Tuesday, December 14, 2021

ఆంధ్ర మహా భారత అవతరణ - సేకరణ - కర్లపాలెం హనుమంతరావు ( మూలం - ఆంధ్రుల సంక్తిప్త చరిత్ర - ఆంధ్ర మహా భారత అవతరణ - శ్రీ ఏటుకూరి బలరామమూర్తి )



ఆంధ్ర మహా భారత అవతరణ 

- సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - ఆంధ్రుల సంక్తిప్త చరిత్ర - ఆంధ్ర మహా భారత అవతరణ - శ్రీ ఏటుకూరి బలరామమూర్తి ) 


చాళక్యుల కాలంలో మత, కుల విభేదాలు రాజ్య భద్రతకే విచ్ఛిన్నకరంగా తయారయాయి. సుస్థిర రాజ్యపాలన అసంభవమౌతుండేది. ఇతర రాష్ట్రాల నుండి దండెత్తి వచ్చే రాజులను ఆహ్వానించే మతస్థులు, కులస్థులు ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండేవారు. కుట్రలను, అరాచకాన్ని ప్రోత్సహించేవారికి మతం ఒక ముసుగుగా ఉపయోగపడేది. ఆ సందర్భంలో అవతరించినది ఆంధ్ర మహా భారతం . 


ఆంధ్ర మహాభారత అవతరణ


విచ్ఛిన్నకర ధోరణులను కొంతవరకైనా అరికట్టి ఐక్యజాతి పరిణామాని కవసరమైన సంస్కృతిని నిర్మించిన ఘనత తెలుగు సాహిత్యానిది.  అందుకు మహాభారతం నాంది.


మత ప్రవక్త దృక్పథం సంకుచితం. తన దేవునిపై భక్తి కంటె పొరుగు దేవుడిపై ద్వేషం జాస్తి. దేవతల ద్వేషం ప్రజలలో వ్యాపించి అంతఃకలహాలకు కారణమైంది.


కవుల దృక్పథం వేరు. జీవితంలోని కుల, మత భేదాలకు అతీత మైన, సామాన్య మానవ భావాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తీకరించటమే కవి కర్తవ్యము. ఈ గురుతర బాధ్యతను నిర్వహించిన కావ్యాలు భారత, భాగవతాలు. అయితే ఈ కర్తవ్యం -  నాటి ప్యూడల్ సమాజ పరిధికి లోబడి జరిగింది. సామాన్య ప్రజల జీవితం ఈ సాహిత్యంలోకి ఎక్కలేదు.


మహాభారతం సర్వజన వంద్యంగా వుండవలెనని తాను రచించి

నట్లు నన్నయభట్టు ఇలా వివరించాడు.


'ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని 

అధ్యాత్మ విదులు వేదాంత మనియు 

నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని 

కవి వృష  మహా కావ్య మనియు

లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని 

ఐతిహాసికులితిహాసమనియు 

పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ

 యంబని మహ గొనియాడుచుండ


గీ. వివిధ వేద తత్వవేది వేదవ్యాసు 

డాదిముని పరాశరాత్మజుండు 

విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై 

పరగుచుండ జేసె భారతంబు.


తామెంతటి మహత్కార్యానికి పూనుకున్నారో మహాభారత కవులు

గుర్తించారు.


“నానా రుచిరార్థ సూక్తినిధి 

నన్నయభట్టు తెనుంగునన్, మహాభారత 

సంహితా రచన బంధురుడయ్యె 

జగద్ధితంబుగాన్”


"గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెలుంగు వారికిన్ వ్యాస ముని ప్రణీత"మైన మహాభారత గాథను వివరిస్తున్నానని నన్నయభట్టు మరొక చోట చెప్పాడు.


ఇదే విషయాన్ని భారతంలో అత్యధిక భాగాన్ని రచించిన కవి బ్రహ్మ తిక్కన యింకా స్పష్టంగా చెప్పాడు.


ఉ॥ కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి, 

ఆంధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయ 

సంస్కృతి శ్రీవిభవాస్పదంబయిన చిత్తముతోడ మహాకవిత్వ దీక్షావిధినొందిపద్యములగద్యములన్ రచియించెదన్కృతుల్ ——


అంతేకాదు.


తెలుగు భాషలో ప్రజాసామాన్యానికందరికీ అర్థమయ్యేటట్లు వ్రాయటంలో పురుషార్థ సాధన ఇమిడి వున్నదని కూడా తిక్కన భావించాడు.


తే॥ తెనుగుబాస వినిర్మింప దివురుటరయ

భవ్యపురుషార్థ తరు పక్వ  ఫలము గాదె ॥


ఆంధ్ర మహాభారతం నన్నయ ప్రారంభించిన తర్వాత 200 సంవత్సరాలకు గాని పూర్తికాలేదు. ఏ ఆశయంతో నన్నయభట్టు భారత రచన కుపక్రమించాడో, అదే ఆశయంతో క్రీ.శ. 1260 ప్రాంతంలో తిక్కన ఆ కావ్యాన్ని పూర్తిచేశాడు.


ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాలలోని అన్ని కులాలలోను మహా భారతం అంతటి విస్తార ప్రచారంగల గ్రంథం మరొకటి లేదు. పాండవ కౌరవ గాథలు, నాటినుండి నేటివరకు సామాన్య ప్రజలకు విజ్ఞానాన్ని లోకానుభవాన్ని అందజేస్తూనే ఉన్నాయి.


నాడు ప్రజలలో జైన, హిందూ మతాలు వ్యాప్తిలో ఉన్నాయి. పూర్వ మీమాంసాకారుడైన కుమారిలభట్టు ఆంధ్రుడైనందు వలన, ఆంధ్రలో ఆ సిద్ధాంతానికి ఆలంబనం హెచ్చుగా ఉండేది.


నిర్జీవమైన కర్మకాండకు జైన, పూర్వ మీమాంసా ధోరణులు రెండూ విశేష ప్రాధాన్యత నిచ్చినవి. అర్థంతో నిమిత్తం లేకుండానే మంత్రోచ్చారణ ద్వారానే ఫలితాలు వస్తాయన్న మూఢ నమ్మకాలు విరివిగా ఉండేవి.


క్రీ. శ. 787 లో మలబారులో  పుట్టి అద్వైత వాదాన్ని ప్రచారం చేసిన శంకరాచార్యుని బోధనలు దేశమంతా వ్యాపించినప్పటికీ, పాత ధోరణులింకా బలంగానే వున్నాయి. శంకరుని ఆద్వైతం జ్ఞానప్రధానం; కర్మకాండను నిరసించింది.


నన్నయ్యభట్టు మహాభారత రచన అద్వైత ధోరణికి ఎనలేని సహాయం చేసింది. శైవ, వైష్ణవ ద్వేషాలను ఖండించింది. నిర్జీవ కర్మ కాండపైనుండి ప్రజల దృష్టిని వాస్తవ జీవితంవైపు మళ్ళించింది. 


రాజ్యలోభం, ద్వేషం, కక్ష మొదలైన ఆవేశాలకు లోనైనప్పుడు మహా సామ్రాజ్యాలు పతనమైపోతాయన్న నీతిని ప్రచారం చేసింది. కర్మలు అప్రధానమని, జ్ఞానం, సమవృష్టి, అద్వైతభావం ముఖ్యమని కథా రూపంలో ' ప్రజలకు బోధ చేసింది.


ఈ ఉపకృతితోపాటు, మరొక అపకారం కూడా జరిగింది. నన్నయ భట్టుకు పూర్వమే చాలా కాలం నుండి తెలుగులో రచనలు సాగుతూ వచ్చాయని ప్రాచీన శాసనాలే తెలియజేస్తున్నాయి. కాని నాటి గ్రంథాలేవి లభించటం లేదు. అట్టి ప్రజా వాఙ్మయాన్ని, “గాసట బీసట" అని నన్నయభట్టు హేళన చేసి ప్రజావాఙ్మయం పట్ల నిరసన కలిగించాడు. 


ఈ నిరసన వైఖరిపై తిరుగుబాటుగానే, రెండు శతాబ్దాల అనంతరం వీరశైవ మతం, వీరశైవ వాఙ్మయం తలయెత్తాయి.

- సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

14 -11-2021 


( మూలం - ఆంధ్రుల సంక్తిప్త చరిత్ర - ఆంధ్ర మహా భారత అవతరణ - శ్రీ ఏటుకూరి బలరామమూర్తి ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...