ఈనాడు - హాస్యం - వ్యంగ్యం
దణ్నం దశగుణం భవేత్ !
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు ప్రచురితం - 05 - 07- 2009 )
' గుడ్ మార్నింగ్ ఇండియా' అంటుంది పొద్దున్నే ఎఫ్ఎమ్ రేడియో . 'వందేమాతరం' అని పాడుతుంది అంతకు ముందుగానే ఆకాశవాణి' ఏ పనినైనా ' ఓం నమశ్శివాయ' అంటూ ప్రారంభించడం మన సనాతనాచారం. సంధ్యావందనం చేయందే దినచర్య ఆరంభించేవాళ్ళు కాదు మన పూర్వీకులు. | వందేమన్దారుమన్దారుమన్దిరానన్ద కన్దలమ్' అంటూ ఆది శంకరులు కనకధారాస్తవం అలపించగానే కనకవర్షం కురిసిందని కథ. ' సరస్వతీ నమస్తుభ్యమ్' ' అస్సలాం లేకుం ' అన్నా సత్ శ్రీ ఆకాల్ అన్నా ఆమెన్ అన్నా. . అన్నీ ఆ భగవానుడికి వివిధ రూపాల్లో భక్తుడు చేసే నమస్కారాలే గదా
ఏ పుట్టలో ఏ పాముందోనని చెట్టుకూ పుట్టకూ కూడా నమస్కారాలు చేస్తుంటాం మనం . రోడ్డుకు నమస్కారం చేశాడో కవి . ఈ దండం దస్కం కనిపెట్టిన వాడెవడో! మహా గడుసుపిండమే సుమా! వాడికో దండం!
అణుబాంబులు, ఆటంబాంబులూ అంటూ అగ్రరాజ్యాలు ఊరికే హడావుడి చేసేస్తుంటాయిగానీ- నమస్కార బాణాన్ని మించిన ఆయుధం ప్రపంచం మొత్తంలో ఏదీ లేదు.
ఇంగ్లీషువాడు ' హలో ' అన్నా చైనావాడు లెయ్ వో అన్నా జపానువాడు ముక్కు పట్టుకుని ముందుకు వంగి ముక్కినా, జర్మనీవాడు కుడి చెయ్యి గాల్లోకెత్తి ఊపినా, కాంగోవాడు మాంబో అన్నా, ఫ్రెంచి చాడు శాల్యూట్ కొట్టినా, ఇంగ్లాండ్ వాడు టోపీ గాల్లోకెత్తి చూపెట్టినా.. అవన్నీ ఎదుటివాడిని పడగొట్టడానికి ప్రయోగించే శక్తిమంతమైన ఆయుధాలే.
మన దేశంలోనే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నమస్కారబాణాలు సంధిస్తుంటారు . రాజస్థాన్ ' రాంరాం ' అంటే, గుజరాత్ లో 'కెమ్ చె ' అంటారు. బెంగాల్లో ' నమష్కార్' అంటే తమిళనాట 'వణక్కం ' అంటారు. చేతులు కలుపుకోవటం, గుప్పెట్లు గుద్దుకోవడం, ' హాయ్ ఫై ' చెప్పుకోవటం ఈతరం కుర్రకారు నమస్కారం బ్రాండ్.
ఈ మధ్య ప్రసిద్ధికెక్కిన రెహమాన్ ' జయహో ' కూడా ప్రపంచా నికి మనదేశం పెట్టే కొత్తరకం నమస్కారమే!
నమస్కారం మన సంస్కారం. ఉత్తరాది వైపైతే పెద్దవాళ్ళ పాదాలకు వంగొంగి నమస్కారాలు పెట్టాలి. నడుముకు మంచి వ్యాయామం.
ఈ దండాలు పెట్టడంలో తెలుగువాడేమీ తీసిపోలేదు. 'దండమయా విశ్వంభర,దండమయా పుండరీక దళనేత్రహరీ, దండమయా కరుణానిథి దండమయా నీకునెపుడు దండము కృష్ణా' అంటూ ఆ దేవుడిమీద అదేపనిగా ఐదేసిసార్లు దండ ప్రయోగాలెందుకు చేశాడో తెలుసాండీ? దండమనేదాన్ని ఇలా వచ్చి అలా ఒకసారి పెట్టేసి పోయేదానికన్నా పదేపదే ప్రయోగిస్తూ ఉండాలి. ఆదీ పనున్నప్పుడే కాదు సుమా; ఎప్పుడూ సంధిస్తూంటేనే ఏ పనైనా సజా వుగా సాగేదని ధ్వనించడానికన్నమాట. వేడిమీదున్న వాడిని చల్లబరిచేది, విడిపోదామనుకునేవాళ్ళను కలపగలిగేది కూడా ఈ నమస్కారమే సార్! మొన్నటి ఎన్నికల్లో అమ్మలక్కలకు అందరికన్నా ఎక్కువగా దండాలు పెట్టాడు కాబట్టే మన సీయం మళ్ళీ సీయం కాగలిగాడని ఓ వర్గం అభిప్రాయం.
అన్ని దండాలూ ఒకేలా ఉండవండోయ్! ' దండం దశ గుణం భవేత్' అని సంస్కృతంలో అన్నది ఈ దండాన్ని గురించి కాకపోయినా, దీనిక్కూడా వర్తిస్తుంది.
రెండు చేతులూ జోడించి గుండెల మీద పెట్టుకుంటే పెద్దలకు పెట్టినట్లు, నెత్తిమీద పెట్టుకుంటే దేవుడికి పెట్టినట్లు, నుదురు నేలను తాకినట్లు వంగితే అల్లాకు పెట్టినట్లు మోకాలి మీద వంగితే బుద్ధ భగవానుడికి పెట్టినట్లు.. క్రాసు చేసుకుంటే యేసుకు పెట్టినట్లు. తలొంచుకుని మౌనంగా నిలబడితే చనిపోయినవారి ఆత్మలకు పెట్టినట్లు, భజన చేస్తూ ఎగిరెగిరి పెడితే గిడిగీలు పెట్టినట్లు గోత్రనామాలు చెబుతూ పెడితే ఏటికోళ్ళు.. బొక్కబోర్లా పెడితే సాష్టాంగ ప్రణామాలు, పొర్లుతూ పెడితే పొర్లుదండాలు.. ఇవికాక ఇంకా టెంకణాలు, జాగిలీలు, గొబ్బిళ్ళు. అబ్బో.. సూర్య నమస్కారాలకన్నా ఎక్కువే లెక్క తేలతాయి! ఇన్ని రకాల దండాలు ఉండగా .. ఎందుకో మనిషి మరి ' దండం ' .. ఐ మీన్ దుడ్డు కర్రనే ఎక్కువ ఎందుకు నమ్ముకుంటున్నట్లూ ?
దండాలు పెడితే లాభమా లేదా అనే మీమాంస మాట అటుంచి, అసలు పెట్టకపోతే అసలుకే మోసం వచ్చే సందర్భాలు మనబోటి మామూలు బోడిమనుషుల జీవితాల్లో మాటిమాటికి వస్తుంటాయి.
పనిలో మనమెంత తలమునకలుగా ఉన్నా పైఅధికారి కనపడంగానే లేచి విష్ చేయకపోతే మనపని ఫినిష్; అందుకే అనేది- ఉద్యోగు లకు నమస్కారం అనేది తప్పనిసరిగా అభ్యాసం చేయవలసిన యోగం. ఈ
' హస్తకళ' లో ప్రావీణ్యం సంపాదించినవాడిని దండకారణ్యంలో పారేసినా దొరికింది 'దండు' కుని మరీ తిరిగి రాగలడు.
' దండాలు స్వామీ! ' అంటే, ' ముందు నీ తండ్రి బాకీ తీర్చు ' అనేవాళ్ళూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త!
ఈ గజిబిజీ కాలంలో ఎవరూ మనవంక తిరిగి చేతులు జోడించడం లేదని చేతులు ముడుచుకుని కూర్చుంటే కుదరదు . తగిన భక్తులు సమకూరిందాకా మనకా ళ్ళకు మనమే మొక్కుకుంటూ ఉండాలి. దాన్నే రాజకీయం అంటారు.
మన వీపుకు మనమే నమస్కారం చేసుకోలేం గనక మీరు ఎదుటివాడికి ' నమామి' చెబితే ఎదుటివాడు మీకు 'ప్రణమామ్యహం' అనాలనే ఏర్పాటూ చేసుకోవచ్చు. దీన్నే రాజకీయాల్లో పొత్తులంటారు.
మంత్రాలకు చింతకాయలకు రాలకపోవచ్చేమోగానీ- నమస్కారాలకు పురస్కా రాలు దక్కే ఆస్కారాలు పుష్కలంగా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఒక దండం వంద దండల పెట్టు.
అతి వినయం ధూర్త లక్షణమనే మాట ఈ కాలానికి అతికే సామెత కాదు. నమ్మకంగా నమస్కారాలు పెట్టుకుంటూ పోతే ఏనాటికైనా ప్రధానమైన ఏ మంత్రిపదవో, మళ్ళీ మాట్లాడితే మరోసారీ అదే పదవి దక్కే అవకాశాలు మెండు ! అందుకే సామీ ఆ త్యాగరాజస్వామి ' ఎందరో మహానుభావులు .. అందరికీ వందనాలు' అని ముందుగానే దండాల మీదే ఎత్తుకున్నాడు.
నిద్రలేచినప్పటినుంచీ నిద్రపోయేదాకా మనం ఎదుటివాడివంక వేలెత్తి చూపించటానికి ఉపయోగించే శక్తిని దండాలు పెట్టే వైపు మళ్ళించగలిగితే దేశంలో ఇంత అశాంతి, అరాచకం ప్రబలి ఉండేవి కాదు. సైనికులు, పోలీ సులు- తుపాకులకూ తూటాలకూ పెట్టే ఖర్చును ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు అన్నాడు ఓ సంఘ సంస్కర్త.
ఇన్ని తెలిసి మరి ఈ మధ్య ఓ ప్రజా ప్రతినిధి, బ్యాంకు ఉద్యోగి మధ్య రుణాల విషయంలో పెద్ద రణమే జరిగింది.
చెరొక దండం పెట్టేసుకుంటే సమస్య మొదట్లోనే పరిష్కారమైపోయేది కదా!
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు ప్రచురితం - 05 - 07- 2009 )
No comments:
Post a Comment