Saturday, February 6, 2021

ఆవుల సాంబశివరావుగారి అభిమాన సాహిత్యం గురించి.. కొద్దిగా! - కర్లపాలెం హనుమంతరావు

 




 

పది సంవత్సరాల వయసులో బుద్ధుని చరిత్ర క్లాసు పుస్తకంలో కేవలం పాఠం లాగా మాత్రమే కనిపించినా ప్రముఖ హేతువాది ఆవుల సాంబశివరావుగారి జీవన శైలి మీద పుస్తక పఠనం ప్రభావం చూపించడానికి ఆ తరగతి పాఠమే నాందీ పలికింది. ఒకానొక పత్రికకు వ్యాసం రాస్తూ తన జీవితాన్ని ప్రభావితం చేసిన మహామహులను ఆయన ఒక వరసలో తలుచుకున్నారు. వేమన, తెలుగుభాష తీపిదనం మరిగిన తరువాత వరస పెట్టి వదలకుండా చదివిన మంచి పుస్తకాలలో మరీ మంచివి అంటూ ..పోతన భాగవతం, భారతం, ఆముక్తమాల్యద, వసుచరిత్రలను అయనే స్వయంగా ఎంచి చూపించారు. అవ్యక్తమైన మానసిక స్వేచ్ఛ కోసమై తపించే కృష్టశాస్త్రి  కృష్ణపక్షం తన భావసరళిని తీవ్రం చేసిందని చెబుతూనే.. తనలో హేతువాద బీజాలను నాటిన  మహిమాన్వితుల పుస్తకాలను తలుచుకున్నారు. త్రిపురనేని రామస్వామిగారి కురుక్షేత్రం, సూతపురాణం, పలుకుబడి గలిగిన నమ్మకాలను ఎట్లా నిలదీస్తుందో అర్థం చెసుకున్నట్లు చెప్పుకొచ్చారు.  విషయం పురాతనమైనదైనా సరే స్వతంత్ర బుద్ధితో ఆలోచించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పే వీరేశలింగంగారి రచనలు యావత్తూ చదివినట్లు చెప్పుకొచ్చారు. దురాచారాలు మనుషులను మానసికంగా ఎంతలా బలహీనపరుస్తాయో తెలుసుకునేందుకు గాను గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం  దొహదం చేస్తుందన్న  విషయం విపులంగా  వివరించుకొచ్చారు. ఒక పక్క చలం, మరో పక్క శ్రీ శ్రీ .. ఒకరు స్త్రీని గురించి, మరొకరుఉ దేశాన్ని గురించి ఎంత నూతనంగా ఆలోచించవలసిన అగత్యం ఉన్నదో కొత్త కొత్త కోణాలలో వివరిస్తుంటే ఉత్తేజితమయిపోయేటంతగా వారి భావజాలంతో మమేకమయినట్లు సాంబశివరావుగారు వివరించారు. ఉన్నవ లక్ష్మీనారయణగారి మాలపల్లితో తన సాంఘిక దృష్టి కోణం దిశ మారిందని స్వయంగా ఒప్పుకున్నారు ఆ లోకాయుక్త. మార్క్స్  ఎంగెల్స్ తో కలసి రాసిన దాస్ కాపిటల్, కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో,  ముందే చదివేసి ఉడటం వల్ల

 హెగెల్స్, కాంటు రచనలు చదివి జీర్ణించుకోవడం సులభమైందన్నది సాంబశివరావుగారి భావన. కొత్తగా అబ్బిన బావుకత వల్ల పరిణతి చెందిన మనసుతో రష్యన్ విప్లవ పాఠాల సారాంశం సరైన మోతాదులోనే వంట పట్టినట్లు చెప్పుకొన్నారు . పదహారు, పదిహేడు శతాబ్దాలలో ఇంగ్లండులో జరిగిన పారిశ్రామిక విప్లవం ప్రజాస్వామిక విప్లవానికి ఎట్లా మార్గదర్శకం అయిందో అవగాహన చేసుకునే పాటి విశ్లేషణాత్మక బుద్ధి, అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధం,   ప్రజల హక్కుల కోసం .. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం  ఫ్రెంచి విప్లవం, ఎట్లా సర్వం తెగించి పోరుకు దిగిందో తెలుసుకునే పాటి అవగాహన, థామస్ జఫర్ సన్, రూసో మొదలైన రచయితలు, భావుకులు ఆయా సంఘటనలలో ఎట్లా వైతాళిక పాత్ర పోషించారో ఆ వాతావరణం అంతా మనసుకు ఎక్కించుకునే పాటి బుర్రా బుద్ధీ పెరగడానికి ఎన్నో ఉద్గ్రంథాలు ఎట్లా ఉపకరిస్తూ వచ్చాయో..  ఒక చిరు వ్యాసంలో  స్మృతి రూపంలో వివరించారు. ఏ ఉద్యమంలోనూ ఆర్థిక సమానత్వం  ఎజండా కాకపోవడం ఆవులవారి సునిశిత దృష్టి నుంచి జారిపోకపోవడం  విశేషం.. ఆయన ఉద్దేశంలో ఆర్థిక సమానత్వం భవిష్యత్తులో రాబోయే ప్రగతిశీల ఉద్యమాలకు ఉత్ప్రేరకం మాత్రమే. ఇరవయ్యో శతాబ్ద్దంలో జరిగిన రష్యన్ విప్లవమే సాంఘిక వ్యవస్థను, అందులోని ఆర్థిక ప్రాతిపదికను సమూలంగా మార్చేందుకు ఉపయోగపడిన మొదటి ఉద్యమంగా సాంబశివరావుగారు భావిస్తారు. మార్క్స్ కు  లెనిన్ రాసిన భాష్యం ఈ క్రియానుగతమైన మానవోద్యమాలన్నిటికి  అద్దంపట్టినట్లు ఆవులవారి అభిప్రాయపడుతున్నారు. వీటిని మనసు పెట్టి చదివిన విజ్ఞుడు మానవ స్వేచ్ఛాప్రియత్వానికి, ఆ తరహా స్వేచ్ఛకు ఆర్థిక సౌలభ్యం ప్రధాన భావమవుతుందన్న మూల వాస్తవం తెలుసుకుంటాడన్నది లోకాయుక్త పదవి సమర్థవంతంగా నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఆవుల సాంబశివరావుగారు ముక్తాయింపు.

 అప్పటి వరకు సంపన్నుల, సమాజంలో ఉన్నత తరగతుల వారి వ్యవహారంగా సాగుతూ వచ్చిన భారత స్వాతంత్రోద్యమం గాంధీజీ రాకతో ఒక్కసారి దేశప్రజలందరి ఉద్యమంగా స్వరూపం మార్చుకున్న విషయం ఆవులవారి దృష్టిని దాటిపోలేదు. సామాన్య ప్రజల హృదయాలలో కూడా స్వాతంత్ర్య పిపాసను బాపూజీ ఎట్లా రేకెత్తించగలిగారో వెలూరి శివరామ శాస్త్రిగారు బాపూజీ ఆత్మకథను అతిచక్కని సరళ శైలిలో చేసిన అనువాదం చదివి తాను అర్థం చేసుకున్నట్లు సాంబశివరావుగారు చెప్పుకొచ్చారు. గాంధీజీ నిర్మలమైన వ్యక్తిత్వం  సామాన్యుడికైనా అవగాహన అయే తీరులో రాసిన పుస్తకం అది అని ఆవులవారి ఆలోచన. మహాత్ముల జీవితాల పట్ల భక్తి విశ్వాసాలు ఉండే సామాన్య ప్రజకు బాపూజీని మాహాత్మునిగా మలిచి చూపించిన అనువాదం అని ఆవులవారి ఉద్దేశపడ్డారు. ఆసేతు హిమాచల పర్యంతం జన హృదయం మీద బాపూజీ ఎట్లా పీఠం వేసుకు కూర్చున్నారో ఆ పుస్తకం చదివితే తెల్సుస్తుందని ఆయనే ఒకానొక సందర్భంలో ప్రసంగవసాత్తూ చెప్పుకొచ్చిన మాట.. వేలూరివారి పత్రికా రచనలోని పదును పాఠకుల మనసుల్లోకి సూటిగావెళ్లే విధంగా ఉంటుందంటారు ఆవులవారు. స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకోకుండా ఉండుంటే జవహర్ లాల్ నెహ్రూ  ఒక గొప్ప ప్రపంచ స్థాయి రచయిత అయివుండేవారని ఆవులవరి ఆలోచన. అంతగా ఆయన రాసిన 'గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ'ని సాంబశివరావుగారు మధించారన్నమాట!

చరిత్రకు , మానవ చరిత్రకు  నూతన దృక్పథాన్ని ఎత్తి చూపెట్టిన 'ఆర్నాల్డ్ టైన్స్' చరిత్ర అంటే కేవలం ఒక పెద్ద కథ కాదని, మానవ సమాజ గమన వివరంగా తెలియపరిచే సమాచార సాహిత్యమన్న  ఆవులవారి మాట ఆలోచించదగ్గది. చరిత్రను కొత్త కోణం నుంచి చూడటం తనకు నేర్పిన ఆ పుస్తకాన్ని గురించి ఆవులవారు సందర్భం వచ్చిన ప్రత్తీసారీ ప్రశంసించకుండా ఉండలేకపోయారు.  ఏ ఏ ఘట్టాలు మనిషిని ప్రభావితం చేస్తూ వచ్చాయో, సమాజ గమనాన్ని మలుపు తిప్పుతూ వచ్చాయో  ఆ పుస్తకం చదివిన తరువాత తాను మరింత పరిణత దృష్టితో చూడడానికి అలవాటు పడ్డారో సాంబశివరావుగారు చెప్పుకొచ్చిన తీరు ప్రశంసనీయం. నెహ్రూజీ ఆత్మకథకూ  ఆయన హృదయంలో గొప్ప స్థానమే ఉంది. అది కేవలం ఒక నాయకుడి జీవిత చిత్రణ మాత్రమే కాకుండా, ఒక మధుర కావ్యం కూడా ఆవులవారి  దృష్టిలో.

సంపదల మధ్య పుట్టినా సున్నితమైన హృదయం, సునిశిత మేధో సంపద, సత్యాన్ని తెలుసుకోవాలన్న జ్ఞానతృష్ణ, నమ్మిన సత్యాన్ని ధైర్యంగా నిర్భయంగా ప్రకటించే సత్యనిష్ఠ -మనిషిని ఎట్లా మహామనీషిగా మలిచెందుకు దోహదపడతాయో తెలుసుకోవాలంటే  నిరాద్ చౌదరిగారి 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ యాన్ అన్నోన్ ఇండియన్', యం.సి. చాగ్లాగారి 'రోసెస్ ఇన్ డిసెంబర్', లాంటి పుస్తకాలు చదవాలంటారు  ఆవుల. నిరాద్ చౌదరిగారి కథ భారతదేశాన్ని, భారతీయ జీవితాన్ని గురించి తనలో పలు ఆలోచనలు రేకెత్తించిందని  ఆవులవారి ఉవాచ. చాగ్లాగారి ఆత్మకథయితే ఆనాటి దేశపరిస్థితులకు.. ముఖ్యంగా హిందూ ముస్లిముల మధ్య గల సహృదయతకు, న్యాయ, పరిపాలనా వ్యవస్థలకు ఒక దర్పణం వంటిదని ఆయన అభిప్రాయం. చదివినవారిని ఎవరినైనా సరే తప్ప ఆలోచనల్లో పడవేయకుండా ఉండనీయని గొప్ప స్ఫూర్తిదాయకమైన సాహిత్యంగా  ఆయన కితాబిచ్చిన పుస్తకాలు ఇంగర్ సాల్, బెర్ట్రెండ్ రస్సెల్, వంటి తాత్వికుల పెద్ద రచనల జాబితా!  విశ్వరహస్యాలను, మానవ ప్రకృతిని మౌలికంగా పరిశీలించిన గ్రంథాలు, మనిషిని ప్రధాన వస్తువుగా స్వీకరించిన పుస్తకాలు, తన జీవితానికి తానే కర్త, భర్త అని వాదించే  రచనలు, మానవోన్నతికి భగవంతుని జోక్యం అవసరం లేదని , అసలు అడ్డుగా కూడా దైవభావనలు నిలబడకూడదని, మనిషి పురోగతికైనా, తిరోగతికైనా మనిషే పూర్తి బాధ్యుడని బోధించే రచనలు ఏవైనా సరే ఆవులవారు అమిత ఇష్టంగా చదివి వాటిలోని సారాన్ని వడగట్టి జీవితానికి అన్వయించుకుంటారని అర్థమవుతుంది. ఆ కారణం చేతనే ఆయనకు మానవేంద్ర నాధ్ రాయ్ రచనలు ప్రాణమయ్యాయి.  మౌలికమైన అంశాలనైనా విప్లవాత్మక కోణంలో భావుకత చెదరకుండా సాగిన సాహిత్య ఆవులవారి వ్యక్తిత్వం పై చూపించిన ప్రభావం ఏ కొలతలకూ అందనిది. 

ఆణిముత్యాల వంటి రచనలను జాతికి అందించిన మహామేధావి మానవేంద్రుడన్నది ఆవులవారి ఆలోచన. తాత్విక, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమస్యలన్నింటినీ మునుపెన్నడూ ఎరుగని కొత్త కోణంలో తాత్వికుడు ఎం.ఎన్. రాయ్ నిర్వచించిన పుస్తకాలత గాఢమైన పరిచయం ఏర్పడిన తరువాత ఆవులవారిలోని అసలు మానవతావాదికి నూతన రూపం ఏర్పడడం ఆరంభమయిందనేది ఒక సాధారణ భావన. మానవుడు సమాజంలోని అంతర్భాగమే అయినప్పటికి.. ఆ విశిష్ట జీవి స్వేచ్ఛను, శ్రేయస్సును  కాపాడని పక్షంలో సమాజ నిర్మాణం పరిపూర్ణం కాదన్న ఎమ్.ఎన్.రాయ్ నవ్య మానవవాదం ఆవులవారికి మనసుకు హత్తుకున్నది. అటు వ్యక్తి స్వేచ్ఛకు, ఇటు సాంఘిక శ్రేయస్సుకు సమన్వయం  చేకూర్చే  మానవేంద్ర నాధ రాయ్ బావ సరళితో ఆవులవారు పుర్తిగా మమేకమైనప్పటి బట్టి తెలుగువారికి ఒక లోకాయుక్త లౌకిక పరమైన ఆస్తి కింద సమకూరినట్లయింది.

 రాయ్ రచనలు తన మీద చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదని  సాంబశివరావుగారే  స్వయంగా అనేక సందర్భాలలో తన మనోభావాలను స్పష్టంగా బైటపెట్టిన తరువాత ఆ ఆధ్యాత్మిక  మార్గాన్ని గురించి మీమాంసలకు దిగడంలో అర్థం లేదు. తన లోని హేతువాదికి, బౌతికవాదికి  పురోగమన దృష్టిని కల్పించిందీ ఎమ్,ఎన్.రాయ్ తరహాలో 'సేన్ సొసైటీ' కర్త ఎరిక్ ఫ్రామ్ ది కూడా అని ఆవుల సాంబశివరావుగారు చెప్పుకొచ్చారు. ఎంచుకున్న అంశం ఏదైనా, స్వతంత్ర బుద్ధితో సామాజిక వ్యవస్థ తీరుతెన్నులను సునిశితంగా పరిశీలించడం 'ఫ్రామ్' పుస్తకాల అధ్యయనం వల్ల కలిగిన లాభం అన్నది  ఆవులవారి అభిప్రాయం.

నోబెల్ పురస్కారం అందుకున్న ఆర్థిక శాస్త్రవేత్త మిరడాల్ ప్రసిద్ధ గ్రంథం 'ఏసియన్ డ్రామా' ఆసక్తితో చదివి ప్రాచ్యదేశాల లోతైన ఆలోచనలను అర్థం చేసుకున్నానన్న చెప్పిన ఆవుల సాంబశివరావు గారి అధ్యయన శైలి పరిశీలిస్తే .. ఆ మహామనవతావాది  పఠన పర్వం ప్రాచ్యుల వేదాల దగ్గరే ఆగిపోకుండా,  తాత్వికుల ఉపనిషత్తులు, అస్తిక షడ్దర్శనాల దాకా సాగినట్లు అర్థమవుతోంది.

 పురోగమనం, జీవం.. చేవ గలిగిన మనిషి  అచరించకుండా వదలించుకోకూడని సృజన వ్యాపారాలు- హేతువాదం, మానవతావాదం అన్నది ఆవుల వారి ధృఢాబిప్రాయంగా గుర్తిస్తే .. ఆ విధమైన మావవతావాదం ఆయనలో రగులకొల్పింది ఆరంభంలో వైవిధ్య భరితమైన వివిధ రంగాలకు చెందిన ప్రపంచ సాహిత్యం అన్న వాస్తవం మనకు అర్థమవుతుంది.  

- కర్లపాలెం హనుమంతరావు

21, నవంబర్, 2020.

(నవభావన -  జీవవాహిని శారద -  పుటలు 46 -  55 -ఆధారంగా)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...