గడచిన ఏడాది శాన్
ఫ్రాన్సిస్కోలో
జరిగిన బాలల చలన చిత్రోత్సవాల్లో
పాల్గొన్న వారిలో అధిక శాతం బాలలు కాదు. 35-65 వయసుల మధ్య వాళ్ళు! అదే
ప్రాంతంలో అదే సమయంలో పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన చిత్రాలు ఆడిన థియేటర్లలోని ప్రేక్షకుల్లో 55 శాతం
15 సంవత్సరాల లోపు బాలలే! బాలల
పత్రికలను బాలలు చదవడం ఎప్పుడో మానేసారు! ఏడేళ్ళు దాటిన బాలలకు రెండు
చక్రాల సైకిళ్ళు
తొక్కటం చిన్నతనంగా తయారైంది! 196 దేశాలలో అధ్యయనం
చేస్తే 152 దేశాల్లో బాల్యం
పది పన్నెండేళ్లకే పరి సమాప్త మవుతున్న వికృత
చేష్టలు ఇష్టారాజ్యంగా సాగుతున్నట్లు నిర్ధారణ అయింది. అనారోగ్యకర లైంగిక ప్రయోగాలు, రెచ్చగొట్టే
ఉద్రేక పూరితమైన చలన చిత్రాలు, చిత్రాలు, సాహిత్యం.. ఎలాంటి కట్లుబాట్లు లేకుండా యథేచ్చగా పసిపిల్లలకూ
అందుబాటులోకి వస్తున్న దుస్థితి మన దేశంలోనూ ఉండటం విచారకరం.
ఈ పాపంలో సింహభాగం అంతర్జాలనిదే- అని పలు అధ్యయనాల సారాంశం.
పిల్లలు పిల్లల్లాగా ఉంటే బాగుంటుందని పెద్దల
మొత్తుకోలు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. 'ప్రపంచమే నా ఇల్లు.. ప్రజలంతా నా వాళ్ళు' అన్నంత అమాయకంగా సాగాలి బాల్యం. 'పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం-/కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ/ ఏవీ ఎరుగని పూవులు' బాలలు అని గదా 'శైశవ గీతి'లో శ్రీశ్రీ అన్నది! ‘మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే .. అవి తమకే’ నని మురిసే ఆ అమాయకత్వం క్రమేపీ బాలల్లో తరిగి పోతున్నదని ఇటీవలి పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గతంలో మన తెలుగులో పిల్లల కోసం ప్రత్యేకంగా 'బాల భారతం' 'బాల రామాయణం' లాంటి చిత్రాలు వచ్చి బహుళాదరణ పొందాయి. సాధారణ చిత్రాల్లో సైతం పిల్లల వినోద విజ్ఞానాల కోసం వీలైనంత మేరా ఒకటో రెండో వినోద సన్నివేశాలు.. గీతాలు నీతి దాయకమైనవి చొప్పిస్తుండేవాళ్ళు. చలన చిత్రం అంటే ఇంటిల్లి
పాదీ
కలిసి చేసే వైజ్ఞానిక వినోదమని ఆ పెద్దల ఉద్దేశం
అయివుండాలి. ఇప్పుడో? పెద్దలే సిగ్గుపడే అసభ్య చిత్రాలను పిల్లలు గుడ్లప్పగించి మరీ చూస్తున్నారు! సెన్సార్ వారి
'యు' ధృవీకరణ
పత్రం గల చిత్రాల్లోనూ పెద్దలకే అభ్యంతరకరమైన సన్నివేశాలుండి పిల్లల అభిరుచులను భ్రష్టు పట్టిస్తున్నాయన్నది చేదు వాస్తవం.
ఆడపిల్లలు మగపిల్లలతో, మగపిల్లలు ఆడపిల్లలతో స్నేహం సాధించడంలో విఫలమైతే
అసమర్థులుగా తిరస్కరణకు గురయ్యే హీన సంస్కృతి బాలల ప్రపంచంలో నేడు విపరీతంగా ప్రబలుతున్నది.
‘పాయసంవంటి బాల్యం విషతుల్యంగా మారేందుకు ఇలాంటి
వైపరీత్యాలు చాలానే ముఖ్య కారణం’ అంటున్నారు బాలల
మనో విశ్లేషకులు . ఫేసు బుక్, ట్విట్టర్ వంటి సోషల్
మీడియాలో అర్థరాత్రిళ్ళు దాటినా యథేఛ్చగా ‘ఆపోజిట్ సెక్సు’తో అశ్లీల విషయాల మీద చేసే చర్చలు, పిల్లలు మధ్య బదిలీ అవుతున్న నీలి చిత్రాలు, వీడియోలు బాలల
సహజ సున్నిత జీవన సౌందర్యానికి చెరుపు
చేన్నాయన్నది
వారి ప్రధాన ఆరోపణ. కుతూహలం కొరబడ్డ లైంగిక చర్యల్లో యాంత్రికంగా
పాల్గొంటూ ప్రమాదకరమైన అలవాట్లకు బానిసలై బాలలు
వివేక రహితంగా మొగ్గ దశలోనే జీవితాన్ని
గందరగోళంలో పడేసుకుంటున్నట్లు బాలల మానసిక శాస్త్ర వేత్త నీరజా సక్సేనా ఇటీవల ముంబయి విశ్వవిద్యాలయానికి సమర్పించిన
పరిశోధనా పత్రంలో ఆందోళన
వెలిబుచ్చడం గమనించదగ్గ అంశం.
'ఎదగటానికెందుకురా తొందరా.. ఎదర బతుకంతా చిందర వందర ' అని ఓ పాత చలన చిత్రంలో పాట. ఆ రోజుల్లోనే భవితను గూర్చి అంతలా చింతన చేసేవారే! మరి ఇప్పటి పరిస్థితులకి ఇంకెంతగా ఆందోళన చెందాలి?
ఎనిమిదేళ్ళ ప్రాయానికే ఆడపిల్లల్లో
అందాన్ని పెంచుకోవాలన్న స్పృహ! మగ పిల్లలకు ఆడపిల్లల దృష్టిలో పడి తీరాలన్న యావ! భావి జీవితానికి
మేలు కలిగించే అంశాల అధ్యయనం మీద
ఏకాగ్రత చెదరగొట్టే ఆలోచనలు కావూ ఇవన్నీ?! శరీరాకృతి, వేషభాషలను గురించి పట్టింపు పసితనం
నుంచే ప్రాధాన్యతాంశాలైతే అందమైన బాల్యాన్ని ఇక అనుభవించే సమయం దొరకబుచ్చుకునేది ఎప్పుడు?! 'పీర్ల పండుగకు పీర్లు ఎత్తుకోని 'మాన్
కోట్.. బిస్కోట్'
అని అరుసుకుంట గల్లీల పొంటి తిరుక్కుంట
అలాయ్ గుండం సుట్టు ఎగిరి దుంకాలనుంది. దీపాళి పండక్కి రోలురోకలి దీసుకోని అండ్ల పొటాష్ బోసి రాతిగోడకేసి లగాంచి కొట్టాలనుంది. ఎండాకాలం
దోవోజి బాయిల షెడ్డుమీది కెల్లి డైగొట్టి దుంకాలనుంది.. కంపినోల్ల
సేన్ల దొంగతనంగ అనపాయకాయలు.. కందికాయలు తెచ్చుకోని ఉడక బెట్టుకోని తినాలనుంది. మునగాలోల్ల సినీరయ్య తాత
బోతాంటె ఎనకనించి గోసి ఊడ బీకాలనుంది. మా
రామక్క తోని మాట్లాడాలనుంది' అంటూ 'పాతవాచకం' పేరున ఓ కవి 'నా బాల్యాన్ని నాకు తెచ్చివ్వవూ' అంటో గోస పెట్టడం
చూస్తుంటే అందమైన బాల్యం మీద ఎంత
ముచ్చటేస్తుంది! 'జబ్ బచ్ పన్ థా, తో జవానీ ఏక్ డ్రీమ్ థా/ జబ్ జవాన్ హుయె, తో బచ్ పన్ ఏక్ జమానా థా!' అని హిందీలో ఓ కహావత్. బాల్యానికి యవ్వనం ఓ రంగుల కలవరింత. యవ్వనానికి బాల్యం ఓ గడిచిపోయిన వింత! ఇందుకు విరుద్ధంగా ఇప్పటి బాలలు చేసే ఆలోచనల వల్లే ఈ చింత!
బాలల ప్రపంచంలో వస్తున్న ఈ మార్పులు
దేనికి సంకేతం? గతంలో బడికి సెలవులు వస్తే చాలు.. బంధు మిత్రుల ఇళ్లకు
వెళ్లి ఉల్లాసంగా గడపడం ఉండేది. ఇప్పుడు పెద్దలతో కలవడానికి
పిల్లలు బొత్తిగా ఇష్ట పడటం లేదు. సందు దొరికితే స్నేహితులు. లేదంటే ఒంటిగా ఇంట్లో గదిలో ఇంటర్ నెట్ ముందు ఫీట్లు. బాలల్లో పఠనాసక్తి పూర్తిగా తరిగి పోతున్నదనే అద్యయనాలు
తెలుపుతున్నాయి. సంగీతమైనా చిత్రమైనా అయినా ఇంటిల్లిపాదీ కలసి సరదాగా వినోదించే రోజులు చెల్లిపోయా యనిపిస్తుంది. చెవిలో మెషిన్.. తనలో తాను. లేకుంటె తన లాంటి మరో
అర్భక జీవితో చాటుమాటు మాటా మంతీ! తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇంటి పెద్దలు, చదువులు చెప్పే గురువులు, సంఘంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన విజేతలు.. వాళ్ళ అనుభవాలు, ఆలోచనలంటే ఆసక్తి లేదు. తనకు మించిన పరిపక్వత ప్రదర్శించలేని మిత్రబృందం సలహాలకే
పిల్లలు
పెద్దపీట వేస్తున్నారు. వ్యాపార దృష్టితో నడిచే
పత్రికల్లో సైతం అవసరానికి
మించి దొరికే
అభ్యంతరకరమైన సమాచారం బాలల అమాయకత్వానికి చేసే మేలుకన్నా కీడే ఎక్కువని
బాలల మనో శాస్త్రవేత్తలు వెలిబుచ్చుతున్న ఆందోళన అర్థం చేసుకోదగిందే. చిన్నపిల్లల ఆటబొమ్మల్లో
సైతం ప్రాధాన్యత సంతరించుకుంటున్న లైంగిక కోణం గురించి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ మిన్హాస్ ఈ మధ్య
ముంబయిలో బైట పెట్టారు. ప్రతి పదిమంది బాలల్లో ఒకరు అసహజ
రీతి లైంగిక చేష్టల వలల్లో చిక్కుబడి పోతున్న మాట నిజమే.
భావోద్వేగాలనేవి శరీర పరిపక్వతను అనుసరించి సహజ పద్ధతిలో వికాసం
చెందవలసిన ప్రకృతి
ధర్మాలు. అసహజమైన రీతిలో అభివృద్ధిని సాధించే క్రమంలో జీవితంలో
ఆయాచితంగా లభించే అందాలని, ఆనందాలని, అనుభవాలని శాశ్వతంగా కోల్పేయే ప్రమాదం పొంచి ఉందని రాబర్ట్ మిన్హాస్ అభిప్రాయం. బాల్యం అనేది తాపీగా, ప్రశాంతంగా, సహజంగా ముందుకు సాగవలసిన వికసన దశ. తద్విరుద్ధంగా జరిగితే అందమైన బాల్యం అందకపోవడమే కాదు.. ముందు ముందు అనుభవించాల్సిన ఆనందకర జీవితాన్నీ చే జేతులా దుంప నాశనం చేసుకున్నట్లే లెక్క. బాలల మనస్తత్వ శాస్త్రవేత్తల
హెచ్చరికలను పెడ చెవిన బెడితే జగత్ జీత్ సింహ్ షాయిరీ ' యే దౌలత్
భి లే లో/ యే షొహరత్
భి లే లో/ భలే
ఛీన్ లో ముఝ్ సే మేరీ జవానీ/మగర ముఝ్ కో లౌటా దో బచ్ పన్ కా సావన’ అని పాడుకునేందుకైనా అందమైన బాల్యం అందుబాటులో లేకుండా
పోవచ్చు.
బాలలే కాదు ..తల్లిదండ్రులూ అప్రమత్తమవాల్సిన తరుణం ముంచుకస్తోంది మరి.. తస్మాత్ జాగ్రత్త!
--కర్లపాలెం హనుమంతరావు
***
(బాలల దినోత్సవం సందర్భంగా నవంబరు 14, 2014 నాటి ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుటలో ప్రచురితం)
No comments:
Post a Comment