ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక
కుర్చీల ముచ్చట్లు
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 06 - 05 - 2019 )
ఎన్నికల ప్రచార సభాప్రాంగణం.
ఖాళీ కుర్చీలు .
ఖాళీగా కూర్చోలేక కబుర్లలో పడ్డాయి.
ఈ హస్తం పార్టీ మీటింగులంటే ఇందుకే నాకు హాయి. వేది కమీద హడావుడేగానీ కింద గ్రంథాలయాని కన్నా నిశ్శబ్దంగా ఉంటుంది.
నిజమేనన్నా. నిన్న ఆ పసుపుపచ్చ రంగు పార్టీ వాళ్ళ మీటింగులకు వెళ్లొచ్చిన కుర్చీల గోడు వినాలి. ఎక్కడెక్కడి జనాలో పుట్టపగిలిన్నట్లు వచ్చి పడ్డారుట . ఒక్కోసారి ఇద్దరేసి శాల్తీలను కూడా మోయాల్సిన చ్చిందని . . ఒళ్ళు హూనమైపోయిందని ఒహటే మూలుగు . పగవాడిక్కూడా వద్దన్నా ఈ పాడు కుర్చీల బతుకు ' అందులోనూ ఈ దేశంలో ఎన్నికల సమయంలో అసలు వద్దు.
నాలుగు రోజులు పనికే నువ్వింత బేజారవడం ఏం బావోలేదప్పా! ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఇప్పుడీ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలప్పుడు కుర్చీలుగా పుట్టాం!
ఇంకో కుర్చీ అందుకుంది 'ఆ మాటా నిజ మేనన్నా! ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే కుర్చీలాటేగా! మనకోసం నెహ్రూ-గాంధీ కుటుంబంవారు ఎంతగా వెంపర్లాడుతుం టారు. ఆ తెల్లగడ్డం గుజరాతీ పెద్దాయన ఎన్ని నెలలబట్టి ఎండనక వాననకా ఊళ్ళెంబడి పడి తిరుగుతున్నాడూ! గిన్నీసు బుక్కు లోక్కూడా ఎక్కేట్లున్నాడు. అంతా కిస్సా కుర్చీ కా' అను బావుంటుంది.
ఎట్లాగైనా మనల్ని దక్కించుకునితీరాలని బుద్ధిమంతులుగా పేరుగడించుకున్న పెద్ద పెద్దోళ్లూ బుద్ధిహీనంగా నోళ్లు పదును పెడు తున్నారు.
మన మీద మోజు అలాంటిది. అందుకే నలిపి నామం పెట్టని పరమ పిసినారి నేతలూ ' అవి ఇవి ఇస్తాం. . ఊరికే ఇస్తాం. . ఊరి మొత్తానికి చేయిస్తాం ' అంటూ జనాల కళ్ల ముందు నోట్లాడిస్తూ ఊరిస్తున్నారు. అందుకే మనమూ ఓ రకంగా ప్రజాసేవలో భాగస్వాములవుతున్నట్లు లెక్క. ఆనందపడి పొండి!
మరో కుర్చీఅంతుకుంది .
'ఇదేం ప్రజాసేవ' పెద్ద కుర్చీ ఎక్కడానికి చేసే టక్కుటమారాలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడే ఇలాంటి ఉదారత ప్రదర్శించి ఉంటే అలాంటి ప్రజాసేవ చేయించిన ఫలం మనకూ దక్కేది. అదీ అసలైన గొప్పతనం!
ఇప్పుడు మాత్రం మన గొప్పతనానికి తరుగేమిట్రా? ఏళ్లు మీదపడ్డా పెళ్ళి మీద మనసుపోని బుల్లోడికి మనమీదే మోజు. ఏళ్ల కిందట పెళ్ళాడి తాళికట్టిన ఆమె పేరును ఈమధ్యే వెల్లడించిన పెద్దాయనకూ మనమీదే వలపు.
కుర్చీ మీద కూర్చుని తృప్తి పడి పశువులకు వేసే గడ్డి తిన్న పాపానికి జైలుకు పోతూ కూడా మనల్ని ముద్దుగా ముద్దుల భార్యకు అప్పగించి పోలేదూ లాలూ ప్రసాదు!
జైలంటే గుర్తుకొచ్చింది. నాయన పోయాడన్న దుఃఖమన్నా లేకుండా మనల్నే ఎంతగా తలచుకున్నాడు జగను! ఇప్పటికే మనల్ని మరచిపోలేక ఎన్ని ఆపపోసాలు పడుతున్నాడో చూశావా!
అదే నేననేది. కాటికి కాలు చాపుకొన్న ముసిలోడి నుంచి, కళ్లు ఇంకా పూర్తిగా తెరవని బుడ్డోడి దాకా ఆడామగా అన్న తేడా లేకుండా అందరికీ మనమీదే కన్ను. రాజకీయాలనుంచి సన్యాసం తీసుకున్నా , సన్యాసంలోనే ఉండీ రాజకీయాలు చేస్తున్నా , సిని మాల్లో చేరి గొప్ప పేరుగడిస్తున్నా , రాజకీయాల్లో దూరి సినిమాలు చూపిస్తున్నా. అందరూ చెప్పులు, చీపుళ్ళు, మిర్చీలు, ఫ్యాన్లు పట్టుకుని రొప్పుతూ తిరిగేస్తున్నారంటే అదంతా మన కుర్చీలమీదుండే అంతు లేని ప్రేమతోనే. జనాలకు ఈ మాత్రమైనా మనం మేలు చేస్తున్నామంటే అదంతా ఆ భగవంతుడు ఈ ఆషాఢభూతులకు అధికారంపై దాహం మోహం ప్రసాదించబట్టే .
బాగుంది నీ మెట్ట వేదాంతం! అందలం ఎక్కిన తరువాత అంది వచ్చినదంతా అబగా కబళించుకుపోవాలన్న దుర్బుద్ధితో కదూ వీరంతా వేషాలు వేస్తోందిప్పుడు. మళ్ళా కుర్చీ ఎక్కిస్తే ఈ జగన్నాటకాన్ని మరో అయిదేళ్లపాటు నిరాటంకంగా ఆడుకోవచ్చని కదూ తేరగా సొమ్ము వెదజల్లుతోంది! జనం నుంచి దోచిన లక్షకోట్లలో నుంచి ముష్టి రూపాయి విదిల్చి అదేదో పెద్ద ప్రజాసేవ చేస్తున్నట్లు పోజొకటి!
రాజకీయ నాయకుల సభలు చూసీచూసీ మీరూ గడుసుతనం మహబాగా ఒంట పట్టించు కున్నారన్నా!
నాయకుల మాటల్లోని మర్మం మనకేమైనా కొత్తా! టికెట్ దక్కలేదన్న అక్కసుతో పార్టీ కార్యాలయం నుంచి మనల్ని బయటకు లాగి కెమెరాల సాక్షిగా కుళ్ళబొడిచిన సంగతి ఎలా మరవ గలం? అందుకే, అధికారానికే కాదు... అసమ్మతికి నేనే ప్రతీకనని గర్వపడతా. నిన్నూ గర్వపడమంటున్నా!
ఛీ.. పో అని ఈసడించినా, చెప్పులు విసిరి కొట్టినా దులపరించుకుని చిరునవ్వులు చిందించడానికి నేనేమన్నా నిన్న మొన్నటిదాకా కుర్చీకి అతుక్కుని కూర్చున్న రాజకీయనేతనా? వట్టి కుర్చీని ! మన విలువ ఏమిటో తెలిస్తే నువ్విలా మాట్లాడతావా?
తెలుసులేరా బాబూ మన ప్రభ! దశరథుడంతటి మహాప్రభువు రామచంద్రుణ్ని మనమీద కూర్చోబెట్టాలని తహతహలాడిపోయాడు. కన్నబిడ్డకే ఆ భాగ్యం దక్కాలని కైకేయమ్మ అంతులేకుండా పరితపించింది. చివరికే మైంది? అన్నదమ్ములిద్దరికీ దక్కలేదు. మన సాంగత్యం అన్న కాళ్లకింద నుంచి తమ్ముడి తలమీదకు ఎగబాకి మనమీద పద్నాలుగేళ్లు కొలువు తీరలేదా పాదుకలు? దీన్నిబట్టి నీకు పాదుకలు, పెద్దమనుషులు కాదు ముఖ్యం. సింహాసనం ఎక్కినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రధానం. మనల్ని ఎలాగైనా సాధించుకోవాలని సప్త సముద్రాలను క్షీరసాగరాలుగా మారుస్త మని వాగ్దానాలు గుప్పిస్తారు పెద్దమనుషులు. జనం నమ్మి అందలం ఎక్కిస్తారు. సుపరి పాలన హామీ గాలికొదిలేస్తారు. గాలిని, భూమిని, నీటిని కూడా దోచేస్తారు. ఫలితం..
ఇదిగో... ఇలా మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు సభల్లో ఓటర్లకు కాకుండా... వట్టి ఖాళీ కుర్చీలకు రాసుకొచ్చిన ప్రసంగం వినిపించాల్సి రావడం
ఆపక్కన ఎన్నికల కోడ్ ఒకటి నడుస్తోంది. ఎక్కువ తక్కువలైతే అదో కేసవుతుంది. ఈ నెలరోజులు ఎన్నెన్ని రాజకీయ సభలు చూళ్లేదు. ఖాళీ కుర్చీలం... మనకు అర్ధమైనంతైనా మన ఓటర్లు అర్ధ మనకుండా ఉంటుందా?
నిజమేరా, ఈపాటికే ఒక మంచి నిర్ణయం తీసేసుకుని ఉంటారు. మళ్ళీ ఎన్నికల దాకా పశ్చాత్తాప పడకుండా మంచి సమర్ధుణ్ణ్ని, చిత్తశుద్ధిగల నేతను మాత్రమే ఎన్నుకుంటారని ఆశిద్దాం'
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 06 - 05 - 2019 )
No comments:
Post a Comment