Thursday, December 16, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం అసలు గెలుపు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 20 -04 - 2011)


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

అసలు గెలుపు 


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 20 -04 - 2011)   


ఫాహియాన్, హ్యుయన్ సాంగ్ లాంటి విదేశీ యాత్రికులు ఇప్పటికిప్పుడు ఇండియాలో పర్యటిస్తే ఏం రాసి ఉండేవారో తెలుసా? "భారతదేశం బీదదేశం అనే మాట వట్టిదే. నేతలు ప్రజల కష్టసుఖాలను అసలు పెట్టించుకోరన్న మాటా ఎవరో గిట్టనివాళ్ళు పుట్టించిందే. తమిళనాడుకు వెళ్ళి చూడండి! తెల్లారుజామునే దినపత్రికల్లో నోట్లకట్టలు పెట్టి పంచుతున్నారు. వాటిని తీసుకునేవరకు గుమ్మంలో కూర్చుని ధర్నా చేస్తున్నారు' అని రాసి ఉండేవాళ్లు!


నిజమే బాబాయ్ ! మన ప్రజాప్రతినిధులు ఈ మధ్య జనం గురించే కుమిలిపోతున్నట్లున్నారు. ఆ చింతే లేకపోతే- బోలెడంత డబ్బుపోసి పోటాపోటీగా అలా మిక్సీలు, గ్రైండర్లు, టీవీ లాంటివి ఎందుకు పంచుతారు? ఆర్థిక మాంద్యం రోజుల్లోనూ మనదేశ నేతలు ప్రజా సేవకోసం ఇలా తహతహలాడుతుంటే  పెద్దాయన అన్నా హజారే వారినసలు గుర్తించడమే లేదు . జంతర్మంతర్లో ధర్నాకు ఒక్క రాజకీయ పక్షినైనా దగ్గరకు రానీయలేదు. అందుకే బాబాయ్, ఒక్కసారి ఇక్కడ గిల్లు


ఇప్పుడు అర్ధాంతరంగా ఈ గిల్లుడేమిట్రా బాబూ! అర్ధమైంది. ఏ పార్టీ జెండా ఎగరకపోయినా అన్నా హజారే నాలుగు రోజులు నాలుగు మెతుకులు తినడం మానేసిందుకు అంత పెద్ద కేంద్రం దిగిరావడం- కలా నిజమా అని ఆశ్చర్యపోతున్నావ్ కదూ! వాస్తవం తెలుసుకోవడం కోసమేనా గిల్లమని అడుగుతున్నావ్?' 


గెల్లమంటే గిల్లకుండా... ఆ నవ్వెందుకు బాబాయ్! 


నవ్వక, గొల్లుమని ఏడవమంటావా! రాజకీయాల లోతు నీకింకా అంతుబట్టలేదురా అబ్బాయ్. అయిదు రాష్ట్రాల ఎన్నికలను ముందు పెట్టుకుని బుద్దున్న ఏ అధికార పార్టీ అయినా అంతలావు ఆందోళనను కాదు పొమ్మనగలదా! ఓటేసే తీరిక లేని మన ప్రధాని ధర్నా చేస్తున్న పెద్దమనుషులతో చర్చలు- తమాషాకు జరిపించాడనుకున్నావా?


నన్ను మరీ అమూల్ బేబీలా తీసిపారేయొద్దులే బాబాయ్!  మిన్ను విరిగి మీదపడ్డా సలహాదారులు చెప్పనిదే పెదవి విప్పని అధినేత్రి అంతటివారే సొంతంగా ఆలోచించి మరీ ఆదేశమిచ్చిన తరవాత- వేరే అవకాశం ఇంక ప్రధానికి ఎక్కడిది? కొత్త బిల్లులో ఎవరు ఎవరి మీదైనా ఫిర్యాదు చేయవచ్చట. ప్రాథమిక ఆధారాలు దొరికితే ఎంతటివారిపైనైనా కేసులు రాసుకుని ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చట. నేరం రుజువైతే యావజ్జీవ  కారాగారమే. ఫిర్యాదు చేసేవాడిపై ఈగైనా వాలకుండా రక్షణ కల్పించడం సర్కారు బాధ్యతట. నాకైతే భస్మాసురుడికి వరమిచ్చిన బోళాశంకరుడే గుర్తుకొస్తున్నాడు బాబాయ్!


బోడిగుండుపై కోడిగుడ్డు నిలబెట్టాలని మీవాడు ఏడిస్తే నువ్వేం చేస్తావ్?


వీలుకాదని నచ్చజెబుతా. ఇంకా మారాం చేస్తుంటే నాలుగు తగిలించి నోరు మూయిస్తా!


నీ దెబ్బకు వాడికి జ్వరమొస్తుంది. ఆపై ఆసుపత్రి బిల్లు భారం నీపై పడుతుంది. ఇలాంటి క్రిమినల్ గొడవలు లేకుండా గుండుమీద గుప్పిట పట్టి దాంట్లో కోడిగుడ్డు పెట్టి చూపిస్తాడు తెలివైనవాడు. అదే మాయ ఇప్పుడు పెద్ద సర్కారూ చేస్తోందర్రా  అబ్బాయ్!


అర్ధం కాలేదు బాబాయ్ ! 


అర్ధం కావాలంటే ముందు మనదేశాన్ని బాగా అర్ధం చేసుకోవాలి. స్వతంత్రం తరవాత ఇప్పటివరకు దేశంలో బయటపడిన కుంభకోణాల  విలువ కోటి కోట్లకు పైమాటేనని ప్రపంచం కోడై కూస్తోంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత అవినీతి దేశాల జాబి తాలో మనది నాలుగో స్థానం. నిజాయతీపరుల చిట్టాలో అడుగునుంచి ముప్పయ్యో స్థానం. కర్ణాటక చట్టసభలో ఒక్క నీతిమంతు డైనా లేడని లెక్కలు కట్టి మరీ తేల్చేశాడు తెహల్కావాడు. పార్లమెంటు స్పీకరు టేబుల్ మీద పరచిన నోట్లకట్టలను ప్రపంచమంతా చూసింది. కత్రోచీలు, అండర్సన్ లూ దర్జాగా జారి పోయినప్పుడు ఎవరూ కళ్ళు మూసుకుని కూర్చోలేదు గదా! విచారించే కొంతమంది విజి లెన్స్ కమిషన్ అధికారులే పచ్చి అవినీతిపరులు. తీర్పులు చెప్పే న్యాయాధీశులపైనా అను మానాలు పుట్టుకొస్తున్నాయి. వికీలీక్స్ అసాంజే విదేశీ ఖాతాల్లోని నల్లధనం వివరాలు బయటపెట్టినా- మనమింకా బుకాయించే దశలోనే ఉన్నాం. మన ఆటలూ వేలంపాటలూ అంతర్జాతీయంగా తెచ్చిపెట్టిన గొప్ప పేరును ఎంత తక్కువగా చెప్పుకొంటే... అంతమంచిది


నిజమే బాబాయ్! మన దగ్గర పనివాళ్ల పేర్లపైనా సిమెంటు ఫ్యాక్టరీలు ఉంటాయి! నాయకులు వీరప్పన్ కన్నా గొప్ప గజదొంగలు కాదని చెప్పలేం. కిరసనాయిలు పట్టుకున్నాడని అధికారిని పెట్రోలు పోసి తగలబెట్టిన కిరాతకులు- మహారాజుల్లా వెలిగిపోతున్నారు. మహా నేత అంటే- పెద్దమనుషులు అనే పెడసరి అర్థమే  ముందుగా తోస్తున్నది .


అదే మరి నేనూ  చెప్పేది. నీలాంటివాడికే రాజకీయమంటే పెడర్థం తోస్తున్నప్పుడు, జనం మంచిచెడ్డల గురించి అహర్నిశ లూ అవగాహనతో పనిచేసే ఆ అన్నా హజారేలు, స్వామి అగ్నివేశ్, కిరణ్ బేడీ, కేజ్రీవాలు , మేధాపాట్కర్ లాంటి మేధావుల ముందు అధికారం కోసం నాయకులు మామూలు జనాలతో చేసే మాయలు నిలుస్తాయా? ఐరాస ఎనిమిదేళ్ళకిందట చేసిన తీర్మా నానికి సరే సరే అన్నా- అవినీతిని శిక్షార్హమైన నేరంగా చట్టంలా మార్చడానికి ఇన్నేళ్లు గడిచినా... మన మాయగాళ్ళకు మన సొప్పడం లేదే మరి! 


మరైతే హజారే 'జన్ లోక్పాల్ బిల్లును తీసుకురావడానికి ఎందుకు ఒప్పుకొన్నారు? తదుపరి పార్లమెంటు సమావేశాల్లోనే దాన్ని ప్రవేశపెడతారని అంటున్నారు. అదేమిటి బాబాయ్.. మళ్లీ నవ్వుతున్నావ్?


అరేయ్, ఇల్లలకగానే పండగంటే- ఇండియాలో ప్రతిరోజూ పండగేరా అబ్బాయ్! బిల్లు ముసాయిదా రూపకల్పన కమిటీలో అప్పుడే ముసలం పుట్టింది చూడు ! నాలుగురోజులు పోతే, హసన్ అలీ నిర్దోషిగా బయటకు వచ్చి కమిటీలో సభ్యుడయ్యేదాకా ఆగుదాం... తొందరేముందని కపిల్ సిబల్ అన్నా అనొచ్చు. అది కుదరదంటే ఏ రాజానో, రాజుగారో, రాడి యానో సలహాదారులుగా ఉండాలని ఇంకో మహానుభావుడు పేచీ పెట్టవచ్చు. క్రికెట్లో భారతజట్టు ప్రపంచకప్ గెలిచింది. భారతీయ పౌరులందరూ విజేతలయ్యేదీ, జన్ లోక్పాల్ బిల్లు- చట్టం అయినప్పుడే!'


కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 20 -04 - 2011)   


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...