ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక
దొంగ నాటకం
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు- ప్రచురితం - 07-02 2014
దొరలే దొంగలు, దొంగలే దొరబాబులు. కాలజ్ఞాని బ్రహ్మంగారైనా ఊహించి ఉండరేమో ఈ విడ్డూరం!
వేమనదంతా వెర్రి వాదం. బంగారం కావాలంటే ఆకువసర్లు నూరాలా? ఏ బంగారు దుకాణం వెనక ద్వారాన్నో, గుట్టుచప్పుడు కాకుండా తెరవగలిగితే బోలెడంత బంగారం!
బిల్ గేట్స్, లక్ష్మీ మిట్టలు లాంటి లక్ష్మీపుత్రులదంతా వట్టి చాదస్తం. కోట్లు, లక్షలు కూడబెట్టడానికి ప్లాన్లు, ప్రాజెక్టులంటూ పెద్ద పెద్ద బిల్డప్పులు అవసరమా? రెండు రోజులు చాలు. మూడు రౌండ్లు రెక్కీ నిర్వహిం చేస్తే- బస్తాలనిండా బంగారమే బంగారం!
'నిజాయతీ' అని తెగ గింజుకుంటున్నాడు ఈ మధ్య ఓ పెద్దమనిషి. ధర్మంగా సంపాదిస్తే ఎన్ని తిప్పలో ఈ తిక్కదేశంలో తెలీదా? అనంతపద్మనాడికైనా ఆదాయం పన్ను శాఖలతో ఎంత సతాయింపు? దేశాభివృద్ధికోసం ముందస్తు పన్నులు కాస్తంత ఎక్కువ కట్టినా లెక్కలడిగి బొక్కలో తోసేస్తున్నారే!
లక్షలు పోసి కొనుక్కున్న ఉద్యోగం కాబట్టి, ఆ నష్టం కాస్తంత పూడ్చుకోవాలనుకోవడం నేరమా? గుండె చిక్కబట్టుకుని బల్లకింద నుంచి ఇంతేదో గిల్లుకుందామన్నా లోక్ పాల్ బిల్లనీ, అవినీతి నిరోధక చట్టమని, చట్టుబండలని ఎన్నెన్ని గుదిబండలు మెడల చుట్టూ!
గాలినైనా వేలంపాటలకు పెట్టుకుని నాలుగు రాళ్ళు నిబ్బరంగా దాచుకునే సదుపాయం సర్కారు పెద్దలకే కరువైపాయే! ఇనుము. ఇసుక, బొగ్గు, ఎర్రచందనం పేరిట ఎన్నెన్నో యాతనలు పడి. కోట్లు కూడబెట్టినా ఏం లాభం? ఏ ఖజానా పెద్దకో హఠాత్తుగా దేశసేవ చేయాలన్న దుర్బుద్ధి పుడితే చాలు, ఆ పొట్టే పెద్ద నోట్లన్నీ రద్దు! బోఫోర్సు క్యాష్ లాగా విదేశీ బ్యాంకుల బోషాణాల్లో మూసిపెట్టుకోవడానికి అందరికీ ఇటాలియన్ సంబంధాలు కుదరద్దూ?
ఎన్నికలు అత్యంత ఖరీదైనవి. వందకోట్లు రేషను కార్డుల సంఖ్యకన్నా రెట్టింపు ఓటరు కార్డులు ఉన్న నియోజకవర్గాల్లో నిలబడి ఎదుటి పక్షంలో తలబడాలంటే తలకు వెయ్యేసుకున్నా ఎన్ని కోట్ల రూపాయలు తగలే యాలి! రోజురోజుకూ చిక్కిపోయే రూపాయిని నమ్ముకునే కన్నా, బంగారం కణికెల్ని వీలైనన్ని దారుల్లో సేకరించి దాచుకోవడం తెలివితక్కువ పనేం కాదుగా ! అయినా, దొంగతనం, దొంగతనం అంటూ దుర్మార్గంగా అభాండాలువేయడం ఎంతవరకు సమంజసం ?
చతుష్షష్టి కళల్లో చోరకళ ఒకటి. తంజావూరు తాళ పత్ర గ్రంథాలయంలో కెళ్లి వెదికితే, ఎన్ని బొత్తుల పొత్తాలు బయటపడతాయో! ఇరుగు పొరుగు ఇళ్ళలో దూరి, పాలు పెరుగులు మింగిన బాలకృష్ణుణ్ని ఇలాగే వేధించి ఉంటే రాజకీయాల్లో మనకు మార్గదర్శకత్వమంటూ మిగిలుండేదా ? దొంగ లెవ్వరినీ రాజకీయాల్లోకి రావద్దంటే ఎలా?
ఆమ్ ఆద్మీ ప్రభ అన్ని రంగాలా వెలగాలనేగా అందరి మూలుగులు దోచుకుని, దాచుకుని... దొరబాబుల్లాగా ఊరేగే సౌకర్యం! రెండు మూడు వర్గాలకే పరిమితం చేయడం ఎంత దుర్మార్గం! పనివాళ్ల పేరున గనులు రాసిచ్చే ఉదార హృదయులు అందరికీ దొరుకుతారా? ఉప్పు, పప్పు ధరలు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. పట్టపగలు ఏటీఎంలలో చొరబడి దౌర్జన్యంగా ఎంత దోచుకుంటే మాత్రం చెడ్డపేరే గాని, చారెడు నూకలన్నా దొరుకుతున్నాయా?
బంగారుతల్లులు, ఇందిరమ్మ సంచులు అంటూ హంగామాలు చేస్తే మిగిలేది భంగపాటే! బంగారు తండ్రులు, ఏ రాహుల్ గోతాలో పథకాలుగా ప్రవేశ పెట్టి బీదా బిక్కి చేతికి ఓ సుత్తి, దొంగతాళాల గుత్తీ ఇచ్చేస్తే- దారిద్య్ర రేఖ నుంచి మధ్య తరగతికేం ఖర్మ. ఏకంగా ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో కెక్కే భారతావనినే ఆవిష్కరించవచ్చు గదా!
తన పని తాను చేసుకుపోవడానికి చట్టాలు ఎలాగూ మనకు దిట్టంగానే ఉన్నాయి. ఒకవేళ జైలుకు పంపినా, కొన్నాళ్లు సకల మర్యాదలు చేసి, చిలకమార్కు నేర పరిశోధనతో బయట పడేయవచ్చు. రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష పెడితే ఏమొస్తుంది? ఆమ్ ఆద్మీకి ఇలా ఏదో ఉపాధి హామీ పథకాలు ప్రవేశపెడితే ఓటు బ్యాంకు బలపడటానికి పనికొస్తుంది. 'ఆహార భద్రతకన్నా ఇలాంటి స్వేచ్ఛావిహార
భద్రతే ఎన్నికల్లో కలిసొచ్చే ఆకర్షణీయ పథకం. పోలీసు ఉద్యోగాలకు పరుగు పందాలు పెట్టి అభాసుపాలయ్యే కన్నా, 'జేబులు కొట్టే దొంగవెధవల' పోస్టులు సృష్టించి ఉద్యోగ హోదా కల్పిస్తే విరాళాల సేకరణలో పెద్ద తలకాయలకు దాసోహ మనే బాధా తప్పుతుంది కదా! పరుగు పందాల్లో గెలిచి పోస్టులు కొట్టేసిన పోలీసులు మాత్రం ఏం పొడుస్తున్నారట? సూరి హంతకుడి వ్యవహారం చూడలా? ఏటీఎంలో చారల చొక్కా ఆగంతకుడి ఆచూకీ తీయగలిగారా? బంగారం దుకాణం దొంగలిద్దరూ జాలిపడి దొరబాబుల్లాగా వచ్చి లొంగిన తరవాతగదా పత్రికా సమావేశాలు పెట్టింది.. బీరాలు పలికింది!
దొంగ జాలిపడితేనే పోలీసులకు కేసులు క్లోజయ్యేది. కీచకులు పాలుమాలితేనే మహిళల భద్రత కాస్త పెరిగేది. ప్రైవేటు బస్సులు పోనీలే... పాపమని నెమ్మదిస్తేనే ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం సంభవమయేది . సర్కారు ఉద్యోగులు చెయ్యి నొప్ఫెట్టి రెక్కలు ముడుచుకుంటేనే ముడుపులు ముప్పు జనాలకు తప్పేది. పంతుళ్లు, వైద్యులు వస్తాయించకుంటేనే సర్కారు చదువులు, వైద్యాలు సక్రమంగా సాగేది. కబ్జా దారులు దర్జా ఒలకబోయని నేలమీదే చెట్టయినా గుట్ట యినా చివరిదాకా మిగిలేది. ప్రజాస్వామ్యమని పెద్ద ఘరానాగా మనం ప్రకటించుకుంటున్నాం గానీ, దొంగ ఓటర్ల దయాదాక్షిణ్యాలమీదనే సుమా ఈ మహా సౌధం నిలబడి ఉన్నది...
'దొంగ వెధవ' తిట్టు కానేకాదు. వెయ్యి కిలోల బంగారం అనే ధనంతో రాజకీయాల్లోకి వచ్చి వర్ధిల్లు' అనే దీవెన.
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు- ప్రచురితం - 07-02 2014 )
No comments:
Post a Comment