Sunday, July 26, 2015

కృత(క) యుగం- ఓ సరదా గల్పిక

కార్తీకమాసం. శుక్లపక్షం. శుద్ధ నవమి. కృత యుగారంభ దినం. బ్రహ్మాజీ ఆ యమ బిజీగా ఉన్నాడు. దాదాపు అన్ని ఏర్పాట్లూ పూర్తైపోయినట్లే. ఇహ ఎవరి బాధ్యతలు వాళ్లకి అప్పగించడమే తరువాయ.
ముందుగా ధర్మ దేవతకు ఫోను కొట్టాడు. నాలుగైదు రింగులైతేనే గానీ రంగం మీదకు రాలేదా మహా తల్లి. “సారీ! మీకు తెలీందేముంది! ఒంటి పాదం..” ధర్మ దేవత  సంజాయిషీ.
ఓకే..ఓకే! ఈ ఘడియ వరకే నీకీ కష్టం. ఈ బ్రహ్మీ ముహూర్తం నుంచి ఇహ నీ ఇష్టం.  పరుగే పరుగు! కృత యుగం ఆరంభం. కంగ్రాట్స్ ధర్మ దేవతా!”
కంగారు పడింది ధర్మ దేవతఒక్క పాదంతో తిప్పలు పడుతున్న మాట నిజమే. కానీ ఎన్నేళ్ల బట్టో ఇలా అలవాటై పోయింది.   మళ్లా నాలుగు పాదాలంటే .. బాబోయ్ నా వల్ల కాదుచతుష్పాదుల్ని మరీ పశువుల్లా చూస్తుందీ భూలోకం.  ఐనా ఇప్పుడంత  ఉరుకులు పరుగులు పెడుతూ నేను చేసే రాచకార్యాలు మాత్రం ఏమున్నాయి గనక? పెద్ద  లోగిళ్ళు.. కడుపులో చల్ల కదలకుండా పడి ఉన్నాను .. నన్నొదిలేయండి సార్ ఈ యుగానికి.. ప్లీజ్!”  ఠకాలున ఫోన్ పెట్టేసింది ధర్మ దేవత.
ఆదిలోనే హంస పాదా!కిసుక్కున నవ్వింది వాణి.
తర్కిస్తూ కూర్చోడానికి టైము లేదు. అవతల ఆరంభ డియలు ముంచుకొచ్చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న వాళ్ళందర్ని ముందు సంప్రదించాల్సిందే.
హరిశ్చంద్రుడికి ఫోన్ కొట్టాడీ సారి బ్రహ్మ గారు. విషయం వినంగానే వినయంలో తేడా వచ్చేసిందిసార్! ప్రతి సత్య యుగంలో సత్య హరిశ్చంద్ర నాటకం అంతవసరమా ! నిజం విలువ లోకాలకు తెలియ చేయాలనే కదా ఆది దంపతులు నా నాటకం ఆడించింది! తెలివి మీరిన జీవులు పెడర్థాల్లు తీస్తున్నారు సార్ ఇక్కడ. మహాత్ముడంటే  సత్యకాలం మనిషి. ఆయనొక్కడు మారాడని లోకాలన్నీ మార్తాయా ? బలిజేపల్లి వారి క్కూడా అక్కర్లేదిప్పుడు ఈ నీతులు. ఇంకెవరి కోసం సార్ మళ్లీ నేనూ.. నన్ను కట్టుకున్నందుకు చంద్రమతి.. లోహితాస్యుడు అష్ట కష్టాలు పడాలి?  ఈ సారి గానీ విశ్వామిత్రుల వారు వచ్చి దాన మడిగితే కావాలంటే కమండలం కొత్తది బంగారంతో చేయిస్తా గానీ భూ మండలం గీమండలం జాన్తా నై’  అంటూ ఫోన్ పెట్టేశాడు హరిశ్చంద్రుడు.
బ్రహ్మాజీ ఈసారి నేరుగా ఇంద్రుడికే ఫోన్ కొట్టాడు. కృతయుగారంభ వార్త ఆ దేవ రాజుకీ ఏమంత ఉత్సాహంగా అనిపిస్తున్నట్లు లేదు. క్షీరసాగర మధనం మళ్లీ సాగించడంలోని సాధక బాధకాలను ఏకరువు పెట్టడం మొదలు పెట్టాడు ”బహు భారీ పథకం బ్రహ్మగారు పాల సముద్రం చిలకడంకలికాలం సుఖాలు మరిగాక ఎవరూ దేనికీ వూరికే  లొంగడం లేదు. వేష భాషల్ను బట్టి ఇప్పుడు ఎవడు సురుడో.. ఎవడు అసురుడో కని పెట్టడం కష్టం.  వచ్చే ప్రభుత్వాలను బట్టి లెక్కలు మారి పోతున్నాయి. చిలికే అంత పెద్ద వ్వం ఇప్పుడేదీ! వాసుకి జోలి కెళితే వన్యమృగ సంరక్షణ చట్టాలు వూరుకోవు. మంధర పర్వతం ఎప్పుడో జనావాసాల  కింద మారిపోయింది! కూర్మావతారం ఆ విష జలాల అడుగున  ఒక్క గడియైనా నిలబడేలా లేదు. సత్య యుగం కాబట్టి  కామధేనువుని, కల్ప వృక్షాన్ని, ఐరావతాన్ని, పెద్ద దేవుళ్లెలా పంచుకున్నా పెద్ద గొడవలేం కాలేదు. రోజులు మారి పోయాయి బ్రహ్మాజీ! నీలకంఠుడికైనా హాలాహల సేవనం  అంగీకారమో కాదో కనుక్కోండి ముందు. సర్వమంగళ గతంలో మాదిరి భర్త విషయంలో భరోసా ఇస్తుందో లేదో.. అనుమానమే. అన్నింటికీ మించి నారాయణ స్వామి మరో దేవి పాణి గ్రహణం లక్ష్మమ్మకు సమ్మతంగా ఉంటుందనుకోను  ”
“కచ్చితంగా ఉండదు. అసలే ఆడదైనా మొగుడు మరో దానితో కులుకుతుంటే చూస్తూ ఎందుకూరుకోవాలి?  కృత యుగంలో ఎలా జరిగిందో ఏమో తెలీదు  కాని.. ప్రస్తుతం మాత్రం మహిళా సంఘాలు  చాలా బలంగా ఉన్నాయి భూలోకంలో” సరస్వతీ దేవి హూంకరింపు. సందు చూసి దేవేంద్రుడు చల్లగా ఫోన్ పెట్టేశాడు.
కృత యుగారంభానికి ఈ సారి ఇన్ని కృత్యాద్యవస్థలా?! కల్లో కూడా ఊహించినట్లు లేదు పాపం  బ్రహ్మ దేవుడు.
వేద వ్యాసుని మూలకంగా వచ్చి పడ్డాయీ తిప్పలుసత్యసంధతకు కృత యుగం.. సత్య వినాశనానికి కలి యుగమని పేర్లు కల్పించి ఇప్పుడు చంపుతున్నాడు. అవతల ముహూర్త ఘడియలు ముంచుకొచ్చేస్తున్నాయి. సత్య యుగారంభం కోసం యుగాల బట్టి కంట వత్తు లేసుకుని ఎదురు చూసే ఆశాజీవుల కిప్పుడేం సమాధానం చెప్పి తప్పించుకోవాలి.. నారాయణా?”
నారాయణ.. నారాయణనాలుగు తలలూ ఒకేసారి పట్టుకుని నేల చూపులు చూసే తండ్రి గారిని పరామర్శించడాని కన్నట్లు  ప్రత్యక్షమయాడు నారద మహర్షి
నీ నారాయణ నట్టేట్లో కూలా! నా పుట్టి మునిగేట్లుందిరా నాయనా ఇక్కడ!”  బావురు మన్నాడు బ్రహ్మ దేవుడు.
కంటి రెప్ప పడే వ్యవధానంలో పరిష్కారమయ్యే సమస్య కదా తండ్రీ  ఇది ! నడుస్తున్న కృతక యుగానికే కృత యుగమని పేరు పెడితే సరి. ప్రచారం హోరెత్తించడానికి అనుచర గణాలం మేం లేమా?” నారదులవారి ఓదార్పు.
కృత యుగమంటే సత్య యుగమని కదా  ప్రతీతి! మిథ్యావాదం, సర్వ భక్షణం, అల్పాయుష్షు, అసత్యవాదం, రస రాహిత్యం, రుచి హీనత్వం, నిత్య కామం, పర పీడనానందం, కుపరిపాలన, నాస్తికత్వం, పరాన్న భోక్తం, చౌర్యం, లౌక్యం, దంభం, మోసం ..నా నోటితో ఎందుకులే ఆ గోలంతా..అగ్ని గుండ కాసారంలా మండే ఆ భూగోళాన్నా నువ్వు సత్య యుగమని ప్రకటించ మనేది?! ” నోరు వెళ్ళబెట్టాడు బ్రహ్మ దేవుడు.
యుగాల తరబడి తమరు ఈ తామరాసనాన్ని  వదలక పోవడం  వల్ల లోకం తీరు  క్షణానికో రకంగా ఎలా మారుతున్నదో గ్రహింలేకున్నారు జనకా! ఈ మధ్యనే పుట్టుకొచ్చాయి భూమండలంలో కొన్ని కొత్త ప్రభుత్వాలు. అవి  తాజాగా సేకరించిన సర్వేల వివరాలు చాలు ..మీ సత్యయుగాని కన్నా ఎన్నో ఉత్తమ లోకాల సృష్టి అక్కడ రెప్ప పాటులో జరిగి పోతున్నదని తెలుసుకోడానికినారదుల వారు అందించిన  సర్వే నివేదికల బొత్తి వంక ఓ సారి తేరిపార చూసారు విధాత గారు.
వాస్తవానికి సత్య యుగంలో కన్నా కలి యుగంలోనే సత్యానికి పరీక్షలు ఎక్కువ. పొద్దస్తమానం పిల్లకాయలకి ఆబ్జెక్టివ్ మోడలంటూ 'ట్రూ' ఆర్ 'ఫాల్స్' బిట్ ప్రశ్నలు మప్పుతున్నారు ఇక్కడ. గిట్టని నాయకుణ్ని నడి మీడియాలో నిలబెట్టేందుకు  వెయ్యో.. వందో ప్రశ్నలు వరసగా సంధించి 'నిజమా..  కాదా' అని నిగ్గదీసే రాజకీయాలు రోజూ నడిచేవీ  ఈ కాలంలోనే. ఏ అన్నవరం బస్టాండులోనో నిలబడి 'ఏమోయ్.. సత్యనారాయణా' అనో 'ఏమ్మా.. సత్యభామా' అనో గట్టిగా గొంతెత్తి పిలవండి! 'ఆయ్' అంటో వంద గొంతులు  ఒకే సారి ఖంగు మంటాయి. కలియుగ సత్య ప్రియత్వానికి ఇదో తిరుగులేని తార్కాణం. చట్ట సభల్లో ప్రజా ప్రతినిధులు పదవీ ప్రమాణాలు స్వీకరించేటప్పుడు, న్యాయస్థానాల్లో నిందితులు బోనుల్లో నిలబడి నమ్మబలికేటప్పుడు ఓం ప్రథమంగా స్మరించుకునేది సత్య దేవతనే. గీత మీదో.. రాజ్యాంగం మీదో ప్రమాణం చేసేస్తే సరి నోట బలికేదంతా సత్యం కిందే నమోదై పోయే కాలం కలికాలం!  ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులందరికీ సత్య ధృవీకరణ పత్రాల సమర్పణ తప్పని సరి చేసింది ఎన్నికల సంఘం. సాక్షాత్ శ్రీరామ చంద్రుల వారైనా సరే..   అరణ్యవాసంలో ఆదాయానికి మించిన ఆస్తులేవీ కూడ బెట్టలేదన్న ప్రమాణ పత్రం  సమర్పిస్తేనే  పట్టాభిషేక మహోత్సవానికి  చట్టబద్ధత ఏర్పడేది ఈ కలి యుగంలో. వధూవరుల చేత అగ్ని సాక్షిగా 'నాతి చరామి' అంటూ సత్య  ప్రమాణాలు చేయిస్తేనే అది సామాజి కామోదం పొందే రిణయం. యూపీయే పాలనలో  నడిచినన్ని  నిజ నిర్దారణ కమిటీలు మిగతా మూడు యుగాల మొత్తంలో సగమైనా లేవు. ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా.. ఉపద్రవాలు ముంచుకొచ్చినా.. బాధితుల ఉపశమనార్థం  ముందుగా ఊరేగేవి నిజ నిర్దారణ బృందాలే. ఆడిన మాట అబద్ధమని రుజువైతే చివరికి రాజకీయ సన్యాసమైనా సరే స్వీకరించేందుకు వీలుగా  రాజీనామా పత్రాలు జేబుల్లోనే పెట్టుకు తిరిగే రాజకీయ సంసారులు దండిగా ఉన్నారీ కలికాలంలో. సత్య యుగమని తెగ గొప్పలే గాని.. మోహినీ అవతారమే ఓ పెద్ద అబద్దం గదా! సత్యప్రియుడని పెద్ద పేరున్నా  శత్రువు   నట్టింటనే నక్కున్న వైనం ప్రహ్లాదుడెక్కడ పొక్కనే లేదు చివరి క్షణం వరకు! కలియుగీయులకు నిజం నిప్పు. ఆ కణికను చూస్తేనే జీవులకు వణుకు. లోకాలు మాడి మసై పోరాదనే  కష్టమైనా పళ్ల బిగువున నిజాన్ని గుప్పెట్లో పెట్టుకుని తిరిగేది ప్రజా నేతలు. సత్య యుగంలో ఒక్కడే నీల కంఠుడు. కృత యుగంలో ప్రతీ ప్రజా ప్రతినిధీ ఓ నీలకంఠుడే.
నిజాలను కక్కించడానికి ఈ యుగంలో ఎన్నో కట్టు దిట్టాలు! చెరసాలలు,  విచారణలురా యంత్రాంగాలు, లై డిటెక్టర్లు, నార్కోటిక్ పరీక్షలు, కాణీ పాకం వినాయకుళ్ళు. సత్య యుగంలో నిజ నిర్థారణని  ఒక్క వ్యవస్థా  ఏర్పడినట్లు లేదు! బాపుజీ మాదిరిగా  సత్యయుగంలో సత్యంతో ఏ మహాత్ముడూ ప్రయోగాలు చేసినట్లూ  కనిపించదు. సత్యమింత  కట్టు దిట్టంగా అమలవుతున్నా కలియుగానికి వికృత యుగమని చెడ్డ పేరు రావడం అన్యాయం
ముహూర్తం ఘడియలు ముంచు కొస్తున్నాయితొందర పెట్టింది మంజువాణి.
బ్రహ్మగారు గంభీరంగా ప్రకటించారు” “ భూలోక వాసుల  కొత్త ప్రభువుల తాజా  సర్వేలు  కలియుగ సత్య సంధతను సమగ్రంగా ఆవిష్కరించాయి. ఆ నివేదికల ఆధారంగా మరో కొత్త కృతయుగ సృజన వృథా ప్రయాసేనని భావిస్తున్నాను.    ఈ కార్తీక శుక్ల పక్ష  శుద్ధ నవమి శుభ మూహూర్తంలో నడుస్తున్న కలియుగాన్నే   కొత్త కృతయుగంగా  ప్రకటిస్తున్నాను
దేవ దుందుభువులు మోగడం మొదలు పెట్టాయి. నూతన కృత యుగారంభ శుభవార్తను  ముల్లోకాలకు చేరవేసేందుకు  నారదుల వారు బైలు దేరారు. స్వస్తి.
-కర్లపాలెం హనుమంత రావు




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...