కామేశ్వర్రావంకుల్ ఈ సారి అమెరికానుంచి తిరిగొచ్చిన తరువాత
కార్లో ఊరేగడం మానేసి సైకిల్ పట్టుకొని తిరగడం మొదలుపెట్టాడు. ిరికే తిరిగితే
ఫరవాలేదు.. ఏవేవో కాగితాలూ అవీ పంచడం.. ఉపన్యాసాలు దంచడం ఎక్కువయిందిప్పుడు! ఆయన
నీడ కనబడినా.. సైకిల్ బెల్ వినబడినా పక్క సందులోకి తప్పుకోవడం తప్పనిసరయిపోయింది
కాలనీ జనాలకి.
మా సర్వసుఖీకాలనీ ఫౌండర్ మెంబర్ ఆయన. పాతికేళ్లకిందట ఏజీ
ఆఫీసులో పనిచేసే రోజుల్లో సొసైటీ పెట్టి మా మామగారిలాంటివాళ్లచేత బలవంతంగా సైట్లు
కొనిపించాడు. కోర్టుల చుట్టూతా తనే తిరిగి లిటిగేషన్లీ సెటిల్ చేయించి ఆనక అందరి
వెంటాబడి ఇళ్ళు కట్టించాడు. అప్పుట్లో దమ్మిడీ విలువ చెయ్యని స్థలాలు . ఇప్పుడు
గజం పాతికవేలు పెట్టి కొంటామన్నా అమ్మేవాడు లేడు. 'మనవివాళ ఇలాంటి స్థితిలో ఉన్నామంటే కామేశ్వర్రావంకులే కారణం' అంటుంటారు మావారు. కాలనీజనాలందరికీ ఆయనమీద అదే గౌరవం.
అంకుల్ గారబ్బాయి అమెరికాలో పెద్ద పేరున్న డాక్టరు.
అప్పుడప్పుడు ఈయనే వెళ్ళివస్తుంటాడు అక్కడికి. 'అక్కడే ఉండిపోవచ్చుగదా అంకుల్?' అని ఎవరైనా అడిగితే '
కాలనీకూడా నాకు కొడుకుతో సమానమే. వాడంటే అక్కడ డెవలప్పయిపోయాడు.
ఇక్కడ కాలనీ డెవలప్ మెంటుని ఎవరు చూస్తారర్రా? ఇదీ నా బాధ్యతే
కదూ!' అనే ఆయన అంకితభావాన్ని చూస్తే ఎవరికి మాత్రం గౌరవభావం
కలగదూ.. చెప్పండి!
ఊళ్ళోకే కొత్తవైద్యం వచ్చినా దాన్ని నెత్తిమీదేసుకొని
కాలనీలో ఊరేగందే తోచదాయనకు. అడిగినవాళ్లకీ అడగనివాళ్లక్కూడా ఆరోగ్య సూత్రాలు
వినిపించడం ఆయన హాబీ. కాదు.. కాదు.. హేబిట్!
మూడురోజుల కిందట మా వారు కారు సర్వీసింగుకిచ్చి నడిచి
వస్తుంటే.. రాయి తగిలి చెప్పు తెగిందట. కుంటూ కుంటూ నడుస్తూ కామేశ్వర్రావంకుల్
కళ్లల్లో పడ్డారు.. పాపం. తప్పుకొనేందుకు దారిలేదు. చెప్పు తెగిందాయ! 'కాలికేమయిందీ? కుంటుతున్నావూ?'
అంటూ ఇంటిదాకా వెంటబడి వచ్చాడు అంకుల్. చెప్పు తెగిందని
చెప్పనిస్తేనా? 'కారణం లేకుండా కాలికి నొప్పొస్తే కిడ్నీ
ప్రాబ్లం కావచ్చు. షుగరున్నా అలాగే అవుతుంది. మీ నాయనకు షుగర్ లేదే! మీ
అమ్మగారికుందేమో! వంశపారంపర్యంగా వచ్చే చాస్ను ఎక్కువ నాయనా! అందుకే నీకంత పెద్ద
కళ్లజోడు. అశ్రద్ధ చేస్తే గుడ్డివాడివైపోతావ్! చెప్పులుకూడా లేకుండా
తిరుగుతున్నావే! షూస్ వేసుకో! సాక్సు వదులుగా ఉండాలి. పాదాలు మురిగ్గా ఉండకూడదు!
ఒకసారి నేను క్లీన్ చేసి చూపిస్తానుండు!' అంటూ గభాలున మావారి
పాదాలను పట్టేసుకొని వెంటవున్న బ్రష్ తో తోమడం మొదలుపెట్టాడు! గజేంద్రమోక్షంలోని
ఏనుగుటైపులో గిజగిజలాడుతున్నారు మావారు. 'పెద్దవారు! మీరు నా
కాళ్ళు పట్టుకోవడమేంటి అంకుల్?' అని వారించబోతే 'ఫర్లేదులేవయ్యా! వసుదేవుడంతటివాడు గాడిదకాళ్ళు పట్టుకోలేదూ!
విద్యంచేసేవాడికి రోగే నారాయణుడు' అంటూ చేతుల్తో కాళ్లనూ,
మాటల్తో మెదడునూ తోమేస్తున్న ఆయన్నుచూసి నాకు మోహినీ అవతారం ఎత్తక
తప్పింది కాదు!
వేడి వేడి కాఫీ కలిపి తెచ్చి అంకుల్ ముందుంచాను. మావారి
పాదపద్మాలను పక్కన పారేసి కాఫీరసాస్వాదనలో మునిగిపోయాడాయన. శ్రీవారు బతికి
బైటపడిపోయారు. తన గదిలోకి దూరి తలుపులు బిడాయించేసుకొన్నారుకూడా.
'అబ్బాయికి మొహమాటం కాస్త ఎక్కువ లాగుందమ్మాయ్! కాలికి
దెబ్బేమైనా తగిలిందేమో చూడు! షుగరుంటే ఓ పట్టాన తగ్గదు. చిన్నదైనా పెద్దదైనా
దెబ్బను నిర్లక్ష్యం చేయద్దు! జ్వరం కాసినా, నొప్పిపెరిగినా వెంటనే మాత్రలు వేసుకోవాలి. అన్నీ నేను పంపిస్తా! షుగర్
పేషెంట్ ఎప్పుడూ మందులు దగ్గరుంచుకోవాలి. రేప్పొద్దున మళ్లీ ఒకసారి వచ్చిచూస్తాలే!
ఈలోగా రియాక్షన్ గానీ, ఎలర్జీగానీ వస్తే ఎవిల్ మాత్రలు వేయ్!
జ్వరమొస్తే క్రోసిన్, దగ్గయితే లోమోఫిన్.. వాంతులయితే
పెరినారమ్' అంటూ బైలుదేరిన మనిషి మళ్లీ వెనక్కి వచ్చి 'కాఫీ అమృతంలాగుంది అమ్మడూ! అబ్బాయికి మాత్రం చెక్కెర తక్కువ కాఫీ
ఇస్తూండు!' అన్నాడు.
కొడుకు మెడిసన్ చదివే రోజుల్లో ఆ అబ్బాయి క్లాసు పుస్తకాలు
కాలక్షేపంకోసం ఈయనా చదివేవాడుట. వైద్యాన్ని అశాస్త్రీయంగా చదివినంత ఉపద్రవం మరోటి
లేదు. విన్నవి, కన్నవి అన్నీ తమకో తమ
చుట్టుపక్కలవారికో ఉన్నవనిపించే ప్రమాదం జాస్తి. దానికి సజీవ తార్కాణమే
కామేశ్వర్రావంకుల్ పురాణం.
కొడుకును చూట్టానికి వెళ్ళొచ్చిన ప్రతిసారీ ఓ కొత్తజబ్బు
పేరు పట్టుకొని వచ్చి ప్రాణాలుతీయడం ఆయనకు పరిపాటే. ఆ మధ్య ఒకసారిలాగే 'ఆంత్రాక్స్.. ఆంత్రాక్స్' అంటూ కాలనీ అంతా హడలుగొట్టేసాడు.
మూడేళ్లకిందట పోయొచ్చినప్పుడు 'ఎబోలా.. ఎబోలా' అని లబోదిబోమన్నాడు. 'ఎల్లోఫీవరు' పేరు చెప్పి వణికిస్తున్నప్పుడు 'ఇక్కడి వాతావరణానికి అలాంటి జబ్బులు రావయ్యా మగడా!' అని
ఎవరెంత మొత్తుకొన్నా వింటేనా! ఇదిగో ఈసారి కొద్దిగా నయం. ఇండియాకు మ్యాచయ్యే
జబ్బును పట్టుకొచ్చాడు. దాని పేరు 'డయాబెటిస్ మిల్లిటస్'. అందరం మామూలుగా అనుకొనే షుగర్
కంప్లయింట్. 'ఇందులోనూ రెండు రకాలున్నాయండోయ్! మొదటి రకం
మామూలుదే. నూటికి నలభైమందికొచ్చేదే. నలభై దాటిన వాళ్లకు వచ్చే చాన్సు ఎక్కువ. రెండో రకం కొద్దిగా డేంజర్.
షుగర్ కంట్రోల్లో ఉంచుకోకపోతే కళ్లకి, కిడ్నీలకి, నరాలకి, రక్తనాళాలకి కూడా ప్రమాదమే. ఒకసారి వస్తే
వదిలే జబ్బు కాదిది. దిగులుపడుతూ కూర్చుంటే తరిగేదీ కాదు. పైపెచ్చు పెరుగుతుంది
కూడా. కంట్రోల్లో ఉంచుకోవడ మొక్కటే మన
చేతుల్లో ఉండేది.' అంటో ఉపన్యాసాలు దంచుతున్నాడీ మధ్య మరీ.
ఒకసారి ఆయన వచ్చే వేళకి మావారు మసాలా వడలు లాగిస్తున్నారు
ఇష్టంగా. పక్కనే పాయసం గ్లాసు. ఇటువైపు ఫ్రూట్ జ్యూసు. మా మ్యారేజ్ డే సందర్భంగా
నేనే తయారుచేసాను ఇవన్నీ ప్రత్యేకంగా. 'మీ ఆయనకు షుగరుందని అన్నావు కదమ్మా!' అన్నాడాయన
ప్లేటువంక.. నా వంక మిర్రిమిర్రి చూస్తూ.
షుగరూ లేదు.. వగరూ లేదు. చూడ చక్కని ఫిగరు నిజానికి
మావారిది. అసలా ఫిగర్ని చూసే కదా వలచి వరించి నేను చేసుకొందీ! ఒకవేళ ఏదైనా ఉంటే
వెళ్లి వెళ్లి ఎవరైనా ఈ అంకుల్తో
చెప్పుకొంటారా? చెబితే మాత్రం సవ్యంగా అర్థం
చేసుకొంటాడా? తన ధోరణే తనదయిపాయ!
'ఆయనకలాంటి జబ్బేమీ లేదు లేండి!' అన్నాను అక్కడికీ ఉండబట్టలేక.
'ఇవాళ లేకపోతే రేపు రాదని గ్యారంటీ ఏంటీ? ప్రివెన్శన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రోగ
నివారణకన్నా రోగ నిదానం ప్రధానం కదమ్మా!ఈ స్వీట్లేమిటీ?! ఈ
జ్ఉసులేమిటీ?! ఇవన్నీ మానెయ్యాలమ్మాయ్! నేను చెప్పినట్లు చెయ్!
పొద్దున్నే ఆరు ఏడూ మధ్య ఒక లోటాడు నిమ్మరసం..' మావారు అదేపనిగా పళ్ళు నూరుకొంటుంటే చూడలేక వంటింట్లోకి
పరుగెత్తా. అక్కడిక్కూడా వినబడుతున్నాయ్ అంకుల్ మాటలు!
కాలింగ్ బెల్ మోగింది. మళ్లా హాల్లోకొద్దును గదా.. పాపం
మావారు మంచినీళ్ళు తాగుతూ కనిపించారు. అంకుల్ మాత్రం ఒక్కో ప్లేటే ఖాళీచేస్తూ
కనిపించాడు మధ్య మధ్యలో మా వారికి
సలహాలిస్తూ. ' ఆ షుగరేదో ఈయనగారికే రాకూడదా
భగవంతుడా!' అని పళ్ళు నూరుకొంటూ వెళ్ళి తలుపు తీసాను.
ఎదురుగా రంజిత.. రమణ!
రంజిత చేతిలోని పాపను అందుకొంటూ లోపలికి నడిచాను. పరిచయాలయ్యాయి అంకుల్తో.
రంజిత మా చెల్లెలు క్లాస్ మేట్. రమణ బ్యాంకాఫీసరు. ఈ మధ్యనే చెన్నైనుంచి ట్రాన్స్ఫరై
ఇక్కడికొచ్చారు. క్వార్టర్సు దొరికేవరకు అకామిడేషన్ కావాలంటే మావారిని ఒప్పించి పై
పోర్షను ఇప్పించాను.
ఇద్దరూ చిలకా గోరింకల్లా ఉంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్
కాంపిటీషను కెళితే ఫస్టు ప్రైజ్ గ్యారంటీ.
పదినెలల పాప ఉంది వాళ్ళకి.
అంకుల్ కి పిల్లల్ని చూస్తే వల్లమాలిన ప్రేమ. పాపను ఒళ్లో
కూర్చోబెట్టుకొని పరీక్షగా చూస్తున్నాడు. పసిదానిక్కూడా ఎక్కడ షుగర్ అంటగడతాడోనని
హఠాతుగా కరెంటు పోయింది. కేండిల్ వెలిగించేలోపున కాళ్లకి చెప్పులేసేసుకున్నాడు ఆయన.
చీకట్లో ఒక్క క్షణం బైట ఉండలేడు అంకుల్.
'ఆ అబ్బాయిని ఎక్కడో చూసినట్లుందమ్మాయ్!' అన్నాడో రోజున రమణ ప్రసక్తి వచ్చినప్పుడు.
రమణావాళ్ళు ఈ ఊరొచ్చి నెలకూడా కాలేదు. ఎక్కడ చూసుంటాడు..
చాదస్తం కాకపోతే!
రంజిత వాళ్లు క్వార్టర్సు దొరికి వెళ్లిపోయారు. ఇప్పుడు అప్పుడప్పుడప్పుడు
ఫోన్లలో పలకరించుకోవడమే!
ఈ మధ్య ఫోన్లో కలిసికూడా చాలా రోజులయింది. పాపను
చూడాలనిపించి నేనే వెళ్లానో రోజు
రంజిత చాలా ముభావంగా ఉంది. ముపటి చురుకుతనం లేదు! తరిచి
తరిచి అడిగితే బావురమని ఏడ్చేసింది. 'ఈ మధ్య ఆయన చాలా మారిపోయారక్కా! ఇల్లుకూడా పట్టకుండా తిరుగుతున్నారు.
హైదరాబాదసలు రాకుండా ఉండాల్సింది' అంటో వెక్కిళ్ళు పెట్టి
ఏడ్చేసింది.
వివరంగా చెప్పమన్నా.
'ఇది చదువు నీకే తెలుస్తుంది' అంటూ ఒక డైరీ అందించింది. అది రమణ పర్శనల్ డైరీ. పరాయివాళ్ళ డైరీలు చూడడం
తప్పు. అయినా చెల్లెలులాంటి రంజిత సంసారంకోసం చూడక తప్పింది కాదు.
రమణ దస్తూరీ చక్కగా ఉంది.. అతనిలాగే.
'డియర్ మధూ! నా అణువణువూ నువ్వెప్పుడే స్వాధీనం
చేసుకొన్నావు. ప్రాణానికన్నా ప్రేమించే రంజితనుంచి నన్ను దూరం చేయడం నీకు భావ్యమా? ఎంత వద్దనుకున్నా వదలడంలేదే నీ ఊహలు! ఈ
విషయం నా భార్యకు తెలిస్తే తట్టుకోగలదా? నాకు కంటిమీద కునుకే
లేకుండా చేసావు. ఎందుకు నామీద నీకింత మధురకక్ష? ఈ వయసులో నా
పాలబడ్డావే! నా రక్తంలో కలగలసిపోయి నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు.. 'ఇలాగే సాగింది అంతా!
'ఎవరీ మధు?'
తెలీదన్నట్లు తలూపింది.
'ఇప్పుడేం చేద్దామనుకొంటున్నావ్?'
రంజిత మాట్లాడకుండా పాపకేసి చూస్తూ కూర్చుంది. ఉబికి
వస్తోన్న కన్నీటికి అడ్డుకట్ట వేయాలని వృథా ప్రయత్నం చేస్తుందా పిల్ల!
'నువ్వు ధైర్యంగా ఉండాలి. తొందరపడద్దు! నేను కనుకుంటాగా!
అన్నీ చక్కబడతాయి!' అని తోచినమాటలు నాలుగు చెప్పి
వచ్చేసానక్కణ్ణుంచి.
మావారిని సలహా అడిగాను. 'కామేశ్వర్రావంకుల్ కౌన్సిలింగు తీసుకోమను!' అన్నారు.
దటీజ్ నాటే బ్యాడ్ ఐడియా!
కాలనీకి పెద్దాయన. అందరికీ కావాల్సిన వాడు. అదీగాక ఆయనకు
పెద్ద సర్కిలుంది. తలుచుకోంటే ఈ వ్యవహారాన్ని ఇట్టే తేల్చేయగలడు.
రంజితను ఒప్పించి ఆ డైరీ చూపించాను ఆయనకు. చదివి 'రమణతో మాట్లాడాలి ముందు' అన్నాడు.
రెండు రోజులతరువాత రంజిత ఫోన్ చేసింది. హుషారుగా ఉందా
గొంతు. 'అక్కా! అంకుల్ ఇక్కడే ఉన్నారు.
వీలయితే ఒకసారి వస్తావా?' అనడిగింది.
నేను వెళ్ళిన సమయానికి రమణ ఇంట్లో లేడు. కామేశ్వర్రావంకుల్
పాపను ఒళ్లో కూర్చోబెట్టుకొని వేడివేడి కాఫీ ఊదుకుంటూ తాగుతున్నాడు. ఎదురుగా ఆయన
ఖాళీ చేసిన ప్లేట్లు! పెద్ద ట్రీటే ఇచ్చినట్లుంది రంజిత.
'ఏమిటి విశేషం?' అనడిగాను కుతూహలంగా.
'మధుమోహం' అనాడాయన
విచిత్రంగా నవ్వుతూ. అర్థం కాలేదు. వివరంగా ఆయనే చెప్పుకొచ్చాడు. 'కడుపులో మంటగా ఉంటే అల్సర్ అంటాం మనం. వీళ్లాయన ఉన్నాడు చూసావూ! 'హృదయబాధ' అంటాడు. కవి గదా!
ఒక్క ముక్క అర్థమయితె ఒట్టు. అయినా చేయగలిగిందేమీ లేదు.
అంకుల్ చెప్పేది వింటూ 'ఊఁ'
కొట్టడం మినహా.
'వీళ్లాయనకు డయాబెటిస్'
హతోస్మి! మళ్లీ టాపిక్కుని రోగాల పట్టాలమీదకు ఎక్కించేసాడు.
ఆ బండి ఇంకెక్కడాగుతుందో దెవుడికే తెలియాలి.
'.. యూరిన్ ఎక్కువగా పోతోందని..విపరీతమైన ఆకలని.. నీరసంగా
ఉంటోందని.. ఇలాగే ఇంకా ఏవేవో సిమ్టమ్స్ కనిపిస్తే డాక్టరుగారి సలహామీద షుగర్
టెస్టులు చేయించుకొన్నాట్ట. పాజిటివ్ అని తేలింది. అప్ సెట్టాయ్యాడు. పెళ్లానికి చెబితే ఎక్కడ బెంబేలు పడుతుందోనని
తనలోనే దాచుకొన్నాడు. అయినా దిగులు దిగులే కదా! చెక్కరవ్యాధికి 'మధు' అని ఒక చక్కని
ట్యాగ్ తగిలించి ఆ ఊహాప్రేయసికి ప్రేమలేఖలా డైరీలో రాసుకొన్నాడు. ఎంతైనా కవికదా! ఈ
అమ్మాయికి ఆ కవిహృదయంలేక కంగారుపడింది. ఇదిగో రమణ మెడికల్ సర్టిఫికేట్' అంటూ ఒక రిపోర్టు చూపించాడు.
అందులో రమణకు 'డయాబెటిస్ మిల్లిటస్ పాజిటివ్' అని స్పష్టంగా ఉంది.
'రోగాలను కవితారాగాలతో జతచేస్తే ఇలాగే కత అపార్థాలకు.. ఆనక అనర్థాలకు దారి తీస్తుంది.ఇహనైనా అపోహలేవీ
పెట్టుకోకుండా మీ ఆయన్ని చక్కగా చూసుకో అమ్మా! తీపి తిననీయద్దు. ఆహారం ఎంత చేదుగా
ఉంటే మీ సంసారం అంత తీయగా ఉంటుంది. మీ అయన రాసిన కవితకి ఇదే తగిన శిక్ష. ఇలాగే తీర్చుకోవాలి నీ కక్ష. వగరే మీ కాపురానికి శ్రీరామ
రక్ష' అని నవ్వుతూ వెళ్ళిపోయాడు
కామేశ్వర్రావంకుల్.
మూడునెలలు కాకుండానే రమణకు ట్రాన్స్ఫరొచ్చింది!
రంజితావాళ్లను బండెక్కించి వచ్చిన రోజు రాత్రి అంకుల్ మా
ఇంటికి భోజనానికి వచ్చాడు.
'కాఫీ ఇవ్వమ్మా! షుగరొద్దు!' అన్నాడు.
'నాక్కూడా!' అన్నారు
మావారు.
'నీకేమోయ్.. భేషుగ్గా ఉన్నావుగా!'
'మీరు షుగర్ అంటారని ముందే వద్దనేసానంకుల్!' అన్నారీయన బుద్ధిగా.
'ఈ వయస్సులో నీకు షుగరేమిటోయ్?' అనేసాడు అంకుల్. బిత్తరపోవడం మా వంతయింది.
'రమణకు రాలేదూ! అలాగే!' అన్నారీయన తెగించి.
'రమణకు మాత్రం షుగరుందని ఎవరన్నారూ?'
అవాక్కయిపోయాం నేనూ.. ఈయనా!
ఈయన నాలిక్కి నరంలేదా?
'మరి ఆ మెడికల్ రిపోర్టు?!'
'మావాడి ఫ్రెండ్ లెటర్ హెడ్ మీద నేనే టైప్ చేసి తెచ్చా!' అన్నాడు కాఫీ చప్పరిస్తూ తాపీగా.
'మరి మధు.. వగైరా వగైరా?!' అనడిగాను ఉండబట్టలేక.
'ఆ మధు ఎవరో కాదు. నా మేనకోడలు కూతురు. రమణ ఆఫీసులోనే
పనిచేస్తోంది. దానికి వీడు వల విసిరాడు. ఆ డైరీలో వాడు రాసుకొంది నిజంగా మధును
గురించే. నువ్వు నాకు చూపించి మంచిపని చేసావు. రంజిత ఏడుస్తుందని 'మధుమోహం' కథ అల్లా. మీ
వాడికి మూణ్ణెల్లలోనే బదిలీ ఎలా వచ్చిందనుకొన్నావ్? బ్యాంకు
ఎమ్.డీకి చెప్పి నేనే చేయించా. ఈ ముక్క
చెప్పిపోదామనే ఇంతరాత్రివేళ పడుతూ లేస్తూ వచ్చింది. తెల్లారి ఫ్లైటుకే నేను మా వాడిదగ్గరకు
పోతున్నా. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో.. ఏమో అని..'
కామేశ్వర్రావంకుల్ ఎంత మంచిపని చేసాడు. అందుకే ఆయనంటే
మాకందరికీ అంత గౌరవం.
మళ్ళీ కొంతకాలం మా సర్వసుఖీకాలనీ నిశ్శబ్దంగా ఉంటుంది
కాబోలు! ఈ సారొచ్చినప్పుడు ఇంకేం కొత్త ఉపద్రవం తెస్తారో చూడాలి!
రెండువారాలకనుకొంటా.. తెల్లవారు ఝామున పాలపాకెట్లకని బైటికి
వెళ్ళిన మావారు కళ్లనీళ్ళు పెట్టుకొంటూ తిరిగొచ్చారు. 'కామేశ్వర్రావంకుల్ కోమాలోకి పోయాట్ట!'
'ఆయనకీ షుగరుంది. అదీ రెండో టైప్. మహా డేంజర్. పోయినసారి
కొడుకుదగ్గరికి వెళ్లినప్పుడే కన్ఫాం అయిందట. పోవడం ఖాయమని ఆయనకీ తెలుసు. అయినా
కాలనీ అంతా ఎంత సందడిగా తిరిగేవాడు!
'లక్షల్లో ఒకడుంటాడు అలాంటి వాడు' అన్నారు మావారు దుఃఖం దిగుమింగుకొంటూ.
నిజమే! అందుకే లక్షలో
ఒకరికొచ్చే జబ్బు ఆయనకొచ్చింది. తను పోతానని తెలిసీ అందరూ ఆనందంగా ఉండాలని
ఎంతలా ఏడిపించుకు తిన్నాడూ!
తలుచుకొంటుంటే నాకూ ఏడుపు ఆగడం లేదు!
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు 'ఆదివారం
అనుబంధం' 22 సెప్టెంబరు 2002 నాటి సంచికలో
పేరుతో ప్రచురితం)
No comments:
Post a Comment