Friday, December 24, 2021

ఈనాడు హాస్యం - వ్యంగ్యం - గల్పిక బండ పడుద్ది కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 09-12- 2013 )


 



ఈనాడు హాస్యం - వ్యంగ్యం - గల్పిక


బండ పడుద్ది


కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 09-12- 2013 ) 


' ఓరి .. నీ బండపడ '  అని మన పెద్దాళ్లు ఊరికే అన్నారా? తథాస్తు దేవతలున్నార్రా! జనాల నెత్తిన మళ్ళీ బండ ఎలా పడిందో చూడు' 


గ్యాస్ బుండ గురించే అన్నా  నీ ఆవేదన? బండమీద ఇంకో అరవై ఆరున్నర. స్వాతంత్య్రం వచ్చి అరవై ఆరేళ్లు దాటాయి. దానికి గుర్తుగా ధరను జాతికి అంకితం చేస్తే చమురు కంపెనీల దేశభక్తినిలా శంకించడం బావోలేదన్నా!


ఏడుపొక్కటే తక్కువరా!  పొయ్యిమీదనే  మండుతోందను కుంటే... పొయ్యి కిందా  ఇలా మంట పెట్టిస్తుంటే కడుపు మండిపోతుందిరా!  ఇక్కడు వట్టి గ్యాసు గ్యాసని  మనం నేతల కూతలనేదో ఛీ కొడతాంగాని- ఆ గ్యాసు సిలిండర్లకు పట్టి బజార్లో పెడితే ఎంత డిమాండూ!


వానచుక్క సామెతని సరిపెట్టుకోరాదా అన్నా! మురిక్కాలవలో పడితే మురుగు, ముత్యం చిప్పులో పడితే ముత్యం.  ముత్యానికి మరి డిమాండు ఉండకుండా ఉంటుందా?  నీకు తెలవడా అన్నా!


మా బాగుందిరా అబ్బీ నీ కపిత్వం! కిలో బంగారం, కిలో వంటగ్యాసు తూచి ఏదో ఒకటే కోరుకొమ్మంటే, నీ ఓటెటోగాని నేను మాత్రం గ్యాస్ తీసేసుకుంటారా   బాబూ!  అలా ఉంది ఇంట్లో పరిస్థితి. ఎందుకురా ఆ నవ్వూ!


ముక్కోటి దేవతలొకవైపు అమ్మ ఒకవైపు రెండిం టిలో ఏది కావాలంటే.. అమ్మవైపే తూగేను నేను- అని వెనకటికి ఒక గొప్ప కవి మా గొప్పగా చెప్పారులే. ' అమ్మ కూడా వద్దు బదులుగా ఓ గ్యాసు బండ ఇవ్వు'  అని అడిగేట్లున్నావ్ నువ్వు!  అందుకొచ్చింది నవ్వు.  మరేమనుకోమాకన్నా!


నవ్వులాటగానే ఉంటుందిరా అబ్బీ నీకు నా బతుకు.  పెళ్ళీ పెటాకులూ అయితే బయటపడుతుంది తమరి సరుకు .  అన్నట్లు నువ్వేదో పెళ్ళిచూపులకు వెళ్తున్నావటగా?  పిల్లకు ఏ పీజీ డిగ్రీనో ఉందని సంబరపడిపోకు. ఎల్పీజీ గ్యాస్ కనక్షను లాంటిదేదో ఉందో లేదో ముందు చూసుకో! కాపురం కూడా గ్యాసు లేనిదే ముందుకు కదలదు. గుర్తుంచుకో!  కాఫీలోకి పంచదార తక్కువైతే ఏ పక్కింటి పంచ ముందో నిలబడి ఓ కప్పు అప్పు అడుక్కోవచ్చు. అదే గ్యాసుగాని అయిపోయిందనుకో .. అయిపోయిందే నీ పని. ' ఎక్క డైనా బావగాని- గ్యాసుబండ దగ్గర కాదు' అన్న సామెత పుట్టుకొచ్చింది విను!  ఒకే బాణం, ఒకే భార్య లాగా ఒకే కనెక్షను .. ఒకే  బుకింగు' అన్న కొత్త సూత్రం తెచ్చింది ఈ గ్యాడు తిప్పలు. 


ఆవుమీద వ్యాసంలోలా  ఈ గ్యాసుమీదనేనీ నీ ధ్యాసంతా?.   వ్యాసమేదన్నా రాస్తున్నావా అన్నా?! 


మ' సంసారి బాధలు నీకేం తెలుస్తాయిరా సన్నాసీ?  బైటికె ళ్చిన ఆడపిల్ల క్షేమంగా ఇంటికొచ్చిందాకా ఎంత ఆందోళ నో... దానికి పదింతలు.. బుక్ చేసిన సిలిండరు సవ్యంగా మన ఇల్లు చేరిందాకా!  ఆడపిల్లవాళ్ళు సమర్పించుకునే కట్నాలనుంచి  కొంత గిల్లి మళ్ళీ పిల్లకు నగానట్రా చేయిం చినట్లు మనం ముందుగా చదివించుకోవాలను తిరుగు కట్నంలా సబ్సిడీ మొత్తాన్నిప్పుడో బ్యాంకు ఖాతాలో జమ వేస్తారట!  బికార్లం... బాటా, బిర్లాల మాదిరి బ్యాంకుల

చుట్టూ షికార్లు కొట్టడం.. . ఆదో విచిత్రం! నిరాధారుడికి గ్యాసుబండ బహుదూరం.  జీవనాధారం కోసమే అల్లాడాలా . . ఆధార్ కార్డులకోసమే పోరాడాలా? పోలీసోడి దెబ్బలకన్నా మహా కముకుగా ఉంటున్నాయబ్బీ  'గ్యాసు ' దెబ్బలు! 


పో అన్నా... నువ్వు మరీ చెబుతావు.  అంతర్జాతీయ మార్కెట్టంటూ ఒహటుంటుందని, దానికి అనుసంధానమైన పాపానికి ధరలెప్పుడూ కిందికి దిగిరానేరామని అంట్లు తోముకునే అప్పులమ్మక్కూడా అవగాహనస్థాయి పెంచింది. వంట గ్యాసు లాంటిదాన్ని నువ్వు ఇలా తక్కువ చేయటమా?! 


వేళకు ఇంటాయన కొంప చేరకపోయినా ఏమంత అందోళన పడటంలేదు ఈ కాలం ఇల్లాళ్లు.  అదే బుక్ చేసిన గ్యాసుబండ సవ్యంగా ఇంటికి చేరకపోతే, మంచమెకేస్తు న్నారురా వాళ్ళు!  మా పిన్నమ్మగారమ్మాయిని కొత్త కాపురానికి పంపిస్తూ సారెలో ముందుగా పెట్టిందేంటో తెలుసా  గ్యాసు సిలిండరు ! కట్నకానుకలకన్నా కరాఖండీగా  కండేషను పెట్టారట మగపెళ్ళివాళ్ళు.  పిల్లను చూచానికని వచ్చినప్పుడు ముందుగా అమ్మాయికేమున్నా లేకున్నా  ప్రత్యే కంగా కనెక్షనుంటేనే సంబంధం ఖాయం చేసుకుంటున్నారు.  అలాంటి గ్యాసుని తక్కువచేసి మాట్లాట్టం కుదురుతుందా?


పిచ్చిపిచ్చి ఊహలొచ్చేస్తున్నాయి. మరీ ఈమధ్య ఈ గ్యాసుబండ ధర పెరిగినప్పట్నుంచీ ! తులాభారం సీనులో ఒక సిబ్బెలో ఎన్టీఆర్లా శ్రీకృష్ణుడంట..  మరో సిబ్బెలో తూకానికి సత్యభామాదేవి వంటింటి గ్యాస్ సిలిండరంట! ఇంకో సీనులో కుచేలుడిచ్చిన అటుకులు బొక్కి పరంధాముడిచ్చిన అష్టఐశ్వర్యాల్లో గ్యాసు సిలిండరు కూడా కనిపించింది. పచ్చి పండ్లు, పిచ్చి కాయలే దొరికాయా శ్రీరాముడంతటివాడికి నైవేద్యంగా పెట్టడానికి అని లక్ష్మణస్వామి నోరుచేసుకుంటే పండరీబాయి  ఫేమ్ భక్త శబరి ఏమని మొత్తుకుందో తెలుసా? ' క్షమించు లక్ష్మణా! సమయానికి గ్యాసు నిండుకొంది, బుక్ చేసిన బండ ఇంకా డెలివరీ కాలేదు' అని. 


అయ్యబాబోయ్.. ఇంక ఆపుతావా అన్నా.. గ్యాసు మాటలు ఇంతకూ ఎప్పుడూ లేంది ఇవాళ నువ్వింత పెందలాడే వచ్చి ప్రేమగా పలకరిస్తోందెందుకో తెలుసుకోవచ్చా?


ఇంట్లో గ్యాసు నిండుకుందిరా!  వంట సగంలో అగిపోయింది. నీ సిలిండరొక పూటకి దొర్లించుకుపోదామనీ! నీ సాయం వృధా పోదులేరా సోదరా ! డబుల్ సిలిండరుతో సహా రంభలాంటి భార్య ప్రాప్తిరస్తు' అని దీవిస్తాగా'


ఒక్కటి మాత్రం ఇప్పటిదాకా నువ్వు చెప్పిన గ్యాసు పాఠా న్నిబట్టి గట్టిగా ఒంటపట్టించుకున్నానన్నా! వంటగ్యాసు బండను  మాత్రం సాక్షాత్తు ఆ వాయుదేవుడే వచ్చి అడిగినా ఇవ్వకూడదని.  ఈ వంకతో వచ్చినప్పట్నుంచీ మా పార్టీని తెగ తిట్టిపోస్తున్నావుగా నువ్వు ఇంక నీకెలా ఇచ్చేది? !


అంతేనంటావా? అయితే దీవెన కాదు. విను ! ఉప్పుకల్లు ఒకప్పుడు తెల్లాడిని తరిమితరిమికొ ట్టింది. గ్యాసు బాధితులందరి తరఫున ఇదే నా శాపం .  ' ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే నీ సర్కారుకూ ' గ్యాస్ ట్రబుల్'తప్పదు 


రచన: కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 09-12- 2013 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...