Sunday, February 7, 2021

చిల్లర పద్యాలు -పొట్టి కథ -కర్లపాలెం హనుమంతరావు

 



 

ఒక చాందస కవిగారు అష్టకష్టాలు  కోర్చి తారాశశాంకం మళ్ళీ పద్యాల్లో రాసాడు. మొత్తం కథనంతా ఏడొందల యాభై పద్యాల్లోకి కుదించాడు. పుస్తకంగా అచ్చేయించి అమ్మకాలకు బయలు దేరాడు. కళాబంధువు అని బిరుదున్న ఒక వ్యాపారిగారిని కలుసుకుని ఇలా విన్నవించుకున్నాడు" అయ్యా! అత్యంత ఆహ్లాదకరమైన శైలిలో తారాశశాంకుల శృంగార గాథను ఏడొందల పద్యాల్లో రచించాను. పుస్థకం వెల కేవలం పాతిక రూపాయలు మాత్రమే. అంటే పదిపైసలకు మూడేసి పద్యాలు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు తినే చాక్లెట్టు కూడా అర్థ రూపాయి పెడితే గాని రెండు రావడం లేదు. మీ బోటి కళాపోషకులు కనీసం ఒక డజను గ్రంథాలన్నా కొనాలండీ!"  అని విన్నవించుకున్నాడు గడుసుగా.

 

ఆ కళాపోషకుడుగారు అంతకన్నా గడుసుపిండం." అయ్యా కవిగారూ! పదిపైసలకు మూడు పద్యాలంటే కారు చవకేనండీ! కొనడం న్యాయమే. కాకపోతే మీరు కాస్త ఆలస్యంగా వచ్చారు. నిన్ననే రెండు రూపాయలు పోసి సుమతీ శతకం కొనుకున్నా! అందులో నూరు పద్యాలకు తోడు కొసరుగా మరో పదహారు పద్యాలున్నాయండీ! మీ లెక్కన పది పైసలకు ఐదేసి పద్యాలు. ముందు వాటిని నమిలి హరాయించుకోనీయండి. అప్పుడు మీ పద్యాల పని పడతా! వట్టి చేతులతో పండితులను పంపించడం శుభం కాదన్నారు పెద్దలు. కనక పోనీ.. ఈ అర్థ రూపాయితో ఓ పదిహేను పద్యాలు మీ చేత్తోనే మంచివి ఏరి ఇచ్చి పోండి. రుచి బాగుంటే ఈసారి వచ్చినప్పుడు టోకున తీసుకుంటా" అన్నాడు.

"ఇంకా పద్యాలను చిల్లరగా అమ్మడం లేదు లేండి" అని మెల్లగా జారుకున్నాడా

పండితులుం గారు.*

No comments:

Post a Comment

కథ విలువ - చెంగల్వ - సేకరణ

  కథ  విలువ  - చెంగల్వ  నమస్కారమండి!" అన్న గొంతు విని తలెత్తి చూసాను. "ఓఁ. మీరా! రండి" అంటు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాను...