Thursday, December 16, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం వినోదవల్లరి - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 09 -04 - 2005 )




ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

వినోదవల్లరి


 - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 09 -04 - 2005 ) 


నటన ఒక్క నాటకాల, సినిమాల వాళ్ల సొత్తేమీ కాదు. బళ్ళారి, భానుమతులను మించి నటించగల ఘటనాఘటన నటనాసా ర్వభౌములు దండిగా ఉన్న దేశం మనది.


మొన్న రవీంద్ర భారతిలో మన ఎమ్మెల్యేలందరూ కలిసి ఆడిన నాటకాలను తెల్లార్లూ చూసొచ్చిన కలవరింతా ఏందీ?'


కాదయ్యా... ముప్ఫై ఒక్క రోజుల మన బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారాల్లో చూసిన తరువాత అంటున్న మాట ఇది


నిజం... నిజం. బుల్లితెరపై మనకు కనిపించిన ఆ అల్లరి వెనక ఎంతెంతవినోదవల్లరి దాగుందో!... పైసా  ఖర్చు లేకుండా వినోదం పంచారు కదా!


రొటీన్ సినిమాలతో, జీళ్లపాకం సీరియల్సతో విసు గెత్తిన జనాలకు ఆ ఆవేశకావేశాలు, వాగ్యుద్ధాలూ, వాయిదాలూ, వాకౌట్లు నిజంగానే యాక్షన్ ఫిక్సుకు మించి థ్రిల్లింగ్సిచ్చాయంటే అదంతా మన ఘనాఘన నటనా ప్రవీణుల  ప్రతిభా పాటవాల పుణ్యమే కదా!


ఆ అరుపులు, బల్లలు చరుపులు, మైకుల విరుపులు, మాటల ఒడుపులూ... ఏ ప్రామ్ టింగూ  అక్కర్లేకుండానే ప్రామ్ట్ గా  స్క్రిప్ట్ ప్రకారం అంత చక్కగా నటించాలంటే ఎంత టేలెంటుండాలో! ఆ వ్యూహ ప్రతివ్యూహా లకు కురుక్షేత్ర నాటకకర్త అయినా కుదేలయిపో వాల్సిందే!


మన డెమోక్రసీనే పెద్ద డ్రామా కంపెనీ కదా! మతా తీత కులాతీత సర్వసత్తాక ప్రజాస్వామ్యమనే మెగాసీరియ ఏళ్ల తరబడి ఎడతెరపి లేకుండా పదే పదే ఆడుతున్నా విసుగనిపించని విధంగా ఏ ఎపిసోడుకి  ఆ ఎపిసోడ్ ఎంతో ఇంటరెస్టింగ్ గా ఉంటూ సాగుతుం దంటేనే తెలుస్తోంది- మనమెన్నుకున్న నాయకుల నటనా వైదుష్యం ముందు అమితాబ్బచ్చన్న అబ్బలాంటివాళ్లు కూడా బలాదూరేనని...! 


మిత్ర లాభం, మిత్రభేదం అంటూ సూత్రాలు వల్లించిన పరవస్తు చిన్నయసూరైనా విస్తుపోవాల్సిందే ఈ చిత్ర విచిత్ర విన్యాసాలను చూసి భరతముని నటనకే భాష్యం చెప్పే వీళ్లకు మళ్ళా సిని మావాళ్లొచ్చి  తైతక్కలాడటంలో ప్రత్యేకంగా తర్పీదివ్వా ల్సినంత అగత్యమేంటూ  అర్థమవటం లేదు . 


ఎన్నికలవేళ ఎన్ని కళలు పోతారో మన నాయకమ్మన్యులు! పరమా త్ముడు వేసింది పది అవతారాలే! మన ఓటు వేయించు కుని గెలిచినవాడు అలాంటి అవతారాలు పూటకు ఇంకో పది వేస్తున్నా పోటీలో వెనకబడిపోతున్నాడే పాపం! పులి వేషం, పిట్టలదొర, బుర్రకథ, చెక్కభజన, డప్పు, కోలాటం, సోదీ ... ఏదీ మన ప్రజాప్రతినిధుల ప్రతిభ ముందు సాటొచ్చేది!  పాండవోద్యోగం పద్యాలు ఎంత మంది కృష్ణుళ్లు మందుకొట్టి తెల్లార్లూ పీకి పాకాన పెట్టినా మైకు ఎదుట మన నాయకులు చేసే మైమింగులముందు ఎందుకు పనికొస్తాయి ! వందమంది వందిమాగధులైనా  తమ ముందర తేలిపోయే విధంగా స్తోత్రాలు చేయగల శాస్త్రంలో పట్టాలు పుచ్చుకున్న వాళ్లు ప్రతి రాజకీయ పార్టీలో పొర్లిపోతున్నారు. 


రాణి వెడలె రాజీవ తేజము లలరగ అంటూ భుజకీర్తులు పట్టుకొనే భజన బృందాలు చేసే కీర్తనలకన్నా ఎక్కువగా ఏ కళాకారులు పాడి మెప్పించగలరు  బాబూ! 


అక్క డికీ ప్రతి పార్టీకీ ప్రత్యేకంగా ఓ 'కల్చరల్ ఫ్రంట్' అంటూ ఉండే కల్చర్ ఒకటుంటుందిగదా! ఆ భజన నాట్యమం డళ్కు నిండుగా పైవాళ్లను మిమిక్రీ చేసేవాళ్లూ ఉండనే ఉండె ! వెంట్రిలాక్విజం, తోలుబొమ్మలాటలంటూ ప్రత్యేకంగా కళాకారులు చేసే ప్రాక్టీసు సరే గానీ , పాలిటిక్సులో ప్రవేశమున్న ప్రతివాడికీ వీటిని మించిన గారడీ విద్యలు ఆల్రెడీ అబ్బేఉంటాయబ్బాయ్. భరతనాట్యం ముద్రలు నిద్రలో కూడా అభినయం పట్టి ఉండాల్సిన ఫీల్డు పాలిటిక్సంటే ! సరదాకొద్దీ ఏదో వేదిక మీద అలా రంగులు వేసుకుని పాటలూ, అవీ పాడటమే గానీ మన లీడర్లు  రింగులు కట్టి పాడే వేలంపాటలు వేరే ఉంటాయి. అవి ఘంటసాలవారి పాటలకన్నా ఎంతో ఆ మధురంగా ఉంటాయి ! '


రాయబారం సీనులో ఎప్పుడు ఏ డైలాగు ఎంత రేంజిలో  వాడాలో మన నాయకుడికి  తెలిసినంత నిక్కచ్చిగా మూడుసార్లు 'నంది' కొట్టిన గుమ్మడి గోపాలకృష్ణుడికైనా  తెలిసుండకపోవచ్చు. 


 నిజమే. ఎన్ కౌంటర్లకు మించిన నాటకాలు ఏముంటాయి? ఎన్నికలను మించిన సినిమా లేమొస్తాయి ? వీధి నాటకాలను తలదన్నే పాదయాత్రలు చేయగల పెద్ద కళాకారులున్నారు . మయసభను మరపించే చట్ట సభలో ఈ వేల  దుర్యోధనుడి వేషం కట్టిన వాడు, రేప్పొద్దుటికల్లా  ధృతరా ష్ట్రు డి  వేషం కట్టే దౌర్భాగ్యం పట్టవచ్చు.   బుచ్చెమ్మకు నకలు  పదవులకోసం విధవ వేషాలెయ్యని  గిరీశాలు పాలిటిక్సుకు బొత్తిగా తగరు! పారాబ్రహ్మ పరమేశ్వర అంటూ ప్రత్యేకంగా గొంతెత్తి పాడితేనే తెర తొలిగేదనుకునే అంగరి బుచ్చెయ్య లిప్పుడెక్కడాలేరు. ముఖాలకు మేకప్పులేకపోయినా, మన నేతలు ఆడేదంతా తెరచాటు  నాటకమేనని తెలిసేందుకు  ఓటరు మహాశయుడేమీ  మళ్ళా బళ్లల్లూ  చేరి 'ఓనమశ్శివాయ ' అంటూ సిద్ధమవాత్సిన పనిలేదు. శాసనసభ సమావేశాలయినా, పెరేడు గ్రౌండు  ప్రధాన నాయకుల ఉపన్యాసాలు  అయినా, రాజీవుడి  పల్లెబాటలనైనా ఏ చిరంజీవి సినిమాలకు మల్లేనా , ఎండమావులు సీరియల్ తలదన్నేలానో  ఎంజాయి చెయ్యటమే తప్పించి ఇంకేం చెయ్యలేమని  గ్రహించిన స్వతంత్ర భారత సగటు ఓటరు ప్రేక్షక పాత్రలో తానా లీనమై నటిస్తున్నాడు. అంతే... 


మరి అప్పటిదాకా ఈ ఉత్తుత్తి ఆటలపోటీలు, మైకేల్ జాక్సన్  మహా డేంజరు షోలూ, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ స్టెప్స్ యూనివర్సిటీ కుర్రాళ్ల సుకూన్ సంబరాల్లో సందడిలాగా  సాగుతూనే ఉండాల్సిందేనా? ఏ మాటకు ఆ మాటే ! అవిభక్త భక్తమండలి గొంతెత్తి పాడే సోనియమ్మ స్తోత్రాలూ, పేరాకొక్కటి మాత్రమే  ఫుల్ స్టాపు, కామాలుండే జ్ఞానోదయ ఉపదేశాలు, నోములవారి పిట్టక థలు, నాగంచేసే ఆగాలు, రొప్పయినా  రోశ య్యగారి యాంకరింగు , ఉప్పు సత్యాగ్రహం రీప్లే, జార్ఖండ్ ముక్తి మోర్చా నాటకం, తెలంగాణా రోటిపాట, ఇలా క్షణానికో విధంగా సినిమాలను  మించిన వినోదాలను అందిస్తున్నందుకు  టిక్కెట్టు ఖర్చు ఆదా అయిందని ఆనందించాలి, ఆస్పాదించాలి.  అంతకు మించి  ప్రేక్షక పాత్రలో  పాత్రలో నటించే ఓటరుకిక కిక్కురుమనే ఛాన్సే లేదు . 


అదేం కాదు ! సమయం వస్తే  సత్తా చూపిస్తా!  అప్పటిదాకా నే ఈ రాజకీయ వినోదవల్లరి. 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 09 -04 - 2005 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...