Sunday, December 12, 2021

కొన్ని న్యాయాలు .. కొన్ని లో కోక్తులు - కర్లపాలెం హనుమంతరావు



ఊడుగుగింజ న్యాయం 

ఊడుగుగింజలకు విలక్షణమైన గుణం ఉంది. రాలి చెట్టుకింద పడినవి మట్టిలో కలసి మృగశిర కార్తెలో ఒక్క చినుకు రాలినా చాలు  ఆ గింజలు మళ్లీ చెట్టుకే అతుక్కుంటాయి! 

ఒక పార్టీలో  నుంచి బయటకు వచ్చిన వాడు అదను చూసుకుని మళ్లీ ఆ పార్టీ లోకే గెంతేస్తే  అట్లాంటి జంపింగ్ జిలానీని 'ఊడు గింజ' లాంటోడు అనడం అందుకే. 


అక్కే చేత్ మధు విందేత కిమర్థం పర్వతం వ్రజేత్ ? 


అక్కము సంస్కృత పదం. ఇంటిమూల అని అర్థం. 

ఇంట్లో ఓ మూల  తేనెతుట్ట కనపడుతుంటే దానిని పిండుకోవాలి.  ఆ పని చేయకుండా తేనె కోసం కొండకు వెళ్లడం తెలివి మాలిన చేష్ట . వెతికేది  మన దగ్గరే ఉన్నా ఎక్కడెక్కడో గాలించే   సందర్భంలో వాడే జాతీయం ఇది . 

విజయ డయరీల వంటివి  మన రాష్ట్రంలోనే  పెట్టుకుని ఎక్కడి గుజరాత్ అమూల్  పాల కోసమో  అంగలార్చే సందర్భానికి   ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. 


3

అంధ కూప న్యాయం : 

ఒక గుడ్డి వ్యక్తి బావిలో పడితే, ఆ కబోదిని  గుడ్డిగా అనుసరించే కళ్లున్న వాళ్లూ  ఆ  బావిలోనే పడతారని చెప్పడానికి ఈ లోకోక్తి .  కూపము అనే సంస్కృత పదానికి  బావి తెలుగు అర్థం . 


అర్థజరతీయ న్యాయం: 

జరతీయ అంటే వయసు మీరిన శాల్తీ  . అర్థ జరతీయ-  అంటే సగం ముసలితనం వచ్చిన మనిషి . ఒకటి రెండు వెంట్రుకలు   మాత్రమే నెత్తిమీదివి  చూసి వయసులో ఉన్న స్త్రీ అని భ్రమపడినట్లే, నడుం మీద మడతలు రెండు  కనపడగానే వయసు ఉడిగిన స్త్రీగా భ్రమించినప్పుడు  ఈ న్యాయం వాడతారు. అంటే వస్తువులోని  ఒక పక్షపు లక్షణాన్ని బట్టి వస్తువు మొత్తానికి ఆ లక్షణం ఆపాదించే  ఆపత్తుకు    అర్థజరతీయ న్యాయం అతికినట్లు సరిపోతుంది. . 

ఫలానా రాజకీయ పార్టీ మంచిదని కొంత మంది .. కాదని  కొంత మంది 

వాదించుకోవడం వింటుంటాం . అప్పుడు ఇరు పక్షాలదీ  అర్థజరతీయ న్యాయమే అనిపిస్తుంది! 


అర్థాతురో న గణయత్  అపకర్ష దోషమ్ 

అర్థం ( డబ్బు ) మీద అత్యాశ ఉండేవాడు అవమానాలు లెక్క చేయడు - అని అర్థం. డబ్బు పిచ్చికి సిగ్గెగ్గులు  ఉండవనే  లోకం తీరును అద్దంలో చూపెట్టే సామెత ఇది. 

జైళ్లపాలవుతామన్నప్పటికీ     సిగ్గయినా లేకుండా అమ్యామ్యాలకు తెగబడతారు చాలామంది  పొలిటీషియన్లు! వాళ్లని చూసినప్పుడు  ఈ లోకోక్తి గుర్తుకొస్తుంది . 


6

అసారే  ఖలు సంసారే సారం శ్వశురమందిరమ్ 

అత్తారింటి మీద తమాషా చతురి ఇది. ఈ లోకం సారవిహీనం అయినా ( మజాగా లేకపోయినా ) .. ( శ్వశురమదిరం )   అత్తగారి ఇల్లు మాత్రం సారవంతమైనదేనట! ( అని అల్లుడిగారి ఆలోచన.. కోడలుది కాదు ) 

పాలిటిక్స్ పాడువే   అయినా మంత్రి పదవి మాత్రం మహా మజా! అనుకునేవాళ్లకు ఈ న్యాయం నూటికి నూరుపాళ్లు సరిపోతుంది  .. కదా! 😊


7

అసిధారావ్రతం - అనే మాట చాలామంది వాడుతుంటారు. దాని సరయిన అర్థం తెలుసో .. లేదో మరి! 

అసిధార అంటే కత్తకి ఉండే పదునైన  అంచు .. దాని మీద చేసే సాము చేయడానికి చాలా వడుపు అవసరం . ఆ కష్టాన్ని సూచించే న్యాయం ఈ అసిధారావ్రతం . 


8

అహి నకుల న్యాయం : 

పాము ముంగిస సామెత .  కేవలం శత్రుత్వం కన్నా పుట్టుకతోనే శత్రుత్వం ( ఆగర్భ శత్రుత్వం )  ఉంటే ఈ న్యాయం   మరింత అతుకుంది .

కాంగ్రెస్, భాజపాల మధ్య ఉండే రగడను చూసినప్పుడు ఈ అహినకుల న్యాయం గుర్తుకొస్తుంది . 


9

ఆమ్రవణ న్యాయం: 

వేరే రకాల చెట్లు చాలా ఉన్నా ..  మామిడి చెట్టు వంటి పళ్లు కాసే చెట్టు  గాని ఉందంటే. . ఆ తోటను మామిడి తోట  అనడం సహజం  . మామిడి తోట అన్నంత మాత్రాన ఆ తోటలో ఉన్నవన్నీ మామిడి చెట్లే కావాలని లేదుగా! గుంపులో ఒక విశిష్టమైన వ్యక్తిత్వం గల  వ్యక్తి ఉన్న సందర్భంలో ఆ గొప్ప వ్యక్తి పేరుతోనే గుంపు మొత్తానికి  గుర్తింపు వస్తుంది. 

ఉదాహరణకు తెలంగాణా రాష్ట్ర సమితి , ఆమ్ ఆద్మీ  పార్టీలు వంటివి ఆ పేర్లతో కన్నా  కెసిఆర్ పార్టీ , కేజ్రీవాల్  పార్టీలుగానే  ప్రసిద్ధి.. అట్లాగని  కెసిఆర్ పార్టీలో కెసిఆర్, కేజ్రీవాల్  ఒక్కరే ఉండరుగా ! ఈ భావాన్ని సూచించే సందర్భం వచ్చినప్పుడే  ఆమ్రవణ న్యాయం అనే లోకోక్తిని వాడాలనిపించేది  . 


10 

ఆహారే వ్యవహారే చ వ్యక్తలజ్జ స్సుఖీభవేత్ !

ఆహారంలో గాని, వ్యవహారంలో గాని మొహమాటం లేని వాడు సుఖపడతాడు  - అని సామెత . 

ఈ సామెత సారం రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాగ్నెట్లు బాగా వంటబట్టించుకున్నారు . కాబట్టే వాళ్లు ఆ స్థాయి దాకా ఎదిగి సుఖపడుతున్నారు. ఏమంటారు ? 

- కర్లపాలెం హమమంతరావు 

15 -09- 2021 

బోథెల్ ; యూ ఎస్ ఎ 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...