Sunday, December 19, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక కటింగ్ అండ్ ఫిటింగ్ రచన - కర్లపాలెం హనుమంతరావు ( భలేజాబులు - పేరుతో ఈనాడు - 22- 04 - 2005 న ప్రచురితం )


 


 


"మావాడికి అదేదో కాస్మోపాలిటన్ కంపెనీ..  అందులో మాంఛి మార్కెటింగ్ ఎగ్జి క్యూటివ్ ఉద్యోగం వచ్చిందిరా?" అన్నాడు కేశవాయి  ఎగ్జయిటింగ్ గా. 


మంత్లీ లెవెన్ ప్లస్ ' టెన్ K'  సాలరీ ! .. మరి ఎగ్జయిటింగ్ ఎందుకుండదూ!


"కోటీ కాలేజీ ముందు ఆడపిల్లలకోసం 'కూంబిం ' గ్  చేస్తుంటే ఈ జుత్తుపోలిగాణ్ని చూసి ఎవరో తలకుమాసినవాడు .. అని జాబిప్పించార్రా " అన్నాడు శివాయి గేలిగా. 


 శివాయి కొడుకు కాలం కలిసిరాక కానిస్టేబుల్ గా  చేస్తున్నాడులే. అదీ వాడి అసూయకు కారణం.


శివాయి , కేశవాయి నా స్నేహితులు. 


బిడ్డ జాబుకు డిపాజిట్ కట్టాలంటే కేశవాయికి లక్ష రూపాయల లోను నేనే చేసి ఇప్పించాల్సొచ్చింది. మర్నాడే ఘొల్లుమంటూ వచ్చిపడ్డాడు "జాబుకెళ్ళిన మావాడు  కనిపించటంలేదురా!.... ఆఫీసులో అడిగితే అదోరకంగా సమాధానం చెబుతున్నారు" అని బావురుమన్నాడు. 


" ఉద్యో గమొచ్చిన ఉద్వేగంలో  ఎక్కడో పడి పొర్లు తుంటాడులే. వస్తాడు" అని ధైర్యం చెప్పి పంపించా. 


ఆ మర్నాడు పొద్దున్నే  మళ్లీ వచ్చిపడ్డాడు. "స్టేషన్లో కంప్లయింటిద్దాంరా.... శివాయి కొడుకు చేత వెతికించి పెట్టు... ఇంట్లో ఎవరికీ కంటిమీద కునుకు లేదంటే ఒట్టు" అంటూ పిల్లాడి ఫొటో చేతిలో పెట్టాడు. 


ఆడపిల్లలకు మల్లే వెనక జుట్టుతో నిజంగానే జులాయిలాగా ఉన్నాడా భడవ. 


శివాయి కొడుక్కోసం స్టేషను కుపోయాం. 


అక్కడ లేడు; అంతా గొడవగా ఉంది.


"ఎవరో ఏజెంట్లట... యమభటుల్లాగా వెంటబడుతుంటే కంటబడకుండా తలో ఓ డ్యూటి వేయించుకుని బైటబైటే తిరుగుతున్నా రట" అన్నాడు శివాయి తరువాత..


"మావోయిస్టుల మీద ఒంటికాలిపై లేస్తారే! మామూలు శాల్తీనైతే  ఎన్ కౌంటరంటూ లేపేస్తారే! ఏ హెల్మెట్ పెట్టుకోలేదనో... బండి నెంబర్ ప్లేటుమీద తెలుగు రాసుందనో మూసెయ్యచ్చుగదా! ఆఫ్ట్రాల్ ఏజెంటుగాళ్లకే భయపడతారేంట్రా వీళ్లు" అని గయ్యిమని లేచాడు కేశవాయి .


ఆ ముక్కే శివాయిగాడితో అంటే "ఏజెంట్లంటే  ఐ.ఎస్.ఐ. ఏజెంట్లనుకుంటున్నారేయో!  ఎల్.ఐ.సి. ఏజంట్లురా బాబూ! పైవాడి రికమెండేషన్... ఒక్కసారి దొరికామా... చచ్చిందాగా  బుక్కయిపోయామే! పోలీసోడి లాఠీ కన్నా పాలసీవాడి పెన్ను  పోటు పవర్ ఫల్ రా 

 బాలిగా! లాకప్ డెత్ లంటూ రోజు రచ్చ చేస్తారే మీ పేపర్లలో... పోలీసోడు చేసే చిత్రహింసను గురించి మాత్రం పట్టించుకొనే  నాధు  లేడు. పగవాడిక్కూడా వద్దురా బాబూ ఈ పాడు జాబు" అనేశాడు. 


జీతాల రోజులు. ఏజెంట్ల గాలింపులు మరీ  ముమ్మరంగా సాగే నేపథ్యంలో  ముందు ఈ పోలీసోడి జాడ కనుక్కోటమే అసాధ్యంగా ఉంది.


" ఈ నైటుదాకా వెయిట్ చెయ్యండి. అప్పటికీ, దొరక్క పోతే మనమే వెళ్ళి ఏదో ఒహటి చేద్దాంలే" అన్నాడు టూకీగా. 


ఇంతలో చీకటి పడకుండానే కేశవాయిదగ్గర్నుంచి పిలుపొచ్చింది. వెళ్ళాం. ఎవడో కొత్తశాల్తీ.... బిత్తర చూపులు చూస్తూ ఓ మూల కూర్చొని, లేస్తారే ఉన్నాడింట్లో. చలిమిడి ముద్దలాగుంది గుండు. చలిజ్వరం తగిలిన వాడికిమల్లే వణికేవాడిని  చూపిస్తూ 'మావాడేరా' అన్నాడానందంగా కేశవాయి. 


" మా దొడ్లోనే దాక్కోనున్నాట్ట ఇన్నాళ్లు. ఇప్పుడు పసిగట్టిందిది" అన్నాడు తోకాడిస్తూ నిలబడ్డ కుక్కను చూపిస్తూ.


"జాబొచ్చిందని కొండకెళ్లొచ్చావా? ఇంట్లో చెప్పే పనిలే? " అని గదమాయించా. 


" ఇది కొండగుండు కాదంకుల్! ఆఫీసు గుండు" అని భోరుమన్నాడు అంతా లావూ ఒడ్డూ  భడవాయి . 


డ్యూటీ కెళ్ళిన గంటలోనే సైలెంటుగా  బుర్ర చెక్కేశారట. నేనింక ఆ ఆఫీసుకి పోనేపోను' అని గారాలు కుడిచే కొడుకు గుండు మీదొక్కటి చ్చుకుని "ఊడితే మళ్ళీ వస్తుందిరా బొచ్చు. ఉద్యోగం వస్తుందా? ఈ జాబుకు నీ బాబు లక్ష రూపాయల అప్పు తెచ్చి మరీ కట్టాడని గుర్తుం చుకోరా" అన్నాడు కేశవాయి.


అయినా జాబుకీ జుత్తుకి లింకేంటో?... ఇదేవన్నా గుళ్ళో పూజారుద్యోగమా గుండుకొట్టించెయ్యటానికీ, కనుక్కుందాం ఉండు స్వయంగా వెళ్లి  " అంటూ మర్నాడాఫీసు కెళ్ళి అడిగితే గానీ అన్ని విషయాలూ సవిస్తరంగా బైటపడలేదు. 


" కంపెనీ ఎండీ గారబ్బాయి అమెరికాలో హెయిర్ కటింగ్ కోర్సులో ఎమ్మెస్ చేసొచ్చాడండీ! ఇండియాలో సూపర్ స్పెషాలిటీ సెలూన్లు పెట్టాలని తహ తహ. మా కంపెనీ ఎంప్లాయీస్ నే  మార్కె టింగ్ ఏజెంట్లుగా మలచాలనే  కొత్త కాన్సెప్ట్ జాబుతో చేరినవాళ్లందరికీ ముందుగా గుండ్లు గీయిస్తున్నాం" అంది సి.ఇ.వో సీట్లో కూర్చున్న శాల్తీ సొంత గుండు నిమురుకుంటూ. 


"జుత్తు కత్తిరించే హక్క అ సలు మీకుందా ? కోర్టు కెళితే మీ పని గోవిందా ! తెలుసా? ' అని అక్కడిగదమాయించి చూశా. ఉహూ... తగ్గితేనా!


"ఆ ఛాన్సే లేదు సార్! నెలనెలా స్వచ్ఛందంగా గుండు గీయించుకొంటామని అండర్ టేకింగిచ్చిన తరువాతే ఇక్కడ పని ఇచ్చేది" అన్నాడు  సి.ఇ. ఓ. 


"అసలిక్కడ మీరు పీకే పనేంటయ్యా"


"గుళ్లముందు, బస్టాండ్ల ముందు తిరిగే మీ అబ్బాయి లాంటి  జుత్తు పోలిగాళ్లను గాలించి పట్టుకు రావడమే మా కంపెనీ మెయిన్ డ్యూటీ"


"సెలూనాళ్లకు జులపాలాళ్లతో పనేంటంట? " 


"ఈ ఇండస్ట్రీలో బైప్రొడక్టు కిందొచ్చే జుత్తును సవరాలు, విగ్గుల కింద రీప్రాసెసింగ్ చేసే యూనిటొకటి ఎండిగారి కోడలుగారు ఫ్లోరిడాలో ఫ్లోట్ చేస్తున్నారండీ! గుండు ఇక్కడ మేండేటరీ అయితే... విగ్ డ్రస్ కోడ్. ప్రతి ఎంప్లాయీ కంపల్సరీగా కంపెనీ విగ్లే  వాడి తీరాలని రూలు!" అంటూ ఓ విగ్ తీసి మా కేశవాయి  కొడుకు మాడుమీద పెట్టాడు!


" యాక్సెప్టైడ్ " అని సంతకం చేసే ముందు రూల్బన్సీ చూసుకోబోతే ఇలాగే అవుతుందమ్మా మరి" అంటూ సొంత గుండు తడుముకున్నాడా సి. ఇ. ఓ. 


"కేశవాయి కొడుక్కి జాబొచ్చిందంటే టేలెంటును చూసి అనుకున్నాంగానీ నెత్తిమీది జుట్టును చూసన్న మాట" అని పడీ పడీ నవ్వా డాపూట శివాయి చాలా సేపు.


"పోనీలేరా ఒన్ టైం  షేవింగ్ ఖర్చన్నా సేవ్ అయింది" అని సర్ది చెప్పాల్సి వచ్చింది కేశశవాయికి.


"ఆ మాటయితే నిజమే. నెలకు పదకొండు వేల నూటపదకొండు రూపాయలంటే ఊరికే ఇస్తారా?" అన్నాడనుకోండి శివాయి తరువాత.


సేలరీ రోజు ఆ బండారం కూడా బైటప డింది. కేశవాయి గుండెల్లో ఇంకో బండ పడింది. 


" షేవింగుకి వెయ్యి... విగ్గుకి పది వేలూ పోగా మిగిలింది నూట పదకొండే. నెల నెలా ఇదే తంతట. కొండకుపోయి వేరేగుండు గీయించుకోవటమెందుకు! " అని కూలిపోయాడు పాపం కేశవాయి. 


ఈ ముక్క శివాయి చెవిలో కూడా వేయటం మంచిదని వెళ్ళానా.. అనుకు న్నంతా అయింది. వాడి కొడుకు పోలీసుద్యోగానికి రాజీనామా చేసి నిన్ననే ఆ ' కటింగ్ అండ్ ఫిటింగ్ ' కాస్మోపాలిటన్ కంపెనీలో కలిసిపోయాట్ట ! 


' అరె! పైవాళ్ళు పంపే ఏజంట్ల తంటాకన్నా ఇలా గుండుకొట్టించుకుని బస్టాండ్లలో .. కోటీ వుమెన్స్ కళాశాల  ముందు ' కూంబిం' గు లు చేసుకుంటూ బతకడం బెటరని నిన్ననే డిసైడైపోయాడురా మావాడు" అనేశాడు శివాయి దిగాలుగా. 


- కర్లపాలెం హనుమంతరావు

( భలేజాబులు - పేరుతో ఈనాడు - 22- 04 - 2005 న ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...