ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక
చట్టం నిజమైన చుట్టం
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 15-03-2014 )
" వినియోగదారుడు అంటే ఎవరండీ" అని అడిగా మా వారిని ఇవాళ పొద్దున.
అటునుంచి సమాధానం లేదు.
ఒకటి అడిగితే పొంతనలేకుండా పది జవాబులు చెప్పే మన రాహుల్ బాబు జబ్బు కొద్దిగా మా వారికీ కద్దు . అయినా ఏ బదులూ లేకపోయేసరికి కంగారని పించింది. దాంతో లోపల గదిలోకి తొంగి చూశా. ఆయన యోగాలో ఉన్నారు. 'శవాసనం' వేస్తుండబట్టి మన ప్రశ్న చెవిలోకి వెళ్లినట్లు లేదు. సమాధానం తెలియక అలా శవాసనం నటిస్తున్నారా.. చెప్మా ?
ఎంతైనా మగవాడు.. మొగుడుగారు. చట్టసభల్లో ప్రతిపక్షాలు నిలదీసి అడిగినట్లు అడిగితే భర్తగారి అహం దెబ్బతీసినట్లు అవుతుందేమోనన్న సందేహం నాది. అందుకే నా ప్రశ్నకు నేనే సమాధానాలు వెదుక్కునే పనిలో పడ్డా... పేపరు చూస్తూ:
' వినియోగదారుడు' అంటే మరీ బరువైన పదంలా ఉంటుంది. నాలాంటి మధ్యతరగతి ఇల్లాలికి అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే ' వాడేవాడు' అనుకోవచ్చేమో . వాడే .. వీడు' అని ఇదివరకో అపరాధ పరిశోధన నవల చదివా. దానికి ఈ శీర్షికకు పోలికేమన్నా ఉందా?
అదేదో పతివ్రతల ప్రతంచేసి నారదులవారికి కృష్ణమూర్తిని దానం చేస్తుంది గదా శ్రీకృష్ణ తులాభారంలో సత్య భామ! మళ్ళీ మొగుణ్ని కొనుక్కోవడానికి ఇంట్లో ఉన్న ఆభరణాలన్నీ తక్కెట్లో పోసినా బరువు తూగదు . మా వారికి మల్లే ఆ నల్లనయ్యకూ ఉదయం పూట వ్యాయామం అంటే మహాబద్ధకం అనుకుంటా. మరి, రుక్మిణీభామ వచ్చి ఇల్లా మొక్కి అల్లా ఒక్క తులసాకు వేసీ వెయ్యగానే ఎలా తూగినట్లు? అంతా కృష్ణలీల' అను కుంటాంగానీ, మరీ లోతుగా ఆలోచిస్తే ఇందులోనూ ఎక్కడో 'మాయ' కొట్టడం లేదూ!
తూకాలూ కొలతలూ ఉన్నచోట ఈ మాయా మర్మం తప్పనిసరేమో! పెట్రోలు బంకుల్లో ఈమధ్య ఇట్లాంటి మాయలేగా బయటపడి పెద్ద రభస జరిగింది !
మా వారితో కలిసి బండిమీద బయటకు వెళ్లినప్పుడు నేను ఈ బంకుల్లో పెట్రోలు పోసేటప్పుడు చూస్తుండేదాన్ని. ఈయనగారు కనీసం మీటరు వంక చూసి ' ఇదేమిట' ని గట్టిగా గదమాయించడానికీ మహా మొహమాటం! అక్కడికీ నాకు అనుమానం వచ్చి అడగబోయినా, నా నోరు మూయించడానికి మాత్రం గట్టిగా దబాయించేస్తారు . కొనే వాళ్లం మంచి సరకు కోరడం మన హక్కు కాదూ!
వారానికోసారి నేనే రైతుబజారు దాకా పోయి కూరగాయలు అవీ తెచ్చుకుంటా. ఉన్నంతలో మంచివి ఏరుకుని, బేరమాడి కొనాలంటే ఈయనగారివల్ల కాదన్న సంగతి మా పెళ్లయిన కొత్తలోనే తేలిపోయిందిలేండి.
నట్టింట్లో సోఫాకు చేరగిలబడి టీవీ చూస్తూనో, పేపరు తిర
గేస్తూనో, చట్టసభలో ప్రతిపక్షనాయకుడి మోడల్లో తెగ రెచ్చిపోతే- మంచి సరకు మనింటికి వస్తుందా?
నోటీసూ పాడూ ఇవ్వకుండానే అప్పటికప్పుడు ఇంటి అద్దె హఠాత్తుగా వంద పెంచినా సరే పళ్లికిలించుకుంటూ ఇచ్చుకుంటారేగానీ ' ఇదేంటీ అన్యాయం. ఇలా మూణ్లెల్ల కోసారి చొప్పున పెంచుకుంటూ పోవడానికి మీకేం హక్కుంది' అని కనీసం మాట వరసకైనా అనరే!
నాకైతే కడుపు మండుతూనే ఉంటుంది. నాలుగు దులు
పుదామనే ఉంటుంది. కాని, ఇద్దరు మగాళ్ల మధ్య
మనం నోరు చేసుకోవడం మర్యాద కాదని మౌనం
వహిస్తా. మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్
అవస్థే నాదీనూ!
ఇలాంటి వ్యవహారాల్లో మగవాళ్లకన్నా మన ఆడంగులే ఎంతో మెరుగు. బేరాల విషయాల్లో ఒక పట్టాన రాజీపడనే పడం. మా
ఫ్లాట్స్ మహిళాబృందం మొత్తం దుకాణాలకు వెళ్లినప్పుడు
చూడాలి తమాషా! పక్కపిన్నుల్నైనా సరే పదిసార్లు అటూ
ఇటూ వంచి చూడందే ఎంచుకోం. ఇక చీరెల బేరమైతే సరే
సరి ! ఉచిత కానుకలు, భారీ డిస్కౌంట్ల విషయంలో
మహా బలహీనులమైపోతుంటాం. ఆ విషయంలో మాత్రం మనం అబలలం! మరేం చెయ్యాలి చెప్పండి! లోకం చూస్తే విజయావారి ' మాయాబజారు' మార్కు, విపణి వీధి అంత కంగాళీగా ఉందని నిన్న ఎక్కడో చదివా. తాను సుఖంగా బతకడం కోసం లోకంలోని ఏ వస్తువునైనా తెగనమ్మడానికి మనిషి సిద్ధంగా ఉన్నాడు. మరి అందుకే ఉచితమనే మాట
ఎంతగా వినిపిస్తే- కొనే విషయంలో అంత ఎక్కువ
జాగ్రత్త తీసుకోవాలి మనం.
ఈ ఎన్నికల్లో చూస్తున్నాంగా ! అమూల్యమైన ఓటును,
సొంతం చేసుకునేందుకు ఎంత ధరైనా పెట్టే దొరలు
ఊళ్ల మీదపడి తెగ తిరిగేస్తున్నారు. ప్రజాస్వామ్య
మంటే ఒక పెద్ద బజారులాగుంది. ఎన్నికలు వచ్చినప్పు ఎన్నో పార్టీల దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఇందులో
అభ్యర్థులు అమ్మకానికి పెట్టిన సరకు కొనే ఓటర్లం
ఎంత అప్రమత్తంగా ఉండాలి?
అందమైన రంగుల కాగితాల్లో చుట్టి ఆకర్షణీయంగా
తయారుచేసిన ప్యాకెట్లు గదండీ ఈ పార్టీల మేనిఫె
స్టోలు!
ఒక పార్టీ ఉచిత విద్యుత్ ,సగం ధరకే నీళ్లు, ఖర్చు లేని చదువులు, కూర్చోపెట్టి మేపే ఆహార పథకాలు.. గట్రా గట్రా ఇస్తామంటుంది. ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఘడియ నుంచే వరస పెట్టి ఉపకార వేతనాలు, పసివయసు నుంచే పింఛన్లు, ఉచితంగా గుండె ఆపరేషన్లు, సాగు చేసుకునేందుకు వ్యవసాయ భూములు .. లాంటివి సవాలక్ష ఇచ్చే దస్త్రాల మీద సంతకాలు చేసుకుంటూ పోతామంటుంది. ఇంకో పార్టీ ఇదివరకు చేసిన అప్పులు కొట్టిపారేస్తాం. ముందు ముందు కొట్టిపారేసే అప్పులు కొత్తగా ఇప్పిస్తాం. పొరుగు రాష్ట్రాలలో పారే నదులకు గండ్లు కొట్టిస్తాం .. అంటూ హామీలు గుప్పిస్తుంది. మావారు దినం తప్పకుండా పారాయణం చేసే ' శ్రీశ్రీ సంధ్యాసమస్యలు' లాంటి సందిగ్ధంలో పడిపోతున్నాడు సామాన్య ఓటరు.
బెర్లిన్ గోడముక్కలు కూడా మన వాడ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాయి. మరిక సందిగ్ధంలో పడిపోవడం వినియోగదారుడి ముఖ్య లక్షణం లాగుంది.
పెళ్లికొడుకుల విషయంలో ఆడపిల్లలు ఇలాగే అయోమయంలో పడిపోతుంటారు. పెళ్లిచూపులకొ చ్చిన వాళ్ల లోపలంతా ఎంత లొటారంగా ఉందో కనిపెట్టకుండా పైన పటారం చూసి పడిపోతే జీవితాంతం చెత్త సరకుతో సర్దుకుపోవాలి సుమా!
పటాటోపం చూసే పిల్లల్ని ఈ సోకాల్డ్ ఈ - స్కూళ్లల్లో పడేస్తే, బీటెక్కులు పూర్తిచేసినా బిడ్డలకు బయోడాటాకు స్పెల్లింగైనా రాదు.
పట్టాలు, భూమి పట్టాలు, బిరుదులు, బాబాల దగ్గర బంగారం, శివలింగాలు, రాజధాని వంకతో రాళ్ల దిబ్బలు, సర్వేల పేరుతో అనుకూల ఫలితాలు, విశ్లేషణల నెపంతో విపక్షాల మీద చిమ్మేందుకు విషపు వార్తలు, చివరికి బిడ్డల్ని కని పెట్టేందుకు అమ్మ కడుపులు కూడా అమ్మ కానికి దొరుకుతున్న వ్యాపార యుగమిది. అందుకే ' వాడే' వాడు, అదేనండీ ' వినియోగదారుడు ' ఎంతో వివేకంతో విచక్షణను ఉపయోగించాలిప్పుడు.
అందరూ మా వారంత అమాయకంగా ఉంటే, అనక మా సంసారమంత సంబడంగా తయారవుతుంది వ్యవహారం. బజారులో వినియో గదారుడే నిజమైన రాజు. ఆ రాజాధి రాజు వినియోగదారుడికి ఎన్నో హక్కులుంటాయిట.
ఏది మేలైన సరకో తెలుసుకునే హక్కు, కొన్న సరుకు మన్నికైందనీ, ముందు ముందు మన మెడకు గుదిబండగా మారదని అమ్మేవాడి నుంచి భరోసా పొందే హక్కు, 'ఐఎస్ఐ' ' ఆగమార్క్' ప్రమాణా లకు తగ్గలేదని నిర్ధారించుకునే హక్కు, ఎన్నో రకాల నుంచి మేలురకాన్ని మాత్రమే కోరుకునే హక్కు. ఇట్లా! నోరు నొక్కుకుని కూర్చుంటే ఎన్ని హక్కులుంటే మాత్రం.
ఏం ఉపయోగం?
ఉచితంగా వస్తుందని, సగం ధరకే దొరుకుతుందని, కంటికి నదురుగా ఉందని, పక్కింటి పిన్నిగారు కొన్నదనీ మనమూ తొందరపడి అమ్మేవాడి మాయలో పడిపోతే కష్టమేసుమండీ!
మా వారస్తమానం అలా కాయితాల మీద వూరికే గీకినట్లు 'వినియోగదారుడికి హక్కుల చట్టం ' వూరికే రాలేదు. ఆ చట్టం.. ' వాడే ' వాడికి నిజమైన చుట్టం సుమండీ!
-
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 15-03-2014 )
No comments:
Post a Comment