పీకాడని ఒక పెద్దమనిషిని రాత్రంతా బంధించిన చీకటి కొట్టు బాబాయ్ చెరసాలంటే ! నెహ్రూజీ తీరిగ్గా పుస్తకం రాసుకున్న విశ్రాంతి మందిరం. బ్యాంకు దొంగను ఓ. హెన్రీగా మార్చిన పుస్తకాలయం. జైళ్లు- ఒంటి కొవ్వు తగ్గించే వ్యాయమశాలలు... గ్రంథసాంగులు గ్రంథాలు రాసుకునే విశ్రాంతి మందిరాలు, వోల్టేర్ లాగా వేదాంతిగా మార్చే యోగాశ్ర మాలు కూడా బాబాయ్!


అర్ధమైందిరా బాబూ! బయట కొవ్వొత్తులు చూపిస్తూ ఓదార్పు యాత్రలు చేసే యువరాజులకు, ఆ కొవ్వొత్తులు తయారుచేసే విధానం కూడా నేర్పే శిక్షణాలయాలు అని కూడా కదూ నువ్వు చెప్పాలనుకుంటున్నావ్? మన నేరగా ళ్లను మనం కట్టుకున్న జైళ్లలోనే పెట్టుకుంటే మన పరువు దేశవ్యాప్తం కాకుండా  ఉంటుందని నువ్వెందుకంటు న్నావో తెలిసింది. 


ఎవరి గురించి అంటున్నావో... అది మాతం చెప్పకు బాబాయ్! ఆ చిప్పకూడు పెట్టే ' రెస్టా ' రెండుకు నువ్వే పోతావ్!  


-రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 26- 07 - 2011 ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...