Saturday, December 25, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం గంజినీళ్లే గతి - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 17-06-2010)


 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

గంజినీళ్లే గతి 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 17-06-2010) 


గిన్నీసు రికార్డు కాదు.. . ఇంట్లో గిన్నెలూ, చెంబులూ బద్దలైపోతు నాయే నీ దెబ్బకు 


నా దెబ్బ కాదయ్యా మగడా! .. ఇది ధరలదెబ్బ!  బోడి బీరకాయ కిలో యాభయ్యా?  బీన్స్ ఎనభై... బీటురూటు ముప్ఫై.. బెండ ముప్పైరెండు... దొండ....


అబ్బ..ఆపు నీ ధరల దండకం...! 


లేకపోతే ఎందయ్యా? నువ్వేమో ఏడనో కోడిని కొట్టుకొచ్చి పలావు చేయమని కూర్చున్నావు పీకల మీద.  పుంజునంటే నువ్వు కొట్టుకొచ్చావు గానీ... పులావు లోకి కావాల్సినవి నేనే కొట్టునుంచి కొట్టుకురావాలి? 


కొట్టుకురావడమేంటే... కొత్తగా మాట్లాడుతున్నావ్? నెల మొదట్లోనే జీతం మొత్తం కుడుముల్లాగా నీ చేతిల్లోనే  పోశాను గదే! ఆ మొత్తం మార్నింగుషోలకే మటాషా?


ఆ తమాషా ఒక్కటే తక్కువ నా బతుక్కి! నా బతుకే టీవీ సీరియల్ అయిపోయింది. పులావు కావాలంటే ఏమేం కావాలో తెలుసా?


ఆ మాత్రం తెలీక పోవటానికి నేనేమన్నా సివిల్ ఎగ్జామినేషన్ రాసే విద్యార్థినా? నూనె... పసుపు.... కారం... ఉప్పు... కొబ్బరి... మసాలా దినుసులు. టమాటాలో బీన్సో ఆలు గడ్డలో పడితే ఆ మజాయే వేరు!


వంటనూనె బొట్టు ఎట్టా మండిపోతా ఉందో తెలుసా? మామా... పండక్కి గడపలకి పసుపు రాయటమట్లా ఉంచు... మెళ్ళో పుస్తెల తాడుకింత పులుముకుందామన్నా చిటికెడంతైనా కొనలేక చేతులు ముడుచుకూర్చున్నా. నువ్విప్పుడొచ్చి కోడిపులావు చేయమని మారాం చేస్తా ఉన్నావు! 


పసుపు లేకపోతే మానె... పోనీ- ఉప్పు కార మన్నా పోసి వండి పెట్టవే! 


సడిపాయె! ఉప్పు సంగతే చెప్పు... కల్లు, సారా అంటే ఏరులై పారతా  ఉందిగానీ... కల్లుప్పు తాగే బోరునీళ్ళలో తప్ప కలికానిక్కూడా దొరకటం లేదయ్యామగడా! రాతి ఉప్పు అయినా కిలో పాతిక పెడితే తప్ప రావటంలేదు. పులావుకు సరిపడా కొనాలంటే ఏ మధుకోడాకో కొడుకో, కూతురో అయిపుట్టాల


మరీ నీకు ఎటకారాలెక్కువైపోయాయ్! పోనీ

వట్టి కారమన్నా వేసి చేసి పెట్టవే... నాలిక జిహ్వ చచ్చిపోయుంది


కారం కారం అని పదిమార్లు అట్లా ఊరికే పలవరించమాకయ్యా! నా కళ్ళంట నీళ్ళొస్తున్నాయి. కొట్లో కారం పొట్లాల రేట్లెట్లా ఉన్నాయో తెలిస్తే నువ్విట్లా పులావు జపం చేయవు. కూరగాయ లెట్లాగూ కొనే స్తోమతు లేదు... కొరివికారమన్నా వేసుకుతిందామంటే... అది కొనటానికి మళ్ళా మనమేదో బ్యాంకు లోనుకు పోవాల


అపూ! వింటావున్నాను గదా అని... ఊరికే దంచేస్తున్నావు ఊకదంపుడు ఉపన్యాసం! పులావు ఎట్లా చెయ్యలో.... అందులో ఏమేం వెయ్యలో.... ఆ సోదంతా నాకెందుకు! కట్టుకున్న దానివి... అడిగింది ఠక్కుమని చేసి పెట్టడం పతివ్రతాధర్మం. ముందు పొయ్యి వెలిగించు!


ఏం పెట్టి వెలిగించాలయ్యా పొయ్యి ? గ్యాసు అయిపొయ్యి పదిరోజులపైనే అయిపోయింది. ఫోనులో పలకడు. పోయినా ఉలకడు ఆ గ్యాసుబండ బండమనిషి.  రేపో ఎల్లుండో... రేట్లు పెంచుతారంటగా.... అప్పటిదాకా నోస్టాక్ అంట!


ఆహాఁ... గ్యాసు లేకపోతే పొయ్యే వెలగదా! కట్టెపేళ్ళతో కుస్తీపట్టిన రోజులు అప్పుడే మర్చిపోతే ఎట్లా సుకుమారీ! గ్యాసు మాటలు కట్టి పెట్టేసి  ముందా  పులావు పనిచూస్తావా... లేదా? 


సరీ... పొయిలోకి నా కాళ్ళో చేతులో పెట్టి వండి పెడతాగానీ... ముందు నువు పులావు దినుసుల సంగతి చూడు మామా! నిజం చెబితే నీకేదో..  నువ్వంటే పడని పత్రికల్లో రాసిన కతల్లాగుంటాది గానీ... ఇదిగో సంచీ! నువ్వే బజారు దాకా పోయి  నాలుగు రకాల కూరగా యలు కొనుక్కురా! ఒక్క కోడిపులావేం ఖర్మ... గరమాగరమ్ కోడిపులుసు... కోడివేపుడు, గారెలు కూడా చేసి పెట్టడానికి నేను రడీ!


ఎట్లాగైనా నువ్వు మాటల్లో మన సర్కారు వాళ్ళని మించిపోయావే! నీ కబుర్లతోనే కడుపు నింపేస్తావు... తెల్లారిపోయినట్లుంది.... అదిగో అప్పుడే కోడికూత! 


అది కోడికూతేగానీ... కోడి కూసింది కాదు. మామా! మనచిన్నాడిని గోడవతల కూకుని అట్లా కూస్తుండమని నేనే అన్నా. నువ్వు కోడిపులావో అని కలవరిస్తా వుండావాయ పాపం! ఇదిగో ఆ కోడికూతలు వింటూ ఈ జావ తాగతా వుండు. కోడిపులావేం ఖర్మ... పెద్ద వొటేల్లో చికెన్ బిర్యాని తిన్నదానికన్నా మజాగా ఉంటాది... ' పాపం, నిజం కోడిని వదిలేయ్ మామా! మన సర్కారు పున్నెమా అని దాన్నైనా నాలుగు దినాలు హాయిగా బతకనీరాదా!'


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 17-06-2010) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...