Wednesday, December 15, 2021

ఈనాడు- హాస్యం - వ్యంగ్యం - కరుడు కట్టిన మంచితనం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడులో పద్దుల కందని పాపాలు శీర్షికతో - ప్రచురితం - 25 - 12 -2009 )


 




ఈనాడు- హాస్యం - వ్యంగ్యం - 


కరుడు కట్టిన మంచితనం 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడులో పద్దుల కందని పాపాలు   శీర్షికతో - ప్రచురితం - 25 - 12 -2009 ) 


'ఇదేమి చిత్రం చిత్రగుప్తా' ఇన్ని యుగాల నుంచి ఈ యమధర్మాన్ని ఇంత నిర్విఘ్నంగా నిర్వహించుకొస్తున్నామే! సమవర్తి అనే మా కీర్తికి మచ్చ వచ్చే పెను ప్రమాదం ఎదురైంది! ఈ అగ్ని పరీక్షనుంచి నిష్కళంకంగా బయటపడే దారేదైనా ఉంటే వెంటనే వెదకవయ్యా! ' 


'నిజమేకానీ మహాప్రభో! జీవితంలో ఒక్కసారైనా నిఖార్సైన  పాపం చేయని ఈ పుణ్యాత్ముడికి నరకంలో నివాసం కల్పించే నిబంధన ఏదీ నా పరిజ్ఞానమునకు కూడా అందటంలేదు యమధర్మరాజా!' 


'అసంభవం! నాలుగు పదులు నిండిన ఈ నగరజీవి జీవితకాలంలో ఒక్క నేరమైనా చేయకుండా నేరుగా ఇలా మన ముందు బొందితో నిలబడి ఉండటం ఎలా సంభవం? సరిగ్గా చిట్టా చూడవయ్యా.. ఏ చీమనో దోమనో అయినా చంపకుండా ఉంటాడా?' 


'ఎర్రబస్సుల మీద ఏ కారణం లేకుండానే రాళ్ళు. వేసే వాళ్ళ ముందు ఈ జీవి చేసిన చిరుహింస ఏపాటిది ప్రభూ! చీమలనూ, దోమలనూ, నల్లు లనూ, వ్యాధులు కలిగించే ఏ క్రిమికీటకాలనైనా చంపటం ఒక నేరంగా పరిగణించరాదని పరమేశ్వ రుడు ఈమధ్యే మన నిబంధనలలో సవరణ చేశాడని మరచితిరా మహాప్రభూ!'


' పోనీ మానవజన్మ ఎత్తినవాడు జీవితంలో ఒక్క సారైనా ఏదైనా మోసానికి పాల్పడకుండా ఉంటాడా! చూడవయ్యా! '


'రేషన్ కార్డులలో గాంధీ.. గాడ్సేల వంటి  వాళ్ళ పేర్లు కూడా దూర్చి నలుగురికీ చవకగా పంచవలసిన పంచదార, బియ్యం, నూనెల వంటి సరకులను ఒక్కరే బొక్కే సేవారికన్నా ఈ బక్కయ్య చేసిన మోసం ఏపాటిది యమధర్మరాజా!  చిన్న చిన్న మోసాలకు కూడా శిక్షలు విధిస్తూ కూర్చోవాలంటే  విధులు అమలుచేసేందుకు తగిన సిబ్బంది ఏదీ? కొత్త నియామకాలంటే నిధులు లేవని మొన్నే గదా మన కుబేరులవారు కుండబద్దలేసి సెలవిచ్చిందీ  ! ' 


అబద్ధాలు ఆడటం మహాపాపం.  ఈ మనిషి వాలకం చూస్తే నిత్య సత్యవ్రతం ఆచరించే సత్య హరిశ్చంద్రుడి లాగా ఏం లేడు . గట్టిగా చూడు.... చిట్టాల్లో ఏ చిట్టి పొట్టి అబద్ధమాడినట్లున్నా ఓ శిక్ష వేసి ఫైలు మూసేద్దాం. ' 


' లేదు యమధర్మరాజా! మనం అబద్ధాన్ని ఒక పాపంగా పరిగణించటం మానేసి ఒక మన్వంతరం దాటిపోయింది. క్లింటన్ వంటి పెద్ద పెద్ద అగ్ర దేశాధినేతలే అబద్ధాలాడి తప్పించుకుంటున్నారు. కడుపున పుట్టిన బిడ్డల్నే సొంత సంతానం  కాదని బుకాయించే నేతలున్నారు  భూలోకంలో.  ఎన్నికల సమయాల్లో నాయకులిచ్చే వాగ్దానాల ముందు ఈ పిచ్చి బక్కయ్య చెప్పే చిన్ని చిన్న అబద్ధాలు చీమంత.  యమ ధర్మస్మృతుల  ప్రకారం అవి అసలు శిక్షారాలే కాదు.' 


' ఇంక చాలు చిత్రగుప్తా! చాలు...చాలు.... '


' అదేమిటి స్వామీ' ఎన్నడూ లేనిది కళ్ళల్లో ఆ నీళ్ళు! ' 


' కరుడు కట్టిన మంచితనంతో ఈ బక్కయ్య నా కళ్లలో నీళ్ళు తెప్పించాడయ్యా ! ఇంతటి మహాత్ముడిని మన నరకలోకం దాకా తెచ్చినందుకు ముందు ఆ మన యమకింకరులను విధులనుంచి బహిష్కరిస్తున్నాను'


' మాట మధ్యలో అడ్డొస్తున్నందుకు  మన్నించండి యమధర్మరాజా ! ఇందులో మన యమకింకరులు చేసిన తప్పేమీ లేదు' అని అప్పుడు నోరు తెరిచాడు బక్కయ్య.  


' మరెవరిది తప్పు? ' 


'నా కథ ఆసాంతం వింటే తమరికే తెలుస్తుంది మహాప్రభూ ! నేనొక సగటు నగరజీవిని.  బతుకుతెరువు కోసం పనికి వెదుకులాడుకునే రోజుకూలీని.  మొన్న కరవు, అటు మొన్న పేరుతెలియని రోగం, నిన్న వరద. పెరిగిన ధరవరలతో పూట గడవటమే కటకటగా ఉంటే గోరుచుట్టు మీద రోకటిపోటులాగా రోజు మార్చి రోజు దేనికోదానికి బందులు!  పనిదొరకక బతుకుమీద వెగటు పుట్టి.. తాగిన పురుగుమందు. ససం ప్రాణమే తీసి చచ్చింది మహాప్రభూ! వైద్యం కోసం ధర్మాసుపత్రికని వెళితే పెద్ద పెద్ద మనుషులకే పడకలు చాలక ఇబ్బంది పడుతుంటే మధ్య బక్కోడివి.. నీకు వైద్యమేంటి.. చోద్యం కాకపోతే! '  అంటూ గెంటేశారు. బైట మందుల షాపులో కొని మింగిన గోలీలో ఏం గోలుమాలుందోగానీ.. యమధర్మ రాజా! మింగీ మింగకముందే... ఇదిగో మిగిలిన ఆ కాస్త ప్రాణాన్ని మీ యమభటులొచ్చి ఇలా తీసుకొచ్చేశారు' 


' ఆరెఁ... ఎందుకు స్వామి.. తిప్పుకోకుండా నవ్వుతున్నారు? ' 


'ఉసురు తీయాల్సిన విషము ఉసురు తీయలేదా? ఊపిరి నిలపాల్సిన మందు ఊపిరితీసిందా ! భళా. . బక్కయ్యా మీ భారతము కడు చిత్రముగా నున్నది. నీ చరితము కడు కామెడీగానున్నది. కానీ నాకు ఒకందులకు నాకు మహదానందముగా కూడా ఉన్నది.ఆత్మహత్యా ప్రయత్నం మహాపాపమనిగదా శిక్షాస్తుృతి చెప్పుచు న్నది! నీవు కోరినవిధంగానే నీకు నరకలోకమును ఇప్పుడు ప్రసాదిస్తున్నందుకు సంతోషముగానున్నది. ' 


'ధన్యుణ్ణ్ని యమధర్మరాజా! నా కోరికకు మరో చిన్న కొనసాగింపు కూడా ఉన్నది. నాకు పాపులకు దండనలు అమలుచేసే కింకరుల పని ఇప్పించమని మనవి' 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడులో పద్దుల కందని పాపాలు   శీర్షికతో - ప్రచురితం - 25 - 12 -2009 ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...