ఆదాయ యోగం
రచన - కరపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 20-02-2015)
' సబ్ కా సాథ్ ... సబ్ కా వికాస్'
నీ ఆయోగ నీతి- ఆ యోగమేంటో అంతా కొ త్తగా ఉంది. నా బాధంతా నీ భాష గురించి కాదు. వృద్ధి, ఉద్యోగాల కల్పన, బీదరికం నిర్మూలన, పథకాల అమలు... ఇలాంటి అంశాలన్నీ వినసొంపుగా ఉంటాయేగానీ, కాసులు రాలేందుకు వేరే దగ్గర దారులు ఇంకేమీ లేనేలేవా అన్నదే నా శంక! నిధులు, విజ్ఞానం లాంటివాటినన్నింటినీ కేంద్రం ఉదారంగా పంచి రాష్ట్రాలకు సాధికారత కల్పించడం అంతా వినసొంపుగానే ఉంది!'
' స్వచ్ఛ భారత్ అంటూ కనబడ్డ చెత్తనల్లా అలా ఊడ్చిపారేయమని సతాయిస్తున్నారు కానీ, నిజానికి ఈ చెత్త నుంచి ఎన్ని కొత్తకొత్త ఆదాయ వనరులు సాధించు కోవచ్చు! '
' పాత రాష్ట్రం, ప్రత్యేక హోదాల్లాంటి హామీలన్నీ అమలు కావాలని ఒకరు, కొత్త రాష్ట్రం... కొండలా మీ అండ కావాలని మరొకరు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు మొన్న నీతి ఆయోగ్ సమావే శంలో మోదీ బుగ్గ పట్టుకుని బతిమాలుతుంటే- ఎంతో విడ్డూరమనిపించింది.
కేంద్రం నుంచి ఎంత సాయం అందుతుందన్న విషయం పక్కన పెడితే, ఎక్కడ చూసినా తుక్కూ దూగరా కుప్పలు కుప్పలుగా దర్శనమిచ్చే మన పుణ్యభూమిలో వేరే ఆదాయ వనరులకు వెదుకులాట అంతలా అవసరమా?'
' తెలుగు రాష్ట్రాలు రెండూ నిండు పూర్ణగ ర్భలు కదా! తుంగభద్రలో, తెలుగు గంగలో ఇసుకను బంగారంగా మార్చుకోవచ్చు. మొన్నటి వరకు ఎవరూ పట్టించుకోని ఎర్రచందనం దుంగలే ఇప్పుడు ఓ ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయవనరు. మద్యం గురించి ఇహ చెప్పేదే ముంది! ప్రజాసంక్షేమ పథకాలన్నింటికీ అదే ప్రధాన వనరైన దుర్గతి మనది. పనికిరాని బొట్టు బిళ్ల లతో సైతం మదర్ థెరెసా బొమ్మలు చేసి అమ్మగల ప్రతిభావంతులైన మహిళలకు కొదవలేదు.'
' చీపుగా చూసే చీపురు పుల్లల్ని కూడా ఓ మఫ్లరు మనిషి అధికారానికి సోపానంగా ఎలా మలచుకున్నాడో ఢిల్లీ ఎన్నికల్లో చూశాం గదా! కూచిపూడి, కొండపల్లి బ్రాండులతోనే కాదు, పూచిక పుల్లలతో సైతం సామాన్యు లను కోటీశ్వరుల్ని చేసేయొచ్చు. సహజ వనరు నీరు. వాటిని బాటిళ్లకు పట్టి, మూతి బిగించి మంచి కంపెనీ లేబులొ కటి అందంగా అతికిస్తే సరి- లీటరు ఇరవై రూపాయలన్నా వాటంగా చెల్లిపోతుంది. '
' దేవుడు వృథాగా దేన్నీ ప్రదానం చేయడు కదా! వీటికి సెన్సెక్సుల అదుపు లేదు. సెబీల గుబులు లేదు. సెన్సారు వాళ్ల కత్తెర్లూ అడ్డురావు. ఇంత సులభంగా నాలుగురాళ్లు సంపాదించుకునే అవకా శాలెన్నో ఆకాశమంత విస్తారంగా ఉన్నాయి. మన సీఎంలు మాత్రం మోదీ ముందలా సాగిలపడి బీదరువులు అరవడ మేమిటి? ! '
' రాజకీయ నాయకులైతే డబ్బు సంపాదనకు చూపిన అక్రమ దారులు ఇన్నీ అన్నీ కావు. నాలుగు రాళ్లు సంపా దించుకోమని మన పెద్దలు అస్తమానం పోరుతుంటారు. అదెంతో నిజం. రాళ్లు రప్పలకు ఉన్న గిరాకీ నిజమైన
డబ్బుకు ఎక్కడుంటుంది చెప్పు! గాలిని తరంగాలుగా మార్చేసి వేలు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే యడం లేదూ! బొగ్గు, ఇనుప ఖనిజాలను తవ్వి పోసుకుని కోట్లకు పడగలెత్తినవారి కథలకైతే లెక్కే లేదు. పాత పాలకుల పాలన పుణ్యమా అని దేశంలో ఏదీ వ్యాపారా నికి అనర్హమైనది కానే కాదని ఎన్నడో తేలిపోయింది. పశుదాణా నుంచైనా బంగారు కాసులు రాబట్టుకోవచ్చని లాలూ ప్రసాదు లాంటివారు ఎన్నిమార్లో నిరూపించారు. ఎక్కడ చూసినా అవినీతి బాగోతాలు. కానీ, జాతికి అవి నేర్పే పాఠాలు ఏమిటన్నదే మనకు ముఖ్యం! '
' తట్టెడు సిమెంటు తయారు కాకుండానే రెట్టింపు రేట్లకు
షేర్లు అమ్మేసే తోలు పెట్టి కంపెనీలు బోలె డన్ని వర్ధిల్లిన భూమి ఇది. జనాలకూ ఇలాంటి కిలాడీ పథకాలలో తర్పీదు ఇప్పిస్తే తప్పేముంది! '
' అత్యధిక బిలియనీర్లున్న ప్రపంచ దేశాల్లో మనదింకా మూడో స్థాన మేనా? సిగ్గుచేటు. బిల్ గేట్సన్నను మించి సంపాదిస్తున్నారే మన పెద్దమనుషులు ! చట్టం చూసీచూడనట్లు పోతే చాలు, చట్టిలో .. ముంతలో కూడా బంగారం ముద్దలు దాచుకునే స్థాయికి ఎదక్కపోతే నన్నడుగు! '
' మేక్ ఇన్ ఇండియా' అనేది మన ప్రధాని నినాదం కూడా. గోడకు కొట్టుకునే మేకు కూడా ఇక్కడే తయారవాలన్న ఆయన ఆకాంక్ష నుంచైనా మన జనాన్ని స్ఫూర్తి పొందనీయకపోతే ఎలా? '
' దేశభక్తితో పాటు స్వయంభుక్తికి సులభ మార్గాలెన్నో కళ్లముందే ఇన్ని వూరిస్తున్నా . . నిద్రమత్తులోనే ఉంచి జనాలను మనం జోకొడుతున్నామన్నదే నా బాధ.'
' వనరులు అపారం. సద్వినియోగం చేసుకునే యోగమే అవసరం. కోళ్ళక్కూడా పనికిరాని ఫారాలలో పాఠశాలలు పెట్టి పిల్లకాయల భవిష్య త్తును అలా బుగ్గిపాలు చేసేకన్నా చిన్నతనం నుంచే చిన్నతనం లేకుండా ఏ చెత్తతోనైనా సరే కొత్త కొత్త పద్ధతుల్లో ఆర్జించడం నేర్పించాలి. ఆ సెట్టులనీ ఈ సెట్టులనీ పసిబిడ్డల్ని పెసరట్ల మాదిరిగా, పరీక్షల పెనంమీదలా కాల్చుకు తిన కుండా వేడివేడి పకోడిల్లాంటి మంచి రుచికర మైన పథకాలు మరిన్ని సెట్ చేసి పెట్టి ఉంచాలి. పర్యాటకానికి కాణాచి మన దేశం. ఆ పేరు చెప్పి ఎక్కడికక్కడ గదులు అద్దెకు ఇచ్చినా పదులు, వేలల్లో ఆర్జించుకోవచ్చు. ప్రభుత్వ సారాయి దుకాణమైతే ఏ కొద్దిమంది తాగుబోతులకే పరిమితం. పరమాత్ముడి ప్రసా దాలకైతే సర్వే సర్వత్రా గిరాకీ. ఆశ్రమాలను మించిన శ్రమరహిత ఆదాయ పథకాలు ఇంకెక్కడున్నాయి స్వామీ?'
' నాలుగు రాళ్లు జమ కూడాక బోర్డు తిప్పేసే కళ బీసీ కాలంనాటిదే కావచ్చు కానీ, ఈ రోజుకూ అలాంటివారు కోకొల్ల లుగా మహారాజుల్లా వెలిగిపోతున్నారు. |
' ఇన్నేసి ఆదాయవనరులు సహజసిద్ధంగా మన దగ్గర దండిగా పోగుపడి ఉండగా, కొత్త ఆలోచనలతో సమాజా న్ని కదం తొక్కించే నేర్పు ముఖ్యమంత్రులు చూపించాలి తప్పించి నేల చూపులు చూస్తే పెద్ద తప్పిదమవుతుంది .
రచన - కరపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 20-02-2015)
No comments:
Post a Comment