Wednesday, December 29, 2021

వ్యాసం ప్రబంధాలలో పండుగ భోజనాలు - ఉత్పల సత్యనారాయణాచార్యులు ( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు .

 వ్యాసం 


ప్రబంధాలలో పండుగ భోజనాలు 

- ఉత్పల సత్యనారాయణాచార్యులు 

( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు .

                29-12- 2021 



తెలుగు సాహిత్యమున ఏదో యొక విందునో భోజనమునో పురస్కరించుకొని తెలుగువారి వంటకాలను విస్తరించి వర్ణించిన కవులలో ప్రముఖులు   శ్రీనాథుడు, శ్రీకృష్ణ రాయలు, పింగళి సూరన్న, తంజావూరు నేలిన విజయ  నాయకుడు. 


ఆయా కవులు తమ కులాచారములకును, అభిరుచులకును దగిన భోజన సదా ర్థములను వర్ణించియుండిరి. రాయలుమాత్రము  బ్రాహ్మణ..  బ్రాహ్మణేతర భోజనముల రెంటిని లెస్సగా నెఱిగినవా డగుట శాకాహార మాంసాహార భోజనముల జక్కగా వర్ణించి సమకాలపు సాంఘిక జీవనమును మనకు సాక్షాత్కరింప జేసి యున్నాడు. 


విస్సనమంత్రి పంక్తిని గూర్చుండి శ్రీనాథుడు హేమ పాత్రాన్న మారగించెడివాడు. అతని భోజనము సాధారణ మైన దైయుండదు. ఒకప్పుడు పల్నాడులో నొకరింట జొన్న న్నము పెట్టి, చింతచిగురు, బచ్చలాకు కలిపిన యుడుకు కూర వడ్డించిరట. కప్పురభోగి వంటకమున కలవాబుపడిన కవిసార్వ భౌమున కది యెట్లు రుచించును?


ఫుల్లసరోజనేత్ర ! యల పూతన చన్నుల చేదు ద్రావి నా 

సల్ల దవాగ్ని మ్రింగితి న టంచును నిక్కెద వేమొ తింత్రిణీ

పల్లవయు క్తమౌ యుడుకు బచ్చలి శాకము జొన్నకూటీతో 

మెల్లగ నొక్క ముద్ద మ్రింగుము నీ పస కాననయ్యెడిన్


అని పరిహాసము చేసినాడు. సన్నన్నము సున్నయైన పల్నాటి సీమను హేళన చేసి 'రసికుడు పోపడు పల్నాడు' అచట 'కుసు మాస్త్రుండైన జొన్నకూడే కుడువవలసి వచ్చు' సని యెఱుక పఱిచినాడు. ఆ కాలమున పూటకూలి ఇండ్లలో ముఖ్యముగా  లక్ష్మణవజ్ఝల నొక్క రూకకు చక్కని భోజనము లవారింట లభించెడిదట.


కప్పురభోగి  వంటకము కమ్మని గోధుమ పిండివంటయున్ 

గుప్పెడు పంచదారయునుక్రొత్తగ గాచిన యాలనే పెస 

ర్పప్పును గొమ్మున ల్లనటి పండ్లను నాలుగు నైదు నంజులున్ లప్పలతోడ త్రొంబెరుగు లక్ష్మణవజ్ఝల యింట రూకకున్.


తెలుగువారికి ముఖ్యముగా గుంటూరు మండల వాసులకు గోంగూర తగనియిష్టమను వాడుక యున్నది. ఆ ప్రాంతము వాడేయయిన శ్రీనాథు డేలనో గోంగూరను గొనియాడిన వాడు కాడు. ఇది చింతింపదగిన విషయమే మఱి ! ఆ కాలమున భోజనపరాక్రమము గల ఏ రామయమంత్రియో 'గోంగూర వంటి కూరయు గాంగేయునివంటి ధన్వి, నభూతోన భవిష్యతి' యని ప్రస్తుతించియుండవచ్చును. 'మా రామయమంత్రి భోజన పరాక్రమ మే మని చెప్పవచ్చు ఆ స్వామి యెఱుంగు తత్కబళ చాతురి తాళఫల ప్రమాణమున్ ' శ్రీనాథుడు, గోంగూరను గొనియాడకపోయినప్పటికి అరవవారి విండ్లను నిరసించియుండుట చేత నాంధ్రత్వమును నిల్పినవాడై నాడు. 


తొలుతనే ఒడ్డింత్రు  దొడ్డ మిర్యపుజారు చెవులలో పొగవెళ్లి చిమ్మి రేగ

బ్రహ్మరంధ్రము దాకా  బాఱు నావ పచ్చళ్లు మున్నగు అరవ పచ్చళ్లత నికి నచ్చవు. ఈ కవి సార్వభౌముడు కన్నడదేశమున కరిగియచ్చట 'రుచులు దోసంబంచు పోనాడి' నిస్పృహచెందిన వాడు. కావ్యపా కాలలో శ్రీనాథుడు నేటికాలపు రమ్యతయు రుచియు తెలిసిన రసికుడు ఇడైనలకు తన కావ్యమున చో టిచ్చిన యీ కవి నేటి నవనాగరిక యుగమున నుండదగినవాడు.


రాయలు ఋతుపర్ణనలో నాయా కాలములకు దగిన పంటక ములను బేర్కొనియున్నాడు. బ్రాహ్మణభోజనమును గూర్చి చెప్పుచు రాయలు పొరివిళం గాయలను బేర్కొ నెను. వేపుడు బియ్యపు పిండి బెల్లపు పాకముతో జేసిన యుండ లవి. పెరుగువడియములు, పచ్చివరుగులు - వాన కాలమున గలమాన్నము ఒల్చిన పప్పు, నాలుగైదు పొగపిన కూరలు - వేసవి కాలమున నులివెచ్చని యన్నము, తియ్యని చారులు, మజ్జిగపులుసులు, పలుచని యంబలి, చెఱకుపాలు, ఎడనీళ్లు, వడపిందెలు, ఊర గాయలు, నీరుచల్ల – ఇక చలికాలమున మిరియపు పొళ్లతో గూడిన వెచ్చవెచ్చని కూరలు, అవపచ్చళ్లు, చేయి చురుక్కను నేయి, ఇవురగాచిన పాలు బ్రాహ్మణు లారగించెడివారట.


తారుణ్యాతిగ చూతనూత్న ఫల యుక్తాలాభిఘార స్వన 

ద్ధారాధూపిత శుష్యదంబు హృత మాత్స్యచ్ఛేద పాకోద్దతో ద్గారంపుంగనరార్చు భోగులకు సంధ్యావేళలం గోళికాం 

తారాభ్యంతర వాలుకాస్థిత హి మాంతర్నారికేళాంబువుల్


మాంసాహారులైన ధనికులు వేసవి కాలమున చేపల తునకలలో మామిడి కాయముక్కలు వేసి తాళింపు పెట్టి మధ్యాహ్న వేళలం దల్పాహారముగా బుచ్చుకొనెడివారట. ఆ పిమ్మట స్నాన శాల దాపున దడియిసుకలో బూడ్చి పెట్టిన కొబ్బరిబొండములు దీసి ఎడనీరు త్రాగి చేపల కనరును పోగొట్టుకొనెడివా రట. శాకాహారపు అల్పాహారముగూడ నిండకు దక్కువైనది కాదు. పనసతొనలు, దోసబద్దలు, తియ్యదానిమ్మలు, గసదాడి అరటి పండ్లు పానకములు బ్రాహ్మణులు సాపడుచుండెడివారట.


శ్రావణ మాసమున ఆకుకూర అధికము. ఆకాలమున సామాన్యులైన రెడ్లు చెంచలి, తుమ్మి, లేత తిగిరిసాకు తఱగి చింతచిగురు కలిపి నూనెలో వేయించి పొడికూర చేసికొనెడి వారు.


గురుగుం జెంచలి దుమ్మి లేదగిరి సాకుం దింత్రిణీ పల్లవో 

త్కరముం గూడ దొరంటి సూనియలతో గట్టావి కుట్టారు

గిరముల్ మెక్కి తమిన్ బసుల్ పొలము వో గ్రేపుల్ మెయుల్నాక మే 

కరువు గుంపటి మంచ మెక్కిరి ప్రభు త్వైకాప్తి రెడ్లజ్జడిన్.


పెద్ద నార్యుడు శ్రీనాథుని వంటి అనుభవ రసికు డయ్యును నారని కేలతో వంటకములపై బుద్ధిపోలేదు. ఆయనకు 'ఆత్మ కింపయిన భోజన' మున్న జాలు. కప్పురభోగి పంటకముకన్న పెద్దన్నకు కప్పురపు ఏడెమే ముఖ్యము. 


పారిజాతాపహరణప్రబంధమున నంది తిమ్మన్న 'శాక పాకంబుల చవులు వక్కా ణించుచు' శ్రీకృష్ణుడు భుజించినట్లు వర్ణించి యుండెనే కాని, ఆ శాక పాకములను మనదాక రానిచ్చిన వాడు కాదు.


కమ్మనై కారమై నేతను పండంబొల్చి, త దుమురై పాఱుటల్ లేక సద్యోజనితంబుల్ వోలెఁ జాలు జపులోదవునవి కండచక్కెర పాకమున దయారయినవియు సగు అప్పాలను తెనాలి రామకృష్ణుడు వర్ణించెను. ఇచ్చట కార మనగా ఘాటని అర్థము. పింగళి సూరనార్యుడు తన కథానాయకుడై న క ళాపూర్ణునకు బ్రాహ్మణ భోజనమే పెట్టించెను.


పట్లు మండిగలు బొబ్బట్లు వడలు కుడుములు సుకియలు గడియంపుటట్లు వె

కల వంటకములు బూరెలు తేనె తొలలు చా న్నప్పాలు వడియంబు లప్పడాలు బొంగరములు సొజ్జెబూరె కాగుల సేవె లుక్కెర లరిసెలు చక్కిలములు.


తంజాపు రాంధ్ర నాయక రాజైన రఘునాథ భూపాలుడు శ్రీనాథుని కప్పురభోగి పంటకములను చవిచూచినవా డగుటచే గాబోలు తన కాలపు దొరల భోజనములను గూర్చి రఘునాథ రామాయణమం దిట్లు వర్ణించెను.


కప్పురభోగి పంటకము కమ్మగనే పడియున్ భుజించి మేల్

దుప్పటులట్లు మూరగల తోరవు పచ్చడముల్..

కప్పుకొచెడి వారట! ఈ రఘునాథ భూపాలుని కుమారుడైన విజయ రాఘవ నాయకుని రఘునాథాభ్యుదయ ద్విపద కావ్యమం దానాటి వంటకములలోని విశేషము లెన్నేనియు గ్రహింప వచ్చును. ఈ కవిరాజు భోజన మిషతో నాటి మహారాజుల మహానసమున ఘుమఘుమలాడు వంటకములను బెక్కింటిని పేర్కొని యున్నాడు.


ఒక వేదండయాన కై దండ యుసగ దిగి బంగరు పీటమీద గూర్చుండిన పట్టపు రాజు పళ్లెరమున దొలుతగా “గిలుకు టం దెలు మ్రోయ గీరసల్లాప కులుకుచు పచ్చడులు గొని వచ్చినదట ! వడ్డన మొదలుకొని స్వీయ సంప్రదాయమునే వర్ణించి నాడు విజయ రాఘవుడు.


"అప్పడాల్ నువు పొడి హవణించినట్టి 

కప్పురపుకోడి యొక్క లతాంగి తెచ్చె

 తురిమిన టెంకాయ తునియలు గూర్చి కరివేప పొడిచల్లి కమ్మని నేత

పొంకంబుగా దాల్చి పొదిగినయట్టి కుంకుమకోడి గై కొనివచ్చె నొకతి"


ఈ వంటకములలోని పదార్థములనుబట్టి ఇవి శాక సంబం ధములే యనియు, నేటి పకోడీలవంటివే కప్పురపుకోడి మున్నగు నవి యనియు, నాటి బ్రాహ్మణులుగూడ నిట్టివి చేయుచుండెడివా రనియును జెప్పవచ్చును. కాని బ్రాహ్మణులు దీనిని కప్పురపు కోడి, కుంకుమకోడి, కస్తూరికోడి, పాలకోడి, కట్టుకోడి అని పేర్కొనకపోవచ్చును. పదార్థ మొక్కటియయ్యును వ్యవహారమునందును, పేర్లలోను కొద్దిపాటి భేద ముండవచ్చును. కో ళ్లన్నియు బోయి పకోడీలు మాత్రము నిలిచినవి. 


నీరుమజ్జిగయనగ మనము సాధారణముగా మజ్జిగ తేట యని భ్రమపడుదుము. అది కాదు.


"సారమౌ జంబీర సారంపు రుచుల 

మీఱంగ లవణంబు మితముగా గూర్చి 

మేలైన సొంటితో మిళిత మైనట్టి 

ఏలకి పొడివైచి యింపు దీసింప 

దగు వట్టివేళ్లచే తావులు గట్టి 

మగువ యొక్క తె నీరుమజ్జిగ దెచ్చె"


ఇవి కాక మనము మఱచిపోయిన సారసత్తులు, పేణీలు మున్నగు ఈ కవి తన ప్రబంధమున నిబంధించి మనకు రుచి చూపించుచున్నాడు.



- ఉత్పల సత్యనారాయణాచార్యులు 

( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు .

                29-12- 2021 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...