Wednesday, July 15, 2015

గోదావరి పుష్కరాలు- పుష్కర ఘాటు అనుభవాలు- పరామర్శ



జీవితం సంక్లిష్టమైపోయి సమస్యల పరిష్కారానికి భక్తిమార్గం వినా మరో దారి లేదనే నిస్సహాయదశకు జనసామాన్యం క్రమంగా చేరువవుతున్న సంధిదశలో నిన్న మంగళవారంనాటి గోదావరీ పుష్కరాల ఘాతుకం సంభవించింది.
ఒక ఉత్పాతం వచ్చిపడి దిగ్బ్రాంతి కలిగించే దారుణం చేసిపోయిన పిదప సహజంగానే అన్ని వైపులనుంచి విమర్శలు, విసుర్లు, సమీక్షలు, ఆత్మవిమర్శలు.. వెల్లువెత్తుతాయి. వాటిని ఆపడంవల్లో, అడ్డగించేందుకు చేసే ఎదురుదాడివల్లో జరిగే ప్రయోజనం శూన్యం.
పోయిన ప్రాణాలు ఎటూ తిరిగిరావు. జరిగిన నష్టం పూర్తిగా భర్తీ కాదు. అలాగని ఒక చర్చంటూ కూడాలేని పక్షంలో ప్రజాస్వామ్యవ్యవస్థ సార్థకత ఏమిటి? విమర్శంటే మరిన్ని తప్పించగల తప్పిదాలు పునరావృతమవకుండా తీసుకొనే ముందస్తు చర్య.
జరిగిన  ఘోరంలో ఎవరి పాపం ఎంత? ఎవరి పాలు ఎంత?
గిట్టని మనిషిని దునుమాడే అవకాశం వస్తే సరి! అది జననష్టం, ప్రాణనష్ణం జరిగిన సందర్భమైనా సరే.. కసిదీరా నాలుగురాళ్ళు వేసి మానసికానందం పొందే  పిల్లచేష్టలు కొందరివి.  జరిగిన ప్ర్రమాదంలో ప్రభుత్వ సలహాదారుకీ పెద్ద  పాత్రే ఉందని  ఇంకా విచారణైనా మొదలవక ముందే ఒక మాజీ ఎం.పి  విమర్శ! దురదృష్ట ఘటనలు సంభవించినప్పుడు శవరాజకీయాలు, శైశవ రాజకీయాలు చెలరేగడం సహజమే. ప్రభుత్వపక్షం పొరపాట్లు ప్రతిపక్షాలకు  వరాలు. ముక్కూమొగం తెలీని వ్యక్తికి నిష్కారణంగా కష్ణంకలిగితేనే సున్నితమనస్కులకు కన్నీళ్ళు రాకుండా ఉండవు. ఆ కన్నీరు ప్రభుత్వపక్షం పెద్దవి అయినంత మాత్రాన మొసలికన్నీరు అయిపోతుందా? నిజాయితీగా ప్రజలను క్షమాపణలు కోరితే నీచరాజకీయానికి నాటకంలా అనిపిస్తుంది కాబోలు ! అందుకే వాటిని శవ, శైశవ రాజకీయాలన్నది.
పుష్కరఘాటులో ఓ ముప్పై ప్రాణాలు పోయినందుకే ఐదుకోట్లమంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకొన్న నేత రాజీనామా చేయాల్సివస్తే.. అధికార దుర్వినియోగాన్ని, దురన్యాయాన్ని బహిరంగంగా ప్రశ్నించిన  ప్రజావాదులెందరో ప్రాణాలు పోగొట్టుకొన్న సందర్భంలో మాజీ మహానేతలు ఎన్ని వందలసార్లు రాజీనామాలు చేసి ఉండాల్సిందో! జనసామాన్యం ఒక ప్రమాదంలో పడిన  వెంటనే బాధ్యత గలిగిన రాజకీయపక్షాలైతే  ముందుగా ఆందోళన చెందవలసింది ప్రజాక్షేమం గురించి.  గిట్టని ప్రభుత్వంమీద  కక్షెలా తీర్చుకోవాలన్న దుష్ట ప్రణాళికలను రచించడం గురించి కాదు.
ప్రమాదం వేడి క్రమంగా చల్లబడి భావోద్వేగాలు సద్దుమణిగిన పిదప జనం ఎటూ ఎవరి పొరపాటు ఏమిటన్నది  నిగ్గు తేలుస్తారు. అవకాశం వచ్చినప్పుడు తగు గుణపాఠమూ నేర్పుతారు.  ప్రతీ ప్రజాహిత కార్యక్రమంలోనూ పలువంకలు పెట్టుకొంటూ ప్రగతిపథంలో ముళ్లడొంకలుగా మారే పక్షాలను  ఎలా ఏరిపారేయాలో  ఈ దేశప్రజలకు బాగా తెలుసు.
కానీ జనసామాన్యం అమాయకత్వం మాత్రం సామాన్యమైనదా!
తరగతిలో మొదటి ర్యాంకుకు ఏమాత్రం తగ్గినా బతకడం వ్యర్థంగా భావిస్తున్న బిడ్డల్ని పెంచుతున్న అజ్ఞానమీ జనానిది, పుష్కర ప్రథమఘడియల్లోనే మూడుమునకలు వేయకపోతే  పుణ్యం రాదా? పన్నెండు రోజులు పుష్కరాలు.  వందలాది స్నానఘట్టాలు. ఎక్కడికక్కడ ఎన్నో కోట్లు వెచ్చించి ఆధునిక పద్దతుల్లో ఏర్పాటు చేసారు. సమీపంలోని అనువైన ఘాటుకు అనుకూలమైన సమయంలో వెళ్ళి మునిగితే సాధించే పుణ్యంలో లోటు వస్తుందా! అన్ని లక్షలమంది వచ్చిపడి  ఒకేసారి ఒక చిన్నస్నానఘట్టంలో  మునిగి తరించాలంటే ఎంత ఇబ్బంది? ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకొన్నా ఎక్కడో ఒక చిన్న అంచనాలోపంతో అంతా తలకిందులయే పరిస్థితి, పొరుగువ్యక్తి మంచిచెడ్డలను పట్టించుకోకుండా ముసలీ ముతకా, పిల్లా మేకాతో సహా ఇంత పెద్ద సంబరానికి తరలి వచ్చేస్తే సంభవించే పరిణామాలను ఎంత ముందుచూపున్న యత్రాంగామైనా తట్టుకోగలదా?  ప్రభుత్వాన్ని, అధికారులను సమర్థించడం కాదుగాని..  అన్నింటికీ అధికారులనే.. పాపం .. పాపాల భైరవులను చేయడం  ఎంతవరకు సమంజసం? ఆలోచించుకోవాలి! ఆత్మవిమర్శ చేసుకోవాలి!  జనవాహిని క్రమశిక్షణా రాహిత్యమూ ఈ ఉపద్రవానికి కొంత కారణమే!
స్వామీజీల పాత్రా ఏమంత తక్కువ? ముక్తిమార్గంకోసం దరిచేరేవారిని ప్రతికూల పరిస్థితుల్లో సైతం అనుకూల దృక్పథానికి మళ్ళించవలసిన ఆధ్యాత్మిక గురువులు.. వ్యాపారులమధ్య జరిగే అవాంచనీయ స్పర్థలమాదిరి .. ఎవరి శిబిరాలతో వారే తమ ఉనికిని సార్థకం చేసుకొనే ప్రణాళికల్లో సామాన్యజనానికి నూరిపోస్తున్నది చాలావరకు అజ్ఞానం, అహేతుకమైన అంధవిశ్వాసం. మహాపుష్కరాలని ఒక కొత్త పేరు సృష్టించి గోదావరీ నదీమాతకు 144 సంవత్సరాల అనంతరం వచ్చే అరుదైన పుష్కరంగా ఊదరగొట్టడం ఎంతవరకు ఉచితం? జీవితకాలంలో ఒకేసారి వచ్చే  పుష్కరాలన్న గత్తరభావనతో పుణ్యస్నానఫలాన్ని సాధ్యమైనంత  వేగంగా  రాబట్టుకొనేందుకు కట్టలు తెంచుకొంది..  పుష్కరఘాటుల్లో చేదు అనుభవాన్ని చవిచుసింది భక్తజనవాహిని! ఏ స్నానఘట్టంలో వళ్ళు తడుపుకొన్నా సంపాదించే పుణ్యం సమానంగానే ఉంటుందన్న వాదన .. అనర్థం అంతా జరిగిపోయిన పిదప ఇప్పుడు కొత్తగా తెరమీదకు వచ్చిందిగానీ.. ఆ ధర్మసూక్ష్మమే ముందునుంచీ ప్రబోధించివుంటే ఇంత ప్రజాసంక్షోభం నివారించుండేవారు కదా ఆధ్యాత్మిక గురువులు!
ఎక్కడెక్కడి సాధుపుంగవులనో వెదికి పట్టుకొని వచ్చి మరీ
చానళ్లలో పీఠాలేసి కూర్చోబెట్టి అస్తిత్వంకోసమో.. పక్క ఛానెళ్లమీద ఆధిక్యం కోసమో టీవీ చానళ్ళు చాలాకాలంబట్టి సాగించిన అప్రజా  ప్రాయోజిత కార్యక్రమాల ఫలితంకూడా ఇప్పుడు ఈ పుష్కఘాటులో జరుగిన ఘాతుకానికి ఓ కారణమే!
ప్రతీ పనికి టెలీకాన్ఫెరన్సులనీ, ముందస్తు ప్రణాళికలని.. మీటింగులమీద మీటీంగులు పెట్టి ఊదరగొట్టే ముఖమంత్రిగారి పనివిధానంలో తరచూ పొరపాట్లు దొర్లుతుంటే.. మునుపటి 'ప్రచార వ్యామోహం' అనే నింద మళ్ళీ రాజకీయ జీవితానికి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది.

పుష్కరాలవంటి ఆధ్యాత్మిక సంబరాలకి సహజంగానే జనాకర్షణ జాస్తి. కొద్ది ప్రచారంతోనే భారీ దిగ్విజయం నమోదు చేసుకోగల సదవకాశం  ఆధ్యాత్మిక సంబరాల్లో ఇమిడి ఉంటుంది. సువర్ణావకాశం చేతికి అందివచ్చినా అత్యాశ.. తనపేరు పదికాలాల పాటు ప్రజల మనసుల్లో నిలబడాలన్న ఆకాంక్ష.. చంద్రబాబుచేత పొరపాట్లు తరుచుగా చేయిస్తోంది. 'ముందస్తు జాగ్రత్తలు తీసుకొన్నాం' అన్నారుగాని.. పొంచి ఉన్న  ప్రమాదాలని ముందస్తుగా నివారించే మానసిక సంసిద్ధత, ప్రణాళిక  అధికార యంత్రాంగంలో కొరవడిందన్నది స్పష్టం. జరిగిన సంఘటనలకు ముందుగా అధికార యంత్రాంగాన్నే అందరూ తప్పు పడుతున్నారంటే.. అది తప్పుపట్టేవారి తప్పుకూడా కాదు.

రాష్ట్రం విడిపోయి రాజధానికూడా స్థిరంగాలేని నేపథ్యంలో ఏమి ఆశించి  చంద్రబాబు  ఇంతటి భారీ వ్యయప్రయాసలతో కూడుకొన్న అనుద్పాదిత ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నెత్తికెత్తుకొన్నట్లు? ఉత్పాదిత కార్యక్రమాలదిశగా పాలనాయత్రాంగం శక్తిసామర్థ్యాలను  మళ్ళించి నవ్యాధ్ర పునర్నిర్మాణయజ్ఞాన్నినిబద్ధతతో నిర్వహిస్తారన్న ఆశతోనే గదా అశేషాంధ్రులు చంద్రబాబుకు పట్టంగట్టింది! ఆ పనులు పలుచనయేరీతిలో  పుష్కరాలవంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి నిధులు మళ్లి, మళ్ళీ వాటిలోసైతం లోపాలు పునరావృతమయితే ముందుగా  నష్టపోయేది చంద్రబాబు.. ఆయన  పార్టీ. ఆనక అసలే కష్టకాలంలో ఉన్న రాష్ట్రం.
కన్నీళ్ళు నిజమే కావచ్చు. కానీ కాచుకొన్న అవకాశ రాజకీయాలు దెబ్బతీయక మానవు. సంతోషంగా నిర్వహించి సగర్వంగా చెప్పుకుందామనుకొన్న మహాపుష్కరాల సంరంభమంతా  మొదటి రోజే మొదటి ఘడియల్లోనే సంతాప సందేశాలు అందుకొనే దురదృష్ట సందర్భంగా  మారింది. న్యాయవిచారణ సంఘం ఎటూ వేస్తారు.
పోయిన ప్రాణాలను ఎటూ తిరిగి రావు. జరిగిన నష్టం ఎలాగూ పూర్తిగా భర్తీ కాదు.  గతంలో జరిగిన ఇలాంటి ప్రమాదాలమీద చేపట్టిన విఛారణ సంఘాల నివేదికలు శ్రద్ధగా ఆకళించుకొని , చిత్తశుద్ధితో ఆచరణలో పెట్టివుంటే అధికారులు, పోలీసులు, ముఖ్యంత్రి.. మిగతా బాధ్యులు ఇప్పుడు ముఖాలు వేలాడదీసుకొని సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిన దుస్థితినుంచి తప్పించుకొని ఉండేవారు.
ఒక్క ప్రభుత్వమే కాదు, ప్రజలు, సమాచార మాధ్యమాలు, ఆధ్యాత్మిక గురువులు.. అంతా మరోసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం.. అవకాశం ఈ సారి వచ్చిన గోదావరి మహాపుష్కరాలు.
***


'

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...