Thursday, December 30, 2021

కథ బొమ్మల పెళ్లిళ్లు కొడపటిగంటి కుటుంబరావు. ( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) సేకరణ కర్లపాలెం హనుమంతరావు



 


కథ 

బొమ్మల పెళ్లిళ్లు 

కొడపటిగంటి కుటుంబరావు.

( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) 

సేకరణ కర్లపాలెం హనుమంతరావు 

30-12-2021 

బోధెల్ - యూఎస్ఎ



ఆరోజు సరోజినికి పర్వదినం. ఆపిల్లకళ్లకు సమస్తం ఆనందమయంగా తోచింది. 


వాళ్ల బావ భైరవమూర్తి గారి మేడ టాజిమహల్లాగుంది. ఇంటిపక్క తోట నందనవనంలాగుంది. తనతో తోటలో పికారు చెయ్య టానికి వచ్చిన సావిత్రి సాక్షాత్తూ దేవకన్యకలాగుంది. 


ఆరోజున సరోజినికి సావిత్రినిచూస్తే అనురాగంపొంగి పొర్లటం మొదలు పెట్టింది. ఈ ప్రేమావేశం తాత్కా లిక మేఫనీ, పూర్వం ఉన్నదికాదనీ, ముందుండబోదనీ ఆ ఉత్సాహంమీద సరోజినికి తోచటం అసంభవం. దీనికంతా కారణం అప్పుడే ప్రవేశిస్తున్న వసంతరుతువు కాదు, ఆనాడు భైరవమూర్తిగారి శిశువు అన్నప్రాశన.


మీరు సావిత్రినికాని సరోజినిని కాని ఇద్దరినీ కాని బాగా ఎరిగుండకపోతే ఇద్దరూ కవలపిల్లలని చెప్పినా నమ్ముతారు. 


నిజానికిమటుకు సరోజిని సావిత్రికి పిన తల్లి. సావిత్రి సరోజినికన్న ఏమాత్రమో పెద్దదీ, సరోజినికన్న మితభాషి కూడా కావటంచేత చూడగానే ఇద్దరిలో కనపడే భేద మేమిటంటే సావిత్రి పినతల్లికంటె గంభీరంగా ఉండేది. అంతకుమించి ఇద్దరిలోనూ ఎక్కువ తారతమ్యం లేదు.


సరోజిని సావిత్రిని తోటంతా తిప్పి ఆఖరుకు  తన ప్రాణానికి మంచి పాదరిల్లంటిది కనపడ్డ చోటు  చూపి ఇక్కడ కాస్సేపు కూర్చుందామన్నది. 


ఇద్దరూ ఆకుల కింద కూర్చున్నారు. కొంతసేపు ఆకబుర్లూ ఈకబు ర్లూ చెప్పి సరోజిని అసలు సంగతి కొచ్చింది.


“అయితే, సావిత్రీ బావ నీ పెళ్లి చేస్తాడుట నిజవేనా ? " 


సావిత్రి సమాధానంగా పినతల్లిని చూసి నవ్వింది.


"అంతా నిశ్చయమయిందా?" 


" అదే నిశ్చయం. ఇంకా తాంబూలా లిచ్చుకో లేదు.”


2


“నీ కాబొయ్యే మొగుడెవరు ?  "


సావిత్రి చాలా నేర్పరి. ఎటువంటి ప్రశ్న కటువంటి సమాధానం చెప్పాలో ఎరుగును .


“ఎరగవు టే? మామయ్య ఇక్కడ చదువుకునేట ప్పుడు వస్తూండేవాడే—రాధాకృష్ణ మూర్తని !” 


" నాకు బాగా జ్ఞాపకంలేదు... అయితే నీకీ  సంబంధం ఇష్టమేనా?" 


" ఎందు కిష్టంకాదు?”,


సరోజిని తనావిషయం మాట్లాడదలుచుకున్నది అ యిపోయినట్టు నన్న గొంతుతో ఏదో మంగళహారతి ఎత్తిచప్పున ఆపి “ఇప్పు డీసంబంధం కాకుండాపోతే?” అన్నది.


" ఏమిటి?"


“నిన్ను ఆ అబ్బాయికిచ్చి -ఆయన పేరేమిటి? —ఆయనకిచ్చి చెయ్యరనుకో..”. 


" పోనీ!...అయినా ఎందుకు చెయ్యరు?”.


"ఇంకొకరి కిచ్చిచే స్తే!" 


" ఇంకో రెవరు?"


“అన్నయ్యకి స్తే!”


సావిత్రి నవ్వి “తాతయ్య కిష్టంలేదుగా?" అంది. 


"తాతయ్య సంగతి కాదిప్పుడు! నీ సంగతి చెప్పు!"


" ఏమో! నా కంత యిష్టంలేదు సుమా. మామయ్య ఎప్పుడూ మేనకోడలిని చేసుకోటం నీతి కాదఁటుంటాడు. అయినా ఇప్పుడెందు కాఆలోచన?”


సరోజిని సావిత్రి చెయ్యి తీసుకుని వేళ్లు సాగ దీస్తూ “ఇవాళ మా నాన్న మీ నాన్న నడగబోతున్నాడు. నిన్ను అన్నయ్య కియ్యమని. నీకింకా తెలీదేమో?” అని సావిత్రి మొహం వంక చూసింది. 


సరోజిని అనుకున్నట్టు సావిత్రి మొహాన  ఏభావం కనపళ్ళేదు. 


ఇంత రహస్యం చెప్పినా సావిత్రి చలించకపోవటంచూసి సరోజినికి ఉత్సాహభంగమైంది. ఇద్దరూ కొంతకాలం మౌనంగా కూర్చున్నతరువాత సరోజిని పోదామంటూ లేచింది.


“కాస్సేపు కూర్చోవే అబ్బ! ఇంట్లో ఏముంది?"


"ఇంకా అడుగూ బొడుగూ కాఫీ ఉందేమో తౌగి ఇప్పుడేవస్తా. లేకపోతే మంచినీళ్లైనా తాగుతా: ఏం చేస్తాం!" అంటూ చెయ్యి వదలించుకుని సరోజిని ఇంటి వైపు పరిగెత్తింది.


సరోజినటువెళ్లింది, సుందరం ఇటొచ్చాడు. అతను వెనకనించి సావిత్రిని సమీపించి “ఇక్కడున్నావుటే అమ్మాయి? అమ్మ నీకోసం వెతుకుతూంటేను,,, ఓసి!" అంటూ సావిత్రి పక్కనేకూలబడి ఒక చేత్తో సావిత్రిని దగ్గరికి తీసుకున్నాడు.


“నీపెళ్లెప్పుడే, పెళ్లికూతురా ? రాధాయి కంట గడు 

తున్నారూ నిన్ను! మంచివెధవ నీకు మంచి మొగుడవుతాడు. ఆలుసుమాత్రం ఇచ్చేవు సుమా! ఒక చెంపనించి తొక్కి పెడితే కాని మాటవినడు. జాగ్రత్త."


" ఏమ్మాటలు, మామయ్యా!"


"ఓసి! నీకెంతసిగ్గు ! ఒక్కత్తెవు కూర్చుని మొగుడి విషయం ఆలోచిస్తున్నావేమోనని మంచి  చెప్పబోతే తప్పా? నే పోతున్నా లే!”


" ఉండు! ఉండు! అట్లా అయితే నేనూ పెళ్లి విష యమే మాట్లాడతాను. ఒకటి చెప్పు. మేనమామను పెళ్లి చేసుకోవచ్చునా?”


"తప్పు!"


" నేను మరి నిన్ను చేసుకోబోతున్నా నే!"


సుందరం సావిత్రి చెంపమీద ఒక్కటి పెట్టి “ఈసారి  ఆమాటంటే నీతో మాట్లాడను," అన్నాడు. 


సావిత్రి చెంపరుద్దుకుంటూ నవ్వి, “ఈ మాట మీ నాన్న అన్నా ఇదేనా శిక్ష!” అన్నది. 


సుందరం ఆశ్చర్యంతో మేనకోడలి వంకచూసి, “నాకింకా తెలీదే! నీతో ఎవరన్నారు?" అని అడి గాడు.


"సరోజిని.”


“దాని కన్నీ తెలుసు!... హూఁ! ఆ అయిదు వేల కట్నం నాన్న గారి మతిచెడగొడుతున్నది. సంవత్సరం కిందట ఈ విషయం వచ్చినప్పుడు అయినవాళ్లలో కట్నంరాదని చాతనాయిన  వంకలన్నీ చెప్పి మనిద్దరికీ ముడిపడకుండా చేశాడు. ఈసారి బావ ఎట్లా తప్పించుకుంటాడు? ఇంకో వెయ్యి ఇస్తామంటే సగోత్రీకుల పిల్లనైనా చేసుకుంటారు నాన్న గారు. ఒక్కపాఠం నేర్చుకో, పిల్లా! నీ కెప్పటికైనా పిల్లలు పుడితే విశ్వ ప్రయత్నంచేసి వాళ్లకు పెద్దవాళ్ళ నెదిరించటం నేర్పు. నాకిన్నేళ్లు  వచ్చినై, ఇంత చదువు చదివాను! నాన్న గారు రేపు కొండముచ్చును పెళ్ళిచేసుకోమంటే కాదనేటం దుకు నాకు ధైర్యంలేదు... మీ నాన్న నీకు చనువిచ్చా డుగా! రాధాయినే చేసుకుంటానని పోట్లాడు.”


"నేను పోట్లాడను. నాన్న పెళ్ళివిషయం నన్నడగడు, నేను సిగ్గుపడతానని ఆయన నమ్మకం, నేను సిగ్గు లేనట్టు ఆయన కెట్లా తెలియచెయ్యటం?" 


" ఆహా ఏం లోకం ! ఎవరి పిల్లల మనసు వాళ్ళకు తెలీదు!"


ఆసాయంకాలం సుందరం, రాధాకృష్ణమూర్తి కృష్ణ ఒడ్డున ఇసకలో కూర్చున్నారు.


ఆ మర్నాడు సావిత్రి పెళ్ళికి ముహూర్తం ఏర్పాటు చేశారు. తాంబూలాలు పుచ్చుకున్నారు. ముహూర్తం ఇరవైరోజుల్లో ఉంది. 


" రాధా! నా పెళ్ళికి తప్పక రావాలిసుమా , చెల్లెలిని చేసుకుంటున్న వాడి పెళ్ళి నీకెక్కడ తటస్తపడుతుంది?" అన్నాడు సుందరం దీనంగా.


‘‘అర్ధంలేకుండా మాట్లాడతావేంరా, సుందరంగా !  అప్పకూతుర్ని చేసుకుంటున్న వాడివి నువ్వే నేం లోకం లో! నీకు మళ్ళీ అటువంటి పిల్లవస్తుందీ?”


"అటువంటి పిల్ల మాసరోజా ఒకతె ఉందిగా!" 


" ఛీ! అప్రాచ్యుడా! వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారను కుంటున్నావుకాని, నక్కకూ —ఇద్దరికీ ఎంతో భేదం ఉంది. నాకు సంబంధమే కనపడదు.” 


“ఇంకేం? నాకు భేదమే కనపడదు. నిన్నా ఇవాళ లోపల   వందసార్లు సావిత్రిని సరోజిని పేరు పెట్టి పిలిచాను. అది పలకదు!" 


" నీ మొహం! దానిక్కోపం, వళ్ళుమంట, ఎందుకుండదు ? చిత్రంచూడు. ప్రకృతి మనల్ని వెక్కిరించటాని కిట్లాచేసిందికాని వాళ్ళిద్దరిలో నీకు కనపడ్డభేదం నాకు  కనపడి నీ కాభేదం కనపడకుండా ఉంటే ఎంత బాగుండేది. నేను సావిత్రిని కొంతవరకు నిశ్చింతగా - పెళ్ళిచేసుకునేవాణ్ణి. సరోజానీకు కుదిరేది.” 


ఇక్కడ రాధాకృష్ణమూర్తి ఈడుకుమించిన మాటన్నాడు.


"ఎందుకు దిగులుపడతావురా? పెళ్ళయిన మరుక్షణం నుంచీ  ప్రయత్నంచేసినా ఇద్దరికీ సంబంధం కనపడదు.” 


" నీదయవల్ల  అట్లా అయినా బాగుండును."


" నాన్నక్కోపం వచ్చింది మీ బావగారిమీద.”


" పెద్దకట్నం పోయిందే అని.” 


" సామెత చెప్పినట్టుంది.”


పూర్తిగా పొద్దుకూకకుండానే ఇద్దరూ ఇంటిదారి పట్టారు. భైరవమూర్తి గారి మేడముందు రాధాకృష్ణ మూర్తి గుడ్ నైటన్నాడు.


సుందరం  రాధాకృష్ణమూర్తి చెయ్యిపట్టుకున్నాడు. "ఒక కప్ కాఫీ తాగిన తరువాత. " 

" కాఫీ! అవశ్యం ”


ఇద్దరూ మూలగదిలో చేశారు. సుందరం లోపలికి వెళ్లాడు, సరోజినితో రెండు  కప్పులు కాఫీ తయారు చెయ్యమన్నాడు. అందుకని సరోజిని మూడు కప్పుల కాఫీచేసి తనకోకప్పు దాచుకుని మిగిలిన కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. తరవాత కొంచెం ఎడంగా నుంచుని రాధాకృష్ణమూర్తిని పరీక్ష చెయ్యటం మొదలు పెట్టింది. 


రాధాకృష్ణ మూర్తి కాఫీ కాస్త రుచి చూచి కప్పుబల్ల మీద పెట్టి "ఫైన్ ” అన్నాడు.


సుందరంకూడా కొంచెం తాగి మొహం చిట్లించి, “నాకు కాఫీ రుని తెలీదురా ఖర్మం!" అన్నాడు


" సావిత్రికీ అంతే, అన్నయ్యా దానివన్నీ నీగుణా లే" అన్నది సరోజిని నవ్వుతూ. 


రాధాకృష్ణమూర్తి కొంచెంసేపు సరోజిని వంకచూసి, తలగోక్కుని కాఫీతాగటం సాగించాడు.


ఈ కాఫీ మాత్రం ధుమాగా ఉందిరా. యమాగా ఉందనుకో! అద్భుతంగా ఉందంటేనమ్ము . ఎందుకూ? నెంగరం అయ్యరు కాఫీకి నకలు. అసలుకు సరియయిననకలు" 

 సరోజిని తల ఒక పక్కకు  ఒరగేసి  రాధాకృష్ణమూర్తి  వంక చూస్తూ "పాపం, సావిత్రికి సుందరమే మొగుడయే వాడు?" అనుకుంది.


" నేను పోతున్నాను. మీకింకేమన్నా కావాలా? " 


"నీళ్ళు” సుందరం.


" తాగటానికేనా?"…రాధాకృష్ణ మూర్తి. “


" తప్పకుండా! లేకపోతే ఈ చేదుఇట్లాగే ఉండనీమంటావా ఏమిటి?”


సరోజిని  బిగ్గరగా నవ్వుతూ పరిగెత్తిపోయింది.


రొండు నిమిషాలపాటు స్నేహితులిద్దరూ మౌనంగా  కూర్చున్నారు. చివరకు రాధాకృష్ణమూర్తికి మాట్లాడబుద్ధయింది. "మీ చెల్లెలికీ మీ మేనకోడలికి భేదం లేదంటావేంరా? " 


“ఆఁ?" అన్నాడు సుందరం పరధ్యానంగా,


" ఇద్దరికీ లక్షభేదం ఉంది.” 


" ఎవరు?"


" మీ చెల్లెలికీ- మీ సావిత్రికీ "


"ఏమిటి?"


భేదం —లక్ష భేదం—”


"ఏంభేదం?"


" ఉంది " 


"ఎందుకుంది. "


"ఎందుకు లేదు.”


ఇప్పుడు సుందరం దోవకొచ్చాడు.


‘నాఆలోచనంతా పాడు చేశావు! ఏమిటా మనం మాట్లాడుతున్నది?”


రాధాకృష్ణమూర్తి మళ్ళీ వెనక్కి రాదలుచుకోలేదు. "సావిత్రి ఇంత ఉత్సాహంగా ఉండదు.”


స్నేహితు డేంమాట్లాడుతున్నాడో తెలీక సుందరం " ఆఁ?" అన్నాడు. ‘


" ఇంక మాట్లాడదు.".


" ఎవరు?" 


'' సావిత్రి.” 


" సావిత్రంటే  . ఓహో సావిత్రా? ఇంకాసావిత్రేమో ననుకున్నా!"


" ఇంక నవ్వ దసలు .”


"ఎవరు? సావిత్రేనా?"


" ఆ! అంటే సావిత్రికాదు? సావిత్రి!"


"సావిత్రి నవ్వదా ?”


"నవ్వదు. ఎందుకు నవ్వాలి? నవ్వు నాలుగందాల చేటు  " 


రాధాకృష్ణమూర్తి తలగోక్కుని అకస్మాత్తుగా " గుడ్ నైట్" అని వెళ్లిపోయినాడు.




జరిగిన సంగతి  ఏమిటంటే రాధాకృష్ణమూర్తి మొదట సావిత్రికోసం ఉబలాటపడ్డప్పుడు తనమనస్సును ఆపిల్ల కర్పించుకున్నాడు. ఒకపిల్ల తన అనుజ్ఞ లేకుండా తన మనసును ఎత్తుకుపోయినట్లు   అతనికి కొత్త అనుభవం. అనుభవంలేనివాడు కనకనే పని పెట్టుకొచ్చి సరోజిని తన మనస్సును   ఆకర్షిస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు. దానికి అతనికివ్వబడ్డ విశేషేమిటంటే సరోజిని !


రాధాకృష్ణమూర్తి మాట్లాడుతున్నది వినిపించుకో కుండా సుందరం ఆలోచిస్తున్న దేమిటంటే తన చెల్లెలికీ సావిత్రికీ ఏం సంబంధం ఉందా  అని. దానిక్కారణం ఉంది. 


అతను సావిత్రిని సరిగా చూసింది కిందటిరోజు ఉదయం. చెల్లెలిని సరిగా చూసిందంతకు పూర్వమే! మగ వాడికి పెళ్లియావ లేనంత కాలం ఆడపిల్లలంతా ఒకటి గానే ఉంటారు. వాళ్ళిద్దరికీ కొంతపోలికకూడా ఉండే చెప్పేదేమిటి?


అన్నిటికన్న ముఖ్యమైనవిషయం మొదటినించీ సావిత్రికి దిగులు తన్ను తనమామ కియ్యరనే .


—కొడపటిగంటి కుటుంబరావు.

( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

30-12-2021 ; బోధెల్ ; యూఎస్ఎ


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...