ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక
యాచన లోకువా?
– రచన: కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు ప్రచురితం - 24 - 10 - 2009 )
యాచకులు ఎక్కడ ఉంటారో సంపదలు అక్కడ సమృద్ధిగా ఉంటాయంటారు. భిక్షువులే సుభిక్షానికి ప్రత్యక్ష సూచికలు. కులాలవారీగా అధికారంలో భాగం దబా యించి మరీ అడుగుతున్న ఈ కాలంలో యాచకులం మాత్రమే మౌనంగా మా పని మేము చేసుకు పోతున్నాం. అయినా మాకిన్ని అవమానాలా? పుణ్యంగా సంపాదించి పెట్టడమే మేం చేస్తున్న పాపమా?
ఆ మాటకొస్తే ఈ యాచక వృత్తి భూమి పుట్టక ముందునుంచీ ఉన్నదే గదా! మా కులదైవం మహాశివుడు అది భిక్షువు . ఆ దైవాన్ని కొలిచేవాళ్ళే మాదాకా వచ్చేసరికి తోలు వలుస్తామంటున్నారే! సాక్షాత్తు లక్ష్మి అర్ధాంగి అయి ఉండీ విష్ణువు వామనావతారు వేషంలో బలిని మూడడు గులు అడిగితే 'అహో... ఏమి ఆ లీల' అంటూ భక్తులంతా ఈల వేశారే! ఇవాళ మేమేదో ఈ జానెడు పాడు పొట్టకోసం 'భవతీ భిక్షాందేహి!' అంటూ అడుక్కుంటుంటే ఆ భక్తులే ఇంతలా గోల చేస్తున్నారే! ఇంద్రుడి దగ్గర్నుంచి హిరణ్యకశిపుడిదాకా దేవదానవులందరూ ఏదో ఒక సందర్భంలో సందు చూసుకుని చేతులు చాచినవారే కదా? అడుక్కునేవాడంటే అందరికీ లోకువేగానీ- ఆ యాచకుడు అనేవాడే లేకపోతే కర్ణుడు, బలి, అంబరీషుడు మహాదాతలుగా కీర్తి గడించేవారా? ఆ ఖ్యాతి మా యాచక వృత్తివల్ల వచ్చింది కాదా?
అడగనిదే అమ్మైనా పెట్టదని మీరే అంటారు. అడుక్కుంటుంటే ఎద్దులాగా ఉన్నావు... ఏదైనా పనిచేసుకుని బతకరాదా! అంటూ మళ్ళీ మీరే ఈసడించుకుంటారు. పంట పొలాలనన్నింటినీ పరిశ్రమలవారికి ధారపోసి ఉన్న ఎద్దులకే దున్నేందుకు గజం నేలయినా లేకుండా అన్యాయం చేసింది మీరు. వాటితో పోటీకి పోకుండా మాకు తోచినట్లు మేమే ఏదో నెట్టుకొస్తుంటే ' శభాష్' అని భుజంతట్టి మెచ్చుకోవల్సిందిపోయి- శనిగాళ్ళని చిన్నబుచ్చటం అన్యాయం కాదా?
బిచ్చగాడంటే మీకు పట్టదుగానీ- నిజాయతీగా జనాభా లెక్కలు సేకరిస్తే మా యాచకులానిదే మెజారిటీ! దామాషా ప్రకారం అన్ని చట్టసభల్లో మేమే మూడొం తులు మించి ఉండాలి. ఎన్నికల ముందు మీరందరూ మా బిచ్చగాళ్ళ ఓట్లు అడుక్కుని మరీ వేయించుకున్న విషయం అప్పుడే మరపుకొస్తే ఎలా? యాచకులంటూ మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు
గానీ- అసలు అడుక్కోవటమనేది ఎంత గొప్ప ళో మీకు తెలీదు. అస్తమానం హస్తిన చుట్టూ ఇన్ని వందలసార్లు కాళ్ళరిగిపోయేటట్లు ముప్ఫైముగ్గురు ఎంపీలు తిరిగారు గానీ... ఒక్క రైలుగానీ, ప్రాజెక్టు గానీ, నిధులు గానీ అదనంగా సంపాదించగలిగారా?
పనిచేసుకోమని మాకు ఉచిత సలహాలివ్వకుండా.. మా సలహాలు గనక విని ఉంటే ఈపాటికి ప్రపంచ
బ్యాంకు నుంచే ఎప్పటికీ తీర్చక్కర్లేని అప్పులూ కుప్పలు తెప్పలుగా తెప్పించి ఉండేవాళ్ళం.
పుట్టినప్పటినుంచీ బొచ్చె తప్ప మరొకటి పట్టడం ఎర గని పరమవీర ముష్ఠులు మన గడ్డమీద గజానికి ఇద్దరు తగ్గకుండా ఉన్నారు. ఒక్కరి దగ్గరైనా మీరు చక్కటి శిక్షణ పొంది ఉంటే, అణు ఇంధనంకోసం అమెరికావాడి చుట్టూ అన్నిసార్లు తిరగటం తప్పి ఉండేది. పెరటి చెట్టు కనక మీకు మా కళ ఎందుకూ పనికిరాక పోతోంది. గానీ- ప్రపంచం మొత్తం మన యాచక కళా నైపుణ్యాన్ని చూసి నివ్వెరపోతోంది.
పంచాయతీలు మండలాల్ని, మండలాలు జిల్లాల్ని, జిల్లాలు రాష్ట్రాన్ని రాష్ట్రాలు దేశాన్ని, దేశం ప్రపంచ బ్యాంకు నుంచి అమెరికా దాకా అందరినీ- దేనికో దానికి ఎప్పుడూ ఏదో అర్ధిస్తూనే ఉండగా లేనిది. మేం ఏదో రోడ్డువారగా నిలబడి వచ్చిపోయే వాళ్ళను ఓ రూపాయి ధర్మం చేయమని చేతులు చాపి అడగటం ఏ లెక్కన పాపమవుతుందో చెప్పాలి.
అసలే ఆర్థికమాంద్యం. చదువుకున్న వాళ్ళలాగా ఉద్యో గాలిప్పించమని అడుగుతున్నామా? భూములు కావాలని, రేషన్ బియ్యం పెంచాలనీ, ధరలను దించాలనీ, ధర్నాలకు దిగుతున్నామా? మగ పిల్లల మాదిరి ప్రేమిం చమని యాసిడ్ సీసాలు పట్టుకుని ఆడపిల్లల వెంట పడుతున్నామా? అల్లుళ్ళకు మల్లే అదనపు కట్నం తేకపోతే పెళ్ళాల మీద కిరోసిన్ పోసి చంపుతామని బొబ్బలు పెడుతున్నామా? చందాలవాళ్ళకన్నా, పార్టీల కోసం విరాళాలివ్వమని వేధించేవాళ్లకన్నా, పనులు కావాలంటే చాయ్ పానీల సంగతి చూసుకోవాలనే కొందరు ఉద్యోగులకన్నా మేమేమన్నా చికాకులు పెడుతున్నామా? 'మాదాకబళం తల్లీ' అంటూ మర్యాదగానే కదా గడప ముందు నిలబడి వేడుకుంటున్నాం!
గొంతెత్తి అరవటం, గొప్పలు చెప్పుకోవడం, ఇచ్చ కాలు పోవటం, వందిమాగదుల్లా స్తోత్రాలు చేయడం , గంగిరె ద్దులా తలూపటమే యాచకుల పనికిమాలిన గుణాలై తే- ఆ అవలక్షణాలన్నీ మాకన్నా ఎక్కువగా పుణికిపు చ్చుకున్నది మన రాజకీయ నాయకులేనంటే కాదనగలరా? నిజంగా యావత్ యాచకుల్లీ బహిష్కరించదలిస్తే ముందుగా కట్టడిచేయవలసింది పుట్టగొడుగుల్లా పెరుగుతున్న అట్లాంటి రాజకీయ నేతలనే!
ఎప్పుడో జరగబోయే ఏవో కామన్వెల్తు క్రీడల కోసం ఇప్పటినుంచే మమ్మల్ని రోడ్లమీద కనపడకుండా చేస్తే మాకన్నా ప్రమాదం ముందు మీకే నాయకులారా సాధు మేధానిధి అనే శతకంలో పుష్పగిరి అమ్మన అనే పెద్దా యన చెప్పినట్లు- ప్రపంచంలో ధనవంతుడు బీదవాడుగాను, , బీదవాడు దనవంతుడిగాను మారువేషాలలో తిరుగుతూ మాయచేస్తుంటారు. సృష్టి మొదలైనప్పటినుంటే ఒకే వేషంలో తిరిగేవాడుమాతం ఒక్క ధర్మం అడుక్కునేవాడేనని మీరు గుర్తుంచకొంటే మంచిది?
- రచన: కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు ప్రచురితం - 24 - 10 - 2009 )
No comments:
Post a Comment