Sunday, December 26, 2021

ఈనాడు - గల్లిక- వ్యంగ్యం - హాస్యం అలుగుటయే ఎరుంగని ... రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 23 -12-2010 )


 



ఈనాడు - గల్లిక- వ్యంగ్యం - హాస్యం 


అలుగుటయే ఎరుంగని ... 

రచన - కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23 -12-2010 ) 


సర్కారు గజగజ వణుకుతోంది.

రాష్ట్రానికి రక్తపోటు పెరిగిపోతోంది. చలిగాలికన్నా మిన్నగా ప్రతిపక్షాల దీక్షలకు బలవన్మరణాల పాలవుతున్నారు. రైతు శ్రేయస్సు  గురించి నేతలమధ్య మాటల యుద్ధంముందు- కోడిపందాలు బలాదూర్. ఇప్పుడు ఎవరి దృష్టి రాహుల్ మీదనో , రాడియామీదనో  లేదు. వికీలీక్సు, నూటపాతికేళ్ళ కాంగ్రెసు ప్లీనరీ, టూజీ రాజా స్పెక్ట్రమ్ లీలలు, సచిన్ శతకాలు, చైనా జియాబావో- రష్యా మెద్వెదేవ్ పర్యటనలు, పెరిగిన పెట్రోలు రేట్లు, ఉల్లిగడ్డ ధరలు, కరిష్మా కపూర్ కొత్తస్నేహాలు- ఏవీ జనాలకు ఇప్పుడు పట్టడం లేదు. ఏ నోటవిన్నా... ఏ ఛానెల్లో కన్నా రైతుప్యాకేజీ గురించే చర్చంతా!


దేవుడు నిజంగా మూడొంతులు దయామయుడు. భూమండలంమీద నేల ఒక వంతు ఉంటేనే సాగుచేసే రైతు బతుకు ఇంత దుర్భ రంగా ఉంది. మిగిలిన నాలుగొంతులూ భూమి ఉండి ఉంటే?  బాబోయ్... తలచు కుంటేనే గుండెలు దడదడలాడిపోతున్నాయి! 


పాండవులు అయిదు ఊళ్లతోనే ఎందుకు సర్దుకుందామనుకున్నారో ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది . విష్ణుమూర్తి పాలమీదా, విశ్వేశ్వ రుడు వెండికొండమీదా, విధాత తామరతూళ్ళలో ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చిందో బోధపడుతోంది. దేవుడంటే సాగు బాధ తప్పించుకున్నాడుగానీ- మనిషికి ఆరుగాలం స్వేదయాగం తప్పదు కదా! 


అన్నం పర బ్రహ్మ స్వరూపమైనప్పుడు ఆ బ్రహ్మరూపాన్ని సృష్టించే అన్నదాత, ప్రాణదాత మాదిరి పూజనీయుడే కదా! ఆ ప్రాణదాతే ప్రాణాలు తీసుకునేదాకా పరిస్థితులు దిగ జారటానికి ఎవరు కారణం? 


ప్రకృతి అంటే సరే. రాజకీయాలూ రైతన్నతో పేకాటాడు కుంటామంటే ఎలా? రైతుకన్నా  మద్యం కంపెనీలే సర్కా రుకు ఎక్కువా? దొరల సారా బట్టీలకు దొరికినంత సులువుగా ఎరువులకు పురుగు మందులకు అనుమతులు దొరకటంలేదు. పిట్ట రెట్టేస్తే టప్మని కూలే వంతెనలు కడుతున్న గుత్తేదారులకు దక్కుతున్న నిధుల్లో పదోవంతు దుక్కి దున్నే బక్క రైతుకు దక్కడం లేదు. వేలంపాటలో ఆటగాళ్లను పాడుకోవడానికి కుహనా కంపెనీలకు అత్యంత ఉదారంగా కోట్లు గుమ్మరించే బ్యాంకులు- బక్కరైతుకు ఒక్క పదివేలు అప్పుగా ఇవ్వమంటే సవాలక్ష ఆంక్షలు పెడతాయి! చెడిపో యిన స్టేడియాల మరమ్మతులకు ధారపోసే నిధుల్లో పైసా వంతు బీడుపడిన పంట పొలాలకు ఇవ్వమంటే- రాష్ట్రం కేంద్రంవైపు, కేంద్రం రాష్ట్రంవైపూ వేలు చూపిస్తుంటాయి. 


కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము/ బిల బిలా పక్షులు  తినిపోయె అలలు పెసలు/ బొడ్డుపల్లెను గొడ్డేరి మోసిపోతినెట్లు చెల్లింతు టంకము లేదు మార్గం'  అంటూ ఆనాడు శ్రీనాథుడు ఏ అమరపురికరిగాడో... అదే దారి పడుతున్నాడు అనాథ అవుతున్న ఇప్పటి అన్నదాత కూడా! 


అప్పిచ్చువాడు, ఎప్పుడూ ఎడతెగక పారు ఏరు లేని ఊరులో ఉండవద్దని బద్దెనామాత్యుడు ఎప్పుడో పద మూడో శతాబ్దంలోనే హితమ . ఆ లెక్కన మన రైతన్నలు అచ్చంగా ఏ అమెరికా పంచనో తలదాచుకో వాలి. కాకపోతే క్యూబా పోయి సాగు చేసుకోవాలి. కనీసం పొరుగు రాష్ట్రాలకైనా తరలిపోవాలి. లక్షలు కొట్టుకుపోతుంటే- వంద చేతిలో పెట్టి అదే పదివేలు పరిహారం అనుకోమనే పాలకుల పరిహాసాన్ని ఏ రైతన్నయినా ఎంతకాలమని సహించగలడు ?


గుర్తింపు కార్డులు, సమయానికి సరిపడా బ్యాంకు అప్పులు, కల్తీలేని విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, పురుగు మందులు, పనిచేసే మోటార్లు, చౌక విద్యుత్తు, వానలు లేకపోతే సమయానికి కరవు మండలాల ప్రకటనలు, వరదలు ముంచకముందే ముందు జాగ్రత్తలు, పంటలు మునిగితే వెంటనే సహేతుకమైన నష్టపరిహారాలు, సబబైన మద్దతు ధర, సరసమైన పంటల బీమా, మంచి ధరకు సరకు అమ్ముకునే ఏర్పాట్లు, గోదాములు, సర్వేలు, నివేదికలు, పర్యవేక్షణలు, సమగ్రమైన శాస్త్రీయ సాగు విధానాలు... అన్నీ పేరుకు పేపర్లలో పేర్చుకుంటూపోతే చేలో ధాన్యం చేతికొస్తుందా? ఎంత ఘనమైన అంకెనైనా సున్నాతో గుణిస్తే వచ్చే ఫలితం శూన్యమే. చిత్తశుద్ధిలేని పాలకుల పథకాలన్నీ కలిపినా సున్నాను మించి విలువ చేయటంలేదు. అదే- నేటి విషాదం.


రైతును ఊరికే రాజనో, దేశానికి వెన్నెముకనో ఊదరగొడితే చాలదు. వెన్నులో ఇంత సున్నమన్నా మిగిలి ఉంటేగదా తాను నిలబడి నలుగురికి ఇంత అన్నం నోటికి అందించేది. వంద తప్పులవరకు నిబ్బరంగా ఉండ టానికి భూపాలుడు ఏమన్నా గోపాలుడా! పోతనామాత్యుడే ఈ కాలంలో ఉండి ఉంటే, మనకు భాగవతం దక్కి ఉండేదే కాదు. ఎంత రామభద్రుడు వచ్చి పలికించుదామను కున్నా- పొలంపనే చూసుకోవాలా, కలుపు మొక్కలే ఏరుకోవాలా, ఎరువులకని, విత్తనాల దుకాణాల ముందు పడిగా పులు పడిఉండాలా, అప్పుకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుండాలా! ఇన్ని తిప్పలుపడి గుప్పెడు గింజలు పండించినా ఏ వానకు తడిసో, వరదలో కొట్టు కుపోతేనో ముందు ఇల్లు గడవడమెలాగో తెలియక తల్ల డిల్లుతూ కూర్చుంటాడు. చదువుల తల్లి కన్నీరు. ఇంకేమి తుడుస్తాడు?


అందుకే చెప్పేది... అలుగుటయే ఎరుంగని... మహామహితాత్ముడు అలిగిననాడు ఏమవుతుందోనని పర మాత్ముడు చెప్పిన దానికన్నా సాగు చేసుకునేవాడు అలిగితే అంతకన్నా ఎక్కువే అనర్థాలు జరిగిపోతాయి! 'సర్వే జనా సుఖినోభవంతు' అనే ఆశీర్వాదం నిజమవాలంటే ముందు 'అన్నదాత సుఖీభవ' అనే దీవెన ఫలించాలి. 231124 


రచన - కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23 -12-2010 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...