Wednesday, December 15, 2021

ఈనాడు - హాస్యం- వ్యంగ్యం - గల్పిక మాయం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురణ తేదీ 06 -08 - 2004 )


 


ఈనాడు - హాస్యం- వ్యంగ్యం - గల్పిక 

మాయం 

రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురణ తేదీ  06 -08 - 2004 ) 


' మాయ రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తు న్నది 'మాయం' శకం! దేశ రాజధానిలో పట్ట పగలే చట్టసభకు చెందిన శాల్తీ చటుక్కుమని మాయమయిందంటే ఇన్ని దశా బ్దాల కాలంలో మన ప్రజాస్వామ్యం సాధించిన పురో'గతి'  ఆహా!అని వేనోళ్లతో పొగుడుకోవచ్చు' 


'సందు దొరికితే చాలు సెటైరేస్తావు! మాయలూ... మంత్రాలు మనకేమన్నా కొత్తట్రా ? శివుడంతటివాడు శని పడతాడని భయపడి గుహలో దాక్కున్నాడా లేదా! దేవుడు కనపడకపోతే అంతర్ధానమూనూ, మనిషి కనప డకపోతే మాయమూనా!' 


పి.సి. సర్కారు తాజ్మహల్ని మాయం చేస్తే అదో వినోదమనుకున్నాం. భారత్ సర్కార్ ఏకంగా మంత్రుల్నే మాయం చేస్తుంటే ఏమనుకోవాలి! 


' దుబాయి పోయిన భాయీలు మాయమవటం తెలుసు. సుభాష్ చంద్రబోస్ విమానయానం చేస్తూ మాయమయిపోయాడనటం తెలుసు. సభలో సమాధానం చెప్పాల్సిన అమాత్యులే గభాలున ఇలా మాయమయి పోవడం మాత్రం నిజంగా మహా అయోమయంగానే ఉంది భాయీ!' 


' మాయలేనిదెక్కడ నాయనా! ఊరికే యాగీ చేస్తావు గానీ యోగులు సమాధిలోకెళ్ళటం 'మాయం' కాదూ! ఇంటాయన కనిపించకపోతే సన్నాసుల్లో కలిసాడంటావ్. ఇంట్లో ఆవిడ కనిపించక పోతే లేచిపోయిందంటావ్. ఆఫీసులో, రిజిస్టర్లో సంతకాలన్నీ  ఉన్నా సీట్లలో సగం మంది కూడా కనిపించరు... దీన్నే మంటావ్? మంత్రులూ, వాళ్ల సామంతులూ సీటు దిగిపోగానే ఫైళ్లు కనిపించవు. పబ్లిగ్గా హీరో ఫటాఫటామని. . ఆరు రౌండ్లు తుపాకి గుండ్లు  పేల్చేసినా కేసు కనపడకుండా హుష్ కాకి అయిపోయింది. దీన్ని మాయమని అనాలని .. లాకప్పుల్లో ఖైదీలు, గుళ్లల్లో విగ్రహాలు, బ్యాంకుల్లో ఖాతాలు, ఆసుపత్రుల్లో కిడ్నీలు పత్తాలేకుండా పోతుంటే నోరెత్తవు గానీ, నలభయ్యేళ్లనుంచీ నానబెట్టిన కేసును బైటికి తీసి వారెంటిస్తే 'జీహుజూరంటూ జైల్లో కెళ్ళి కూర్చోవటానికేనా మన సోరెన్ భాయ్ అంత గొప్పగా గడ్డాలూ... మీసాలూ పెంచింది? ఇంట్లో వాడింట్లోనే సెక్యూరిటీ కళ్ళుగప్పి మాయమై పోవటానికెంత ఐక్యూ ఉండాలి! ఏదీ మెచ్చుకోలేరు నీలాంటి ముచ్చుగాళ్ళు....' 


' నిజమే సుమా! వీరప్పన్ చిట్టడవుల్లో ఉన్నాడు గనక పట్టుకోలేక పోయారనుకొందాం. నగరం నడిబొడ్డునే అంతంత పెద్ద గడ్డం మీసాలు దువ్వుకుంటూ తిరిగే వాడిమీద రవ్వంత కూడా దువ్వ పడటం లేదంటే...

జనం నివ్వెర పోతున్నారు. కనపడటం లేదని తలుపు మీద కాగితాలంటించి పోతే ఓ పనై పోతుందన్నట్లుగా తంతు నడవటమే వింతగా ఉంది. మరీ నిలదీస్తే ప్రధాన మంత్రే మాయమయ్యేట్లున్నాడు.' 


' మరంతే. మంత్రివర్యుడు అంటే మంత్రగాడనే గదా నిఘంటువు అర్థం! 'మాయం' అని ఈ మధ్య అదేదో సినిమా వచ్చింది. అందులోని హీరోకి మల్లే సోరెన్ బాయికి ఏ దేవత వరమిచ్చిందో గాని... టయానికి

ఠక్కుమని మాయమైపోయాడు. ముందు తరాలకి కొత్త మార్గం చూపించాడు. జె.ఎం.ఎం. జిందాబాద్!... శిబూసోరెన్‌ వర్ధిల్లాలి! ' 


'అభిమాన సంఘం పెట్టేట్లున్నావే!' 


' అవును . నేరాల్లో దొరికే సమయానికి తీరిగ్గా మాయదారి రోగాలు కొని తెచ్చుకొని ఆసుపత్రుల్లో ఆపసోపాలుపడే వారికి శ్రమ తప్పించిన వాడికి తప్పకుండా అభిమాన సంఘం పెట్టాల్సిందే. ఈ ఊహ రాకే  సద్దాం బుష్ కి  చిక్కింది . పప్పూ యాదవ్ చిప్పకూడు తింటున్నది . కృష్ణయాదవ్ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటున్నది. ఎ. కె. గోపాలన్ ఏకంగా అన్ని నెలలు పోటా - క్రింద జైల్లో పడి నలిగిపోకుండా శిబూభాయి దారిలో పోయుంటే సుఖపడుండేవాడా, కాదా! జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడి అడుగుజాడలే రేపటి రాజకీయ తరాలకు నిజమైన ముక్తి మార్గం. విఠలాచార్య సినిమాలోలాగా హాలీవుడ్ టైపులో హఠాత్తుగా మాయమై పోవటమెలాగో శిబూసోరెన్ శిబిరం పెట్టి మరీ  భావితరాలవారికి శిక్షణ గట్రా  ఇస్తే శిబి చక్రవర్తులకు మల్లే  ఎవరూ పాతాళంలో ముక్కిపోకుండా సరిపోతుందని నా సలహా, ఏమంటావ్? రాబోయే రోజుల్లో వారెంట్ జారీ అయ్యే అవకాశాలున్న వారంతా సావకాశంగా క్రాష్ కోర్సు చేసుకుంటే  సేఫ్ అని నా ఉద్దేశం' 


' అవును; పబ్లిగ్గా శిక్షణ పొందటానికి సిగ్గు పడేవాళ్లకు బొగ్గు గనుల్లో తర్పీదివ్వచ్చు.  తుమ్మితే దగ్గితే తరగతులు నిర్వహించే ఓ ప్రాంతీయ పార్టీకీ మధ్య అంతగా క్లాసులు పీకే అవకాశం రావటం లేదు. మిగిలిన పార్టీలవారు కూడా ఈ తక్షణ రాజకీయావసరాన్ని గుర్తించి ప్రత్యేక శిక్షణకు పూనుకుంటే శాసనసభాపతులకు సభ్యుల సెలవు మంజూరు విష యంలో దుగ్ధ తగ్గించిన వారవుతారు. అఖిల భారత అజ్ఞాతవాసుల సంఘం, ఆలిండియా అండర్ గ్రౌండ్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ బిన్ లాడెన్ డెన్ గ్రూపు, తదితర గ్రహాంతరవాసులూ, గత జన్మలో ఏదైనా చిల్లర కేసుల్లో పోలీసులకు చిల్లర సమర్పించక తాత్సారం చేసినవాళ్లూ... అర్జంటుగా ఈ షార్ట్ టరమ్ కోచింగ్లో చేరి ప్రయోజనం పొందితే మంచిది.' 


' దారిలోకొచ్చావురా నాయనా! అయితే ఒక నోట్ తయారు చెయ్ ! కాలానుగుణంగా రాజకీయావసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు సిలబస్ ను  అపుడేట్ చేసే క్రమంలో ఇప్పుడు శిబూసోరెన్ ఆధ్వర్యంలో ' క్షణంలో మాయమవటమెలా? ' అనే విషయం మీద తరగతులను నిర్వహించమని అఖిలపక్ష సంఘాలకు మనవి. దానికి సంబంధించిన ప్రకటన మనమే తయారుచేద్దాం... పట్టు! 

' మీ తలుపులకు వారెంట్లు అంటించారా? దిగులు పడకండి!

' కనపడుట లేదు' అని మీ పేరున పేపరులో ప్రకటన పడిందా! కలవరపడకండి! వీసాదొరకక విసుగేస్తుందా ? అమాంతం అమెరికాలో ప్రత్యక్షమవాలని ఉందా? ఆదా యపు పన్ను అధికారుల సోదా రోజు రోజుకూ అధికమ వుతుందా! ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీల పర్వం తలనొ ప్పిగా తయారైందా? పత్తాలేకుండా పోయే సత్తా లేదా?' 


' టీవీల వాళ్లతో తంటాలు లేకుండా, ఆసుపత్రుల్లో ఆపసోపాల బాధ లేకుండా..  హాయిగా ఉండాలంటే క్షణంలో మాయమయిపోయే మా కొత్త కోర్సుల్లో చేరండి. చట్టం తన పని తనను  చేసుకు పోనీయండి. శిబూసోరెన్ అభిమాన సంఘం నిర్వహించే శిక్షణా తరగతుల్లోసత్వరమే చేరండి. క్షణంలో మాయమైపోండి...' 


గమనిక: కోర్సు ఫీజు మొత్తం  ముందే చెల్లించాలని మనవి. 


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురణ తేదీ  06 -08 - 2004 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...