Thursday, July 16, 2015

అమెరికావాడి తెలుగు పుష్కర స్నానం- ఓ సరదా గల్పిక


చికాగోనుంచి మా చిన్నాన్నగారబ్బాయి చిట్టిబాబు ఫోన్ చేసాడు. 'మొత్తం పాతిక మందిమి.. మునగడానికని వస్తున్నాం. అదేరా! గోదావరీ పుష్కరాలు కదా! ఆ ఏర్పాట్లూ.. అవీ చూసే పూచీ నీదే!' అంటూ.
'ఇంతమంది ఒక్కసారి వచ్చిపడితే గోదారిలో నీళ్ళు చాలద్దూ!' నేను మధన పడుతుంటే మా మాధవగాడే గాడ్లా వచ్చి ఆదుకొన్నాడు. గోదారీనేగదరా! డోంట్ వరీ సోదరా! అమెరికాలో మునగడానికి గోదావరుండదుగదా! చికాగోనుంచి వస్తున్నారాయ.. పాపం.. చికాకుపడితే ఎలాగురా తమ్ముడూ! నీ చుట్టమేనంటుంటివి! ఎలాగో చూద్దాంలే మరి!' అని నన్ను ఓదార్చాడు.
ఆ సాయంత్రమే టక్కూ.. టయ్యీ.. కట్టిన శాల్తీ ఓటి 'టక్.. టక్' మంటూ  మా ఇంటి తలుపు తట్టింది. మోహాన కాసంత గంధబ్బొట్టు మినహా మనాడే అనుకోడానికి ఇంకేం దాఖలాల్లేవు. అంత మంచిగా ఇంగ్లీషు దంచుతున్నాడు మరి. 'మై నేమీజ్ మిస్టర్ డూబే! మీ మాధవర్రావ్సాబ్ పంపించాడు సార్!' అంటూ ఏవేవో ఫారాలిచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేయమని కూర్చున్నాడు. హేండౌట్ ఇచ్చి డౌట్లేమన్నా ఉంటే అడగమన్నాడు.
కరపత్రం కడు రమణీయంగా ఉంది.
'పన్నేండేళ్లకోసారి వచ్చే పవిత్ర గోదావరీ పుష్కర సంబరాలివి. మీరు జీవితంలో మర్చిపోలేనంత మధురఘట్టంగా మార్చే పూచీ మాదీ! రాజమండ్రి టు నర్సాపూర్ వరకు గోదారి నది వడ్డు పొడుగూతా ఒడ్డూ పొడుగు ఉన్నవస్తాదులు మిమ్మల్ని ముంచేందుకు సదా సిద్ధంగా ఉంటారు.' అన్నాడు.
'వస్తాదులెందుకబ్బా?!'
'ముంచేటప్పుడు మీరు కొట్టుకుపోకుండా సార్! ఒక్క ఫోన్ కాల్ చాలు!  కాలు కదపకుండా గోదారి నది మీ పాదాల చెంతకే పరుగులెత్తుకొంటూ వస్తుంది. పోనీ ఆ ప్లానులో చేరి మునగండి సార్!' అన్నాడు మిస్టర్ డూబే.
' నా తటపటాయింపు అందుక్కాదయ్యా బాబూ! ఫీజును గురించే పీకులాట! ముక్కు మూసుకొని మూడు మునకలేసేందుకు   తలకు పదమూడు వేలా?!
'టోకున మునిగితే డిస్కౌంటుంటుంది సార్! ముసలివాళ్ళకు, పసిపిల్లలకు చెంబుస్నానాలు మా స్పెషాలిటీ! స్త్రీలను ప్రత్యేకంగా ముంచే ఏర్పాట్లూ ఉన్నాయండీ! సిక్కులకు మినరల్ వాటర్ మిక్సుడ్ షవర్ బాతులు'
'తలపాగాలు అడ్డొస్తాయనా పాపం?'
'సిక్కులంటే సర్దార్జీలనుకొన్నారా! భలే సర్దా మనుషుల్సార్ మీరూ! 'సిక్కు'లు మీన్స్ రోగులని అర్థం. విఐపిలకు విడిగా వేణ్నీళ్ల స్నానం..'
'శుద్ధి చేసిన వాటర్ గదరా! కొద్దిగా ఫీజు ఎక్కువే ఉంటుంది మరి.' అని అందుకొన్నాడు అప్పుడే వచ్చిన మాధవగాడు. 'సౌకర్యాలు చూసుకోరా! ఫీజెంత చౌకో అర్థమవుతుంది. సొంతంగా వెళ్ళాలంటే ఎంతవుతుందో తెలుసా?టిక్కెట్టు దొరకడానికే చచ్చే యాతన. రద్దీలో ఏదీ దొరికి చావదు. దొరికినా అ ధరలుండేది నేలమీద కాదు. అదే డూబే వాళ్లయితే అంగవస్త్రంనుంచి.. గోచీపాతవరకు అన్నీ అద్దెకిస్తారు. నిదానంగా అన్ని దానాలు దగ్గరుండి చేయిస్తారు. పురోహితుణ్నీ.. పితృదేవతల్నికూడా వాళ్లే చూసిపెడతారు..తెలుసా!'
'మరే..' అన్నాడు మిస్టర్ డూబే సెల్ఫోన్లో ఏవేవో నెంబర్లు టకటకా కొట్టేస్తూ.
పితృదేవతల్ని ఇప్పుడే బుక్ చేస్తున్నాడేమో కొంపదీసి! ఎంత ఫాస్టు! డూబే జోరు చూస్తుంటే నాకిప్పుడే వెళ్ళి గోదారిలో బుడుంగుమని మునగాలనిపిస్తోంది.
బేడ్ లక్!  పుష్కరాల రెండువారాలూ నాకు సింగపూరు డెప్యుటేషన్ డ్యూటీ!'
'సరిగ్గా మీలాంటి వాళ్లకు సరిపడే స్కీముకూడా ఉంది సార్ మా దగ్గర! ఆఫీసులో.. బిజినెస్ లో మీరు బిజీగా ఉన్నా ఫర్వానై.  ఫీజు కట్టండి చాలు. మీ తరుఫున మరొకర్ని ముంచేస్తాం. ఆ పుణ్యం మొత్తం మీకే బదిలీ అయే ప్రత్యేక పూజకూడా ఈ ప్యాకేజీలోనే ఇన్ క్లూడెడ్!' అంటూ ఇంకో ఫారం.. ఫైలునుంచి బైటికి తీసాడు మిస్టర్ డూబే. ఆ ఫైలునిండా ఎన్ని ఫారాలోరా బాబూ!
'నాకూ ఓ టోకెన్ తీసుకోండి! నలుగుర్లో స్నానమెలాగబ్బా అని ఇందాకట్నుంచీ తటపటాయిస్తున్నా. నౌ ప్రాబ్లం సాల్వుడ్..' అని తగులుకొంది మా శ్రీమతిరత్నం. ముక్కుమూసుకొని మునక్కుండానే ముక్కోటి దేవతలనూ అర్చించే పుణ్యఫలం ఇంత  సులభంగా వచ్చేస్తుంటే వదులుకొంటుందా మా ఆవిడ!
పాచినీళ్ళలో మునిగే బాద లేదు. వరదనీళ్లలో కొట్టుకుపోయే రిస్కంతకన్నా లేని స్కీము. పదివేలు మనవి కాదనుకొంటే సరి! పుష్కలంగా పుష్కర పుణ్యం!
'ఊరికే వాగ్దానాలు చేసి ఓట్లు దండుకుపోయే నాయకులు ఇలాంటి ఉచిత పథకాలు ప్రవేశపెటి ప్రజలనెందుకు పునీతుల్ని చెయ్యరో! మళ్లీ ఎన్నికలొస్తాయిగా! అప్పుడడాగాలి. కడిగిపారేయాలి'      అనుకొన్నాను డూబేకి డబ్బులు సమర్పించుకొంటూ.
 అమెరికా బ్యాచి గోదావరి పుష్కర స్నానాలలా ఖాయామైనాయా! తీరాపోతే  ఆ అమెరికానుంచి తీరిగ్గా విమానం దిగింది ఒక్క శాల్తీనే! అదీ తెల్లతోలు. తెల్లబోవడం మా వంతయింది.
తెలుగు బ్యాచంతా తీరికలేనంత పనుల్లో తలమునకలై ఉన్నారంట! డబ్ల్యు డబ్ల్యుడబ్ల్యు డ్రౌనింగ్ డాట్ కమ్ అని కొత్తగా ఓ వెబ్-సైట్ పెట్టే పనిలో ఉన్నార్ట!
'ఇంట్లోనే కూర్చొని ఇన్టర్నెట్లో పుష్కర స్నానాలు చేయించడం.. ఇండియన్ పితృదేవతలకు అమెరికానుంచే పిండప్రదానాలు వదిలించడంలాంటివి మా లక్ష్యాలు. దానికి తగ్గ సాఫ్ట్ వేరు.. యాప్స్ డిజన్సులో పిచ్చ బిజీగా ఉన్నాం. ఇదిగాని సకెస్ ఐతే నట్టింట్లోకే గోదావరి నదిని తెప్పిస్తాం. పెరట్లోనే పుష్కర స్నానాలు జరిపిస్తాం' అంటూ ఏదేదో సోది రాసాడుగాని చిట్టిబాబు.. దానికన్నా   ఈ తెల్లతోలుని గురించి చేసిన పరిచయముంది చూసారూ.. అదీ మనకిప్పుడు ముఖ్యం.
'ఈ తెల్లబాబుకి తెలుగునదుల్లో మునిగి తరించాలని తెగ ఉబలాటంగా ఉంది. అందుకనే మా అందరికీ బదులుగా పంపిస్తున్నది. మా బాసే. బీ కేర్ ఫుల్! జాతకం ప్రకారం వీడికీ ఏడాది జలగండం ఉంది. మునిగే ముందు మందు కొట్టకుండా చూసుకోండి! చాలు' అంటూ చాలా జాగ్రత్తలుకూడా చెప్పుకొచ్చాడు చిట్టిబాబు.
తెల్లాయన ఊళ్లో ఉన్నంతకాలం నాకు తెల్లారేదెప్పుడో.. రాత్రి గడిచేదెప్ప్డో.. తేడా తెలీకుండా  గడిచిపోయింది. అమెరికా దేవదాసుగారికి కుక్కకాపలా కాయడం నా పనయిపోయింది. ఇంత కష్టపడ్డా పుష్కర స్నానానికని బైలుదేరాల్సిన రోజు పరగడుపునే  బాత్ రూంలో కాలు జారిపడ్డారు దొరగారు. గోదారిలో మునగవలసినవాడు అపోలోలో తేలాడు.

ఏదేమైనా సరే నదిలో మునిగి తీరాల్సిందేనని మంకుపట్టు! కట్లతో అలాగే డిశ్చార్జి  చేయించుకొని.. మంచంమీదనే బాసరవైపుకి తరలించుకుపోయే ఏర్పాటు చేసింది  మిస్టర్ డూబే బ్యాచి!

తిరిగొచ్చిన తరువాత చూడాలీ తెల్లబాబుగారి ఆనందం! తెలుగువారి పుణ్యనదుల జలసౌందర్యాన్ని వేంగీక్షేత్రం విశ్వనాథవారికన్నా విశిష్ఠంగా పొగడ్డం! ఎంత గోదావరి జలమైనా ఒక్క పూట మునక్కే ఇంత కవితావేశమా! మన చోటా నాయుడు లెవెల్లో వీడియోకూడా ఒకటి తీసాట్టగానీ.. విడిగా ఫీజులు అవీ  కట్టలేదని ఆఖర్లో ఎవరో పీకి పారేసారుట! 'పవిత్ర స్థలాల్లో ఫొటోలు తీయడం పాపం' అని విని చెంపలేసుకొని పరిహారంకింద పన్నెండొందలుకూడా వదిలించుకొన్నానని చెప్పుకొచ్చాడు.. పాపం.. నీతిమంతుడు!
'దిన్ మేజిక్ ల్యాండ్ ఈజ్ ఫుల్లాఫ్ వండర్ ఫుల్ మిరకల్స్!' అంటో ఫ్లైటెక్కిందాకా ఒహటె మురుసుడు!

తెల్లాయన అమెరికా చేరిన మూడో రోజే చిట్టిబాబునుంచి ఫోన్!
చిటపటలాడిపోతున్నాడు నా మీద. 'ఇష్టం లేకపోతే ముందే చెప్పాలిరా! .. గోదావరికి దారి తెలీకపోతే కనుక్కోవాలిగాని.. దారిలో అడ్డొఛిన మూసీలో మునకలేయిస్తార్రా స్కౌండ్రల్స్! అదే గోదారనుకొని పాపం మా బాసు మాఅందరికోసం పాతిక సార్లు మునకలేసాడు తెలుసా! వాడికక్కడే పడిశం పట్టుకొంది. ఇక్కడి కొచ్చినాక నిమోనియాకి దిగింది. టెస్టులవీ చేయిస్తున్నాం. ఏ క్షణంలో ఎబోలాకి మళ్ళుతుందోనని గుండెలదిరి పడుతున్నాయ్! .. మూసిన కన్ను తెరవడం లేదు. 'మిరకల్.. మిరకల్' అని ఉలికులికి పడుతున్నాడురా పాపం మానవుడు..' ఇహ వినలేక ఫోన్ కట్ చేసేసాను.
డూబే మోసం స్పష్టంగా అర్థమవుతూనే ఉంది.
బ్యాంకుల్లో ముంచడం విన్నాంగానీ..ఇలా  రివర్ బ్యాంకుల్లో ముంచడం వినడం ఇదే మొదటి సారి.
గోరు తడవకండా గోదావరి స్నానమంటే ఇదా!
కడిగేద్దామని డూబేగాడికి ఫోన్ చేస్తుంటే నెంబరు కలవదే!
'మళ్లీ పుష్కరాలప్పటిక్కానీ నీకు దొరకడులే!' అన్నాడు మాధవగాడు  ఆ మధ్య కనపడినప్పుడు. జరిగిందంతా చెప్పి జగడానికి దిగపోతే 'మీ తెల్లతోలుగాడికి జలగండం ఉందన్నావుగా! నేనైనా.. డూబే అయినా నిమిత్తమాత్రులం.. భాయీ! అంతే!' అంటూ కాలరు విడిపించుకొని దర్జాగా వెళ్ళిపోయాడు మాధవగాడు.
***
కర్లపాలెం హనుమంతరావు 
(2003 గోదావరి పుష్కరాల సందర్బంగా 08-07-2003 ఈనాడు-సంపాదకీయ
పుటలో ప్రచురితం) 
(కార్టూనిస్టు శ్రీధర్ గారికి ధన్యవాదాలతో)




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...