Thursday, July 23, 2015

మనసు మా ఊరి ఇంటిముంగిట వాలిపోతుంది- బెజ్జ రమాదేవి పూల ముచ్చట



మల్లెపూలు ముక్కుపుటాలకు తగలగానే మనసు ఇరవై ఐదేళ్ల వెనక్కి మళ్ళింది. ఇదీ అని చెప్పలేని ఓ మధురస్మృతి.  బాల్యం కళ్ళముందు కొచ్చి నిలబడింది.
మా ఇంటిముంగిట్లో మల్లెపందిరి, జాజిపందిరి పక్కపక్కనే ఉండేవి.  ఆ పందిరికింద నల్లరాయిమీద కూర్చుని అమ్మ వండిన గోరుచిక్కుడుకాయకూర అన్నంలో కలుపుకు తింటోంటే.. కొద్దిగా మసకబారిన సందమామల్లాంటి మల్లెపూలు ఆ అన్నంపళ్లెంలో రాలుతోంటే.. అవి ఏరుకోవడం ఓ ముచ్చట! ఆ ముచ్చట్లలో సదిగాడు పేడకళ్లెల్లో కాలేసి జర్రున జారిపడ్డ సంగతులన్నీ గుర్తుకొచ్చి కిలకిలా నవులొస్తయ్యి. ఆ నవ్వులకు గొంతు పట్టుకుంటే నీళ్ళు తాగుతూ అన్నాలు  తినేవాళ్ళం ప్రమీల(ప్రేమల?),  ప్రభ, నేనూ.
ఆదివారంనాడు అదో సంబరం మాకు.
మా మల్లెపందిరి అంటే నాకే కాదు.. సీతాకోకచిలుకలకు, తుమ్మెదలకు, గొంగళి పురుగులకు, బక్కతొండలకు, ఆవులమందలకూ చాలా ఇష్టమే. బడికెళ్ళి రాగానే పలకలు, సంచి అరుగుమీద పారేసి పందిట్లో చిన్న పీటేసుకుని  చెయ్యెత్తి దగ్గరగా  కనపించే మల్లెమొగ్గల్ని అందుకొని తెంపేవాళ్లం. మాకు పోగా మిగిలినవి పేపరుపొట్లాల్లో చుట్టి తెలిసిన దోస్తులకి ఇస్తుండేది మా అమ్మ.
ఆదివారం వస్తే చాలు.. మల్లె, జాజి పందిర్లమీదనుంచి పచ్చటి ఆకుతేళ్ళు, గొంగళిపురుగులు ఏరిపారేయడం,  చెత్తా చెదారం ఎత్తి పోయడం.. ఇదీ మా పని. ముదిరిన ఆకులు గిల్లిపోయాలి. చెట్లకు నీళ్ళు పోసేందుకు వంతులు వేసుకునే వాళ్ళం ఇంట్లో వాళ్లందరం. ఏడు గోళాల ఉప్పునీళ్ళ బావి మాది. చాదబొక్కెనకు కొబ్బరితాడు. ఎంత చేదినా పైకి వచ్చేదికాదు బక్కెటు. చేదక్కట్టిన కొబ్బరినార  ఒరిపిడికి చేతులు ఎర్రగా కందిపోయేవి.
పెద్దాళ్లు బైటికొచ్చి చూసి పెద్దబొక్కెట విప్పి చిన్నబొక్కెట కట్టేవాళ్ళు. చిన్న బక్కెటతో ఎంతసేపు చేదినా కుండ నిండేదికాదు. నేను చేది పొయ్యడం.. ఇద్దరు చెల్లెళ్ళు చెరోవేవు పట్టుకుని చెట్లకు నీళ్ళు పొయ్యడం. అలుగ్గోళెంలో నీళ్ళు పోసేవాళ్లం. ఆగకుండా ఉరకడం మూలాన ఏ పలుగు రాయో తగిలి కుండ వదిలేస్తే అది కాస్తా పదహారు వక్కలయ్యేది. వాకిలినిండా నీళ్ళ మడుగు.
'బంగారమంటి కాగు ముక్కలాయె' అంటూ మా అమ్మ నాలిక మడతబెట్టి కొట్టేటందుకు ఉరికొస్తుంటే మేం దొరుకుతామా? సందుల్లో బడి, బజార్లో బడి రామేశ్వరమ్మిట్ట నేనూ.. సువర్ణమిట్ట ప్రమీల, ప్రేమలత తాఉకొనేవాళ్ళం.  ఇదంతా మల్లెచెట్టుకు నీళ్ళు పోసేటందుకు  వచ్చిన తిప్పలు!
ఇక పూల సంగతులు! మా అప్పచెల్లెళ్ళు ముగ్గ్గురికి మూడుపాళ్ళు,  మా అమ్మకో పాలు. ఎవరి పూలు వాళ్ళం మాలకట్టుకుని తెల్లటి తడిగుడ్డలో బెట్టి వాకిట్లో తీగెకు తగిలించేవాళ్లం. తెల్లారేసరికి  మొగ్గలు విచ్చి కమ్మటి మల్లెల వాసన మరోలోకానికి మోసుకుపోయేది.
ఇప్పటికీ ఎండాకాలం వచ్చి మల్లెల వాసన ముక్కుకి తగిలిందంటే మా ఇల్లు గుర్తుకొస్తుంది. మా పల్లె పందిరి గుర్తుకొస్తుంది. అందమైన ఆ గోధూళి సాయంత్రం గుర్తుకొస్తుంది. నా దోస్తులు బుజ్జి, పుశ్మి(పుష్పలత) గుర్తుకొస్తారు. అందమైన మా అమ్మ, ఆమె నవ్వు, నవ్వితే తళుక్కున మెరిసే ఆమె ముక్కుపుల్ల గుర్తుకొస్తాయి. ఆ అరుగుమీద ఆడుకున్న గచ్చకాయలు గుర్తుకొస్తాయి.
ఒక మల్లెవాసనతో ఇన్ని గుర్తుకొచ్చి.. మా ఊరు గుర్తుకొచ్చి గుండె చిత్తడి చిత్తడి అయిపోతుంది. మల్లె మొగ్గలు చూస్తే చాలు.. గతించిన ఆ స్మృతులు మదిలో మెదిలి ప్రాణం అతలాకుతలమై పోతుంది.
యాంత్రికమైన బతుకులు.. ప్రకృతిని వికృతిగా మార్చే సంస్కృతి.. ఆత్మీయపరిమళాలు ఉండవు ఆ కాగితంపూలలాంటి జీవితాలకి. అద్దాల బతుకులు. అబద్ధాల జీవితాలు. వీటన్నిటి మధ్యా మల్లెపూలను చూస్తే మనసు ఊరట చెందుతుంది. ఆత్మీయుల్లా తోచే ఆ పువ్వుల నవ్వుల్తో  మళ్లా బతుకులకు జీవకళ వచ్చినట్లుంటుంది.
నేను ఎండాకాలం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటాను. మల్లెల సాంగత్యంలో మూడునెలలు మూడుగడియల్లా దొర్లిపోతాయి. పిల్లి నీచు వాసన పసిగట్టినట్లు.. ఎక్కణ్నుంచి మల్లెలవాసన ముక్కుపుటాలకి తగిలినా..  కళ్లు మూతలుపడతాయి. మనసు మా ఊరి ఇంటిముంగిట  వాలిపోతుంది.
ఎన్ని తెంపినా కొన్నింటిని ఇంకా తనలో దాచుకున్న మా మల్లెపందిరి గుర్తుకొస్తోంది.
తెల్లారగానే మబ్బుల్లో చుక్కల్లా కిలకిలా నవ్వే తెల్లటిమల్లెలు. గాలికి గర్వంగా తలలూపే మల్లెతీగ.. 'ఫోవే..భడవాయీ! నా పూలు నాకూ ఉన్నాయి!' అన్నటు అనిపిస్తుంది. నిండుపూలతో గాలికి ఊగే మల్లెపందిరి అందమైన  నిండుముత్తైదువంత కళగా ఉంటుంది. ఎంత వెతికి వెతికి తెంపినా .. మామూలే! తీగలమధ్య మబ్బుల్లో  చుక్కల్లా దోబూచులాడుతూ అక్కడక్కడా తళుక్కున మెరిసి.. నన్ను వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తుంటాయి. ఆ  పూల వేళాకోళమంటే నాకు ప్రాణం.
-బొజ్జ రమాదేవి


నా మాటః
'ఎండాకాలం యాదిల' మల్లెతల్లీ నీకు జోహార్లు! బతుకమ్మ ఆర్టికల్
'మురికికాల్వల మురికివాసనను మూడునెలలు మీ సువాసనలతో ప్రక్షాళనచేసే మల్లెమొగ్గలూ! మీకు కోటికోటి నమస్సులు!' అంటూ~బొజ్జ రమాదేవిగారు (వ్యాసకర్త హిందీ లెక్చరర్, హన్మకొండ, వరంగల్ జిల్లా) రాసిన ఒక చక్కని స్మతిగల్పికను కందుకూరి రమేష్ బాబుగారి ఫేస్ బుక్ అప్-టు-డేట్సులో చూడటం జరిగింది. మల్లెపూలంటే సహజంగానే ఆసక్తి కదా ఎవరికైనా!  ఆసాంతం చదివాను ఒకే ఊపులో.. అనడంకంటే చదివించింది అనడం సముచితం.  మల్లెల సువాసనలు    గుబాళించాయి రచనలో. రచయిత్రిగారిని అభినందించకుండా ఉండలేం. మంచి రచనవైపుకు మన దృష్టిని మళ్ళించిన రమేష్ బాబుగారినీ అభినందించాల్సిందే.
ఈ గల్పిక తెలంగాణా యాసలో రాసినదికొన్ని ప్రయోగాలు మూలతెలుగునాట అర్థమవవేమోనని నా అనుమానం.  అందుకే నాకున్న కొద్ది పరిజ్ఞానంతో  నా తృప్తికోసం దీనిని  శిష్ట భాషలోకి తిరిగిరాసింది. ఈ  ప్రయత్నం దోషరహితమన్న భ్రమ నాకు లేదు. తప్పులుంటే సరిదిద్దుకొనేందుకు సిద్ధం. మంచి అంశాన్ని మరింతమందికి పంచాలని తప్ప ఈ ప్రయత్నం వెనక మరే ఉద్దేశమూ ఊహించవద్దని మనవి.
కర్లపాలెం హనుమంతరావు


***                             

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...