ఆటా- ప్రత్యేక సంచిక 2012లో 'ధర్మస్య త్వరితాగతిః' పేరుతో ప్రచురితం
'దాత'వ్య మితి యద్దానం దీయతేzనుపకారిణే।
'దాత'వ్య మితి యద్దానం దీయతేzనుపకారిణే।
దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్త్వికం స్మృతమ్॥
మానవజన్మ ధరించినందుకుగాను మనకున్న దానిలో ఎంతో కొంత ఆపన్నులకు, బాధా తప్తులకు ప్రతిఫలాపేక్ష రహితంగా సాత్వికదానం చేసేవారిని భగవంతుడు అనుగ్రహిస్తాడు.
'భక్తి' టీవీలో
స్వామి శివానందులవారు దానమహిమను గురించి ధర్మోపన్యాసం చేస్తున్నారు.
మహాదాత అయిన కర్ణుణ్ణి శ్రీకృష్ణపరమాత్ముడు పరీక్షించాలని ఓ వేకువఝామున కర్ణుని ఇంటికి వెళ్ళాట్ట. కర్ణుడు ఆ సమయంలో వంటికి
నూనె పట్టించుకొంటున్నాడు. అతనికి ఎడమవైపున్న వజ్రాల పాత్రను దానమడిగాడు కృష్ణుడు.
మరో ఆలోచన లేకుండా ఎడంచేత్తో అమాంతం ఆ వజ్రాలపాత్రను కన్నయ్య దోసిట్లో వేశాట్ట
కర్ణయ్య. 'పుర్ర చేత్తో దానమీయడం భావ్యమా?'
అని కృష్ణుడు ఆక్షేపిస్తే
'క్షణం చిత్తం క్షణం విత్తం క్షణ జీవిత మావయోః।
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతిః॥
ఉత్తరక్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. లక్ష్మి చంచలమైనది.
యముడు దయా రహితుడు. మనసు ఏ క్షణంలో ఎటు మళ్ళుతుందో తెలీదు. వస్తువు చెయిజారే లోపల
ఏం ఉపద్రవం ముంచుకొస్తుందో.. ఎవరి కెరుక?.. కాబట్టి ధర్మకార్యం అనుకొనేదాన్ని వెంటనే చేసెయ్యాలయ్యా!.. 'ధర్మస్య త్వరితా గతిః' అన్నారు గదా పెద్దలు! అన్నడుట
కర్ణుడు.
అనుగ్రహ ప్రసంగం శ్రద్ధగా వింటున్న సుబ్బరాజుగారికి పొద్దున
జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
ముప్పై ఏళ్ల కిందటి మాట. నాకు అప్పుడు ఇరవయ్యో..
ఇరవైయ్యొకటో! చెన్నైలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొంటూ బతుకు పోరాటం చేస్తుండేవాణ్ణి.
పురాణం వెంకటరత్నం పంతులుగారు అనే పండితుడి దగ్గర వ్రాయసగాడుగా చేర్పించాడు ఒక
మిత్రుడు.
పంతులుగారు అప్పట్లో వ్యాసభగవద్గీతకు తెలుగు వ్యాఖ్యానం
రాసే పనిలో ఉన్నారు. పక్షవాతంచేత కుడిచెయ్యి సహకరించక రాసేందుకు నన్ను
పెట్టుకొన్నారన్న మాట. నెలకు పాతిక రూపాయలు జీతం. పొద్దున పదినుంచి రెండింటిదాకా
రాత పని. మధ్యలో ఒకసారి టీ. మధ్యాహనం ఆయన 'ప్రేమాలయం'లో భోజనం.
తిండితిప్పలకేంగాని.. పంతులుగారి సేవలో నా భాషా పరిజ్ఞానం
బాగుపడింది. వ్యాఖ్యానం రాసేది గీతకే అయినా.. బైబిలు ఖురాన్ లాంటివాటినుంచి
ప్రమాణాలు తీసుకొనేవారాయన. నేనొకసారి 'గురూ గారూ! మన భగవద్గీతక్కూడా వేరే మతాలనుంచీ సపోర్టు అవసరమా?' అని అడిగాను.
'గీతలో అన్ని మతాలకు, సాంప్రదాయాలకూ స్థానమున్నదనేరా నా మతం. ఈ కోణంనుంచి వ్యాఖ్యానం చెయ్యాలని
నా సంకల్పం' అన్నారాయన.
పంతులుగారు వ్యాఖ్యానం చేసేటప్పుడు బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, బైబిలు, ఖురానుకి ఆంగ్లానువాదంలాంటి ఆథ్యాత్మిక గ్రంథాలే కాకుండా.. హరిభక్తవిలాసం, శృంగారతిలకం లాంటి గ్రంథాలనుకూడా చుట్టూ తెరిచిపెట్టుకొని ఉండేవారు.
వ్యాసగీతలోనుంచి ఒక్కో శ్లోకం పైకి చదువుకొని ,, దాన్నే మననం
చేసుకొంటూ.. ఈ పుస్తకంలోనుంచీ ఒకటీ.. ఆ పుస్తకంలోనుంచీ అరా ఏరుకొంటూ
సంతృప్తిచెందిన తరువాత 'ఇహ రాసుకోరా
అబ్బాయ్!' అంటూ ఏకధారగా వ్యాఖ్యానం
చెప్పుకుపోయేవారు. చెప్పింది చెప్పినట్లు కాగితంమీద పెట్టుకొంటూ పోవడమే నా పని.
ప్రారంభంలో నాకిదంతా ఒక పరమ దండగవ్యవహారంలాగా ఉండేది. పోను
పోను స్వారస్యం గ్రహింపుకొచ్చి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. గురువుగారి దగ్గర
పనిచేసిన ఆ అబుభవం తరువాత నాకు ఒక సినిమా కంపెనీలో దర్శకత్వశాఖలో పనిచేసేటప్పుడు
ఉపయోగించింది. స్క్రిప్టు వర్కులో మెరుగులు సూచిస్తుండేవాణ్ని. ఆ క్రమంలోనే నేనూ ఒక రచయితగా మారడం.. తదనంతరం
సినిమాలు తీస్తూ కొంత గడించడం.. ఇదంతా పాతికేళ్లనాటి ఫ్లాష్ బ్యాకులోని ఫస్టుహాఫ్.
సెకండ్ హాఫ్ ఏమిటంటే..
ఐదేళ్ల కిందట నేను తీసిన రెండు సినిమాలూ అట్టర్ ఫ్లాప్
అవడమూ.. నా పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడమూ!
స్టేట్ స్ లో ఎంబీఏ చేసే మా పెద్దబ్బాయి సోమరాజుని
ఉన్నఫళంగా వెనక్కి పిలిపించి బిజినెస్ మొత్తాన్నీ వాడికి అప్పగించేసింది నా
ధర్మపత్ని. అప్పట్నుంచీ నా పాదాలు పండక్కీ పబ్బానికీ
ఇంట్లోని పిల్లా పీచూ అభివందనాలు పెట్టుకోవడానికీ.. నా అనుభవాలు ఇలా నీ
బోటివాళ్లదగ్గర ఉబుసుపోక చెప్పుకోవడానికీ మాత్రమే పనికివస్తున్నాయమ్మాయ్! అందుచేత
నేను నీకేవిధంగానూ సాయం చేసే స్థితిలో లేనమ్మా!' అన్నారు సుబ్బరాజుగారు తాపీగా సినిమా ఫక్కీలో.
అప్పటిదాకా అంతా ఓపిగ్గా వింటూ కూర్చొన్న శారద లేచి 'సాయానిదేముందిలేండి ఆంకుల్! వీలుంటేనేగదా
ఎవరైనా చేస్తారు! ఇది తాతయ్యగారి చివరి కోరిక. అందుకే ఎలాగైనా పూర్తి చేయాలని నా
పట్టుదల. వస్తానండీ!' అంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి శారద.
సుబ్బరాజుగారు ఆలోచనలో పడ్డారు మళ్లా!
పంతులుగారు ఆ రోజుల్లో వడపళనిలో ఓ చిన్నసైజు అనాథ శరణాలయంలాంటిది నడుపుతుండేవారు. ప్రేమాలయం దాని పేరు. మద్రాసు హైకోర్టులో
బెంచిగుమాస్తాగా చెస్తున్న ఉద్యోగాన్ని ఆ అనాథశరణాలయంకోసం వదిలేసుకొన్నారాయన.
నెలనెలా వచ్చే పించను.. డిపాజిట్`స్ మీదవచ్చే
వడ్డీ చాలక, పుస్తకాలమీదొచ్చే
ఆదాయాన్నికూడా దీనిమీదే వెచ్చించేవారు. తిండికిలేని పేద ముసలివారినీ, ఆధారంలేని పసిపిల్లల్నీ చేరదీసేవారాయన.
కులమతాలకు అతీతంగా ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణంతో
నిండివుండేది ప్రేమాలయం ఆవరణ. ఆశ్రమంలోని వాళ్లందరికీ ఉచితంగా విద్య వైద్య సౌకర్యాలు
కల్పించాలని, పెద్ద గ్రంథాలయాన్ని
ప్రేమాలయానికి అనుబంధంగా నడపాలని.. ఆరాటపడుతుండేవారు ఆయన. ఆయన ఆరోగ్యం పాడైపోయిన
తరువాత అక్కడి కార్యక్రమాలు పలచబడిపోయాయి. ఆయనతోనే ఆ ప్రేమాలయం వైభవమూ
కనుమరుగయిపోయింది.
పంతులుగారు నెల్లూరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒకసారి
చూడటానికని వేళ్లాడు తను. ఓటికుండలోని నీటికిమల్లే శరీరంలోని జీవశక్తి క్రమేపీ
క్షీణించుకుపోతున్న దశ అది.
'ఎలాగుంది గురువుగారూ!' అని అడిగాడు తను.
' తగ్గుతుందిరా.. కృష్ణమూర్తీ.. తగ్గుతోంది!' అన్నారు. మనుషుల్నికూడా సక్రమంగా
గుర్తుపట్టలేని స్థితికి గురువుగారు చేరుకున్నారు! ఇహ తగ్గేదేంటి?' అన్నాడు తను పక్కనే ఉన్న ఎవరో మిత్రునితో.
విన్నట్లున్నారు..
నడుందాకా కప్పివున్న దుప్పటిని తొలిగించి 'తగ్గేది..కాలురా.. పైచ్చి సన్నాసీ' అని నవ్వి
కన్నీళ్ళు పెట్టుకొన్నారు.
పాదాలదగ్గరనుంచి పైకి ఆపరేషన్లు చేసుకొంటూ పోతున్నారు వైద్యులు. చూడలేక
తిరిగి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచి 'ఒక పని చేసిపెట్టాలిరా!
నేను పూర్తిగా తగ్గిపోయిన తరువాత మన ప్రేమాలయం పనులు మీరే చూసుకోవాలి. అదే నా అఖరి
కోరిక' అన్నారు. చూడటానికి వచ్చినవాళ్లందరితోనూ అలాగే
చెప్పేవారుట!
ఇప్పుడు వచ్చిన శారద అప్పట్లో ప్రేమాలయం ఒడిలో ఎదిగిన
బిడ్డ. పంతులుగారి చివరి కోరిక తీర్చాలని.. ప్రేమాలయాన్ని ఎలాగైనా తిరిగి
తెరిపించాలని తంటాలుపడుతున్నది.. పాపం!
అడక్కుండానే సాయం పట్టాల్సిన బాధ్యత తనమీద ఉంది. నోరు
తెరిచి అడిగినా పైసా విదల్చలేని దౌర్బాగ్యస్థితిలో ఉన్నాడు తనిప్పుడు.
వట్టిచేతుల్తో తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పిల్ల కళ్ళల్లో కనిపించిన నిరాశను
మర్చిలేకపోతున్నాడు సుబ్బరాజుగారు.
సెల్ఫోన్ అదే పనిగా రింగవుతుంటే ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు
సుబ్బరాజుగారు. సుకుమార్ పర్సనల్ మేనేజర్
స్వామి. 'ఆడియో ఫంక్షను మొదలయిపోయింది
సార్! సుకుమార్ సార్ రిమైండ్ చేయమంటున్నారు' అన్నాడు
అవతలనుంచి.
'ఏదీ! ఒకసారి మీ సారుకి లైన్ కలుపు!' అని అడిగాడు సుబ్బరాజుగారు ఒక నిశ్చయానికి
వచ్చినట్లు.
***
సుకుమార్ తాజా చిత్రం 'రౌడీ' రవీంద్రభారతిలో ఆర్భాటంగా జరుగుతోంది.
సుబ్బరాజుగారు ఆడిటోరియం చేరేవేళకే వేదికంతా విఐపిలతో కిక్కిరిసి ఉంది. హాలు
లోపలా.. బయటా.. సుకుమార్ అభిమానుల కోలాహలం! మీడియా హడావుడికయితే ఇహ అంతే లేదు.
ముఖ్య అతిథి సాంస్కృతిక శాఖామంత్రి చలమయ్యగారు. సుకుమార్ ను
గురించి సుకుమార్ కే తెలియని సుగుణాలను సుమారు ఒక అరగంటపాటు ఏకరువు పెట్టి ఆఖర్లో 'మన హీరోగారు గొప్పకథానాయకులే కాదు..
రాజకీయనాయకులుకూడా కావాలని కోరుకొంటున్నాను. ఇలాంతి పులుకడిగిన ముత్యాలు
దేశానికి.. మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి ఎంతో అవసరం'
హాలు లోపలా బైటా ఈలలతో, అరుపులతో దద్దరిల్లిపోయింది. ఇంకో ఇద్దరు ముగ్గురు ఈ కాలం దర్శకులు,
నిర్మాతలు సుకుమార్ ని స్తోత్రాలతో ముంచెత్తిన తరువాతగానీ
సుబ్బరాజుగారి వంతు రాలేదు. రెండే నిమిషాలు మాట్లాడాలని నిర్వాహకులు
హెచ్చరించిపోయారు.
సుబ్బరాజుగారు సాధారణంగా సభల్లో ఎక్కువగా మాట్లాడరు.
మైకుముందు ఆయనకు మాటలు పెకిలవు. ఈసారి మాత్రం అదో రకమైన ఊపులో ఉన్నారు. 'పెద్దలు, ప్రముఖులు
హీరోగారిని గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. నాకూ అలాగె మాట్లాడాలని
ఉందిగాని.. మాల వేసుకొని ఉన్నందున అబద్ధాలు మాట్లాడలేను. నా మాటలు నిష్టూరంగా ఉంటె
మన్నించమని మనవి.'
సభలో పిన్ డ్రాప్ సైలెన్సు!
'సుకుమార్ నాకు పాతికేళ్ళబట్టీ తెలుసు. డబ్బుదగ్గర తను మహా
గట్టి. ఐదేళ్ల కిందట నేను తనతో తీసిన 'దేవుడు' అట్టర్ ఫ్లాపయింది. అయినా తన పారితోషికం రూపాయి తగ్గకుండా తీసుకొన్నాడు. అదే..
అంతకుముందు అతనితో కలసి నేను తీసిన ' సూపర్ కుర్రోడు' గ్రాండ్ సక్సెసయిందని.. లాభాల్లో
వాటా అడిగి పుచ్చుకొన్నాడు. లాభంలో వాటా అడిగినవాడు.. మరి నష్టంలోకూడా షేర్
చేసుకోవడం న్యాయమా? కాదా?'
సభలో చిన్న కలకలం.
సుబ్బరాజుగారి ధోరణి అలాగే సాగుతూ ఉంది. 'సుకుమార్ గొప్ప ప్రజాసేవకుడు అన్నారు. ఇన్ని
కోట్లు సంపాదించాడు. ఇప్పటివరకు ఏమేం సోషల్ సర్వీసులు సొంతడబ్బుతో చేసాడో
చెప్పాలి! ఇవాళ్టికీ షూటింగు సమయంలో ఆయన భోజనం ఖర్చు నిర్మాతలే భరిస్తున్నారు.అంత
పిసినారి ఈ హీరో..!'
సభలో ఒక్కపెట్టున రభస. వేదికమీదలు కాగితం ఉండలు.. వాటర్
బాటిల్సు.. దూసుకొస్తున్నాయి. మైక్ కట్ చేసేసారెవరో! ఐనా రాజుగారు తగ్గడంలేదు.
స్వరం పెంచి అరుస్తున్నారు. 'సుకుమార్
లాంటి డబ్బుమనిషి.. సెల్ఫిష్.. తాగుబోతు,, క్రూక్..
అన్నింటికీ మించి..'
అభిమానులు రెచ్చిపోయి వేదికమీదకు దూసుకొస్తుండేసరికి
సెక్యూరిటీ రంగప్రవేశం చేసింది. సభ అర్థాంతరంగా ఆగిపోయింది.
ముందు సుకుమార్ ని ఓ కారులో సురక్షితంగా బైటికి
పంపించేసారు. సుబ్బరాజుగారినికూడా అతిరహస్యంగా ఓ వాహనంలో బైటికి రరలించే
ప్రయత్నంలో ఉండగా.. ఆయనే బైట వేచిఉన్న మీడియాను దగ్గరకు పిలిచి మిగతాభాగం పూర్తి
చేసారు. 'గాయత్రి అనే ఓ కేరళ కథానాయిక ఈ
హీరో వేధింపులకు తాళలేకే కొట్టాయంలో ఆత్మహత్యకు పాల్పడింది. వీళ్ళిద్దరుకు పుట్టిన
బిడ్డకు ఇప్పుడు ఐదేళ్ళు. చెన్నైలోని ఓ హాస్టల్లో సీక్రెట్ గా ఉంచి పెంచుతున్నాడు
సుకుమార్. ఇవిగో వివరాలు. విచారించుకోండి!' అంటూ ఓ కాగితం
వాళ్ళమీదకు వెఇసిరేసాడు పోతూ పోతూ.
నిప్పులేకుండానే పొగ పుట్టించే నైపుణ్యం ఈ కాలం మీడియాది. ఈ
మాత్రం సెగ తగిలితే ఊరుకొంటుందా! ఇరవై నాలుగ్గంటల న్యూస్ ఛానెళ్లలో
స్క్రోలింగులు.. డిస్కషన్లు.. ఒపీనియన్ పోళ్ళు.. ఎస్ ఎమ్ ఎస్సుల ద్వారా అభిప్రాయ
సేకరణలు!
ఒక ఛానలైతే ఏకంగా సుబ్బరాజుగారిని స్టూడియోలో కూర్చోబెట్టింది.
'సుకుమార్ ఇండస్ట్రీలోకి
అడుగుపెట్టేనాటికి పైన చొక్కా.. కింద మాసిన ప్యాంటుతప్ప ఇంకేమీ లేవు. పాతికేళ్లలో
రెండువేల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలి. ఎంత ఆదాయప్పన్ను కడుతున్నాడో
ప్రకటించాలి. రాజకీయాల్లోకి రావాలనుకొంటున్నాడుగా! ముందు అతని నీతి నిజాయితీల్
రుజువుకావాలి!' అని సుబ్బరాజుగారి డిమాండ్లు.
'మా నాన్నగారికి మతి స్థిమితంగా ఉండటం లేదు. ఆయన మాటల్ని
పట్టించుకోవాల్సిన అవసరం లేదు.' అంటూ
పబ్లిగ్గా స్టేటుమెంట్లు ఇచ్చాడు సోమరాజు. 'రౌడీ; చిత్రం ఇంకా ఒక షెడ్యూల్ పూర్తికావాల్సి ఉంది. ఈ వివాదం వల్ల అది ఆగిపోయినా..
ఆలస్యమయినా.. పెట్టిన కోట్లన్నీ ప్రశ్నార్థకంలో పడతాయి. అదీ సోమరాజు బెదురు.
'నేను పూర్తి ఆరోగ్యంతో ఉండే మాట్లాడుతున్నాను. కావాలంటే
మెడికల్ చెకప్పులు చేయించుకోవచ్చు. చెన్నైలో సుకుమార్ కి బినామీ పేర్లతో లిక్కర్
వ్యాపారాలుకూడా ఉన్నాయి. ఈ విషయాలన్నింటిమీద సిట్టింగుజడ్జితో వెంటనే విచారణ
చేయించాలి. చెన్నైపాపకు, సుకుమార్ కి డి ఎన్ యే
పరీక్షలు జరిపించి నిజం నిగ్గు తేల్చాలి.' అంటూ రోజుకోరకంగా సుకుమార్ మీద దాడి తీవ్రతరం చేసుకొంటూ
పోతున్నారు సుబ్బరాజుగారు.
సుకుమార్ కి అనుకూలంగా .. వ్యతిరేకంగా రాష్ట్రం రెండుగా
చీలి మూడురోజులబట్టీ రచ్చ రచ్చవుతోంది. అబిమానుల అల్లరయితే లా అండ్ ఆర్డర్ లిమిట్
ఎప్పుడో దాటిపోయింది.
మొనంగా ఉంటే మొదటికే మోసం వస్తుందనుకొన్నాడేమో.. ఒక ప్రకటన
విడుదల చేసాడు సుకుమార్. 'సుబ్బరాజుగారు నాకు
సినీజన్మనిచ్చిన తండ్రి. ఆయనెందుకు ఇలా చేస్తున్నారో అర్థమవడం లేదు. నా నీతి
నిజాయీతీలను నిరూపించుకొనేందుకు నేను సిద్ధం. నా ఆస్తిపాస్తులమీద విచారణకు నేను
రడీ! చెన్నైలో నాకు ఎక్కడో ఓ కూతురుందని అంటున్నారుగా! ఏ ఎన్ యే పరీక్షక్కూడా
ఒప్పుకొంటున్నాను. ఆఓపణల్లో ఒక్కటైనా నిజమని తేలితే సినిమారంగంనుంచి శాశ్వతంగా
విరమించుకొంటాను. ఉన్న ఆస్తి పాస్తులు
రాష్ట్రప్రజలకు రాసిచ్చేస్తాను. అబద్ధమని తేలితే సుబ్బరాజుగారిమీద పదికోట్లకు
పరువునష్టం దావా వేస్తాను. నివేదికలు వచ్చినదాకా 'రౌడీ'
చిత్రంలో నటించను.' ఇదీ ప్రకటా సారాంశం.
సుకుమార్ ఈ ప్రకటన చేసేనాతికి సుబ్బరాజుగారు అందుబాటులో లేకుండాపోయారు.
శబరిమలై యాత్రలో ఉన్నారు.
పదహారో రోజున ఆయన తిరిగొచ్చేనాటికి పరిస్థితులు పూర్తిగా
మారిపోయాయి.
సుకుమార్ సుగుణాలనుగురించి, సచ్చీలతను గురించి రోజుకో సినిమా విఐపినో, రాజకీయ
ప్రముఖుడో ఛానెళ్లలో ప్రకటనలు
గుప్పిస్తున్నారు. అతని ఆస్తిపాస్తులమీద విచారణకు పూనుకొన్న ఓ స్వచ్చంద సంస్థ
వారంరోజులపాటు విచారించి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసింది. సుబ్బరాజుగారు ఇచ్చిన
చెన్నైపాప వివరాలు బోగస్ వని తేలాయి. సుకుమార్ సుబ్బరాజుగారిమీద పరువునష్టం దావా
వేయకుండా ఉండేందుకూ.. 'రౌడీ' చితం
పూర్తిచేసేందుకూ.. సోమరాజు ఇలాంటివే ఇంకా చాలా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. అయినా
సరే.. పెద్దాయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కండిషన్ పెట్టాడు సుకుమార్!
అయ్యప్పదీక్ష ముగిసింది కనక ఏం చెప్పటానికైనా
సుబ్బరాజుగారిమి ఇప్పుడు అభ్యంతరం లేదు. ప్రెస్ మీట్లో సుకుమార్ ని పక్కన
కూర్చోబెట్టుకొని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడాయన. 'సుకుమార్ పులుకడిగిన ముత్యమని నాకు ముందే తెలుసు. తను రాజకీయాల్లోకొస్తే
తమ ఉనికి దెబ్బతింటుందని భయపడిన కొన్ని శక్తులు నా చేత ఈ నాటకం ఆడించాయి.'
'ఎవరా శక్తులు?' అని అడిగాడో రిపోర్టర్.
'ఇంకా వివాదాల్లోకి పోవద్దు! జరిగిందానికి నేను విచారిస్తున్నాను.
నా ఆరోపణలను వెనక్కి తీసుకొంటున్నాను. సుకుమార్ ని క్షమించమని కోరుతున్నాను.
అగ్నిపరీక్ష జరిగిన తరువాతే సీతమ్మవారి సచ్చీలత లోకానికి రుజువయింది. మన హీరో
సుకుమార్ విషయంలోనూ అంతే జరిగిందనుకోండి! ఇంతటి నీతి నిజాయితీలు ఉన్న వ్యక్తి నేటి
రాజకీయాలకు ఎంతో అవసరం. నేనీ పాడుపని చేయడానికి పుచ్చుకొన్న ముడుపుల మొత్తాన్నీ నా
పాపపరిహారార్థం సుకుమార్ కి సమర్పించుకొంటున్నాను' ' అంటూ అప్పటిదాకా పక్కనే పెట్టుకొన్న సూట్ కేసునుంచి చెక్కుబుక్కుతీసి ఓ సంతకం గిలికిన చెక్కును సుకుమార్ కి అందించి
షేక్ హ్యాండిచ్చారు సుబ్బరాజుగారు.
చెక్ అందుకొని మీడియా కెమేరాలకు చూపించి అన్నాడు సుకుమార్
చిరునవ్వుతో' సుబ్బరాజుగారు నా తండ్రిలాంటి
వారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగిద్దాం. ఈ వివాదంతో ఏ మాత్రం సంబంధంలేని నా ఒకప్పటి సహనటి గాయత్రిగారి పేరు నలుగురు
నోళ్లలో నానడమే నాకు మనస్తాపం కలిగించింది. సుబ్బరాజుగారు ఇచ్చిన ఆ మొత్తాన్ని ఆ
గాయత్రిగారి పేరుమీద ఏదైనా అనాథశరణాలయానికి విరాళంగా ఇవ్వడం ద్వారా మనం ఏసిన
అపచారాన్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చన్నది నా ఆలోచన. పెద్దవారు. నాకు
పితృసమానులు. సుబ్బరాజుగారే ఏదైనా ఆర్ఫనేజ్ పేరు సూచిస్తే సబబుగా ఉంటుంది.' అన్నాడు సుకుమార్.
సుబ్బరాజుగారు సుకుమార్ చెవిలో ఏదో ఊదారు. తలూపి
అక్కడికక్కడే ప్రకటన చేసాడు సుకుమార్. 'చెన్నైలోని మహా మహోపాధ్యాయ కీ॥శే॥ పురాణం వెంకట రత్నం పంతులుగారి
స్మారకార్థం పునరుద్దీకరింపబడుతున్న అనాథశరణాలయం 'ప్రేమాలయా'నికి ఈ చిన్నిమొత్తాన్ని విరాళంగా
ప్రకటించడానికి గర్వపడుతున్నాను.
మీడియా కెమేరాలవెలుగుల్లో
ప్రేమాలయం తరుఫున 'శారద' సుకుమార్
ఎండార్సు చేసిచ్చిన చెక్కు అందుకొంది.
'విరాళం ఎంత సార్?' ఓ జాతీయ ఛానెల్ ప్రతినిధి విచారణ.
చిరునవ్వుతో చెక్కును కెమారాలకి చూపించింది శారద. రెండు
వేళ్ళు గాలిలో ఆడించాడు నవ్వుతో సుకుమార్! ఆనందంతో తలూపుతూ కనిపించారు సుబ్బరాజుగారు.
***
ప్రేమాలయం ప్రారంభోత్సవ సభ.
పక్కనే కూర్చోనున్న సుకుమార్ చేయి అందుకొని చిన్నగా
అన్నారు సుబ్బరాజుగారు 'మా వెధవాయి దగ్గర్నుంచి నా
కష్టార్జితంలోని ముష్టి రెండు కోట్లు రాబట్టుకోవడానికి ఇన్ని ముష్టియుద్ధాలు నటించాల్సి
వచ్చింది. నా కోసం ఎన్నో మాటలు పడ్డావు. సారీరా!'
నవ్వుతూ చేతిని కళ్లకద్దుకొని అన్నాడు సుకుమార్ 'అన్నం పెట్టిన చెయ్యి గురూజీ మీది! మరంతమంది
నాలాంటి అభాగ్యులకు అన్నం పెడతానంటే ఇంకిన్ని మాటలు పడటానికైనా నేను రడీనే! అదీగాక నటనేమన్నా
నాకు కొత్తా?.. నా వృత్తే అది. మీ తిట్ల నాటకం ముందే చెప్పకపోతే మాత్రం కచ్చితంగా అప్
సెట్టయుండేవాడినే!' అని భళ్ళుమని నవ్వేశాడు
సుకుమార్. సుబ్బరాజుగారూ ఆ నవ్వులో పాలుపంచుకొన్నారు.
నాలుగు వరసల అవతలగా కూర్చోనున్న సోమరాజుకి నవ్వులు వినీ..
ఎందుకో అర్థం అదోలా మొహం పెట్టేసాడు!
***
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment