Wednesday, July 22, 2015

సినిమాప్రచారానికి కవిత్వం పాట



కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా కాదేదీ కవితకనర్హం’ అని మహాకవి శ్రీశ్రీ అన్నాడని కాబోలు గతంలో శోభనాచల పిక్చర్సు వారు 'దక్షయజ్ఞము' చిత్రం విడుదలకుముందు ఏకంగా చిత్రసాంకేతికగణం వివరాలతో కూడిన చక్కని చతురస్ర గతి మాత్రాచందస్సులో ఒక పాట రాయించి మరీ ప్రచారం చేయించారు.
సరదాగా ఉంటుంది.. కొన్ని చరణాలు మీరూ వినండి!

దక్షయజ్ఞమండీ- అందరు తప్పక చూడండీ
దర్మయుద్ధమండీ- భక్తులు ధన్యులగుదురండీ

ఆంధ్రకళలతో- ఆంధ్ర దీప్తితో
ఆంధ్ర శోభనాచల స్టూడియోలో
ప్రభువు మీర్జపూర్- పరిరక్షణలో  దక్ష॥

అర్జాకృష్ణుని-ఆధ్వర్యములో
శిష్టదర్శకుల- శిష్యప్రాయుడు
సిద్ధహస్తుడు- చిత్రపువీరుడు
తయారుచేసిన- దక్షయజ్ఞము    దక్ష॥

నగ్నతత్వ- నారాయణాస్త్రము
వస్తున్నది మీ- పట్టణాలకే
తేదీ వివరం- తెలుసుకొనండీ     దక్ష॥

పురాణగాథల- తరాలు దాటిన
పరాకుకూతల- ప్రతికాదండి      దక్ష॥
కృష్ణవేణి నవ- కోకిల స్వరము
గగ్గయ్య భయం- కరధిక్కారము
రామకృష్ణుని- రమ్యగానము
కుంపట్ల మనోహర- పరిహాసము దక్ష॥

బి.టి.చార్యుల- భీకర పలుకులు
మోతీబాబు- పాటల కులుకులు
శాంతారాముని- చక్కని కుంచియ
చతురుడు వాల్కే- శబ్దగ్రహణము
విబుధుడు కిన్నీ- వేషధారణము
సొలుపగు చవాను- ఫోటోగ్రాఫీ
కుండలేశుని య- ఖండస్ఫురణము
బడసిన బంగరు- ప్రతిమారాజము
వస్తున్నది మీ- పట్టణములకే
తేదీ వివరము- తెలిసికొనండీ దక్ష॥

ఇలా సాగుతుంది పాటంతా. ఎక్కడా పొల్లుమాట లేకపోవడమూ,
చక్కనైన పదజాలం వాడటమూ.. సాంకేతిక వివరాలు సమగ్రంగా
ఉండటమూ.. మనమీ పాటలో ప్రశంసించదగ్గవిశేషాలు.
సినిమా మాధ్యమంమీదే కాకుండా కవితాప్రక్రియలమీదా లోతైన అవగాహన ఉంటేనే గాని ఇంతటి చక్కని వరసలతో పాట కుదరదు.
కనిపించిన ప్రతీ దానిమీదా కవితలల్లాలని ఉవ్విళ్ళూరే ఈనాటి యువరక్తపు కవికుమారులూ/కవితాకుమారీలంతా  సునిశితంగా అధ్యయనం చేయాల్సిన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.  కాబట్టే.. డెబ్బై ఏళ్ళకిందట రాసినా.. ఇప్పటికీ  తాజాగా అలరిస్తుంది. పాటకు ఇంకా 42చరణాలున్నా స్థలాభావంచేత పూర్తిపాఠం ఇవ్వడం లేదు.

శోభనాచల పిక్చర్స్ విశేషాలుః
శోభనాచల పిక్చర్స్ తెలుగు చలనచిత్రరంగంలో అతిముఖ్యమైన నిర్మాణసంస్థల్లో ఒకటి. దీని అధినేత మీర్జాపురం రాజా వారు. ఇంతకముందు జయ ఫిలింస్ పతాకాన కొన్ని చిత్రాలు నిర్మించిన రాజా వారు 1941లో శోభనాచల సంస్థను స్థాపించారు. శోభనాచల సంస్థ నిర్మించిన తొలి చిత్రం దక్షయజ్ఞం (1941)గొల్లభామ (1947) చిత్రం శోభనాచల సంస్థకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1947లో విడుదలైన చిత్రాలలో గొల్లభామనే ఆర్థికంగా పై చేయి సాధించింది. 1949లో వచ్చిన కీలుగుర్రంచిత్రానికి రాజా వారు దర్శకుడి మరియు నిర్మాత. కీలుగుర్రం రాజా వారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. 1950లో విడుదలైన లక్ష్మమ్మ చిత్రాన్ని ప్రతిభా వారి శ్రీ లక్ష్మమ్మ కథతో పోటీ పడి నిర్మించారు. ఈ పోటీలో లక్ష్మమ్మదే పై చేయి అయ్యింది. 1940లలో గొప్ప పేరు తెచ్చుకున్న శోభనాచల సంస్థ కొన్ని కారణాల వలన 1950ల ప్రథమార్థంలో మూతపడింది. శోభనాచల సంస్థ యాజమాన్యంలో మద్రాసులోని తేనాంపేట ప్రాంతంలోని శోభనాచల స్టూడియోలలో అనేక చిత్రాలు నిర్మితమయ్యాయి. 1949లో వాహినీ స్టూడియోస్ ప్రారంభంతో శోభనాచల స్టూడియోలలో చిత్రాల నిర్మాణం తగ్గిపోయింది. 1955లో శోభనాచల స్టూడియోల యాజమాన్యం మారింది, స్టూడియో పేరు వీనస్ స్టూడియో గా మార్చబడింది. దశాబ్ద కాలం పైగా పని చేసిన వీనస్ స్టూడియో తర్వాత మూతపడింది.(సోర్సు- https://te.wikipedia.org/wiki/)
- కర్లపాలెం హనుమంత రావు


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...