Wednesday, December 15, 2021

వ్యాసం మేనరికాలు ( మూలం - తాపీ ధర్మారావు గారి 'పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' నుంచి ) సేకరణ- కర్లపాలెం హనుమంతరావు


 


వ్యాసం 

మేనరికాలు 

( మూలం - తాపీ ధర్మారావు గారి 'పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' నుంచి ) 

సేకరణ- కర్లపాలెం హనుమంతరావు 


మానవ సమాజంలో మొట్టమొదట వుండిన విచ్చలవిడిగా జతకూడే పద్ధతి, రాను రాను కొన్ని నియమాలకు లోబడవలసివచ్చింది. ఈ వ్యక్తితో జతకట్ట వచ్చును, ఈ వ్యక్తితో జతకట్టరాదు అని నిషేధాలు కలిగాయి. తల్లి పిల్లల జతలు ఈ నిషేధాల కిందికే వచ్చాయి. 


రాజకీయ కుటుంబాలలో మాత్రం ఇతర రక్తాలు కలియకుండా వుంచుకోడానికి అక్కా తమ్ముడు జతలు కట్టే పద్ధQ కొంత సాగింది. మరి కొన్నాళ్ళకు అదే  ఒక్క తల్లికి పుట్టినవారు తప్ప తక్కిన బాపతు అక్కా తమ్ములు జతకట్టే పద్ధతి ఆమోదనీయమైంది. 


మరి కొంత కాలం తరువాత మరికొన్ని నిషేధాలు వచ్చాయి. రక్తసంబంధం వుంటే జతకట్టడం మంచిది కాదన్న అభిప్రాయం కలిగింది. ఆ దృష్టిని చూసేసరికి ఒక గూడెం ఒక జట్టులో  అంతా, బీరకాయ పీచు సంబంధాలే .  . ఒక్క వేలు విడిచిన సంబంధం, రెండు మూడు నాలుగు..వేళ్ళు విడిచిన సంబంధం అందరూ సంబంధం వున్నవాళ్ళే . 


కాబట్టి, ఒక జట్టులో ఉన్నవారు ఆడవారు కానీ, మగవారు కానీ-అదే జట్టులో నుండేవారిని పెళ్ళి చేసుకో కూడదన్నారు. 


జతల కోసం ఇంకొక జట్టుకు పోవాలి. దీనికి "ఎక్సాగమీ" అని పేరు పెట్టారు. 


మరికొన్ని దేశాలలో దీనికి విరుద్ధంగా వుంది నియమం. ఏ జట్టువారు ఆ జట్టులోనే జతకట్టుకోవాలి అని. దీనిని "ఎండాగమీ" అన్నారు. దీనికి కారణం ఎవరి జాతి మహత్తుమీద వారికి ఆధిక్యత ఎక్కువ అనిపించడం. 


పై జట్టు పెళ్ళి..  ఆ జట్టు పెళ్ళి అన్న ఈ రెండూ రెండు రకాలా, ఒకటే రకమా అనిగూడా వివాదం వుంది. పై జట్టుమీదనే ఆధారపడిపోతే, అలా జతలు కట్టడానికి అవకాశాలు ఉండవచ్చును, ఉండకపోవచ్చును. ఈ రెండు జట్టులకు ఉన్న సఖ్యాన్నిబట్టి, వైరాన్నిబట్టి కథ నడపవలసి వస్తుంది. అదే సూత్రంగా పెట్టుకుంటే, ఒక జట్టు ఇంకొక ಜಟ್ಟು వారితో పోట్లాడి, ఆ జట్టువారి ఆడవారిని తెచ్చుకోవలసి వస్తుంది. ఇలాంటి వివాహాలూ ఉన్నాయి. కాని, ఇదంతా చాలా బెడద వ్యవహారం. పెళ్లే కావాలి అంటే పోట్లాడాలన్న మాట వస్తుంది. నిత్యజీవితంలో ఇంత బెడద పెట్టుకుంటే చాలా కష్టం. ఆ రోజులలో వాళ్ళంత బెడద తెచ్చిపెట్టుకొని ఉంటారా?


ఒక్క జాతిలో రెండుమూడు జట్టులుండవచ్చును కదా? కొండ మీద ఒక జట్టు, లోయలో ఒక జట్టు, కొండ అవతల ఒక జట్టు అన్నట్టు ఉండవచ్చును. ఈ మూడు జట్టులూ ఒక్క తెగవే. సఖ్యంతో  ఉండేవి. అలాంటప్పుడు, పై జట్టునుంచే పెళ్ళి చేసుకోవాలి అని ఒక నియమం పెడితే ఏమయింది? కొండమీది వారు లోయలోని వారితోనూ, లోయవారు అవతలివారితోనూ సంబంధాలు చేసుకోవచ్చు నన్నమాట. లోయలోనివారు, లోయలోనివారిని పెళ్ళిచేసుకోరని అర్థం. ఈ పద్ధతిని జట్టునుపట్టి చూస్తే ఇది ఎక్సాగమీ! జాతినిపట్టి చూస్తే ఇది ఎండాగమీ అవుతుంది. నిత్యజీవితానికి అడ్డు, ఆటంకమూ వుండవు.


ఇలాంటిదే మన గోత్రాల పద్ధతి. ఏ గోత్రం వారు ఆ గోత్రంలో పెళ్లి చేసుకోకూడదు. ఇతర గోత్రం వారినే చేసుకోవాలి. ఇది ఎక్సాగమీ; బయటి సంబంధం. కాని, వారందరు ఒక్క కులంవారే అవడంచేత ఇదే ఎండాగమీ; లోపలి లోపలి సంబంధం. ఈ దృష్టిని చూస్తే ఈ రెండూ ఒక్కటే అని తేలుతుంది.


బయటి సంబంధమయినా సరే, లోపలి సంబంధం అయినాసరే, జతకూడే హక్కులూ, పద్ధతులూ అన్నీ ఇంతకుముందు నేను మనవిచేసినట్టే- అందరికీ హక్కు వుంటుంది. ఒక ఇంటిలో ఒకడు పెళ్ళి చేసుకున్నాడు. అంటే, ఆ ఇంటివారు అందరూ ఆ పెళ్ళికూతురితో జతకట్టవచ్చును. ఒకడికి భార్య అయితే ఆ అన్నదమ్ముల కందరికీ

భార్య అవుతుంది. ఒక ఆమె ఒకడ్ని పెళ్ళిచేసుకుంది అంటే, ఆమె అక్కచెల్లెళ్ళందరూ అతనితో జతకట్టవచ్చును. అతనికి పెళ్ళాం ఇతనికి పెళ్ళాం అని విచక్షణ లేదు. ఇంటందరికీ పెళ్ళామే అవుతుంది. ఇంటికోడలు  అవుతుంది.


ఆశ్చర్యపడకండి. భారతంలో పాండవులు చేసుకున్న పెళ్ళి ఇలాంటిదే. ద్రౌపది ఇంటందరికీ ఇల్లాలే. నాయర్లలో గూడా ఈ ఆచారం వుంది. టిబెట్లో ఇలాంటి ఆచారమే వుంది. నీలగిరి తోడాజాతిలో గూడా ఈ ఆచారం వుంది.


అంతేకాదు, రామాయణంలో రాముడు మాయలేడిని పట్టుకోడానికి పోయిన తరువాత "హా లక్ష్మణా" అన్న ధ్వని వినిపించినప్పుడు సీత లక్ష్మణుడ్ని వెళ్ళమంటుంది. అన్న చెప్పినమాట తప్పకూడదని లక్ష్మణుడు కదలడు . అప్పుడు' సీత  నిష్ఠురాలు  పలుకుతూ, 'మీ అన్న పోయినట్టయితే నన్ను పొందాలనా ఇలా కదలకుండా ఉన్నావు ? ' అని అన్నది.


సీతమ్మ అజ్ఞానురాలు కాదు. ఇంత నీచమయిన మాట ఆడదు. అయినా ఆ మాటలు వాల్మీకి అంతటివాడు వ్రాశాడు. ఏమి? అప్పటి ఆచారం; అన్న భార్యను తమ్ముడు చేసుకోవచ్చు. వచ్చుకాదు; చేసుకోవాలి. గూడాను. వాలి సుగ్రీవులు చేసినపని ఇదే. తార ఇద్దరికీ భార్యయే. అన్నభార్యలను చేసుకొన్న బృహస్పతులు అనేకు లున్నారు.


మహారాజులు ఎందరెందరో తమ కూతుళ్ళను ఇద్దరు ముగ్గురివి కాదు యాభై మందిని, నూరుమందిని, ఒక్క ఋషి గారికి ఇచ్చి వివాహాలు చేశారని మన గాథలున్నాయి. అన్ని వివాహాలూ జరపరు. ఏదో పెద్దదానికి మాత్రం పెళ్ళిచేస్తే చాలు; తరువాత పెళ్ళిళ్ళు తమంతట అవే జరిగిపోతాయి. వాటికోసం వేరే బెడద పడనక్కరలేదు.


ఈ ఆచారం ఇప్పుడు కొంచెం వెగటుగా కనిపిస్తుంది; నిజమే. కాని, ఆ రోజులలో వెగటు ఉండేదికాదు. పైగా చాలా రుచిగా ఉండేదనే చెప్పాలి. ఎందుచేతనంటే, చూడండి. అదే అసహ్యం అయినపని అయితే, దానిని వట్టి రోతతో చూచి, ఈపాటికి దాని మచ్చుమాయా కనిపించకుండా  మరిచిపోయి ఉండేవారం; దాని సంపర్కం రవ్వంతయినా కనబడకుండా చేసేవారం.


కాని, అలా జరపలేదు.  ఇప్పటికీ మనలో ఈ వాసన ఉంది. మరదళ్ళూ, వరస మాటలు ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళ హాప్యాలు బావలూ చాలా దూరం పోతాయని వారి మాటలు విన్న వారందరూ అంగీకరిస్తారు. ఇంటిలో ఉన్నవారు ఎవ్వరూ ఆ హాస్యాలకు ఆక్షేపణ చెప్పరు. అంతా నవ్వేవారే.  ఆనందించేవారే  అంటే, సంఘం ఆ వరసలను అంగీకరించిందన్న మాట. ఆ రూపంగా మన పూర్వాచారల లక్షణం.  మనలో ఇప్పటికీ ఉన్నది. ఇలాంటి వరసలే . . మేనమామ మేనకోడల వరసలు.  జతకూడడానికి అవకాశం వున్న జట్టులు- పైని చెప్పినలాంటివి- 


మేహన అన్నమాటకే జతకట్టడం అని అర్థం చెప్పడం న్యాయం. ఈ మాటను నేను "దేవాలయాల మీద బూతుబొమ్మ లెందుకు? అన్న గ్రంథంలో సూచించాను. ఎందరు విసుగుకున్నా అర్థం తప్పదు. మేహన సంబంధమే మేన సంబంధం.  మేనరికం అయింది. మేనరికం ఉంది అంటే జతకట్టుకోడానికి అవకాశం ఉందనికదా, మనలో అర్థం? అంతేకాదు, కొన్ని సంఘాలలో తప్పకుండా పెళ్ళి చేసుకోవాలి కూడాను. తప్పించకూడదు. పెళ్ళి చేసుకున్నా, చేసుకోకపోయినా, ఈ మేనరికం ఉన్నవారు పైని చెప్పిన బావమరదళ్ళ లాగానే పచ్చి పచ్చిగా హాప్యం ఆడుకుంటారు. వారికా అధికారం ఉంది. ఇంత పచ్చిగా మాటలాడినారే అని ఒక్కరయినా చీకాకుపడరు. . చీవాట్లు పెట్టరు . అదీ మన మేనరికం వరస లక్షణం.

( మూలం - తాపీ ధర్మారావు గారి 'పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' నుంచి ) 

సేకరణ- 

కర్లపాలెం హనుమంతరావు 

 16 -12-2021  


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...