Monday, December 27, 2021

చిన్న కథ మనసులోని మాట రచన - పిళ్లా సుబ్బారావు శాస్త్రి ( ఆంధ్రపత్రిక - వా - 02- 07 - 1956 ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


చిన్న కథ 

మనసులోని మాట 

రచన - పిళ్లా సుబ్బారావు శాస్త్రి 

( ఆంధ్రపత్రిక - వా - 02- 07  - 1956 ) 


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                  26-12-2021 

                   బోథెల్, యా. ఎస్.ఎ



ఆ నగరంలో మంచి పేరున్న వ్యాపారి నారాయణ్ సేఠ్ . అతని తాతల కాలం నుంచీ వస్తున్న వ్యాపారం. నమ్మకస్తుడు . అతను అమ్మే సరుకు ఎప్పుడూ వివాదం కాలేదు. 


సేఠ్ దగ్గర గుమాస్తా మోహన్ లాల్ . బీదవాడు. సేఠ్ కు అతని మీద నమ్మకం జాస్తి . మోహన్ రాసే లెక్కలు తనిఖీ చేయడం గానీ, తాను లేనప్పుడు అతను కొట్లో కూర్చున్నప్పుడు గానీ ఏ ఫిర్యాదుబా ఉండేవి కాదు. మోహన్ లాల్ నిజంగా డబ్బు అవసర పడ్డప్పుడు సేఠ్ కు చెప్పి ఒప్పించుకుని మాత్రమే తీసుకునేవాడు . 


ఎన్నేళ్లు గడిచినా గొర్రెకు బెత్తెడే తోక అన్నట్లు మోహన్ లాల్  కూడబెట్టుకున్నది ఏదీలేదు . పిల్లవాడి  చదువుకు ఖర్చులు పెరుగుతున్నాయి , ఆడపిల్ల పెళ్లీడు కొస్తున్నది .. ఆలోచించరా? ' అని భార్య సతపోరడం మొదలుపెట్టింది. 


సేఠ్ ఇచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ఆయనకు మీ మీద నమ్మకం ఎక్కువా కదా! ఆలోచించండి .. అదనంగా ఎట్లా రాబట్టాలో ! ' అంది ఆ ఇల్లాలు . 


భార్య సలహా విని ఇంతెత్తున లేచాడు మోహన్ లాల్ ' నమ్మిన వాడిని మోసం చెయ్యడం మా ఇంటా వంటా లేదు . చాటుగా సేఠ్ సొమ్ము కొట్టేయడం .. అనే ఆలోచన రావడమే పాపం '  అంటూ . 


అన్నాడే కానీ, రోజా భార్య పెట్టే సోది కారణంగా క్రమంగా మోహన్ లాల్ మనసు కూడా మారడం మొదలు పెట్టింది. బిడ్డ చదువు, కూతురు పెళ్లి . . ఖర్చులు కొండల్లా ఎదురు నిలబడి ఉండేసరికి మోహన్ లాల్ మనసు పూర్తిగా మార్చేసుకున్నాడు. 


అదను కోసం ఎదురు చూసే మోహన్ లాల్ కు అవకాశం రానే వచ్చింది. తప్పుడు లెక్కలు రాసి కనీసం ఐదు  వేల రూపాయలైనా కొట్టేయాలని అనుకున్న రోజునే అదృష్టం కలిసొచ్చినట్లు సేఠ్ దుకాణం వదిలి బైటకు వెళ్లిపోయాడు.  


సేఠ్ వెళ్లంది ఎక్కడికో కాదు, రోజూ ఇంట్లో భార్య పోరు పెడుతుంది ' ఎంత నమ్మకం ఉన్నా యజమాని కింది ఉద్యోగి మీదపూర్తిగా భరోసా ఉంచడం ప్రమాదం. మోహన్‌ లాల్ పాతికేళ్ల బట్టి మన దగ్గర పని చేస్తున్నాడు. మీ పేరు చెప్పుకొని బైట ఎంతసొమ్ము వసూలు చేసుకుంటున్నాడో? ఒకసారి మన కాతాదారులు కొంత మందినైనా విచారించి రండి! చేతులు కాలాకఆకులు పట్టుకుని లాభం ఉండదు ' ఆవటా అని . అర్థాంగి మాటలలోనూ సబబు ఉందనిపించింది. ఈసారి సేఠ్ కి అందుకే బైట తనిఖీకి బైలుదేరాడు. 


ఇక్కడ గుండె నిబ్బరం చేసుకొని... ఐదు వేల రూపాయలూ ఇనప్పెట్టినుంచి తీశాడు మోహన్ లాల్ . చేతులు వణికినయ్! ఏదో భయం వేసింది! మనసులో ఆలోచనలు తిరగటం మొదలు పెట్టాయి .' సేఠ్ కి నేనంటే ఎంతో నమ్మకం! పాతికేళ్ళ బుట్టి , కొట్లో పని చేస్తూ, సేఠ్ డబ్బు తిని సేఠ్ కి ద్రోహం చెయ్యడం ద్రోహం. అంతకు మించి నీచం మరొహటి లేదు. సేఠ్ ఒక వేళ  లెక్కలు అడి గితే  తాను తప్పక దొరికిపోతాడు !పాతికేళ్ల నుంచీ యీ దొంగపని చేస్తున్నానని సేఠ్ కి అనుమానం కలుగుతుంది ! నన్ను పనిలో నుంచి తొలిగిస్తే మళ్లీ తిరిగి యిటువంటి పెద్దమనిషి దగ్గరే నాకు కొలువు అవుతుందన్న  భరోసా కూడా లేదు. ఇంత వయస్సు వచ్చిన తర్వాత కోరి పాపాన్ని తెచ్చు కున్న వాణ్ని అవుతాను. ఈ పని యీజన్మలో చెయ్యను. లక్ష్మీ దేవి తోడు| అనుకుంటూ తీసుకున్న  ఐదు వేలు తిరిగి  ఇనప్పెట్టెలో పెట్టేశాడు!


సేఠ్ కు సగం దూరం వచ్చిన తరు వాత ఆలోచన వచ్చింది . ' మోహన్ లాల్ ని నేను పాతికేళ్ల  నుంచి లెక్కల పనిలో ఉంచుకున్నాను. ఇంత వరకు తాను  లెక్కలు అడిగి ఎరుగడు. అయినా ఎక్కడి నుంచి ఏ ఫిర్యాదు కూడా వచ్చింది కాదు. తనే దొంగతనం చేసేవాడు అయితే చిన్న చిన్న ఖర్చులకు కూడా తనను అడిగే ఎందుకు తీసుకుంటాడు. ఇవాళ హఠాత్తుగా లెక్కలు అడిగితే లాల్ బాధపడకుండా ఉంటాడా ? ఆత్మాభిమానం దెబ్బతింటే  తన దగ్గర చేసే కొలువు మానేసే ప్రమాదం ఉంది.  తనకు మళ్లీ  అంత నమ్మ కస్తుడు దొరకడం అసంభవం.  ' అనుకుని వెనక్కి తిరిగి వచ్చేశాడు. భర్తకు అటువంటి తప్పుడు సలహా ఇచ్చినందుకు సేఠ్ భార్యలో తరువాత బాధ కలిగింది. 


" ఇన్నాళ్లు మన దగ్గర గొడ్డులా పని చేస్తున్నాడు.  అంత విశ్వాసంగా పనిచేసే ఉద్యోగుల మంచీ చెడు చూసుకోవడం మంచి యజమాని ధర్మం. అతనికీ పిల్లలు ఉన్నారు. ఎదుగుతున్నారు, చదువులకు, పెళ్లిళ్లకు చేతిలో సొమ్ము ఆడాలి. వెంటనే పిలిచి ఒక ఐదు వేలన్నా అతని చేతిలో పెట్టండి! ' అంది సేఠ్ భార్య . 




మోహన్ లాల్ డబ్బు ఇనప్పెట్టె లో పెట్టేశాడు! సేఠ్ బండీవి యింటికి తిప్పించేశాడు.……తిరిగి వాళ్ళు నుంచీ నేటివరకూ లాల్ కి అటు వంటి కోరికలు కలుగనూ లేదు ! నేఠ్ లెక్కలు చూడనూ లేదు !! *


నారాయణ్ సేఠ్ తనను దగ్గరికి పిలిచి ఇనప్పెట్టె నుంచి ఒక ఐదు వేలు కట్టతీసి చేతిలో పెడుతుంటే మోహన్ లాల్ కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. 


రచన - పిళ్లా సుబ్బారావు శాస్త్రి 

( ఆంధ్రపత్రిక - వా - 02- 07 - 1956 )


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                  26-12-2021 

                   బోథెల్, యా. ఎస్.ఎ



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...