Thursday, February 4, 2021

వేదకాలం నాటి 'సాగు' సంప్రదాయం- కర్లపాలెం హనుమంతరావు

                                                                   


నిప్పు పుట్టించే విద్య మనిషికి నేర్పించిన గురువు తరువు. ఎండు కొమ్మలు ఒకదానినొకటి రాచుకుని నిప్పు పుట్టడం చూసిన మనిషి ఆ చమత్కారం తాను కందిపుల్ల మీద గుమ్ముడు పుల్ల రాసి పడేసి నిప్పుపుట్టించడంగా మల్చుకున్నట్లు చరిత్ర చెబుతోంది. రాయీ రాయీ రాసినా నిప్పుపుడుతుంది. అయినా ఈ చెట్టు కొమ్మల రాపిడి పద్ధతే   అనువుగా మనిషికి అనిపించింది. రావికర్ర మీద జమ్మికర్ర పెట్టి మథించి నిప్పు పుట్టించే శౌత్రిక కర్మ విధానం ఇప్పటికీ అమలులో ఉంది.

అడవుల్లో, కొండల మీద వాటంతట అవే మొలిచే తృణధాన్యాలను గమనించిన మనిషి వానకారు దయన, తన భుజబలంతో కూడా  ఆ పని చేయవచ్చిన గ్రహించినప్పటి నుంచే 'సేద్యం' మొదలయింది అనుకోవాలి. సేద్యం మూలరూపం ఛేద్యం(ఛేదించబడేది) కావచ్చని పండితులు వేలూరు శివరామశాస్త్రిగారు అభిప్రాయ పడుతున్నారు. రుగ్వేదంలో 'నాగలి' ప్రస్తావన, అథర్వణవేదంలో ఎరువుల  ప్రస్తావనలు కనిపిస్తున్నాయి కాబట్టి సేద్యం భారతీయుల అతిపురాతన ప్రావృత్తిగా వ్యాఖ్యానించక తప్పదు. వేదసంహితలు, పురాణాల నిండా సందర్భం వచ్చిన ప్రతిసారీ కృషివర్ణనలు కల్పించడం ఈ వాదనకు వత్తాసు పలుకుతుంది. భారతంలో భీష్ముణి నిర్యాణకాలం, విష్ణుపురాణం తాలూకు 'మఘాదౌచ తులాదౌచ' లూ పరిశీలించాలి ఇందు కోసం.

 

పరాశర సంహిత కర్త పరాశరుడు కృషీపరాశరుడిగా ప్రసిద్ధుడు కూడా. పాశ్చాత్య చరిత్రకారులూ ప్రస్తావించిన ఈ పరాశరుడి కాలం మన లెక్కల ప్రకారం దాదాపు 3వేల సంవత్సారల గతం. భారతదేశంలో వ్యవసాయం ఎంత ప్రాచీనమైనదో వివరించేందుకే ఈ వివరాలన్నీ.

సేద్యం శ్రేష్ఠతను గురించి బహుధా ప్రశంసిస్తుందీ పరాశర సంహిత. ఎడ్లు వాటి లక్షణాలు, గోష్ఠం గోచరాలు, గోమయాన్ని ఎరువుగా మార్చే విధానాలు, నాగలి.. ఏరుకట్ట సామాను, దుక్కి దున్నే పద్ధతులు, విత్తులు కట్టి కాపాడి చల్లుకునే సూచనలు, పైరు కోసి ధాన్యం నూర్చి తూర్పార పట్టి క్రైలు చేయడాలు, పాతర్లు, గాదెలు,  నిలవున్న ధాన్యం పురుగుపట్టకుండా తగు జాగ్రత్తలు, పైరుకు నీరుపట్టే పద్ధతులు, భాద్రపదమాసంలో పంటకు తెవులు తగలకుండా నీరు పోయడాలు, తెవుళ్ల నివారణ, మళ్లల్లో నీరు నిలిపి వుంచే ఉపాయాలు.. వ్యవసాయానికి సంబంధించిన సమాచారం చాలా విపులంగా ఈ పరాశర సంహితలో కనిపించడం విశేషం.

శునం వహా శునం నరః శునం కృషతు లాంగలం/

శునం వరత్రా బధ్యంతాం శున మష్ట్ర మ్ముదిజ్ఞ్గయ (4 -57- 4)

(ఎడ్లు సుఖంగా లాగు గాక, మనుషులు సుఖంగా పనిచేయుదురు గాక, నాగలి సుఖంగా దున్ను గాక, ములుకోలు సుఖంగా తోలు గాక అని ఈ శ్లోకానికి అర్థం). 

ఇదే నాగలిని ఒక యంత్రంగా సంబోధిస్తూ, ఐదు మూరల ఏడి, ఐదు జానల నాగలి, దున్నే ఎడ్ల చెవుల చివరకు వుండే కాడి,  ఒకటిన్నర మూర నిర్యోలం, పన్నెండంగుళాల పాశికా అడ్డ చీలలు, మూరెడు శౌలం, తొమ్మిది నుంచి పన్నెండున్నర అంగుళాల  పిడికొలతలుండే ములుకోలు-గా నాగలి ఆరు భాగాలను కొలతలతో *'ఈషాయుగోహల’ లో వివరించింది ఈ పరాశరసంహిత. (ఈషాయుగోహల స్థాణుర్నిర్యోల సస్య పాశికా/

అడ్డ చల్లశ్చ శౌలశ్చ పచ్చనీచహలాష్టకమ్/

పంచహస్తా భవేదీషాస్థాణుః పంచవిత స్తికః/

సార్దహస్తస్తు నిర్యోలోయుగః కర్ణ సమానకః/

నిర్యోలపాశికాచై వ అడ్డచల్లస్త థైవచ/

ద్వాదశాంగులమానోహి శౌలోఽరత్ని ప్రమాణకః/

సార్ద ద్వాదశ ముష్టిర్వా కార్యావానవముష్టికా/

దృఢా పచ్చనికాజ్ఞేయేలోహాగ్రా వంశసంభవా') అని శ్లోకం.

వేదకాలంనాటి  వ్యవసాయ పనిముట్లు, వాటి తీరుకూ ఇప్పటి పరికరాలు వాటి పనితీరుకూ ఆట్టే భేదం లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. కాని ఆ కాలంలో మాదిరిగా నేడు పంటల అభివృద్ధి సమృద్ధితనంలో తప్ప ఆహారపుష్టిలో కనిపించడంలేదు! దేశీయావసరాలకే సరిపడినంతగా పండని నేపథ్యంలో ఇహ విదేశే ఎగుమతులను గురించి ఆలోచించడం పేలాలపిండి కథ సామెత అవుతుందేమో!

భారతదేశంలో సాగుకు రాని భూవిస్తీర్ణం చాల ఉన్నట్లు అథర్వణ వేదం చెబుతోంది.  ఆ  పరిస్థితే నేటికీ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నదాత ఆర్థిక స్తోమతు  పరిగణలోకి తీసుకున్నా నిరాశాజనకమైనా దృశ్యమే కంటి ముందు కనిపించేది. అమెరికా సంయుక్త రాష్ట్రాల వంటి అగ్రరాజ్యాలలో వంద ఎకరాల సాగుభూమి ఏకఖండంగా గల ఆసామీ కూడా పేదరైతుగానే పరిగణింపబడుతుంటే.. ఇక్కడ సెంటు భూమి  సొంత పేరు మీద లేకుండానే కొన్ని తరాల బట్టి కౌలుదారీ సాగు చేసుకునే దైన్యస్థితి అన్నదాతది.

పురాణాల కాలంలో 'ఖిలం'  అనే పదం తరచూ వినబడేది. ఏడాది మార్చి ఏడాది పంట వేసేందుకు వీలుగా రెండు మూడు పంటభూములున్న ఆసాములు ఒక భూమిని ఒక సంవత్సరానికి  సాగుచేయకుండా వదిలేసేవాళ్ళు. భారతదేశంలో ఔత్తరేయులు 'ఖిల్'గా పిల్చుకునే ఈ పైరు మార్పు విధానం ఇప్పుడు కనిపించడంలేదు.

'తథా వర్షేషు వర్షేషు కర్షణద్భూ గుణక్షయంః/

ఏకస్యాం గుణహీనాయాం కృషి మన్యత్ర కారయేత్' అంటూ

'యుక్తి తల్పతరు' తప్పని సరి అని చెప్పిన  పైరు మార్పు విధానం వ్యవసాయరంగం సైతం వ్యాపారమయంగా మారిన  తరుణంలో వృథా ప్రయాసగా తోచడంలో ఆశ్చర్యం లేదు.

పైరుమార్పు కోసమే కాకుండా పశువుల తిండి కోసం కూడా గాను సాగుచేయకుండా గతంలో కొన్ని భూములను అట్లాగే వదిలేసే పద్ధతి ఉండేది.

వైదిక కాలాలలో కేవలం పశువుల మేత కోసం గానూ కొన్ని బీళ్లను దున్నకుండా అలా వదిలేసే రివాజు ఉండేది. వ్రజం, గోష్ఠం, సుయవసంగా పిలిచే ఈ గోచరాల పద్ధతి ఇప్పుడు అమలులో లేదు.  పురాణాల కన్నా ముందున్న వేదసంహితలలో పలురకాల ధాన్యాల ప్రస్తావన విస్తారంగా కనిపిస్తుంది. వాజసవేయ సంహితలోని చమకంలో ఇప్పటి మన వడ్లు, మినుములు, యవలు, నువ్వులు, సెనగలు, స్వాల్వము, పశుగ్రాసం, ప్రియంగువులు (ప్రేంఖణం), నవము, చామలు, నెవ్వగులు, గోధుమలు, మసూరాలు పేర్లు వినిపిస్తాయి. అధర్వణ వేదంలో మినుములు ప్రస్తావన ఉంది. రుగ్వేదంలో యవలు, వరులు కనిపిస్తాయి!

ఇప్పుడంటే వేరుశనగ వేస్తున్నారు, కానీ ఇటీవలి కాలం వరకు  మెరకభూముల్లో పునాస పైరులు కోసిన తరువాత  మళ్ళీ దున్ని ఉలవ వేసే ఆచారం ఉండేది. పంటలకు ఎల్లకాలం ఉండే వెల ఆధారంగా ఈ రకమైన రెండు పంటల విధానం తైత్తరీయంలో . (దీర్ఘ సంవత్సరస్య సస్యం వచ్యతే(5 -1 -7 -3) కనిపిస్తుంది.

భారతదేశంలో స్థల, కాల భేదాలను అనుసరించి పంటలు వేసే ఆచారం ప్రచులితం. హేమంతంలో యవలు గొర్తుబట్టడం, మఖ పుబ్బ కార్తెలలో మొక్కజొన్న, వానకారుకాలంలో కోసుకునేందుకు  వీలుగా ఓషదులు,  వరులు శరత్కాలంలో కోతకు వచ్చేందుకు వీలుగా  గ్రీష్మ, వర్షర్తువుల ప్రారంభ కాలంలో పైర్లు పెట్టడం సస్యసాంప్రదాయాల కింద ఆ విధంగా వస్తోవుంది. మౌర్యుల కాలంలో సస్యపరివర్తనం అమలులో ఉన్నట్లు అర్థశాస్త్రం - రెండో భాగం(మైసూరు ప్రతి)లో ఆధారాలున్నాయ్!

కేంద్రాలు, ప్రేంఖణాలు, నువులు గ్రీష్మాంతంలో, సెనగలు, మినుములు, పెసలు వానకారు నడిచే సమయంలో, యవ, గోధుమ, కుసుంబ, కుడువ,మసూరు, కలాయ, సర్షపాదులు శరదృతువుల్లో పైరుపెట్టే  నేటి ఆచారాలు వేదకాలం నుంచి సాంప్రదాయికంగా వస్తున్నవే.

ఆరు రుతువుల విధానం కూడా క్రీస్తుకు పూర్వం రెండువేల ఐదు వందల ఏళ్ల కిందటనే ఆరంభమయినట్లు అనిపిస్తుంది. చాంద్ర సంవత్సరం అయినా ఆంధ్రదేశంలో నేటి రుతువులను పట్టి ఆర్యావర్తము లాంటి ఉత్తరదేశ రుతువులను లెక్కబెట్టకూడదు. దేశ భేదాలను బట్టి మార్పులుంటాయి . కాబట్టి మాన భేదాలను గూడా ఆ పద్ధతి ప్రకారమే పరిగణనలోకి తీసుకోవాలి.


భారీ యెత్తున ట్రాక్టర్లతో దున్నుతున్న నేటి యంత్రాల వాతావరణంలోనూ  అంతర్గతంగా అణిగివున్నది వేదకాలం నాటి కృషీవలుడు నాగలి ధరించి  కార్యక్షేత్రంలోకి అడుగువేసే ముందు వినమ్రంగా చేసిన ప్రార్థన సారాంశమే!  ఆ ప్రార్థన 

'అర్వాచీ సుభగే భవ/

సీతే! వందామ హోత్వా/

యథా న స్సుభగా మసి/

యథా న స్సుఫలా మసి॥'-

ఓ సీతా!(నాగేటి చాలు) మాకు అభిముఖివి కమ్ము. నీకు నమస్కరిస్తున్నాం. మాకు నిండుగా పండుము! ' అనే అర్థంలో సాగుతుంది.


-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

05 -02 -2012 ***

(శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు వ్యాసావనిలో ప్రాచీన సేద్య విధానాలను గురించి విస్తారంగా చెప్పుకొచ్చిన ఓ వ్యాసంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాల ఆధారంగా)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...