అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష! నిజమే! కనీసం కథానికల వరకు!
'అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష!' అనే డైలాగ్ కన్యాశుల్కం కర్త గురజాడవారి పుణ్యమా అని బహుళ ప్రచారంలోకి వచ్చిన పలుకుబడి. నిజమే; కానీ ఆ రావడం వెనక ఉన్న ఉద్దేశంలో కొంత వెక్కిరింతా ఉంది.
నిజానికి వేదాలలో అన్నీ ఉన్నాయో లేదో ఎవరికైనా తెలిసే అవకాశం తక్కువే. అలా తెలియలంటే ముందుగా ఆ వేదాలలో అసలు ఏముందో కొంతైనా అవగాహనకు తెచ్చుకోవడం సబబు.
ఆ సంగతి అట్లా ఉంచి కథానికలుగా మన ఆధునికులు చెప్పుకునే రూపాలు వేదకాలం నుంచే ఉన్నాయన్న వాదనా ఒకటి పండితలోకంలో ప్రచులితంగా ఉంది. ఆ ప్రతిపాదనకు అనుకూలత ప్రకటిస్తో డాక్టర్ కె.కోదండరామాచార్యులు '50 వసంతాల వావిళ్ల వాజ్ఞ్మయ వైజయంతి' సావనీర్ లో 'వేదవాజ్ఞ్మయంలో కథానికలు ఉన్నవి' అంటూ ఒక చిరువ్యాసంలో ప్రతిపాదించారు.(పు.117 -125).
అధ్యయానికి అంతంటూ లేదు. సదరు భావనకు ఊతం ఇచ్చే ఒకానొక చిన్నకథను సైతం ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. 'భరద్వాజో హ త్రిభిరాయుర్భిర్బ్రహ్మచర్యము వాస.. ఏషా ఏవ త్రయీ విద్యా' అనే తైత్తరీయ బ్రాహ్మణకం తాలూకు మూడో అష్టకంలో కనిపించే పదో ప్రపాఠకం పదకొండో అనువాకాన్ని ఉదాహరణగా ఆచార్యులు తీసుకున్నారు. నేడు కథానిక లక్షణాలుగా విమర్శక లోకం గుర్తించిన సంక్షిప్తత, సమగ్రత, సంభాషణల సొగసు, ఉపదేశం, పరిమితమైన పాత్రలు.. ఈ చిన్నకథలోనూ ఉండడం గమనార్హం.
భరద్వాజుడు మూడు ఆయుర్దాయ భాగాలను వరంగా పొందిన ఒకానొక రుషి. జీవితకాలమంతా బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనానికే మీదు కట్టి చివరి దశలో వార్థక్యం చేత శక్తి సన్నగిల్లి శయనావస్థలో ఉన్న దశలో ఇంద్రుని దర్శనభాగ్యం రుషికి లభిస్తుంది. 'నాలుగో ఆయుర్దాయ భాగం సైతం వరంగా ప్రసాదించేందుకు నేను సిద్ధం. కాని ఆ వరంతో నువ్వు ఏమి చెయ్యదల్చుకొన్నావో ముందు చెప్పు' అంటూ ఇంద్రుడు ప్రశ్నిస్తాడు. 'మునుపటి మాదిరే వేదాధ్యయనాన్ని కొనసాగిస్తాన'ని భరద్వాజుని బదులు.
రుగ్, యజు, సామ వేదాల వంక చూపుడు వేలు చూపించి 'మహా పర్వతాలుగా కనిపించే అవేమిటో తెలుసునా? వేదాలు మహానుభావా! నీకింత వరకు దక్కిన జీవితకాలంలో వాటి నుంచి నీవు గ్రహించింది కేవలం ఇంత మాత్రమే సుమా!'అంటూ మూడు సార్లు పిడికెళ్లను తెరిచి చూపిస్తాడు ఇంద్రుడు. 'నిజంగా నీకు ఇంకా వేదాధ్యయన ఫలం మీద బలమైన కోరిక మిగిలుంటే సావిత్రాగ్నిని ధ్యానించు! ఆపైన ఆదిత్యుని సాయుజ్యం పొందు!' అనీ సూచిస్తాడు. అందు మీదట ఇంద్ర ప్రసాదితమైన నాలుగో జీవిత భాగం కేవలం వేద విద్యాధ్యయనానికి మాత్రమే వినియోగించక, సాధించిన జ్ఞాన కాంతి పుంజం సాయంతో పరిసరాలను సైతం తేజోవంతం చేసి విద్య అంతిమ పరమార్థాన్ని రుషి ప్రపంచానికి చాటినట్లు కథ.
ఈ కథ పరిణామంలో, ప్రక్రియ పరంగా. లక్ష్య నిర్దేశన పరంగా తాజా కథానికలకు ఏ మాత్రం తీసిపోనిదని డాక్టర్ కె. కోదండరామాచార్యులవారి వాదన. కాదనగలమా?
-కర్లపాలెం హనుమంతరావు
10, డిసెంబర్, 2019
No comments:
Post a Comment