Thursday, December 30, 2021

ఈనాడు- హాస్యం - వ్యంగ్యం - గల్పిక ఎన్నో దృష్టాంతాలు - రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం 05 - 10 - 200


 




ఈనాడు-  హాస్యం - వ్యంగ్యం - గల్పిక 

ఎన్నో దృష్టాంతాలు 


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం 05 - 10 - 2009 ) 


పరమాత్ముడైనా ఆ పరంధాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేసేవరకు పట్టాభిషేకానికి నోచుకోలేదు. అతని పాదుకలు మాత్రం ఏ ప్రయత్నం చేయకుండానే  దర్జాగా అయోధ్యా సింహాసనాన్నెక్కి కూర్చు న్నాయి! అదృష్టమంటే అదే! 


లక్కుంటే  ఎడారిలో ఉన్నా ఏనుగు వెదుక్కుంటూ వచ్చి గజమాల మెళ్లో వేసేస్తుంది. దీన్నే 'తంతే బూరెల బుట్టలో పడటం' అంటారు. అలా పడాలని బుట్ట ముందు నిలబడి తన్నించుకున్నా తలరాత బాలేక పోతే  పక్కనున్న బురదలో  పడొచ్చు.


' అదృష్టం అదృశ్యం అప్పాచెల్లెళ్లు . రెండూ కంటికి కనిపించేవికావు . దీనికి దృష్టాంతాలేగానీ సిద్ధాంతాలుండవు. 


అపోలో రెండోదశ అంతరిక్ష నౌక చంద్రమండలం మీద దిగేముందు ఇరవై నిమిషాలకు సరిపడే  ఇంధనం మాత్రమే మిగిలుందట. అదృష్టం అట్లా కలిసిరావాలి. అది కలిసి రావాలని   నిర్బంధంగా పెట్టుకునే  పచ్చలరాయి తినే పచ్చడన్నంలో కలిసిపోయి గొంతుకు అడ్డంపడి చచ్చినా చావచ్చు. 


ప్రారబ్దానికి  ఏ శబ్దార్ధకౌముదీ అసలైన అర్థం చెప్పలేదు. ఖర్మానికి ధర్మాధర్మ విచక్షణలుండవు.  'గీత ' చెబుతూనే ఉంది గదా.. పూర్వజన్మ సుకృతమ నేది ఉందే... అది ఏ నిర్వచనానికీ అందనిదని .


టైమ్ బాగా లేకపోతే భోలకప్పూర్ నల్లా నీరే కాదు.... మినరల్ వాటరూ కాలకూటమైపోతుందట! ఏదేమైనా రాజకీయాలు పత్తి మార్కెట్ల మాదిరిగా తయారయ్యాయనేది నూటికి నూరుపాళ్ళు నిజం.  జనాలని నమ్ముకోవాల్సిందిపోయి, అభ్యర్థుల జాతక చక్రాలను నమ్ముకుంది మొన్నటి ఎన్నికల్లో జయలలితమ్మాళ్: మన దగ్గర ఎమ్మెల్సీ సీట్లకోసం హస్తం పార్టీ చీట్లు తీసినట్లు!  గోడదూకే వాళ్లెక్కువైపోతున్నారని గోడను మరింత ఎత్తుగా కట్టుకుంది  ఓ జనం పార్టీ.  ఓటమికి గుర్తు కలిసి రావటంలేదనుకుంటోందేగానీ , జనంలో గుర్తింపులేదని ఇంకా గుర్తించలేకుండా ఉంది ఇంకో కొత్తపార్టీ! 


నేతల తలరాతలను తేల్చేది నిజానికి అయిదేళ్ళకోసారి వచ్చే ఎన్నికల జాతరేగానీ, ఎత్తులూ తాయెత్తులూ కానేకాదని ఇన్నేళ్లకైనా  ప్రజాప్రతి నాయకులనుకునేవాళ్ళ కళ్లు తెరిపిడి పడకపోవడమేమిటి! 


రోజులూ అట్లాగే ఏడ్చాయి. ఎన్నికల్లో గెల్చినోడు సరిగ్గా  ప్రమాణస్వీకారం చేసే రోజే ప్రాణాల మీదకు తెచ్చుకుంటే , యావజ్జీవం పడినవాడు దర్జాగా బయటకొచ్చి పచ్చి చీకటి  వ్యాపారం  చేసుకుంటాడు. రాసిపెట్టుంటే చర్లపల్లిలో ఉన్నా బిర్యానీ పొట్లాలు, సిమ్ కార్డులు సరఫరా ఆగవు ! నూకలు చెల్లిపోతే  గోకులాచాట్ కెళ్ళినా ప్రాణాలు పోతాయిమరి ! దేవుడు దయతలచి ' ఊ ' అన్నా పూజారి పుణ్యముంటేనేగాని ప్రసాదమైనా దక్కని ఈ కాలంలో ముందు పూజారిగారి మనసు మనవైపు మళ్లటమే  అసలు అదృష్టానికి సిసలు దృష్టాంతం.  


కాలం కలిసిరాదనుకో !  పెట్టుకున్న  'నానో' కారు ఫ్యాక్టరీకీ  రెక్కలొచ్చి ఎటెటో ఎగిరిపోతుంది! చేటుకాలం తోసుకొస్తే జైకొట్టిన చేతులే చెప్పులు విసిరేస్తే చేటు కాలం  దాపురించింది వేరే చెప్పాలా? అందుకే అదృష్టం మీదందరికీ కన్ను . అదృష్టమేమన్నా మన గర్ల్ ఫ్రెండా, చప్పట్లు కొట్టి పిలిస్తే 'హాయ్|  అంటూ చప్పునొచ్చేసి వచ్చి ఒళ్ళో వాలిపోవటానికి!


సోనియాజీ 2004లో ప్రధాని పదవికి మన్మోహన్ సింగు గారిని సూచించింది. అప్పటికి  ఆయన లోక సభ  సభ్యుడు కూడా కాదు. దేశానికి సేవ చేయాలని రాసిపెట్టి ఉంది. అంచేతనే ఆయన అంత పెద్ద నేతయారు. 


రాసిపెట్టి ఉంటే ఎక్కడున్నా దక్కుతుందనే సిద్ధాంతం నమ్మకముంటే రాద్ధాంతాలు చేయనక్కర్లే!


దేనికోసమూ దేబిరించకుండా  దేవుడిచ్చిన  పాత్రను సక్రమంగా పోషించడమే స్థితప్రజ్ఞుడి విజ్ఞత.  


జీవితం ఒక పాత్రఅనుకో! కింది సగం కృషి, పై సగం అదృష్టం. అదృష్టం నోటిదాకా రావాలంటే  కృషి చేయక తప్పదు.


దుర్యోధనుడు ధర్మరాజుతో  జూదమాడి గెలిచింది అదృష్టం వల్లకాదు... శకుని పాచికలవల్ల.  గురు త్వాకర్షణశక్తి సూత్రం తట్టినప్పుడే  న్యూటన్ ఆ ఆపిల్ చెట్టు కింద చేరడమూ  అదృష్టంవల్ల కాదు... ఆపిల్ పండు నేల రాలిపడ్డంతో సహా అంతా కాకతాళీయం. సముద్ర తీరం దాటేముందు వాయుగుండం ఏ సిద్ధాంత గ్రంథమూ తిరగేయదు. వాటాన్ని బట్టి జరిగే ఆ పకృతి చర్యను ఏ యాగమూ యజ్ఞమూ ఆపలేదు. 


తలరాతలు మనచేత్తో మనమే రాసుకునేవి: ఆ సత్యం  సత్యంరాజు ఉదంతం సుస్పష్టంగా తెలియచేస్తోంది . అయినా ఇంకా అదృష్టం చూరు  పట్టుకు  వేలాట్టం  కార్యశూరులు  చేయవలసిన  చర్యేనా? !


అదృష్టలక్ష్మి వద్దన్నా వచ్చి మన ఇంటి తలుపు ఎప్పుడో ఓరోజు తట్టి తీరుతుంది . ఆ టైమ్ మన బెడ్ టైం కాకపోవడమే అదృష్టం . 


ఇప్పుడైనా మన అదృష్టానికేం లోటు?! స్వైన్ ఫ్లూ   సీజన్లో జల్లీ ఫ్లూ రావడమే అదృష్టం.  వానల్లేని  కార్తెల్లోను బలవంతంగా బ్యాంకు లోన్లు అంటకట్టడం లేదు. అదీ అదృష్టమే.  అమెరికాలోనూ మాంద్యమున్న రోజుల్లో మన దగ్గర ఉద్యోగాలాట్టే ఉడటంలేదు. అదీ అదృష్టమే.  కందిపప్పుకి బదులు పెసర పప్పు, సన్నబియ్యం ప్లేసులో  దొడ్డుబియ్య బలవంతంగా సంచుల్లో  పొయ్యడం  లే.. లక్కు! లేటయితేనేమిగాని బైటకెళ్లిన ఆడపిల్లల ఏ యాసిడ్ దాడుల్లేకుండా  ఇళ్లు చేరుతున్నారు. అదెంత అదృష్టం! 


ఇట్లా నాలుగైదు ముక్కలయినా అదృష్టానికి దృష్టాంతాలుగా రాయడానికి మిగలడం రచయితగా  నా అదృష్టం . 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం 05 - 10 - 2009 ) 



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...